గడప ముందు వేసే డోర్ మ్యాట్ నుంచి టేబుల్ మ్యాట్స్ వరకు..
రూఫ్‌కి వేలాడే షాండ్లియర్ నుంచి క్యాండిల్ వరకు..
ఫ్లవర్ వేజ్ నుంచి సోప్‌కేస్ వరకు ..
ఇంట్లోని అలంకరణ వస్తువులన్నీ బబుల్స్‌లా ఒకదానితో ఒకటి జత కలిసినట్టుగా కొత్తందాన్ని సంతరించుకుంటున్నాయి!
చిన్నపిల్లలు సబ్బు ద్రావకాన్ని బుడగలుగా ఊదుతూ ఆనందాన్ని పొందే విధానం చూడటానికి ఎంత ఆహ్లాదంగా ఉంటుందో ప్రతి ఒక్కరికీ అనుభవమే. ఆ రంగురంగుల బుడగలు గాలిలోకి ఎగిరినప్పుడు వెలువడి కాంతి ఎప్పుడూ కళ్ల ముందు కదలాడుతూ ఉంటే... ఆ ఆలోచనే హోమ్ డెకార్ నిపుణులను మరింతగా ఆకర్షించి ఉంటుంది. అందుకే, ఇప్పుడు ఇంటి అలంకరణలో ‘బబుల్’ ప్రధాన ఆకర్షణ అయ్యింది. బుడగల్లో ఇంద్రధనస్సు రంగులను ఇంటి గోడలపైనే కాదు, ఇతర అలంకరణ వస్తువుల్లోనూ చూపుతున్నారు హోమ్ డెకార్లు.
కాంతులు వెదజల్లే బబుల్స్
పువ్వుల అమరికకే కాదు మంచినీళ్ల బాటిళ్లూ బబుల్ షేప్‌తో అలరిస్తున్నాయి. పూల కుండీలు, పెన్ హోల్డర్లు, ఇతర టేబుల్ అలంకరణ గ్లాస్ వస్తువులన్నీ బుడగల షేప్‌తో ఆకర్షిస్తున్నాయి. గాజు బుడగల వస్తువుల మీదుగా పడే కాంతి కూడా గది అందాన్ని పెంచడంతో అవీ ప్రధాన అలంకరణ జాబితాలోకి చేరిపోతున్నాయి.
కాదేదీ అనర్హం
టేబుల్ టాప్స్, ల్యాంప్ స్టాండ్స్, షెల్ఫ్స్... కాదేదీ అనర్హం అన్నట్టు సిరామిక్‌తోనూ, ప్లాస్టిక్‌తోనూ బబుల్ షేప్ వస్తువులు ముచ్చటగా ఆకట్టుకుంటున్నాయి. గోడకు అలంకరించే వాల్‌పేపర్స్ లేదా పెయింటింగ్స్‌లో కూడా బబుల్ షేప్ మరింత ఆహ్లాదంగా మారిపోయింది. పిల్లల గదులనే కాదు మెట్ల మార్గంలోనూ బబుల్ అలంకరణ చూపులను ఇట్టే కట్టిపడేస్తుంది.
కలిసి జతకట్టు
వేసవి వేడి తీవ్రతను తట్టుకునేందుకు ధరించే దుస్తులే కాదు ఇంటి వాతావరణమూ ఆహ్లాదంగా ఉండాలి. అందుకు లేత రంగుల బబుల్ డిజైన్స్ మనసుకు హాయినిచ్చే అలంకరణ అవుతుంది. ‘అంతే కాదు, ఒకదానితో ఒకటి కలిసికట్టుగా ఉండే బబుల్స్ కుటుంబ సభ్యుల మధ్య మమతానుబంధాన్ని బలం చేస్తాయి’ అంటున్నారు డెకార్ నిపుణులు. అందుకే, ఇంటి అలంకరణలో ప్రత్యేక ఆకర్షణగా ఈ సీజన్‌ని మరింత ఆహ్లాదంగా మార్చేస్తున్నాయి బబుల్స్.
Comments
Please login to add a commentAdd a comment