'వెటకార' పురస్కారాలు | Sakshi Funday Special Story On Awards | Sakshi
Sakshi News home page

'వెటకార' పురస్కారాలు

Published Sun, Feb 2 2025 5:42 AM | Last Updated on Sun, Feb 2 2025 5:48 AM

Sakshi Funday Special Story On Awards

ప్రతిభా పాటవాలకు గుర్తింపుగా పురస్కారాలు, బిరుదులు, ఘన సత్కారాలు దక్కుతాయి. వివిధ రంగాలలోని ప్రతిభావంతులను సత్కరించే పద్ధతి పురాతన రాచరికాల కాలం నుంచే ఉండేది. అయితే రాజుల కాలంలో పురస్కారాలు, సత్కారాలు మాత్రమే ఉండేవి. వెటకారాలు ఉండేవి కావు. ప్రపంచంలో ప్రజాస్వామ్యం విస్తరించాక, వెటకార పురస్కారాలు కూడా మొదలయ్యాయి.

ఆధునిక ప్రపంచంలో ‘నోబెల్‌’ పురస్కారాలను అత్యున్నత పురస్కారాలుగా పరిగణిస్తాం. బుకర్‌ ప్రైజ్, పులిట్జర్‌ అవార్డు, ఆస్కార్, గోల్డెన్‌ గ్లోబ్‌ వంటి వాటికి కూడా ప్రతిష్ఠాత్మక పురస్కారాలుగా ప్రపంచంలో గౌరవాదరణలు ఉన్నాయి. వివిధ రంగాల్లో కొంత పేరు గడించినా, పరమ చెత్త ప్రదర్శనలు చేసేవారిని బహిరంగంగా వెటకారం చేయడానికి కూడా అవార్డులు ఉన్నాయి. ఇవి ఆధునిక కాలంలో పుట్టుకొచ్చిన అవార్డులు. నోబెల్‌ బహుమతికి బదులుగా ఇగ్‌ నోబెల్‌ బహుమతి, పులిట్జర్‌ బహుమతికి బదులుగా ఫూలిట్జర్‌ బహుమతి ఇలాంటి అవార్డులే! వివిధ రంగాలకు సంబంధించి ఇలాంటి వెటకార పురస్కారాలు మరిన్ని కూడా ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం. ∙పన్యాల జగన్నాథదాసు

ఇగ్‌ నోబెల్‌
శాస్త్ర సాంకేతిక సాహితీ రంగాలతో పాటు ప్రపంచశాంతి కోసం పాటుపడే వారికి ఏటా ఇచ్చే నోబెల్‌ బహుమతులు ఎంతటి ప్రతిష్ఠాత్మకమైనవో అందరికీ తెలుసు. పనికిమాలిన పరిశోధనలు సాగించేవారికి ‘ఇగ్‌ నోబెల్‌’ బహుమతుల గురించి ఎక్కువమందికి తెలీదు. ‘ఇగ్‌ నోబెల్‌’ బహుమతులు ఇవ్వడాన్ని 1991లో మొదలుపెట్టారు. వెటకార పురస్కారాల్లో ఇగ్‌ నోబెల్‌ తీరే వేరు! ‘ఆనల్స్‌ ఆఫ్‌ ఇంప్రొబాబుల్‌ రీసెర్చ్‌ (ఏఐఆర్‌) అనే శాస్త్రీయ హాస్య పత్రిక 1991 నుంచి ఏటా ‘ఇగ్‌ నోబెల్‌’ పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తోంది. ఈ పత్రిక సంపాదకుడు మార్క్‌ అబ్రహాం వినూత్న ఆలోచనకు ఫలితమే ‘ఇగ్‌ నోబెల్‌’ పురస్కారాలు. 

అట్టహాసంగా నిర్వహించే కార్యక్రమంలో నోబెల్‌ బహుమతి గ్రహీతల చేతుల మీదుగా ‘ఇగ్‌ నోబెల్‌’ పురస్కారాల ప్రదానం జరుగుతుంది. ‘ఇగ్‌ నోబెల్‌’ గ్రహీతలు వేదిక మీద ప్రసంగాలు చేస్తారు. ఈ కార్యక్రమం అసలు నోబెల్‌ పురస్కారాల ప్రదానోత్సవాన్ని తలపిస్తుంది. ‘ఇగ్‌ నోబెల్‌’ పురస్కారానికి ఎంపికైన వారికి ‘ఘనం’గా నగదు బహుమతి కూడా ఇస్తారు. ఎంతనుకున్నారు? అక్షరాలా వంద లక్షల కోట్ల డాలర్లు. అమెరికన్‌ డాలర్లు కాదు లెండి, జింబాబ్వే డాలర్లు. అమెరికన్‌ డాలర్లలో ఈ మొత్తం విలువ 0.40 డాలర్లు (రూ.33.73) మాత్రమే! ఈ పురస్కారంలోని వెటకారం అర్థమైంది కదా!

అసలు నోబెల్‌ను మించినన్ని విభాగాలు ఇగ్‌ నోబెల్‌లో ఉన్నాయి. బోటనీ, అనాటమీ, మెడిసిన్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, పీస్, డెమోగ్రఫీ, ప్రొబాబిలిటీ, ఫిజియాలజీ విభాగాల్లో ‘ఇగ్‌’ నోబెల్‌ పురస్కారాలు ఇస్తారు. ఈసారి ‘ఇగ్‌’నోబెల్‌ విజేతలు, వారి ఘనతలు ఒకసారి చూద్దాం:
బోటనీ విభాగంలో ఈసారి ఇగ్‌ నోబెల్‌ పొందినవారు అమెరికన్‌ శాస్త్రవేత్త జాకబ్‌ వైట్, జర్మనీలోని యూనివర్సిటీ ఆఫ్‌ బాన్‌లో పరిశోధనలు సాగిస్తున్న జపానీస్‌ శాస్త్రవేత్త ఫిలిపె యమషిటా. వీరిద్దరూ కనుగొన్న అద్భుతం ఏమిటంటే– కృత్రిమ మొక్కల కుండీలు ఉన్న పరిసరాల్లో నిజమైన మొక్కలను కూడా పెంచుతున్నట్లయితే, కృత్రిమ మొక్కల ఆకారాలను నిజమైన మొక్కలు అనుకరిస్తాయట! ప్రపంచానికి ఏ రకంగానూ పనికిరాని ఈ అద్భుతాన్ని కనుగొన్నందుకే వీళ్లకు ఈ పురస్కారం.

⇒ అనాటమీ విభాగంలో ఈసారి ఏకంగా పదిమంది ఇగ్‌ నోబెల్‌ను పొందారు. వివిధ దేశాలకు చెందిన ఈ పరిశోధకులు మూకుమ్మడిగా ఒకే అంశంపై పరిశోధనలు సాగించారు. వీరి పరిశోధనాంశం నెత్తి మీద మొలిచే జుట్టు. భూమ్మీద ఉత్తరార్ధ గోళంలో ఫ్రాన్స్‌కు చెందిన 25 మంది పిల్లలను, దక్షిణార్ధ గోళంలో చిలీకి చెందిన 25 మంది పిల్లలను నమూనాగా తీసుకున్నారు. ఉత్తరార్ధ గోళంలోని పిల్లలతో పోల్చుకుంటే, దక్షిణార్ధ గోళానికి చెందిన పిల్లల్లో నెత్తి మీద జుట్టు అపసవ్య దిశలో రింగులు తిరిగిన వారు ఎక్కువగా ఉన్నట్లు తేల్చారు.

⇒ ఫిజిక్స్‌ విభాగంలో హార్వర్డ్‌ వర్సిటీ శాస్త్రవేత్త జేమ్స్‌ సి. లియావో ఈసారి ఇగ్‌ నోబెల్‌ పొందారు. చనిపోయిన చేప కళేబరానికి బోలు గొట్టాన్ని కడితే, అది ప్రవాహానికి ఎదురీదగలదని తన పరిశోధనలో తేల్చారు. నిర్ణీత పరిస్థితుల్లో ఒక వస్తువు తన శక్తిని ఏమాత్రం ఉపయోగించుకోకుండానే ప్రవాహానికి ఎదురీదడం సాధ్యమవుతుందని కనుగొన్నారు.

⇒ మెడిసిన్‌ విభాగంలో జర్మనీలోని హాంబర్గ్‌ వర్సిటీకి చెందిన ముగ్గురు శాస్త్రవేత్తలకు ఇగ్‌ నోబెల్‌ దక్కింది. తీవ్రమైన దుష్ప్రభావాలు కలిగించని నకిలీ మందుల కంటే తీవ్రమైన దుష్ప్రభావాలు కలిగించే నకిలీ మందులే ఎక్కువ ప్రభావవంతంగా పనిచేస్తాయని వీరు కనుగొన్నారు.

⇒ కెమిస్ట్రీ విభాగంలో ఆమ్‌స్టర్‌డామ్‌ వర్సిటీకి చెందిన టెస్‌ హీరమన్స్, ఆంటోనీ డెబ్లాస్, డేనియల్‌ బాన్, శాండర్‌ వూటర్సన్‌ ఈసారి ఇగ్‌ నోబెల్‌ పొందారు. ఆల్కహాల్‌ ప్రభావంతో మత్తెక్కి ఉన్న క్రిములను, మత్తు లేకుండా పూర్తి చలనశీలంగా ఉన్న క్రిములను క్రోమాటోగ్రఫీ పరిజ్ఞానంతో వేరుచేయవచ్చని వీరు కనుగొన్నారు.

⇒ బయాలజీ విభాగంలో మినెసోటా వర్సిటీకి చెందిన ఫోరై్డస్‌ ఎలీ, విలియమ్‌ పీటర్సన్‌ ఈసారి ఇగ్‌ నోబెల్‌ దక్కించుకున్నారు. ఆవులు పాలు చేపడంపై నాడీ వ్యవస్థ పరోక్షంగా ప్రభావం చూపుతుందని వీరు కనుగొన్నారు. దీని కోసం వారు ఒక విచిత్రమైన ప్రయోగం చేశారు. ఒక ఆవు వెనుక నిలుచున్న పిల్లి దగ్గర ఒక కాగితం సంచిని పేల్చారు. అధాటుగా జరిగిన ఈ పరిణామంతో ఆవు పొదుగు నుంచి పాల చుక్కలు నేలరాలాయి.

⇒ ఇగ్‌ నోబెల్‌ శాంతి బహుమతి అమెరికన్‌ మానసిక శాస్త్రవేత్త బి.ఎఫ్‌.స్కిన్నర్‌కు మరణానంతరం లభించింది. తన జీవిత కాలంలో ఆయన ఒక విచిత్రమైన అంశంపై ప్రయోగాలు సాగించాడు. యుద్ధాలు జరిగేటప్పుడు సైనిక బలగాలు ప్రయోగించే క్షిపణుల్లో సజీవంగా ఉన్న పావురాలకు గూళ్లు ఏర్పాటు చేసి, వాటిని కూడా క్షిపణులతో పంపినట్లయితే, ఆ శాంతి కపోతాలు క్షిపణులకు మార్గనిర్దేశనం చేయగలవని ఆశించాడు.

⇒ ప్రొబాబిలిటీ విభాగంలో ఫ్రాంటిసెక్‌ బార్టోస్‌ నేతృత్వంలోని చెక్‌ శాస్త్రవేత్తల బృందానికి ఈసారి ఇగ్‌ నోబెల్‌ లభించింది. ఒక నాణేన్ని బొమ్మ బొరుసు వేసేటప్పుడు దానిని ఏవైపు పైకి ఉంచి పట్టుకుంటామో, ఎక్కువ సార్లు అదేవైపు తిరిగి నేల మీదకు పడుతుందని వీరు కనుగొన్నారు. ఈ సంగతిని కనుగొనడానికి ఏకంగా 3,50,757 సార్లు నాణెంతో బొమ్మ బొరుసు వేశారు.

⇒ డెమోగ్రఫీ విభాగంలో ఇగ్‌ నోబెల్‌ ఈసారి ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీ శాస్త్రవేత్త సాల్‌ జస్టిన్‌ న్యూమన్‌కు దక్కింది. జనన మరణాల రికార్డులను నమోదు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే ప్రాంతాల్లో నివసించే ప్రజల్లోనే ఎక్కువమంది దీర్ఘాయుష్కులు ఉంటున్నట్లు ఆయన ఒక రహస్య పరిశోధన ద్వారా కనుగొన్నాడు.

⇒ ఫిజియాలజీ విభాగంలో ఇగ్‌ నోబెల్‌ను జపానీస్‌ శాస్త్రవేత్త ర్యో ఒకాబే నేతృత్వంలోని అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం దక్కించుకుంది. ఈ బృందంలోని శాస్త్రవేత్తలు వివిధ రకాల స్తన్యజీవులపై పరిశోధనలు జరిపి, స్తన్యజీవులు ఆసనం ద్వారా కూడా శ్వాసక్రియ సాగించగలవని తేల్చారు.

మరికొన్ని వెటకారాలు
గోల్డెన్‌ కేలా: అంతర్జాతీయ సినిమా రంగంలో ‘గోల్డెన్‌ గ్లోబ్‌’ అవార్డులకు ఉన్న పేరు ప్రతిష్ఠలు అందరికీ తెలిసిన సంగతే! ఏటా అత్యుత్తమ సినిమాలకు, వాటిలో నటించిన నటీ నటులకు, దర్శకులు సహా ఇతర సాంకేతిక నిపుణులకు ఈ అవార్డులు ఇస్తారు. ‘గోల్డెన్‌ గ్లోబ్‌’ రీతిలోనే బాలీవుడ్‌లో అతి చెత్త సినిమాలకు వివిధ విభాగాల్లో కొన్నేళ్లుగా ‘గోల్డెన్‌ కేలా’ అవార్డులు ఇస్తున్నారు. ‘ర్యాండమ్‌ మ్యాగజీన్‌’ అనే హాస్యపత్రిక ఈ అవార్డులను బహూకరిస్తోంది. ఈసారి ‘బచ్చన్‌ పాండే’ చిత్రం అతిచెత్త చిత్రంగా ‘గోల్డెన్‌ కేలా’ పొందింది. ఈ చిత్ర దర్శకుడు ఫర్హద్‌ సమ్జీ, ఇందులో నటించిన అక్షయ్‌ కుమార్, కృతి సనోన్‌ ‘గోల్డెన్‌ కేలా’ పొందారు.

గోల్డెన్‌ రాస్‌బరీ: ‘గోల్డెన్‌ గ్లోబ్‌’ రీతిలోనే అతిచెత్త హాలీవుడ్‌ చిత్రాలకు కొన్నాళ్లుగా ‘గోల్డెన్‌ రాస్‌బరీ’ అవార్డులు ఇస్తున్నారు. అమెరికన్‌ ప్రచారకర్త జాన్‌ జె.బి. విల్సన్‌ నెలకొల్పిన ‘గోల్డెన్‌ రాస్‌బరీ ఫౌండేషన్‌’ ద్వారా ఏటా ఈ అవార్డుల ప్రదాన కార్యక్రమం అట్టహాసంగా నిర్వహిస్తుంటారు. ఈ అవార్డులు తీసుకోవడానికి పలువురు ప్రముఖులు ముఖం చాటేసినా, కొందరు మాత్రం ధైర్యంగా ముందుకొచ్చి, వీటిని అందుకోవడం విశేషం. ఈ అవార్డును స్వయంగా అందుకున్న వారిలో టామ్‌ గ్రీన్, సాండ్రా బులక్‌ వంటి ప్రముఖులు ఉన్నారు.

బిగ్‌ బ్రదర్‌ అవార్డు: పౌరుల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించే ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు ఏటా ఈ అవార్డు ఇస్తారు. జార్జ్‌ ఆర్వెల్‌ నవల ‘1984’లోని ‘బిగ్‌ బ్రదర్‌’ పాత్ర స్ఫూర్తితో ఈ అవార్డును నెలకొల్పారు. గోప్యతకు భంగం కలిగించే అంశాలపై ప్రజల దృష్టిని ఆకట్టుకునేందుకు, ఈ అంశాలపై చర్చను రేకెత్తించేందుకు లండన్‌ కేంద్రంగా పనిచేస్తున్న ‘ప్రైవసీ ఇంటర్నేషనల్‌’ ఈ అవార్డులను ఇస్తోంది. ఆర్వెల్‌ ‘1984’ నవలకు యాభయ్యేళ్లు పూర్తయిన సందర్భంగా 1999 నుంచి ఈ అవార్డులను ఇవ్వడం ప్రారంభించారు. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, ఆస్ట్రియా, బల్గేరియా, చెక్‌ రిపబ్లిక్, ఫిన్లండ్, ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్‌ దేశాలు ‘బిగ్‌ బ్రదర్‌’ అవార్డులు ఇస్తున్నాయి.

పిగాసస్‌ అవార్డు: ఇదొక విచిత్రమైన అవార్డు. అతీంద్రియ, మానవాతీత మాయలకు ఏటా ఈ అవార్డు ఇస్తారు. కెనడియన్‌–అమెరికన్‌ రచయిత, ఐంద్రజాలికుడు జేమ్స్‌ రాండీ 1982లో ఈ అవార్డును నెలకొల్పారు. ఇజ్రాయెలీ–బ్రిటిష్‌ ఐంద్రజాలికుడు యూరీ గెల్లర్‌ పేరుతో ఈ అవార్డును ‘యూరీ ట్రోఫీ’ అని కూడా అంటారు. ఈ అవార్డు లోగో ‘రెక్కల పంది’ కావడంతో ఇది ‘పిగాసస్‌’ అవార్డుగా పేరు పొందింది. మానవాతీత మానసిక శక్తులతో అత్యధిక సంఖ్యలో జనాలను మభ్యపెట్టిన వ్యక్తులకు, అతీంద్రియ కథనాలను వాస్తవ కథనాల్లా ప్రచురించే మీడియా సంస్థలకు, అతీంద్రియ అంశాలపై అధ్యయనాల కోసం నిధులు సమకూర్చే సంస్థలకు, ఒక వెర్రిబాగుల అంశాన్ని అతీంద్రియ ప్రభావంగా ప్రకటించే శాస్త్రవేత్తలకు ఈ అవార్డులు ఇస్తారు.

ఘంటా అవార్డు: బాలీవుడ్‌లోని అతిచెత్త సినిమాలకు వివిధ విభాగాల్లో ఇచ్చే అవార్డు ఇది. బాలీవుడ్‌ దర్శక నిర్మాత, రచయిత కరణ్‌ అంశుమాన్, ఆయన మిత్రుడు ప్రశాంత్‌ రాజ్‌ఖోవా 2011లో ఈ అవార్డును నెలకొల్పారు. అట్టహాసంగా జరిగే ఈ అవార్డుల కార్యక్రమానికి స్వయంగా హాజరై, అవార్డులు తీసుకోవడానికి చాలామంది ముఖం చాటేస్తారు. అయితే, బాలీవుడ్‌ హీరోలలో రితేశ్‌ దేశ్‌ముఖ్, హీరోయిన్లలో సోనాక్షి సిన్హా ఈ అవార్డుల వేడుకకు హాజరై, స్వయంగా అవార్డులు అందుకోవడం విశేషం.

పురస్కారాల చరిత్ర
పురస్కార సత్కారాల గురించి చెప్పుకోవాలంటే చాలా చరిత్రే ఉంది. ప్రపంచంలో తొలి పురస్కారం ఎవరు పొందారో, దానిని ఎవరు ఇచ్చారో స్పష్టమైన ఆధారాలేవీ చరిత్రలో నమోదు కాలేదు. ఏదో ఒక రంగంలో విశేషమైన కృషి చేసిన వారికి, గొప్ప ఘనత సాధించిన వారికి పురస్కారాలు అందజేసే పద్ధతి శతాబ్దాలుగా ప్రపంచమంతటా ఉంది. ప్రాచీన కాలంలో రోమన్‌ పాలకులు పురస్కారాలు ఇచ్చే పద్ధతిని మొదలుపెట్టి ఉంటారనడానికి కొన్ని ఆధారాలు ఉన్నాయి. 

క్రీస్తుశకం ఐదో శతాబ్ది నాటికే రోమన్‌ పాలకులు తమ పౌరులకు పురస్కారాలను బహూకరించేవారు. సైనిక విజయాలలో కీలక పాత్ర పోషించిన సైనికులకు, సామాజిక పురోగతికి కృషి చేసినవారికి, రాజ్యం పట్ల విధేయత కలిగిన వారికి పురస్కారాలను ప్రకటించి, వారిని బహిరంగ వేదికపై ఘనంగా సత్కరించేవారు. మధ్యయుగాల నాటికి పురస్కార సత్కారాదులు ఆనాటి రాజ్యాలన్నింటికీ వ్యాపించాయి. ఆనాటి యూరోపియన్‌ రాజ్యాల్లో వివిధ రకాల క్రీడా పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి కార్ల్‌సిల్‌ బెల్స్, ఆర్నేట్‌ కప్పులు, కిప్‌ కప్పులు వంటివి బహూకరించేవారు. వీటిని బంగారం, వెండి వంటి విలువైన లోహాలతో తయారు చేసేవారు. 

ఇప్పటికీ చాలా క్రీడా పోటీల్లో బహూకరిస్తున్న కప్పులు ఆనాటి కిప్‌ కప్పుల నమూనానే అనుసరిస్తుండటం విశేషం. పదహారో శతాబ్దిలో బ్రిటిష్‌ రాజ్యంలో కింగ్‌ హెన్రీ–VIII హయాంలో వివిధ రకాల క్రీడా పోటీలకు ఆదరణ బాగా ఉండేది. కింగ్‌ హెన్రీ–VIII కాలంలో ఏటా రకరకాల క్రీడల పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులను అందజేసేవారు. ఆ కాలంలో విలువిద్య పోటీలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేవారు. 

ఈ పోటీల్లో విజేతలకు ‘స్కార్టన్‌ సిల్వర్‌ యారో’ అనే వెండి బాణాన్ని ప్రత్యేకమైన కర్రపెట్టెలో భద్రపరచి బహిరంగ వేదికపై బహూకరించేవారు. క్రీడాకారులతో పాటు కవులను, పండితులను, కళాకారులను కూడా ఆనాటి రాజులు ఘనంగా సత్కరించేవారు. బహుమానాలుగా విలువైన భూములను, భవంతులను, వెండి బంగారాలను ఇచ్చేవారు. కాళ్లకు గండపెండేరాలను, చేతులకు కంకణాలను తొడిగేవారు. వివిధ విద్యలలో అసాధారణ ప్రతిభా పాటవాలు ప్రదర్శించిన వారికి కనకాభిషేకాలు, గజారోహణలు వంటి సత్కారాలను కూడా ఘనంగా చేసేవారు.

ఇలాంటివి మరిన్ని అవార్డులు ఉన్నాయి. వివిధ రంగాల్లో వెటకారంగా ఇచ్చే ఈ పురస్కారాలను స్వయంగా స్వీకరించే వారి సంఖ్య మాత్రం ఎప్పుడూ తక్కువే! పాత్రికేయ రంగంలో పులిట్జర్‌ అవార్డు అత్యంత ప్రతిష్ఠాత్మకమైనది. తప్పుడు కథనాలతో ఊదరగొట్టే పాత్రికేయులు, మీడియా సంస్థల కోసం కొందరు ఔత్సాహికులు ‘ఫూలిట్జర్‌ అవార్డు’ నెలకొల్పారు. గందరగోళంగా ఇంగ్లిష్‌ రాసేవారికి ‘గోల్డెన్‌ బుల్‌’ అవార్డు ఇస్తారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మీడియా సంస్థల మీద కోపంతో కొన్నేళ్ల కిందట ‘ఫేక్‌ న్యూస్‌ అవార్డు’ నెలకొల్పారు. 

క్రీడా పోటీల్లో అతిచెత్త ఆటతీరు కనబరచిన క్రీడాకారులకు ‘వుడెన్‌ స్పూన్‌’ అవార్డు ఇస్తున్నారు. అతీంద్రియ పరిశోధకులకు ‘బెంట్‌ స్పూన్‌’ అవార్డు ఇస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా చెత్త ఆధునిక కళాఖండాలను సృష్టించేవారికి ‘టర్నిప్‌ ప్రైజ్‌’ ఇస్తున్నారు. వెటకారంగా ఇచ్చే ఇలాంటి పురస్కారాలు ఇంకా చాలానే ఉన్నాయి. జనాలకు ఇదో రకం వినోదం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement