ఓరుగల్లులో ‘నేదునూరి’ కీర్తనలు
హన్మకొండ కల్చరల్ : తన గానంతో సంగీత ప్రియుల ను మైమరిపించి ఎన్నో అవార్డులు, సత్కారాలు పొందిన నాదబ్రహ్మ, సంగీత కళానిధి నేదునూరి కృష్ణమూర్తికి జిల్లాతో విడదీయలేని అనుబంధం ఉంది. శాస్త్రీయ సం గీతంలో ప్రతిభాశాలిగా పేరొందిన సంగీత విద్వాం సుడు కృష్ణమూర్తి మరణంతో జిల్లాకు చెందిన సంగీత ప్రియులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. వరంగల్ గడ్డపై నేదునూరి అందించిన కచేరీలు ఇక్కడి ప్రజలను మంత్ర ముగ్ధులను చేసింది.
ఈ నేపథ్యంలో కృష్ణమూర్తి ఓరుగల్లులో చేసిన కచేరీలను ఒకసారి జ్థాపకం చేసుకుందాం. జిల్లాకు చెందిన ప్రముఖ నృత్య సంగీత సంస్థ జనప్రియ గానసభ ప్రారంభ వేదికపై తన 53వ యేట నేదునూరి సంగీత కచేరీ నిర్వహించారు. వరంగల్‌లోని కేఎంసీ ఆడిటోరియంలో 1981 మార్చి 1న జరిగిన జనప్రియ గానసభను అప్పటి విదేశాంగ వ్యవహారాలశాఖ మంత్రి పీవీ నర్సింహారావు ప్రారంభిం చారు.
కాగా, అప్పటి రాష్ట్ర మంత్రి టి.హయగ్రీవాచారి, పీవీ నర్సింహారావు సమక్షంలో నేదునూరి కృష్ణమూర్తి సంగీత కచేరి చేయడంతోపాటు వాగ్గేయకారుల కీర్తనలను ఆలపించి సంగీత ప్రియులను, పండితుల ను ఓలలాడించారు. ఆ సమయంలో ప్రముఖ సంగీత వేత్తలు పేరి శ్రీరామ్మూర్తి వయోలిన్ సహకారం అందించగా.. దండమూడి రామ్మోహన్ మృదంగం వాయించారు.
రెండో సారి..
1984 మార్చిలో జనప్రియ గానసభ ఆధ్వర్యంలో జిల్లాలో మొదటిసారిగా ‘త్యాగరాయ ఆరాధనోత్సవా లు’ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రపంచ ప్రఖ్యాత వీణా విద్వాంసులు చిట్టిబాబు కచేరి జరి గింది. అయితే నేదునూరి కృష్ణమూర్తి ఆ సమయంలో కచేరి చేయలేదు కానీ.. చిట్టిబాబు స్వయంగా మేనల్లుడు కావడంతో తాను కూడా కచేరీలో పాల్గొని ఓరుగల్లు సం గీత ప్రియులతో సమావేశమయ్యారు. కాగా, 1988లో జనప్రియ గానసభ ఆధ్వర్యంలో రెండోసారి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నేదునూరి కృష్ణమూర్తి సంగీత కచేరీ చేసి సంగీత ప్రియులను అలరించారు.
పలువురి సంతాపం..
కృష్ణమూర్తి మరణవార్తను తెలుసుకున్న జిల్లాకు చెంది న సంగీత ప్రియులు, ఆయన అభిమానులు దిగ్భాం తికి లోనయ్యారు. నేదునూరి మరణం యావత్ సంగీత ప్రపంచానికి తీరనిలోటని జనప్రియ గానసభ అధ్యక్ష, కార్యదర్శులు పర్చా కోదండరామారావు,వీఎల్. నర్సిం హారావు పేర్కొన్నారు. తన ఆటో బయోగ్రఫీ పుస్తకాన్ని సంతకం చేసి రిజిస్టర్ పోస్టు చేసి పంపించారని వీఎల్ నర్సింహారావు గుర్తు చేసుకున్నారు.
ప్రముఖ కర్ణాటక సంగీత విదుషిమణి ఎంఎస్ సుబ్బులక్ష్మి కంటే ముందుగానే నేదునూరి కృష్ణమూర్తి అన్నమయ్య పాటలను స్వర పర్చారని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, నేదునూరి మృతికి మన సంస్కృతి సాహిత్య సాంస్కృతిక ప్రధాన కార్యదర్శి మిద్దెల రంగనాథ్, రమాదేవి, విద్యారణ్య సంగీత నృత్య కళాశాల ఉపన్యాసకులు రామకృష్ణశర్మ, జనస్వామి శ్రీనివాసమూర్తి, ఉల్లి జయకాంత్, జియావుద్దీన్, భద్రకాళి దేవాలయ ప్రధానార్చకుడు భద్రకాళిశేషు సంతాపం తెలిపారు.