titles
-
'వెటకార' పురస్కారాలు
ప్రతిభా పాటవాలకు గుర్తింపుగా పురస్కారాలు, బిరుదులు, ఘన సత్కారాలు దక్కుతాయి. వివిధ రంగాలలోని ప్రతిభావంతులను సత్కరించే పద్ధతి పురాతన రాచరికాల కాలం నుంచే ఉండేది. అయితే రాజుల కాలంలో పురస్కారాలు, సత్కారాలు మాత్రమే ఉండేవి. వెటకారాలు ఉండేవి కావు. ప్రపంచంలో ప్రజాస్వామ్యం విస్తరించాక, వెటకార పురస్కారాలు కూడా మొదలయ్యాయి.ఆధునిక ప్రపంచంలో ‘నోబెల్’ పురస్కారాలను అత్యున్నత పురస్కారాలుగా పరిగణిస్తాం. బుకర్ ప్రైజ్, పులిట్జర్ అవార్డు, ఆస్కార్, గోల్డెన్ గ్లోబ్ వంటి వాటికి కూడా ప్రతిష్ఠాత్మక పురస్కారాలుగా ప్రపంచంలో గౌరవాదరణలు ఉన్నాయి. వివిధ రంగాల్లో కొంత పేరు గడించినా, పరమ చెత్త ప్రదర్శనలు చేసేవారిని బహిరంగంగా వెటకారం చేయడానికి కూడా అవార్డులు ఉన్నాయి. ఇవి ఆధునిక కాలంలో పుట్టుకొచ్చిన అవార్డులు. నోబెల్ బహుమతికి బదులుగా ఇగ్ నోబెల్ బహుమతి, పులిట్జర్ బహుమతికి బదులుగా ఫూలిట్జర్ బహుమతి ఇలాంటి అవార్డులే! వివిధ రంగాలకు సంబంధించి ఇలాంటి వెటకార పురస్కారాలు మరిన్ని కూడా ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం. ∙పన్యాల జగన్నాథదాసుఇగ్ నోబెల్శాస్త్ర సాంకేతిక సాహితీ రంగాలతో పాటు ప్రపంచశాంతి కోసం పాటుపడే వారికి ఏటా ఇచ్చే నోబెల్ బహుమతులు ఎంతటి ప్రతిష్ఠాత్మకమైనవో అందరికీ తెలుసు. పనికిమాలిన పరిశోధనలు సాగించేవారికి ‘ఇగ్ నోబెల్’ బహుమతుల గురించి ఎక్కువమందికి తెలీదు. ‘ఇగ్ నోబెల్’ బహుమతులు ఇవ్వడాన్ని 1991లో మొదలుపెట్టారు. వెటకార పురస్కారాల్లో ఇగ్ నోబెల్ తీరే వేరు! ‘ఆనల్స్ ఆఫ్ ఇంప్రొబాబుల్ రీసెర్చ్ (ఏఐఆర్) అనే శాస్త్రీయ హాస్య పత్రిక 1991 నుంచి ఏటా ‘ఇగ్ నోబెల్’ పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తోంది. ఈ పత్రిక సంపాదకుడు మార్క్ అబ్రహాం వినూత్న ఆలోచనకు ఫలితమే ‘ఇగ్ నోబెల్’ పురస్కారాలు. అట్టహాసంగా నిర్వహించే కార్యక్రమంలో నోబెల్ బహుమతి గ్రహీతల చేతుల మీదుగా ‘ఇగ్ నోబెల్’ పురస్కారాల ప్రదానం జరుగుతుంది. ‘ఇగ్ నోబెల్’ గ్రహీతలు వేదిక మీద ప్రసంగాలు చేస్తారు. ఈ కార్యక్రమం అసలు నోబెల్ పురస్కారాల ప్రదానోత్సవాన్ని తలపిస్తుంది. ‘ఇగ్ నోబెల్’ పురస్కారానికి ఎంపికైన వారికి ‘ఘనం’గా నగదు బహుమతి కూడా ఇస్తారు. ఎంతనుకున్నారు? అక్షరాలా వంద లక్షల కోట్ల డాలర్లు. అమెరికన్ డాలర్లు కాదు లెండి, జింబాబ్వే డాలర్లు. అమెరికన్ డాలర్లలో ఈ మొత్తం విలువ 0.40 డాలర్లు (రూ.33.73) మాత్రమే! ఈ పురస్కారంలోని వెటకారం అర్థమైంది కదా!అసలు నోబెల్‌ను మించినన్ని విభాగాలు ఇగ్ నోబెల్లో ఉన్నాయి. బోటనీ, అనాటమీ, మెడిసిన్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, పీస్, డెమోగ్రఫీ, ప్రొబాబిలిటీ, ఫిజియాలజీ విభాగాల్లో ‘ఇగ్’ నోబెల్ పురస్కారాలు ఇస్తారు. ఈసారి ‘ఇగ్’నోబెల్ విజేతలు, వారి ఘనతలు ఒకసారి చూద్దాం:⇒ బోటనీ విభాగంలో ఈసారి ఇగ్ నోబెల్ పొందినవారు అమెరికన్ శాస్త్రవేత్త జాకబ్ వైట్, జర్మనీలోని యూనివర్సిటీ ఆఫ్ బాన్‌లో పరిశోధనలు సాగిస్తున్న జపానీస్ శాస్త్రవేత్త ఫిలిపె యమషిటా. వీరిద్దరూ కనుగొన్న అద్భుతం ఏమిటంటే– కృత్రిమ మొక్కల కుండీలు ఉన్న పరిసరాల్లో నిజమైన మొక్కలను కూడా పెంచుతున్నట్లయితే, కృత్రిమ మొక్కల ఆకారాలను నిజమైన మొక్కలు అనుకరిస్తాయట! ప్రపంచానికి ఏ రకంగానూ పనికిరాని ఈ అద్భుతాన్ని కనుగొన్నందుకే వీళ్లకు ఈ పురస్కారం.⇒ అనాటమీ విభాగంలో ఈసారి ఏకంగా పదిమంది ఇగ్ నోబెల్‌ను పొందారు. వివిధ దేశాలకు చెందిన ఈ పరిశోధకులు మూకుమ్మడిగా ఒకే అంశంపై పరిశోధనలు సాగించారు. వీరి పరిశోధనాంశం నెత్తి మీద మొలిచే జుట్టు. భూమ్మీద ఉత్తరార్ధ గోళంలో ఫ్రాన్స్‌కు చెందిన 25 మంది పిల్లలను, దక్షిణార్ధ గోళంలో చిలీకి చెందిన 25 మంది పిల్లలను నమూనాగా తీసుకున్నారు. ఉత్తరార్ధ గోళంలోని పిల్లలతో పోల్చుకుంటే, దక్షిణార్ధ గోళానికి చెందిన పిల్లల్లో నెత్తి మీద జుట్టు అపసవ్య దిశలో రింగులు తిరిగిన వారు ఎక్కువగా ఉన్నట్లు తేల్చారు.⇒ ఫిజిక్స్ విభాగంలో హార్వర్డ్ వర్సిటీ శాస్త్రవేత్త జేమ్స్ సి. లియావో ఈసారి ఇగ్ నోబెల్ పొందారు. చనిపోయిన చేప కళేబరానికి బోలు గొట్టాన్ని కడితే, అది ప్రవాహానికి ఎదురీదగలదని తన పరిశోధనలో తేల్చారు. నిర్ణీత పరిస్థితుల్లో ఒక వస్తువు తన శక్తిని ఏమాత్రం ఉపయోగించుకోకుండానే ప్రవాహానికి ఎదురీదడం సాధ్యమవుతుందని కనుగొన్నారు.⇒ మెడిసిన్ విభాగంలో జర్మనీలోని హాంబర్గ్ వర్సిటీకి చెందిన ముగ్గురు శాస్త్రవేత్తలకు ఇగ్ నోబెల్ దక్కింది. తీవ్రమైన దుష్ప్రభావాలు కలిగించని నకిలీ మందుల కంటే తీవ్రమైన దుష్ప్రభావాలు కలిగించే నకిలీ మందులే ఎక్కువ ప్రభావవంతంగా పనిచేస్తాయని వీరు కనుగొన్నారు.⇒ కెమిస్ట్రీ విభాగంలో ఆమ్స్టర్డామ్ వర్సిటీకి చెందిన టెస్ హీరమన్స్, ఆంటోనీ డెబ్లాస్, డేనియల్ బాన్, శాండర్ వూటర్సన్ ఈసారి ఇగ్ నోబెల్ పొందారు. ఆల్కహాల్ ప్రభావంతో మత్తెక్కి ఉన్న క్రిములను, మత్తు లేకుండా పూర్తి చలనశీలంగా ఉన్న క్రిములను క్రోమాటోగ్రఫీ పరిజ్ఞానంతో వేరుచేయవచ్చని వీరు కనుగొన్నారు.⇒ బయాలజీ విభాగంలో మినెసోటా వర్సిటీకి చెందిన ఫోరై్డస్ ఎలీ, విలియమ్ పీటర్సన్ ఈసారి ఇగ్ నోబెల్ దక్కించుకున్నారు. ఆవులు పాలు చేపడంపై నాడీ వ్యవస్థ పరోక్షంగా ప్రభావం చూపుతుందని వీరు కనుగొన్నారు. దీని కోసం వారు ఒక విచిత్రమైన ప్రయోగం చేశారు. ఒక ఆవు వెనుక నిలుచున్న పిల్లి దగ్గర ఒక కాగితం సంచిని పేల్చారు. అధాటుగా జరిగిన ఈ పరిణామంతో ఆవు పొదుగు నుంచి పాల చుక్కలు నేలరాలాయి.⇒ ఇగ్ నోబెల్ శాంతి బహుమతి అమెరికన్ మానసిక శాస్త్రవేత్త బి.ఎఫ్.స్కిన్నర్‌కు మరణానంతరం లభించింది. తన జీవిత కాలంలో ఆయన ఒక విచిత్రమైన అంశంపై ప్రయోగాలు సాగించాడు. యుద్ధాలు జరిగేటప్పుడు సైనిక బలగాలు ప్రయోగించే క్షిపణుల్లో సజీవంగా ఉన్న పావురాలకు గూళ్లు ఏర్పాటు చేసి, వాటిని కూడా క్షిపణులతో పంపినట్లయితే, ఆ శాంతి కపోతాలు క్షిపణులకు మార్గనిర్దేశనం చేయగలవని ఆశించాడు.⇒ ప్రొబాబిలిటీ విభాగంలో ఫ్రాంటిసెక్ బార్టోస్ నేతృత్వంలోని చెక్ శాస్త్రవేత్తల బృందానికి ఈసారి ఇగ్ నోబెల్ లభించింది. ఒక నాణేన్ని బొమ్మ బొరుసు వేసేటప్పుడు దానిని ఏవైపు పైకి ఉంచి పట్టుకుంటామో, ఎక్కువ సార్లు అదేవైపు తిరిగి నేల మీదకు పడుతుందని వీరు కనుగొన్నారు. ఈ సంగతిని కనుగొనడానికి ఏకంగా 3,50,757 సార్లు నాణెంతో బొమ్మ బొరుసు వేశారు.⇒ డెమోగ్రఫీ విభాగంలో ఇగ్ నోబెల్ ఈసారి ఆక్స్ఫర్డ్ వర్సిటీ శాస్త్రవేత్త సాల్ జస్టిన్ న్యూమన్కు దక్కింది. జనన మరణాల రికార్డులను నమోదు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే ప్రాంతాల్లో నివసించే ప్రజల్లోనే ఎక్కువమంది దీర్ఘాయుష్కులు ఉంటున్నట్లు ఆయన ఒక రహస్య పరిశోధన ద్వారా కనుగొన్నాడు.⇒ ఫిజియాలజీ విభాగంలో ఇగ్ నోబెల్‌ను జపానీస్ శాస్త్రవేత్త ర్యో ఒకాబే నేతృత్వంలోని అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం దక్కించుకుంది. ఈ బృందంలోని శాస్త్రవేత్తలు వివిధ రకాల స్తన్యజీవులపై పరిశోధనలు జరిపి, స్తన్యజీవులు ఆసనం ద్వారా కూడా శ్వాసక్రియ సాగించగలవని తేల్చారు.మరికొన్ని వెటకారాలుగోల్డెన్ కేలా: అంతర్జాతీయ సినిమా రంగంలో ‘గోల్డెన్ గ్లోబ్’ అవార్డులకు ఉన్న పేరు ప్రతిష్ఠలు అందరికీ తెలిసిన సంగతే! ఏటా అత్యుత్తమ సినిమాలకు, వాటిలో నటించిన నటీ నటులకు, దర్శకులు సహా ఇతర సాంకేతిక నిపుణులకు ఈ అవార్డులు ఇస్తారు. ‘గోల్డెన్ గ్లోబ్’ రీతిలోనే బాలీవుడ్లో అతి చెత్త సినిమాలకు వివిధ విభాగాల్లో కొన్నేళ్లుగా ‘గోల్డెన్ కేలా’ అవార్డులు ఇస్తున్నారు. ‘ర్యాండమ్ మ్యాగజీన్’ అనే హాస్యపత్రిక ఈ అవార్డులను బహూకరిస్తోంది. ఈసారి ‘బచ్చన్ పాండే’ చిత్రం అతిచెత్త చిత్రంగా ‘గోల్డెన్ కేలా’ పొందింది. ఈ చిత్ర దర్శకుడు ఫర్హద్ సమ్జీ, ఇందులో నటించిన అక్షయ్ కుమార్, కృతి సనోన్ ‘గోల్డెన్ కేలా’ పొందారు.గోల్డెన్ రాస్బరీ: ‘గోల్డెన్ గ్లోబ్’ రీతిలోనే అతిచెత్త హాలీవుడ్ చిత్రాలకు కొన్నాళ్లుగా ‘గోల్డెన్ రాస్బరీ’ అవార్డులు ఇస్తున్నారు. అమెరికన్ ప్రచారకర్త జాన్ జె.బి. విల్సన్ నెలకొల్పిన ‘గోల్డెన్ రాస్బరీ ఫౌండేషన్’ ద్వారా ఏటా ఈ అవార్డుల ప్రదాన కార్యక్రమం అట్టహాసంగా నిర్వహిస్తుంటారు. ఈ అవార్డులు తీసుకోవడానికి పలువురు ప్రముఖులు ముఖం చాటేసినా, కొందరు మాత్రం ధైర్యంగా ముందుకొచ్చి, వీటిని అందుకోవడం విశేషం. ఈ అవార్డును స్వయంగా అందుకున్న వారిలో టామ్ గ్రీన్, సాండ్రా బులక్ వంటి ప్రముఖులు ఉన్నారు.బిగ్ బ్రదర్ అవార్డు: పౌరుల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించే ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు ఏటా ఈ అవార్డు ఇస్తారు. జార్జ్ ఆర్వెల్ నవల ‘1984’లోని ‘బిగ్ బ్రదర్’ పాత్ర స్ఫూర్తితో ఈ అవార్డును నెలకొల్పారు. గోప్యతకు భంగం కలిగించే అంశాలపై ప్రజల దృష్టిని ఆకట్టుకునేందుకు, ఈ అంశాలపై చర్చను రేకెత్తించేందుకు లండన్ కేంద్రంగా పనిచేస్తున్న ‘ప్రైవసీ ఇంటర్నేషనల్’ ఈ అవార్డులను ఇస్తోంది. ఆర్వెల్ ‘1984’ నవలకు యాభయ్యేళ్లు పూర్తయిన సందర్భంగా 1999 నుంచి ఈ అవార్డులను ఇవ్వడం ప్రారంభించారు. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, ఆస్ట్రియా, బల్గేరియా, చెక్ రిపబ్లిక్, ఫిన్లండ్, ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్ దేశాలు ‘బిగ్ బ్రదర్’ అవార్డులు ఇస్తున్నాయి.పిగాసస్ అవార్డు: ఇదొక విచిత్రమైన అవార్డు. అతీంద్రియ, మానవాతీత మాయలకు ఏటా ఈ అవార్డు ఇస్తారు. కెనడియన్–అమెరికన్ రచయిత, ఐంద్రజాలికుడు జేమ్స్ రాండీ 1982లో ఈ అవార్డును నెలకొల్పారు. ఇజ్రాయెలీ–బ్రిటిష్ ఐంద్రజాలికుడు యూరీ గెల్లర్ పేరుతో ఈ అవార్డును ‘యూరీ ట్రోఫీ’ అని కూడా అంటారు. ఈ అవార్డు లోగో ‘రెక్కల పంది’ కావడంతో ఇది ‘పిగాసస్’ అవార్డుగా పేరు పొందింది. మానవాతీత మానసిక శక్తులతో అత్యధిక సంఖ్యలో జనాలను మభ్యపెట్టిన వ్యక్తులకు, అతీంద్రియ కథనాలను వాస్తవ కథనాల్లా ప్రచురించే మీడియా సంస్థలకు, అతీంద్రియ అంశాలపై అధ్యయనాల కోసం నిధులు సమకూర్చే సంస్థలకు, ఒక వెర్రిబాగుల అంశాన్ని అతీంద్రియ ప్రభావంగా ప్రకటించే శాస్త్రవేత్తలకు ఈ అవార్డులు ఇస్తారు.ఘంటా అవార్డు: బాలీవుడ్‌లోని అతిచెత్త సినిమాలకు వివిధ విభాగాల్లో ఇచ్చే అవార్డు ఇది. బాలీవుడ్ దర్శక నిర్మాత, రచయిత కరణ్ అంశుమాన్, ఆయన మిత్రుడు ప్రశాంత్ రాజ్‌ఖోవా 2011లో ఈ అవార్డును నెలకొల్పారు. అట్టహాసంగా జరిగే ఈ అవార్డుల కార్యక్రమానికి స్వయంగా హాజరై, అవార్డులు తీసుకోవడానికి చాలామంది ముఖం చాటేస్తారు. అయితే, బాలీవుడ్ హీరోలలో రితేశ్ దేశ్‌ముఖ్, హీరోయిన్లలో సోనాక్షి సిన్హా ఈ అవార్డుల వేడుకకు హాజరై, స్వయంగా అవార్డులు అందుకోవడం విశేషం.పురస్కారాల చరిత్రపురస్కార సత్కారాల గురించి చెప్పుకోవాలంటే చాలా చరిత్రే ఉంది. ప్రపంచంలో తొలి పురస్కారం ఎవరు పొందారో, దానిని ఎవరు ఇచ్చారో స్పష్టమైన ఆధారాలేవీ చరిత్రలో నమోదు కాలేదు. ఏదో ఒక రంగంలో విశేషమైన కృషి చేసిన వారికి, గొప్ప ఘనత సాధించిన వారికి పురస్కారాలు అందజేసే పద్ధతి శతాబ్దాలుగా ప్రపంచమంతటా ఉంది. ప్రాచీన కాలంలో రోమన్ పాలకులు పురస్కారాలు ఇచ్చే పద్ధతిని మొదలుపెట్టి ఉంటారనడానికి కొన్ని ఆధారాలు ఉన్నాయి. క్రీస్తుశకం ఐదో శతాబ్ది నాటికే రోమన్ పాలకులు తమ పౌరులకు పురస్కారాలను బహూకరించేవారు. సైనిక విజయాలలో కీలక పాత్ర పోషించిన సైనికులకు, సామాజిక పురోగతికి కృషి చేసినవారికి, రాజ్యం పట్ల విధేయత కలిగిన వారికి పురస్కారాలను ప్రకటించి, వారిని బహిరంగ వేదికపై ఘనంగా సత్కరించేవారు. మధ్యయుగాల నాటికి పురస్కార సత్కారాదులు ఆనాటి రాజ్యాలన్నింటికీ వ్యాపించాయి. ఆనాటి యూరోపియన్ రాజ్యాల్లో వివిధ రకాల క్రీడా పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి కార్ల్సిల్ బెల్స్, ఆర్నేట్ కప్పులు, కిప్ కప్పులు వంటివి బహూకరించేవారు. వీటిని బంగారం, వెండి వంటి విలువైన లోహాలతో తయారు చేసేవారు. ఇప్పటికీ చాలా క్రీడా పోటీల్లో బహూకరిస్తున్న కప్పులు ఆనాటి కిప్ కప్పుల నమూనానే అనుసరిస్తుండటం విశేషం. పదహారో శతాబ్దిలో బ్రిటిష్ రాజ్యంలో కింగ్ హెన్రీ–VIII హయాంలో వివిధ రకాల క్రీడా పోటీలకు ఆదరణ బాగా ఉండేది. కింగ్ హెన్రీ–VIII కాలంలో ఏటా రకరకాల క్రీడల పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులను అందజేసేవారు. ఆ కాలంలో విలువిద్య పోటీలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేవారు. ఈ పోటీల్లో విజేతలకు ‘స్కార్టన్ సిల్వర్ యారో’ అనే వెండి బాణాన్ని ప్రత్యేకమైన కర్రపెట్టెలో భద్రపరచి బహిరంగ వేదికపై బహూకరించేవారు. క్రీడాకారులతో పాటు కవులను, పండితులను, కళాకారులను కూడా ఆనాటి రాజులు ఘనంగా సత్కరించేవారు. బహుమానాలుగా విలువైన భూములను, భవంతులను, వెండి బంగారాలను ఇచ్చేవారు. కాళ్లకు గండపెండేరాలను, చేతులకు కంకణాలను తొడిగేవారు. వివిధ విద్యలలో అసాధారణ ప్రతిభా పాటవాలు ప్రదర్శించిన వారికి కనకాభిషేకాలు, గజారోహణలు వంటి సత్కారాలను కూడా ఘనంగా చేసేవారు.ఇలాంటివి మరిన్ని అవార్డులు ఉన్నాయి. వివిధ రంగాల్లో వెటకారంగా ఇచ్చే ఈ పురస్కారాలను స్వయంగా స్వీకరించే వారి సంఖ్య మాత్రం ఎప్పుడూ తక్కువే! పాత్రికేయ రంగంలో పులిట్జర్ అవార్డు అత్యంత ప్రతిష్ఠాత్మకమైనది. తప్పుడు కథనాలతో ఊదరగొట్టే పాత్రికేయులు, మీడియా సంస్థల కోసం కొందరు ఔత్సాహికులు ‘ఫూలిట్జర్ అవార్డు’ నెలకొల్పారు. గందరగోళంగా ఇంగ్లిష్ రాసేవారికి ‘గోల్డెన్ బుల్’ అవార్డు ఇస్తారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మీడియా సంస్థల మీద కోపంతో కొన్నేళ్ల కిందట ‘ఫేక్ న్యూస్ అవార్డు’ నెలకొల్పారు. క్రీడా పోటీల్లో అతిచెత్త ఆటతీరు కనబరచిన క్రీడాకారులకు ‘వుడెన్ స్పూన్’ అవార్డు ఇస్తున్నారు. అతీంద్రియ పరిశోధకులకు ‘బెంట్ స్పూన్’ అవార్డు ఇస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా చెత్త ఆధునిక కళాఖండాలను సృష్టించేవారికి ‘టర్నిప్ ప్రైజ్’ ఇస్తున్నారు. వెటకారంగా ఇచ్చే ఇలాంటి పురస్కారాలు ఇంకా చాలానే ఉన్నాయి. జనాలకు ఇదో రకం వినోదం. -
యంగ్ హీరోస్.. స్టార్ టైటిల్స్
-
మహారాజా?
మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో ఓ భారీ బడ్జెట్ ఫిల్మ్ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలోని హీరోయిన్ పాత్ర కోసం ఇండోనేషియా బ్యూటీ చెల్సియా ఇస్లాన్, దీపికా పదుకోన్ పేర్లు తెరపైకి వచ్చాయి. ఫారెస్ట్ అడ్వెంచరస్ ఫిల్మ్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రానికి ‘మహారాజా’, ‘మహారాజ్’, ‘చక్రవర్తి’ అనే టైటిల్స్‌ను పరిశీలిస్తున్నారనే టాక్ తెరపైకి వచ్చింది. మరి.. ఫైనల్‌గా ఈ టైటిల్స్‌లో ఏదో ఒకటి ఫిక్స్ అవుతుందా? లేక మరొక టైటిల్‌ను మేకర్స్ ఖరారు చేస్తారా? అనేది తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు. ఇక విజయేంద్రప్రసాద్ కథ అందించిన ఈ చిత్రానికి ఎమ్ఎమ్ కీరవాణి సంగీతదర్శకుడు. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఈ ఏడాది వేసవిలో ఆరంభమవుతుందని టాక్. -
అగ్రహీరోల సినిమాలు.. పాన్ ఇండియా రేంజ్లో ఉండేలా ప్లాన్!
ఇండస్ట్రీలో పాన్ ఇండియా ట్రెండ్ కనిపిస్తోంది. సినిమాలు దేశవ్యాప్తంగా పలు భాషల్లో విడుదలవుతున్నాయి. దీంతో అన్ని భాషలవారికీ అనుగుణంగా ఉండే కథలను ఎంచుకుంటున్నారు. కథలు మాత్రమే కాదు.. టైటిల్ కూడా పాన్ ఇండియాకి సూట్ అయ్యేలా ఉండాలని ప్రయత్నం చేస్తున్నారు. ఒకే టైటిల్‌తో అన్ని భాషల్లో ఓ చిత్రం విడుదలైతే అది ఆడియన్స్‌కు మరింత చేరువ అవుతుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ క్రమంలో కొందరు టాప్ స్టార్స్ నటిస్తున్న చిత్రాల టైటిల్స్‌పై చర్చ జరుగుతోంది. ‘ఫలానా టైటిల్ అనుకుంటున్నారట’ అని వైరల్‌గా ఉన్న టైటిల్స్ ‘పాన్ ఇండియా టైటిల్’లా ఉన్నాయి. మరి.. ఫైనల్‌గా ఆ టైటిల్స్‌నే ఫైనలైజ్ చేస్తారో? లేదో చెప్పలేం కానీ.. చర్చల్లో ఉన్న ఆ టైటిల్స్ గురించి మాత్రం చెప్పుకుందాం. రాజా డీలక్స్? ప్రస్తుతం ‘సలార్’, ప్రాజెక్ట్ కె’ వంటి భారీ యాక్షన్ సినిమాలు చేస్తున్నారు ప్రభాస్. కేవలం యాక్షన్ జానర్‌కే పరిమితం కాకుండా కాస్త కామెడీ తరహా పాత్రల్లో కూడా ప్రభాస్ నటించాలను కుంటున్నారని తెలుస్తోంది. ఇందులో భాగంగానే దర్శకుడు మారుతితో ఓ సినిమా చేస్తున్నారు ప్రభాస్. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. హారర్ అండ్ కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ సినిమా కథ రాజా డీలక్స్ అనే థియేటర్లో జరుగుతుందని, అందుకే ఈ సినిమాకు ‘రాజా డీలక్స్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేయాలనుకుంటున్నారని సమాచారం. ఒకవేళ ఈ చిత్రాన్ని ఇతర భాషల్లో విడుదల చేయాలనుకుంటే.. అప్పుడు టైటిల్ మార్చే అవసరం లేకుండా పోతుంది. గుంటూరు కారమా? ఊరికి మొనగాడా? మహేశ్‌బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లు. ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే జనవరి 13న విడుదల కానుంది. ఫస్ట్ లుక్ కూడా విడుదలైంది. ఇక ఈ చిత్రానికి ‘అయోధ్యలో అర్జునుడు’, ‘ఊరికి మొనగాడు’, ‘పల్నాటి పోటుగాడు’, ‘అమరావతికి అటు ఇటు’, ‘గుంటూరు కారం’ టైటిల్స్ తెరపైకి వచ్చాయి. ఎక్కువగా ‘గుంటూరు కారం’, ‘ఊరికి మొనగాడు’ వినిపిస్తున్నాయి. సూపర్‌స్టార్ కృష్ణ నటించిన హిట్ చిత్రాల్లో ‘ఊరికి మొనగాడు’ ఒకటి అని తెలిసిందే. కాగా ఈ నెల 31న కృష్ణ బర్త్ డే సందర్భంగా టైటిల్ ప్రకటించే చాన్స్ ఉంది. మరి, ఇక్కడ పేర్కొన్న టైటిల్స్‌లో ఏదో ఒకటి ఉంటుందా? వేరే టైటిల్‌ని ఫిక్స్ చేస్తారా? అనేది చూడాలి. దేవర? ‘జనతా గ్యారేజ్’ తర్వాత ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో మరో సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్. ఓ లీడ్ రోల్‌ను సైఫ్ అలీఖాన్ చేస్తున్నారు. కాగా ఈ సినిమాకు ‘వస్తున్నా!’, ‘దేవర’ టైటిల్స్‌ను చిత్ర యూనిట్ పరిశీలిస్తోందనే టాక్ తెరపైకి వచ్చింది. ఈ నెల 20న ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌ను అధికారికంగా ప్రకటిస్తారట. కె. హరికృష్ణ, మిక్కిలినేని సుధాకర్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 5న రిలీజ్ కానుంది. వీరే కాదు.. మరికొందరు స్టార్స్ చిత్రాల టైటిల్స్పైనా చర్చ జరుగుతోంది. ప్రేక్షకులను ఆకర్షించే విషయాల్లో ‘టైటిల్’ ఒకటి. ఆ విషయాన్ని, కథనీ దృష్టిలో పెట్టుకుని టైటిల్స్ పెడుతుంటారు. ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్‌ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఇక ఫ్యాన్స్ గురించి చెప్పాలంటే టైటిల్ పవర్‌ఫుల్‌గా ఉంటే వారికి కిక్కే కిక్కు. -
అప్పటి హిట్ టైటిల్.. ఇప్పుడు రిపీట్..
ఒక సినిమాకి కథ ఎంత ముఖ్యమో టైటిల్ కూడా అంతే ముఖ్యం. పేరు ఎంత క్యాచీగా ఉంటే ప్రేక్షకుల దృష్టిని అంతగా ఆకట్టుకుంటుంది. అందుకే ఒక్కొక్కసారి హిట్ అయిన పాత సినిమాల పేర్లను టైటిల్‌గా పెడుతుంటారు. అఫ్కోర్స్ కథకు తగ్గట్టుగా ఉందా అని కూడా చూస్తారనుకోండి. ఇంకో విషయం ఏంటంటే.. ఇలా పాత సినిమాల టైటిల్స్ వాడాలంటే ఆ సినిమా విడుదలై ఐదేళ్లయినా అయ్యుండాలి లేదా ఆ నిర్మాత అనుమతి ఇస్తే పెట్టుకోవచ్చు. ప్రస్తుతం తెలుగులో 5 టైటిల్స్ రిపీట్ అయ్యాయి. పాత చిత్రాల హిట్ టైటిల్స్‌తో రూపొందుతున్న తాజా చిత్రాలపై ఓ లుక్కేద్దాం.. అప్పుడు రొమాంటిక్.. ఇప్పుడు యాక్షన్ 'విక్రమ్' నాగార్జున హీరోగా పరిచయమైన తొలి చిత్రం ‘విక్రమ్’. వి. మధుసూదన్ రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నాగేశ్వరరావు పెద్ద కుమారుడు అక్కినేని వెంకట్ నిర్మించారు. రొమాంటిక్ యాక్షన్‌గా రూపొందిన ఈ సినిమా 1986లో విడుదలై మంచి విజయం సాధించింది. ఆ సినిమా విడుదలైన 36 ఏళ్లకు మరోసారి ‘విక్రమ్’ పేరు తెరపైకి వస్తోంది. కమల్‌హాసన్ హీరోగా లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ చిత్రం ‘విక్రమ్’. విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలు చేసిన ఈ చిత్రంలో హీరో సూర్య అతిథిగా చేశారు. అప్పటి ‘విక్రమ్’ రొమాంటిక్ యాక్షన్ అయితే ఈ ‘విక్రమ్’ యాక్షన్ థ్రిల్లర్. తెలుగు, తమిళంలో ఈ నెల 3న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ 'మేజర్' వేరు రవిచంద్రన్ హీరోగా నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన కన్నడ చిత్రం ‘సిపాయి’. ఇందులో సౌందర్య కథానాయికగా నటించగా హీరో చిరంజీవి ముఖ్య పాత్ర చే శారు. 1996లో విడుదలై కన్నడంలో మంచి విజయం సాధించిన ఈ సినిమాని 1998లో ‘మేజర్’ పేరుతో తెలుగులో డబ్ చేసి, విడుదల చేశారు. ఈ చిత్రంలో మేజర్ చంద్రకాంత్ పాత్రను చిరంజీవి చేశారు. ఇది రొమాంటిక్, యాక్షన్ ఓరియంటెడ్ మూవీ అయితే అడివి శేష్ హీరోగా నటించిన తాజా ‘మేజర్’ కథ వేరు. ఇది బయోపిక్. 26/11 ముంబై దాడుల్లో దేశం కోసం ప్రాణాలు అర్పించిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితంతో ఈ సినిమా రూపొందింది. తెలుగు, మలయాళ, హిందీ భాషల్లో శశికిరణ్ తిక్క దర్శకత్వంలో రూపొం దిన ఈ చిత్రం జూన్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రేమ 'ఖుషి' ‘నువ్వు గుడుంబా సత్తి అయితే నేను సిద్ధు.. సిద్ధార్థ్ రాయ్’ అంటూ ‘ఖుషి’లో పవన్ కల్యాణ్ చెప్పిన డైలాగ్ ప్రేక్షకులకు గుర్తుండే ఉంటుంది. ఎస్.జె. సూర్య దర్శకత్వంలో పవన్ కల్యాణ్, భూమిక జంటగా నటించిన ఈ చిత్రం 2001లో విడుదలైంది. లవ్, కామెడీ ఎంటర్టైనర్గా ఈ చిత్రం రూపొందింది. తాజాగా విజయ్ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న చిత్రానికి ‘ఖుషి’ టైటిల్‌ని అనౌన్స్ చేశారు. ఆ ‘ఖుషి’లానే ఈ ‘ఖుషి’ కూడా లవ్, రొమాంటిక్ ఎంటర్టైనర్. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో ఈ ఏడాది డిసెంబర్ 23న విడదల కానుంది. చారిత్రక 'కంచుకోట' ఎన్టీఆర్, కాంతారావు హీరోలుగా, సావిత్రి, దేవిక హీరోయిన్లుగా నటించిన జానపద చిత్రం ‘కంచుకోట’. సీఎస్ రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రం 1967లో విడుదలై ఘనవిజయం సాధించింది. ఇప్పుడు ‘కంచుకోట’ పేరుతో ఓ సినిమా రూపొందుతోంది. మదన్ హీరోగా, ఆశ, దివ్య హీరోయిన్లు. ప్రతాని రామకృష్ణ గౌడ్ ముఖ్య పాత్ర చేస్తున్నారు. ఎమ్.ఏ చౌదరి, వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా హిస్టారికల్ నేపథ్యంలో ఉంటుంది. రివెంజ్ 'రుద్రవీణ' చిరంజీవి హీరోగా నటించిన చిత్రం ‘రుద్రవీణ’. కె.బాలచందర్ దర్శకత్వంలో 1988లో విడుదలైన ఈ సినిమా మ్యూజికల్ హిట్‌గా నిలిచింది. అప్పటివరకూ మాస్ యాక్షన్ రోల్స్ చేస్తూ వచ్చిన చిరంజీవి ఈ చిత్రంలో అందుకు భిన్నంగా కనిపించారు. కాగా ‘రుద్రవీణ’ పేరుతో తాజాగా ఓ సినిమా రూపొందింది. శ్రీరామ్ నిమ్మల హీరోగా, ఎల్సా, శుభశ్రీ హీరోయిన్లుగా మధుసూదన్ రెడ్డి దర్శకత్వం వహించారు. రివెంజ్ డ్రామాతో వస్తున్న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. -
కొకినాకిస్–కిరియోస్ జంటకు డబుల్స్ టైటిల్
ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ పురుషుల డబుల్స్ టైటిల్ థనాసి కొకినాకిస్–నిక్ కిరియోస్ (ఆస్ట్రేలియా) జంట ఖాతాలోకి వెళ్లింది. శనివారం జరిగిన ఫైనల్లో కొకినాకిస్–కిరియోస్ ద్వయం 7–5, 6–4తో ఎబ్డెన్–పర్సెల్ (ఆస్ట్రేలియా) జంటపై గెలిచి తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను సాధించింది. ‘వైల్డ్ కార్డు’ ద్వారా బరిలోకి ఈ టోర్నీ చరిత్రలో డబుల్స్ టైటిల్ నెగ్గిన జోడీగా కొకినాకిస్–కిరియోస్ చరిత్ర సృష్టించింది. -
డ్వేన్ బ్రావో ఖాతాలో 16వ టి20 టైటిల్
టి20 ఫార్మాట్లో అత్యధిక టైటిల్స్ గెలిచిన ప్లేయర్‌గా వెస్టిండీస్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో రికార్డు నెలకొల్పాడు. 15 టైటిల్స్‌తో వెస్టిండీస్‌కే చెందిన కీరన్ పొలార్డ్ పేరిట ఉన్న రికార్డును బ్రావో బద్దలు కొట్టాడు. బ్రావో టైటిల్స్ వివరాలు 3 ఐపీఎల్ (చెన్నై; 2011, 2018, 2021) 1 చాంపియన్స్ లీగ్ (చెన్నై; 2014) 2 టి20 వరల్డ్ కప్ (వెస్టిండీస్; 2012, 2016) 1 స్టాన్ఫోర్డ్ కప్ (ట్రినిడాడ్ అండ్ టొబాగో; 2008) 2 బిగ్‌బాష్ లీగ్ (విక్టోరియన్ బుష్రేంజర్స్; 2010, సిడ్నీ సిక్సర్స్–2011) 5 కరీబియన్ ప్రీమియర్ లీగ్ (ట్రినిడాడ్ అండ్ టొబాగో; 2015, 2017, 2018; ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ 2020, సెయిట్ కిట్స్ అండ్ నెవిస్ 2021) 1 బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (ఢాకా డైనమైట్స్; 2016) 1 పాకిస్తాన్ సూపర్ లీగ్ (క్వెట్టా గ్లాడియేటర్స్; 2019) -
సాత్విక్ జంటకు టైటిల్
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) టూర్ సూపర్–100 హైదరాబాద్ ఓపెన్ టోర్నమెంట్లో భారత్‌కు రెండు విభాగాల్లో టైటిల్స్ లభించాయి. పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) ద్వయం 21–16, 21–14తో మూడో సీడ్ అక్బర్–ఇస్ఫహాని (ఇండోనేసియా) జంటపై నెగ్గింది. మిక్స్డ్ ఫైనల్లో టాప్ సీడ్ సిక్కిరెడ్డి–ప్రణవ్ (భారత్) ద్వయం 21–15, 19–21, 23–25తో ఆరో సీడ్ అక్బర్–వినీ ఒక్తవినా (ఇండోనేసియా) జంట చేతిలో ఓడిపోయింది. నిర్ణాయక మూడో గేమ్‌లో సిక్కిరెడ్డి ద్వయం 3 మ్యాచ్ పాయింట్లను వదులుకోవడం గమనార్హం. పురుషుల సింగిల్స్ ఫైనల్లో టాప్‌సీడ్ సమీర్ వర్మ 21–15, 21–18తో సూంగ్ జూ వెన్ (మలేసియా)పై గెలిచి టైటిల్ సొంతం చేసుకున్నాడు. -
గండర గండడు
ఐక్యరాజ్య సమితి వాళ్లకు సీరియస్ సమస్యలలో తలదూర్చి, తీర్పులు చెప్పి చెప్పీ బోర్ కొట్టేసింది. కాస్త రిలాక్స్ కోసం ఏదైనా చేయాలనుకున్నారు. వెంటనే ‘మీలో దమ్మున్నవాడు ఎవరు?’ పేరుతో ఒక ప్రత్యేక కార్యక్రమానికి రూపకల్పన చేశారు. దీనిలో భాగంగా అసమాన అద్భుత సాహసాలు చేసేవారికి ‘యోధాను యోధ’ బిరుదు ఇచ్చి భారీ బహుమతి ఇస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల నుంచి ఎంతోమంది ఈ పోటీకి హాజరయ్యారు. అనేక వడపోతల తరువాత అయిదు దేశాల నుంచి అయిదుమంది ఎంపికయ్యారు.వారు ప్రదర్శించిన విద్యలు... మొదటి వాడు:తన పొడవాటి గడ్డాన్ని ఒక కారుకు కట్టి కిలోమీటరు వరకు లాగాడు అమెరికాకు చెందిన మాక్స్వెల్ గూటెన్‌బర్గ్.ప్రేక్షకులు చప్పట్లు చరిచారు. రెండవవాడు:‘పూల్ ఔర్ కాంటే’ సినిమాలో అజయ్ దేవగణ్లా రన్నింగ్‌లో ఉన్న రెండు బైక్‌ల మీద అటో కాలు ఇటో కాలు వేసి దర్జాగా అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు వెళ్లాడు జపాన్‌కు చెందిన అమి అకియో తుమితుమి.ప్రేక్షకులు గట్టిగా చప్పట్లు చరిచారు. మూడోవాడు:‘ఫైర్వాక్’ పేరుతో మండుతున్న నిప్పుల్లో అటు ఇటు అరగంట పాటు నడిచాడు చైనాకు చెందిన షాంగ్ మింగ్ డాంగ్.‘ఇక తప్పుతుందా’ అన్నట్లు చప్పట్లు కొట్టారు ప్రేక్షకులు. నాలుగవవాడు:రకరకాల విషసర్పాలను ఒంటి పై వేసుకొని హంగామా సృష్టించాడు రష్యాకు చెందిన వ్లాడిమీర్ మిస్తోలోవ్.సేమ్ సౌండ్!ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శికి ఇవన్నీ చూసి చిర్రెత్తుకొచ్చింది.‘‘ఎహే...చిన్నప్పుడు మా ఊరి అంగడిలో ఇంత కంటే మంచి సాహసాలు చూశాను’’ అని పెదవి విరిచాడు.‘‘వీటిని కూడా సాహసాలు అంటారా?’’ అని కోపగించుకున్నాడు ఐరాస కార్యదర్శి. ఈలోపు చివరి వ్యక్తి వచ్చాడు. అతడు అయిదు ఐటమ్స్ చేశాడు. ఏంచేశాడంటే... ఒకటి: తన జేబులో నుంచి ఒక కోడిగుడ్డును బయటకు తీసి దాన్ని ఆకాశంలోకి విసిరి గురిచూసి కాల్చాడు. అంతే.. ఆ గుడ్డులోని సొన కరెక్ట్‌గా వెళ్లి నేలపై ఉన్న పెనంపై పడి వేడి వేడి ఆమ్లెట్ అయింది! ‘అదిరిపోయింది’ అంటూ ప్రేక్షకుల నుంచి అరుపులు. ‘నిజమే సుమీ’ అన్నాడు ఐరాస కార్యదర్శి ఆనందంగా. రెండు: జేబులో నుంచి చిన్న బాక్స్ తీశాడు. అందులో నుంచి ఒక దోమను బయటకు తీసి గాల్లోకి ఎగిరేశాడు. తన అమ్ములపొదిలో నుంచి వాడిగల బాణాన్ని గురిచూసి సంధించాడు. అంతే...ఆ దోమ కళ్లు ఒక పక్క, కాళ్లు ఒక పక్క, రెక్కలు ఒక పక్క పడ్డాయి! ప్రేక్షకులతో పాటు ఐరాస కార్యదర్శి చప్పట్లు చరిచాడు. మూడు: ఒకరాత్రి విమానం ఎక్కి ఆకాశంలోకి దూసుకెళ్లాడు. అంత పెద్ద ఆకాశాన్ని పట్టుకొని అయిదు నిమిషాల పాటు నాన్‌స్టాప్‌గా ఊపాడు. చింతచెట్టు నుంచి చింతకాయలు రాలిపడ్డట్లు ఆకాశం నుంచి చుక్కలు రాలిపడ్డాయి!‘కేక’ అని అరిచారు ప్రేక్షకులు. ‘డబుల్ కేక’ అని అరిచాడు కార్యదర్శి. నాలుగు: ఒక పెద్ద బకెట్ తీసుకొని హిందూ మహాసముద్రంలోని నీళ్లన్నీ తోడి సçహార ఎడారిలో పోశాడు. అక్కడ ఉన్న ఇసుకను బస్తాల్లో నింపి హిందూ మహాసముద్రంలో నింపాడు! అయిదు: సూర్యుడికి చంద్రుడికి మధ్య పెద్ద తాడు కట్టి దాన్ని ఉయ్యాలగా చేసుకొని ‘అట్లతద్దోయ్ ఆరట్లోయ్...ముద్దపప్పోయ్ మూడట్లోయ్’ అంటూ అట్లతద్ది పాటలు పాడాడు. ఇవన్నీ చూసిన తరువాత ‘‘ఈడు మగాడ్రా బుజ్జి...ఈడే విజేత’’ అని ప్రకటించాడు ఐరాస కార్యదర్శి.విజేతను అందరూ చుట్టుముట్టారు. ఆటోగ్రాఫ్‌లు, ఫోటోగ్రాఫ్‌లు. కొందరు అతనిపై పూలవర్షం కురిపించారు. కొందరు అతడి చేతిని ప్రేమగా ముద్డాడారు.‘ఆగండి’ అని గట్టిగా అరిచాడు ఐరాస కార్యదర్శి. గుండు సూది కింద పడినా శబ్దం వినిపించేంత నిశ్శబ్దం! ‘‘ఆనందంలో పడిపోయి అసలు విషయం మరిచిపోయాం. ఈయన పేరేమిటో, ఏ దేశం నుంచి వచ్చాడో తెలుసుకుందాం. ఈ పోటీలో గెలిచిన వ్యక్తి ఏ మూలన ఉన్న స్టేజీ మీదికి వచ్చి తన గురించి పరిచయం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను’’ అన్నాడు కార్యదర్శి.‘ఈ గండరగండడు ఏ దేశం వాడో... ఏంచేస్తుంటాడో’ అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నిండిపోయింది. ఈలోపు ప్రేక్షకుల మధ్య నుంచి చినిగిన బట్టలతో స్టేజీ మీదికి వచ్చాడు విజేత. మైక్ అందుకొని...‘‘అభిమానం అనేది బురదలాంటిది. షర్ట్ వెళ్లి బురదలో పడ్డా, బురద వెళ్లి షర్ట్ మీద పడ్డా షర్ట్‌కే డ్యామేజీ!’’ అని మొదలు పెట్టాడు విజేత.‘‘ఆ విషయం తరువాత తీరిగ్గా మాట్లాడుకోవచ్చు...ముందు నువ్వు ఏ దేశం నుంచి వచ్చావో చెప్పవయ్య!’’ ఆసక్తిగా అడిగాడు కార్యదర్శి.‘‘నా పేరు సిల్వర్స్టార్బాబు, సౌత్ఇండియన్ సినిమాల్లో హీరోగా పని చేస్తుంటాను’’ అంటూ తన గురించి చెప్పి కప్పు అందుకొని ఫొటోకు పోజు ఇచ్చాడు ‘మీలో దమ్మున్నవాడు ఎవరు?’ విజేత! – యాకుబ్ పాషా -
ఎవరికో భయపడి టైటిల్ మార్చొద్దు
తమిళసినిమా: ఎవరికో భయపడి చిత్ర పేర్లను మార్చకండి అంటూ నటుడు, నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్ అన్నారు. జయ శుభశ్రీ ప్రొడక్షన్స్ పతాకంపై ఎస్కే.సుబ్బయ్య నిర్మించిన చిత్రం నుంగంబాక్కమ్. ఇది సమీపకాలంలో స్వాతి అనే యువతి హత్య ఇతి వృత్తంతో తెరకెక్కుతున్న చిత్రం అన్నది గమనార్హం. దీనికి కథనం, దర్శకత్వం బాధ్యతలను ఎస్డీ.రమేశ్ సెల్వన్ నిర్వహించారు. ఇందులో శంకర్ సీఐగా అజ్మల్ నటించారు.ఆయిరా, మనో ముఖ్య పాత్రల్లో నటించగా ఇతర పాత్రల్లో ఏ.వెంకటేశ్ న్యాయవాదిగా బెంజ్క్లబ్ శక్తి సెంగోట్టై మరో ఇన్స్పెక్టర్గా నటించారు. జోన్స్ ఆనంద్ ఛాయాగ్రహణం, శ్యామ్ డీ.రాజ్ సంగీతాన్ని అందించారు. చిత్ర ట్రైలల్ ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం సాయంత్రం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్‌ల్యాబ్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న విశాల్ ట్రైలర్‌ను ఆవిష్కరించి మాట్లాడుతూ ముందు స్వాతి కొలై వళక్కు పేరుతో జరిపిన ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో తాను పాల్గొన్నానన్నారు. ఒక యథార్థ సంఘటన ఆధారంగా రూపొందిస్తున్న చిత్రానికి అందుకు తగ్గ టైటిల్ పెట్టడమే న్యాయం అని పేర్కొన్నారు. అలాంటిది ఎందుకు ఈ చిత్రానికి నుంగంబాక్కమ్ అని పేరు మార్చారు ఎవరైనా చెప్పారా? లేక మరెవరి ఒత్తిడి కారణంగానో టైటిల్ మార్చారా అని ప్రశ్నించారు. నిజ సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన చిత్రాలకు టైటిల్‌ను ఎవరికో భయపడి మార్చాల్సిన అవసరం లేదని విశాల్ పేర్కొన్నారు. ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో ఒక ఆసక్తి ఉంటుందని, తనకు అలాంటి ఆసక్తి ఉందని అన్నారు. తాను ఇరుంబుతిరై చిత్రంలో రెండు సన్నివేశాలను తొలగించిన సంఘటనను ఎదుర్కొన్నానని, డిజిటల్ ఇండియా, ఆధార్ కార్డు వంటి సన్నివేశాల విషయంలో సమస్యలను ఎదుర్కొన్నానని చెప్పారు. నుంగంబాక్కమ్ చిత్రానికి తన వంతు సహాయంగా మంచి విడుదల తేదీని కేటాయిస్తానని విశాల్ పేర్కొన్నారు. దర్శకుల సంఘం అధ్యక్షుడు విక్రమన్, ఎస్ఏ.చంద్రశేఖర్, గీతరచయిత స్నేహన్, చిత్ర యూనిట్ పాల్గొన్నారు. -
18న తెరపైకి 18–05–2009
తమిళసినిమా: ఒక తేదీనే టైటిల్‌గా చిత్రాలు తెరకెక్కిడం అరుదే. అదేవిధంగా తాజాగా 18–05–2009 పేరుతో ఒక చిత్రం రూపొందింది. అయితే ఈ టైటిల్ వెనుక బలమైన కథ, లక్షలాది మంది ప్రాణత్యాగాలు, పోరుబాట, ఆక్రందనలు, ఆవేదనలు ఉన్నాయి. శ్రీలంక తమిళుల హక్కుల పోరాటం, సాయుధ దళాల కిరాతకం లాంటి హృదయ విషాదకర కథాంశంతో కూడిన చిత్రం 18–05–2009. గురునాధ్ కలసాని నిర్మించిన ఈ చిత్రానికి కే.గణేశన్ దర్శకుడు. కర్ణాటకకు చెందిన తమిళుడైన గణేశన్ ఇంతకు ముందు పలు కన్నడ చిత్రాలతో పాటు తమిళం,తెలుగు చిత్రాలకు దర్శకత్వం వహించారు. త తాజా చిత్రం గురించి ఆయన తెలుపుతూ శ్రీలంక తమిళులను ఆ దేశ సాయుదళాలు ఊచకోత కోసిన సంఘటనలు 18.05.2009 వరకూ కొనసాగాయన్నారు. ఇది చరిత్ర ఎప్పటికీ మరచిపోదన్నారు. ఒక్క చివరిరోజునే 40 వేల మంది ముక్కుపచ్చలారని చిన్నారులతో పాటు మహిళలు, పురుషులు హత్యకు గురయ్యారన్నారు. తమిళులుగా పుట్టిన ఒకే కారణంతో అమాయకపు మహిళలను కూడా రాక్షసత్వంతో శ్రీలంక సాయుధ దళాలు చంపేశాయన్నారు. న్యాయం కోసం గొంత్తెత్తిన వారి కేకలు శ్రీలంక గాలిలో కలిసిపోయాయన్నారు. ఈ సంఘటనలు కళ్లకు కట్టినట్లు తెరపై ఆవిష్కరించిన చిత్రం 18–05–2009 అని చెప్పారు. సుభాష్ చంద్రబోస్, ప్రభాకరన్, నాగినీడు, తాన్యా, జేకప్, శ్రీరామ్, బాలాజీ తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన చిత్రానికి సంగీత రారాజు ఇళయరాజా సంగీతం అందించడం విశేషం. ఈ చిత్రాన్ని ఈ నెల 18న విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాత తెలిపారు. -
రుత్విక, సిక్కి రెడ్డిలకు టైటిల్స్
సాక్షి, హైదరాబాద్: తమ విజయపరంపరను కొనసాగిస్తూ హైదరాబాద్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణులు గద్దె రుత్విక శివాని... సిక్కి రెడ్డి రష్యా ఓపెన్ గ్రాండ్‌ప్రి టోర్నమెంట్లో టైటిల్స్‌ను సొంతం చేసుకున్నారు. రష్యాలోని వ్లాదివోస్తోక్ నగరంలో ఆదివారం ముగిసిన ఈ టోర్నమెంట్లో రుత్విక శివాని మహిళల సింగిల్స్ విభాగంలో... సిక్కి రెడ్డి మిక్స్డ్ డబుల్స్ విభాగంలో విజేతలుగా నిలిచారు. మహిళల సింగిల్స్ ఫైనల్లో రుత్విక 21-10, 21-13తో ఎవగెనియా కొసెట్‌స్కాయ (రష్యా)పై గెలుపొందగా... మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లో సిక్కి రెడ్డి-ప్రణవ్ చోప్రా ద్వయం 21-17, 21-19తో వ్లాదిమిర్ ఇవనోవ్-వలెరియా సొరోకినా (రష్యా) జంటను ఓడించింది. విజేతలుగా నిలిచిన రుత్విక శివానికి 4,125 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 2 లక్షల 74 వేలు)తోపాటు 5500 ర్యాంకింగ్ పాయింట్లు... సిక్కి రెడ్డి జంటకు 4,345 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 2 లక్షల 89 వేలు)తోపాటు 5500 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఎవగెనియాతో జరిగిన ఫైనల్లో రుత్విక పూర్తి ఆధిపత్యం చలాయించింది. కేవలం 26 నిమిషాల్లోనే తన ప్రత్యర్థిని ఓడించి కెరీర్లో తొలిసారి గ్రాండ్‌ప్రి స్థాయి టైటిల్‌ను కై వసం చేసుకుంది. మరోవైపు సిక్కి రెడ్డి జంటకిది ఈ ఏడాది రెండో గ్రాండ్‌ప్రి టైటిల్. ఇంతకుముందు సిక్కి-ప్రణవ్ బ్రెజిల్ గ్రాండ్‌ప్రి టోర్నీలో విజేతగా నిలిచింది. అయితే పురుషుల సింగిల్స్ విభాగంలో హైదరాబాద్ ప్లేయర్ సిరిల్ వర్మకు నిరాశ ఎదురైంది. ఫైనల్లో సిరిల్ వర్మ 21-16, 19-21, 10-21తో జుల్ఫాద్లి జుల్కిఫ్లి (మలేసియా) చేతిలో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచాడు. సిరిల్ వర్మకు 2,090 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. లక్షా 39 వేలు)తోపాటు 4680 ర్యాంకింగ్ పాయింట్లు దక్కాయి. -
అ‘ద్వితీయం’
నిరీక్షణ ఫలించింది. కల నిజమైంది. సంబరం రెట్టింపైంది. ‘మన రాకెట్’ మళ్లీ మెరిసింది. ఇంతకాలం విదేశీ గడ్డపై సత్తా చాటుకున్న భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు సొంత అభిమానుల సమక్షంలో అద్వితీయ ఆటతీరుతో అబ్బుర పరిచారు. గతేడాది చైనా ఓపెన్‌లో ఆవిష్కృతమైన అద్భుత దృశ్యాన్ని ఇండియా ఓపెన్‌లోనూ పునరావృతం చేశారు. ఏకకాలంలో ఒకే సూపర్ సిరీస్ టోర్నమెంట్లో మహిళల, పురుషుల సింగిల్స్ టైటిల్స్‌ను రెండోసారి సొంతం చేసుకొని సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్ వారెవ్వా అనిపించారు. న్యూఢిల్లీ: ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నమెంట్ ప్రారంభమై నాలుగేళ్లు గడిచాయి. సొంతగడ్డపై భారత క్రీడాకారులకు ఈ టోర్నీ చేదు ఫలితాలనే ఇచ్చింది. ఇన్నాళ్లూ ఏ విభాగంలోనూ మనోళ్లు సెమీఫైనల్ దాటి ముందుకెళ్లలేకపోయారు. అయితే ఐదో యేట అందరి అంచనాలు తారుమారయ్యాయి. అటు మహిళల సింగిల్స్ విభాగంలో సైనా నెహ్వాల్... ఇటు పురుషుల సింగిల్స్ విభాగంలో కిడాంబి శ్రీకాంత్ చాంపియన్స్‌గా అవతరించి ‘ఔరా’ అనిపించారు. ఆదివారం జరిగిన ఫైనల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ సైనా 21-16, 21-14తో ప్రపంచ మాజీ చాంపియన్, మూడో సీడ్ ఇంతనోన్ రత్చనోక్ (థాయ్‌లాండ్)పై నెగ్గగా... ప్రపంచ నాలుగో ర్యాంకర్ శ్రీకాంత్ 18-21, 21-13, 21-12తో ప్రపంచ ఆరో ర్యాంకర్ విక్టర్ అక్సెల్సన్ (డెన్మార్క్)ను ఓడించాడు. విజేతలుగా నిలిచిన సైనా, శ్రీకాంత్‌లకు 20,625 డాలర్ల చొప్పున (రూ. 12 లక్షల 89 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 9200 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. గతంలో ఆడిన నాలుగు పర్యాయాల్లో క్వార్టర్ ఫైనల్ అడ్డంకిని అధిగమించడంలో విఫలమైన సైనా ఈసారి ఏకంగా విజేతగా నిలిచింది. భుజం నొప్పితో బాధపడుతున్నా ఈ హైదరాబాద్ అమ్మాయి పట్టుదలగా పోరాడి తన ఖాతాలో తొమ్మిదో ‘సూపర్ సిరీస్’ టైటిల్‌ను జమచేసుకుంది. సెమీస్‌లో ప్రపంచ చాంపియన్ కరోలినా మారిన్ (స్పెయిన్)ను ఓడించిన రత్చనోక్‌ను తక్కువ అంచనా వేయకుండా ఆరంభం నుంచే సైనా పక్కా ప్రణాళికతో ఆడింది. చురుకైన కదలికలు, నెట్ వద్ద అప్రమత్తత, పదునైన స్మాష్‌లు సంధిస్తూ నిలకడగా పాయింట్లు సాధించింది. రత్చనోక్ అనవసర తప్పిదాలు, అభిమానుల మద్దతు కూడా లభించడంతో రెండు గేముల్లోనూ సైనా స్పష్టమైన ఆధిపత్యాన్ని కనబరిచి 49 నిమిషాల్లో ఫైనల్‌ను ముగించింది. టాప్ సీడ్ హోదాకు న్యాయం చేస్తూ సైనా నెహ్వాల్ ఈ టోర్నీలో తన ప్రత్యర్థులకు ఒక్క గేమ్ కూడా కోల్పోకుండా విజేతగా నిలువడం విశేషం. రెండు వారాల క్రితం విక్టర్ అక్సెల్సన్ను ఓడించి స్విస్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టైటిల్ నెగ్గిన హైదరాబాద్ కుర్రాడు శ్రీకాంత్ మళ్లీ అలాంటి ఫలితాన్ని భారత్‌లోనూ పునరావృతం చేశాడు. తొలి గేమ్‌లో తడబడిన శ్రీకాంత్ రెండో గేమ్ నుంచి పుంజుకున్నాడు. అక్సెల్సన్ జోరుకు పగ్గాలు వేస్తూ నిలకడగా పాయింట్లు స్కోరు చేశాడు. అదే జోరులో గేమ్‌ను దక్కించుకొని మ్యాచ్‌లో నిలిచాడు. నిర్ణాయక మూడో గేమ్ ప్రారంభంలో శ్రీకాంత్ 3-7తో వెనుకబడ్డాడు. ఈ దశలో ఏమాత్రం కంగారు పడకుండా ఆడిన శ్రీకాంత్ వరుసగా మూడు పాయింట్లు నెగ్గి ఆధిక్యాన్ని ఒక పాయింట్‌కు తగ్గించాడు. 10-12తో వెనుకబడిన దశలో శ్రీకాంత్ ఒక్కసారిగా రెచ్చిపోయాడు. కసితీరా ఆడుతూ ఎవ్వరూ ఊహించని విధంగా వరుసగా 11 పాయింట్లు నెగ్గి అక్సెల్సన్ను నిశ్చేష్టుడిని చేశాడు. 55 నిమిషాల్లో ఫైనల్‌ను ముగించి తన ఖాతాలో రెండో సూపర్ సిరీస్ టైటిల్‌ను జమచేసుకున్నాడు. ‘బాయ్’ నజరానా గురువారం విడుదలయ్యే తాజా ర్యాంకింగ్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్ అందుకోనున్న సైనా నెహ్వాల్‌కు భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) రూ. 10 లక్షల నగదు ప్రోత్సాహకం ప్రకటించింది. ఇండియా ఓపెన్ నెగ్గినందుకు శ్రీకాంత్‌కు రూ. 5 లక్షలు అందజేస్తామని ‘బాయ్’ అధ్యక్షుడు అఖిలేశ్ దాస్‌గుప్తా తెలిపారు. కల నిజమైంది... ‘‘ఇండియా ఓపెన్ టైటిల్ నెగ్గడంతో గత నాలుగేళ్ల నుంచి నాపై ఉన్న భారం తొలగిపోయింది. గత నాలుగేళ్లుగా విఫలమవుతున్న టోర్నీలో తొలిసారి ఫైనల్‌కు చేరడమే కాకుండా విజేతగా నిలిచినందుకు చాలా సంతోషంగా ఉన్నాను. సొంతగడ్డపై నంబర్‌వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకోవడం... ఇండియా ఓపెన్ గెలవడంతో నా కల నిజమైంది. నా ఆటతీరుపట్ల గర్వంగా ఉన్నాను. ఎంతో కష్టపడ్డాక నేనీ స్థాయికి చేరుకున్నాను. నా జీవితంలో ఇవి మధుర క్షణాలు. ఈ గెలుపు నాలోని విజయకాంక్షను రెట్టింపు చేస్తుంది. మరిన్ని టైటిల్స్ నెగ్గేందుకు ప్రేరణలా నిలుస్తుంది. ఈ విజయాన్ని ఎంతగానో ఆస్వాదిస్తాను. ఐస్‌క్రీమ్ తింటాను. మిల్క్ షేక్ తాగుతాను. చాక్లెట్ తింటాను. సోమవారం విశ్రాంతి తీసుకొని ఆ తర్వాత ప్రాక్టీస్ మొదలుపెడతాను. తదుపరి టోర్నీలో ఆడేందుకు మలేసియాకు బయలుదేరుతాను.’’ -సైనా నెహ్వాల్ నంబర్‌వన్ సాధిస్తా.... ‘‘ప్రతిసారీ గెలుస్తానని అనుకోను. ఓడిపోతే భయపడను. బరిలోకి దిగిన ప్రతిసారీ నా అత్యుత్తమ ఆటతీరు ప్రదర్శించేందుకు కృషి చేస్తాను. ఈ తరహా దృక్పథమే నాకు విజయాలు అందిస్తోంది. ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్ సాధించాలనే లక్ష్యం నా మదిలో ఉంది. నిలకడగా మంచి ఫలితాలు సాధిస్తే భవిష్యత్‌లో ఈ ఘనత సాధిస్తాననే నమ్మకం ఉంది. ఇలాంటి విజయాలు నాలో కొత్త ఉత్సాహాన్నిస్తాయి. మున్ముందు మరిన్ని టోర్నమెంట్లలో మెరుగ్గా ఆడేందుకు స్ఫూర్తిగా నిలుస్తాయి.’’ -శ్రీకాంత్ -
‘భారత బ్యాడ్మింటన్‌కు ఇది
గొప్ప రోజు. ఒకే టోర్నీలో మన ఇద్దరు ప్లేయర్లు టైటిల్స్ నెగ్గడం గతంలో ఎన్నడూ జరగలేదు. ఈ సమయంలో భారత జాతీయ గీతం వినేందుకు నేను అక్కడ ఉంటే బాగుండేదనిపిస్తోంది. రెండూ ప్రత్యేకమైన విజయాలే. సైనా ఈ టోర్నీలో తన అత్యుత్తమ ఆటతీరు కనబర్చింది. ఇటీవల ఆమె చాలా మంచి ఆటతీరు కనబర్చినా విజేతగా నిలువలేదు. ఈ విజయం ఆమెలో ఆత్మవిశ్వాసం పెంచుతుంది. కొంత మంది తక్కువ స్థాయి చైనా క్రీడాకారిణులు ఉన్నా... ఇది ఆమె సూపర్ సిరీస్ విజయాన్ని తక్కువ చేయలేదు. ఇక శ్రీకాంత్ గురించి ఎంత చెప్పినా తక్కువే. నా పుట్టిన రోజునాడు అతను అపురూపమైన కానుక ఇచ్చాడు. లిన్ డాన్లాంటి ఆటగాడిని ఫైనల్లో ఓడించి సూపర్ సిరీస్ టైటిల్ నెగ్గడం అసాధారణం. విజయంతో పాటు అతని ఆటతీరును ప్రత్యేకంగా ప్రశంసించాలి. శ్రీకాంత్ వయసు 21 ఏళ్లే. భవిష్యత్తులో మరిన్ని అద్భుతాలకు ఈ గెలుపు సూచనగా చెప్పగలను.’ - ‘సాక్షి'తో పుల్లెల గోపీచంద్, భారత చీఫ్ కోచ్ బహుమతిగా కారు కెరీర్లో తొలి సూపర్ సిరీస్ టైటిల్ సాధించిన కిడాంబి శ్రీకాంత్‌కు తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం ఉపాధ్యక్షుడు చాముండేశ్వరీనాథ్ కారును బహుమతిగా ప్రకటించారు. శ్రీకాంత్‌కు ‘ఫోర్డ్ ఫిగో స్పోర్ట్’ కారును ఇవ్వనున్నట్లు ఆయన వెల్లడించారు. -
టాలీవుడ్ ట్రెండ్!
సినిమా కథ మొత్తాన్ని ఒక్కమాటలో చెప్పేసేదే టైటిల్. అంతే కాకుండా మొదట ప్రేక్షకులను ఆకర్షించేంది కూడా టైటిలే. సినిమాను జనం వద్దకు తీసుకువెళ్లేదీ ఈ టైటిలే అని చెప్పడంలో అతిశయోక్తిలేదు. ప్రస్తుతం మూవీ టైటిల్స్ సెంటిమెంట్, ట్రెండ్... ఇలా అనేక అంశాలపై ఆధారపడి పెడుతున్నారు. సెంటిమెంట్ ప్రభావం బలంగా పాతుకుపోయింది. అయినప్పటికీ అందరూ టైటిల్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ఒక్కో టైంలో ఒక్కో ట్రెండ్ నడుస్తూ ఉంటుంది. ఒకప్పుడు క్యాచీగా ఉండే రెండక్షరాలు, మూడక్షరాల టైటిల్స్‌తో చాలా సినిమాలు వచ్చేవి. ఇప్పుడు తెలుగు సినిమాల టైటిల్స్ పొడవు పెరిగింది. సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు సూపర్ హిట్ కావటంతో పొడవాటి టైటిల్స్ పెట్టడం మొదలుపెట్టారు. ఊకొడతారా ఉలిక్కిపడతారా, మల్లెలతీరంలో సిరిమల్లె పువ్వు... లాంటి పేర్లు పెడుతున్నారు. అలాంటి పేర్లు ఎన్నని పెడతారు. అందుకే పాటల పల్లవులను టైటిల్స్‌గా మర్చేస్తున్నారు. ఎటో వెళ్లిపోయింది మనసు, ఊహలు గుసగుసలాడే, గుండెజారి గల్లంతయ్యిందే, గోవిందుడు అందరివాడిలే, దిక్కులు చూడకు రామయ్యా......ప్రస్తుతానికి ఈ ట్రెండ్ సాగుతోంది. చిన్న సినిమాల విషయం పక్కనపెడితే, బిగ్ ప్రాజెక్ట్స్ చేసే స్టార్ హీరోలు టైటిల్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. సాధారణంగా తమ స్టార్ డమ్‌కు ఉపయోగపడే టైటిల్స్‌ను మాత్రమే ఎంచుకుంటారు. అయితే ఇప్పుడు మన హీరోలు అవేమీ ఆలోచించటంలేదు. అత్తారింటికి దారేది, గోవిందుడు అందరివాడేలే, గోపాలా గోపాలా... వంటి టైటిల్స్ చూస్తే అర్ధమైపోతుంది. మన హీరోలు కూడా తమ స్టార్ డమ్‌ను వదిలివేసి, ట్రెండ్‌నే ఫాలో అయిపోతున్నారు. అయితే సంతోషకరమైన విషయం ఏమిటంటే తెలుగుదనానికి దగ్గరగా ఉండే పేర్లే ఎక్కువగా పెడుతున్నారు. ** -
శశిధర్, ఉషశ్రీలకు టైటిల్స్
ఏపీ వెటరన్ బ్యాడ్మింటన్ టోర్నీ సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ స్టేట్ వెటరన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో శశిధర్, ఉషశ్రీలు విజేతలుగా నిలిచారు. అండర్-35 పురుషుల సింగిల్స్ టైటిల్‌ను శశిధర్, మహిళల సింగిల్స్ ట్రోఫీని ఉషశ్రీ కైవసం చేసుకున్నారు. చందానగర్‌లోని పీజేఆర్ స్టేడియంలో బుధవారం జరిగిన ఫైనల్లో హైదరాబాద్ ఆటగాడు శశిధర్ వాకోవర్‌తో మురళీకృష్ణ (వైజాగ్)పై గెలుపొందగా, ఉషశ్రీ (విజయనగరం) 21-19, 21-11తో సరిత ప్రియాల్ (వరంగల్)పై నెగ్గింది. అండర్-35 పురుషుల డబుల్స్ ఫైనల్లో కిషోర్ కుమార్ (హైదరాబాద్)-ఉదయ్ భాస్కర్ (వైజాగ్) జోడి 21-8, 21-19తో మురళీకృష్ణ (వైజాగ్)-మనోజ్ కుమార్ (మెదక్) ద్వయంపై విజయం సాధించగా, మహిళల ఫైనల్లో చంద్రకళ (ఖమ్మం)-సరిత ప్రియా (వరంగల్) ద్వయం 21-18, 21-19 సుబ్బలక్ష్మి-ఉషశ్రీ (విజయనగరం) జంటపై గెలుపొందింది. అండర్-45 పురుషుల సింగిల్స్ ఫైనల్లో లింగేశ్వర రావు (వైజాగ్) 21-17, 21-9తో వైజాగ్‌కే చెందిన నాయక్‌ను ఓడించగా, మహిళల సింగిల్స్‌లో గురుప్రీత్ సంధు 21-15, 21-16తో సావిత్రిపై గెలిచింది. మహిళల డబుల్స్ ఫైనల్లో గురుప్రీతమ్ సింగ్-స్మిత (హైదరాబాద్) జోడి 21-16, 21-15తో అఫ్జల్ బేగం-సావిత్రి (ఖమ్మం) జంటపై నెగ్గింది. అండర్-45 మిక్స్డ్ డబుల్స్ తుదిపోరులో కమలాకర్-గురుప్రీత్ సంధు (హైదరాబాద్) జంట 21-9, 21-6తో లింగేశ్వర రావు-స్మిత జిందాల్ (వైజాగ్) ద్వయంపై గెలిచింది. అండర్-55 పురుషుల సింగిల్స్ టైటిల్‌ను ప్రకాశ్ (హైదరాబాద్) చేజిక్కించుకోగా, డబుల్స్ టైటిల్‌ను రవీంద్రనాథ్ రెడ్డి-ప్రకాశ్ (హైదరాబాద్) జోడి గెలుచుకుంది.