ఒక సినిమాకి కథ ఎంత ముఖ్యమో టైటిల్ కూడా అంతే ముఖ్యం. పేరు ఎంత క్యాచీగా ఉంటే ప్రేక్షకుల దృష్టిని అంతగా ఆకట్టుకుంటుంది. అందుకే ఒక్కొక్కసారి హిట్ అయిన పాత సినిమాల పేర్లను టైటిల్‌గా పెడుతుంటారు. అఫ్‌కోర్స్ కథకు తగ్గట్టుగా ఉందా అని కూడా చూస్తారనుకోండి. ఇంకో విషయం ఏంటంటే.. ఇలా పాత సినిమాల టైటిల్స్ వాడాలంటే ఆ సినిమా విడుదలై ఐదేళ్లయినా అయ్యుండాలి లేదా ఆ నిర్మాత అనుమతి ఇస్తే పెట్టుకోవచ్చు. ప్రస్తుతం తెలుగులో 5 టైటిల్స్ రిపీట్ అయ్యాయి. పాత చిత్రాల హిట్ టైటిల్స్‌తో రూపొందుతున్న తాజా చిత్రాలపై ఓ లుక్కేద్దాం..
అప్పుడు రొమాంటిక్.. ఇప్పుడు యాక్షన్ 'విక్రమ్'
నాగార్జున హీరోగా పరిచయమైన తొలి చిత్రం ‘విక్రమ్’. వి. మధుసూదన్ రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నాగేశ్వరరావు పెద్ద కుమారుడు అక్కినేని వెంకట్ నిర్మించారు. రొమాంటిక్ యాక్షన్‌గా రూపొందిన ఈ సినిమా 1986లో విడుదలై మంచి విజయం సాధించింది. ఆ సినిమా విడుదలైన 36 ఏళ్లకు మరోసారి ‘విక్రమ్’ పేరు తెరపైకి వస్తోంది. కమల్‌హాసన్ హీరోగా లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ చిత్రం ‘విక్రమ్’. విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలు చేసిన ఈ చిత్రంలో హీరో సూర్య అతిథిగా చేశారు. అప్పటి ‘విక్రమ్’ రొమాంటిక్ యాక్షన్ అయితే ఈ ‘విక్రమ్’ యాక్షన్ థ్రిల్లర్. తెలుగు, తమిళంలో ఈ నెల 3న ఈ చిత్రం రిలీజ్ కానుంది.
ఈ 'మేజర్' వేరు
రవిచంద్రన్ హీరోగా నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన కన్నడ చిత్రం ‘సిపాయి’. ఇందులో సౌందర్య కథానాయికగా నటించగా హీరో చిరంజీవి ముఖ్య పాత్ర చే శారు. 1996లో విడుదలై కన్నడంలో మంచి విజయం సాధించిన ఈ సినిమాని 1998లో ‘మేజర్’ పేరుతో తెలుగులో డబ్ చేసి, విడుదల చేశారు. ఈ చిత్రంలో మేజర్ చంద్రకాంత్ పాత్రను చిరంజీవి చేశారు. ఇది రొమాంటిక్, యాక్షన్ ఓరియంటెడ్ మూవీ అయితే అడివి శేష్ హీరోగా నటించిన తాజా ‘మేజర్’ కథ వేరు. ఇది బయోపిక్. 26/11 ముంబై దాడుల్లో దేశం కోసం ప్రాణాలు అర్పించిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితంతో ఈ సినిమా రూపొందింది. తెలుగు, మలయాళ, హిందీ భాషల్లో శశికిరణ్ తిక్క దర్శకత్వంలో రూపొం దిన ఈ చిత్రం జూన్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ప్రేమ 'ఖుషి'
‘నువ్వు గుడుంబా సత్తి అయితే నేను సిద్ధు.. సిద్ధార్థ్ రాయ్’ అంటూ ‘ఖుషి’లో పవన్ కల్యాణ్ చెప్పిన డైలాగ్ ప్రేక్షకులకు గుర్తుండే ఉంటుంది. ఎస్.జె. సూర్య దర్శకత్వంలో పవన్ కల్యాణ్, భూమిక జంటగా నటించిన ఈ చిత్రం 2001లో విడుదలైంది. లవ్, కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందింది. తాజాగా విజయ్ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న చిత్రానికి ‘ఖుషి’ టైటిల్‌ని అనౌన్స్ చేశారు. ఆ ‘ఖుషి’లానే ఈ ‘ఖుషి’ కూడా లవ్, రొమాంటిక్ ఎంటర్‌టైనర్. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో ఈ ఏడాది డిసెంబర్ 23న విడదల కానుంది.
చారిత్రక 'కంచుకోట'
ఎన్టీఆర్, కాంతారావు హీరోలుగా, సావిత్రి, దేవిక హీరోయిన్లుగా నటించిన జానపద చిత్రం ‘కంచుకోట’. సీఎస్ రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రం 1967లో విడుదలై ఘనవిజయం సాధించింది. ఇప్పుడు ‘కంచుకోట’ పేరుతో ఓ సినిమా రూపొందుతోంది. మదన్ హీరోగా, ఆశ, దివ్య హీరోయిన్లు. ప్రతాని రామకృష్ణ గౌడ్ ముఖ్య పాత్ర చేస్తున్నారు. ఎమ్.ఏ చౌదరి, వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా హిస్టారికల్ నేపథ్యంలో ఉంటుంది.
రివెంజ్ 'రుద్రవీణ'
చిరంజీవి హీరోగా నటించిన చిత్రం ‘రుద్రవీణ’. కె.బాలచందర్ దర్శకత్వంలో 1988లో విడుదలైన ఈ సినిమా మ్యూజికల్ హిట్‌గా నిలిచింది. అప్పటివరకూ మాస్ యాక్షన్ రోల్స్ చేస్తూ వచ్చిన చిరంజీవి ఈ చిత్రంలో అందుకు భిన్నంగా కనిపించారు. కాగా ‘రుద్రవీణ’ పేరుతో తాజాగా ఓ సినిమా రూపొందింది. శ్రీరామ్ నిమ్మల హీరోగా, ఎల్సా, శుభశ్రీ హీరోయిన్లుగా మధుసూదన్ రెడ్డి దర్శకత్వం వహించారు. రివెంజ్ డ్రామాతో వస్తున్న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment