Rudraveena
-
Rudra Veena Review: ‘రుద్రవీణ మూవీ రివ్యూ
టైటిల్: రుద్రవీణ నటీనటులు: శ్రీరామ్ నిమ్మల, ఎల్సా ఘోష్, శుభశ్రీ, రఘు కుంచె, గెటప్ శ్రీను, చలాకీ చంటి తదితరులు నిర్మాత : లక్ష్మణ రావు రాగుల దర్శకత్వం: మధుసూదన్ రెడ్డి సంగీతం: మహావీర్ సినిమాటోగ్రఫీ: జి ఎల్ బాబు ఎడిటర్: నాగేశ్వర్ రెడ్డి విడుదల తేది: అక్టోబర్ 28, 2022 ‘రుద్రవీణ’ కథేంటంటే.. లాలప్ప (రఘు కుంచె) యానాం లో పెద్ద రౌడీ. రాజకీయ నాయకులు అండదండలతో యానాంలో అక్రమ వ్యాపారాలు చేస్తుంటాడు. ‘లాలప్ప పన్ను’పేరుతో నగరంలోని చిరు వ్యాపారస్తుల నుంచి డబ్బులు వసూలు చేస్తుంటారు. ప్రజలకు కూడా లాలప్ప మనుషులు అంటే చాలా భయం. అలాంటి సమయంలో రుద్ర(శ్రీరామ్ నిమ్మల) వరుసగా లాలప్ప మనుషులను హత్య చేస్తుంటాడు. దీంతో లాలప్ప రుద్ర గురించి ఆరా తీస్తాడు. అసలు రుద్ర ఎవరు? ఎందుకు లాలప్ప మనుషులను హత్య చేస్తున్నాడు? వీణ(శుభ శ్రీ)తో రుద్రకు ఉన్న సంబంధం ఏంటి? ఐపీఎల్‌కు సెలెక్ట్ అయినా రుద్ర.. ఎందుకు జైలుపాలయ్యాడు? హత్యలు చేసేది రుద్రనే అని తెలిసిన తర్వాత ప్రియురాలు ప్రియ(ఎల్సా ఘోష్) ఎలాంటి నిర్ణయం తీసుకుంది? చివరకు లాలప్పను రుద్ర ఎలా చంపాడు? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. బాలచందన్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘రుద్రవీణ’ చిత్రం అప్పట్లో ఎంతసూపర్ హిట్ అయిందో అందరికి తెలిసిందే. అలాంటి సూపర్ హిట్ టైటిల్‌తో రావడంతో ‘రుద్రవీణ’పై ఓ మోస్తారు అంచనాలు పెరిగాయి. కానీ ఆ అంచనాలను ఈ ‘రుద్ర వీణ’ అందుకోలేకపోయింది. టైటిల్ పవర్‌ఫుల్‌గా ఉంది కానీ.. కథలో అది మిస్ అయింది. కథలో వచ్చే ముఖ్యమైన డైలాగ్స్ విషయంలో కూడా దర్శకుడు జాగ్రత్తలు తీసుకోలేదనిపిస్తుంది. ఓ సీన్లో విలన్‌తో ఎమ్మార్వో ‘నీలాంటి వాళ్లను నా సర్వీసులో చాలా మందిని చూశా’అంటాడు.. అప్పుడు విలన్ ‘నా లాంటి వాడిని చూడలేదు’అంటాడు. అక్కడ ‘నన్ను చూడలేదు’ అంటే దానికో అర్థం ఉంటుంది కానీ.. విలన్ కూడా అదే డైలాగ్ చెప్పడం ఏంటో ఎవరికి అర్థం కాదు. అలాగే హీరో కొట్టకముందే విలన్స్ పైకి వెళ్లిపడడం.. పొంతనలేని సీన్స్ ప్రేక్షకుడి సహనానికి పరీక్షగా మారుతాయి. విలన్ మనుషులను హీరో చంపిన తీరు కూడా సాదా సీదాగా ఉంటుంది. హీరోయిన్‌తో లవ్‌ట్రాక్ కాస్త ఎంటర్టైనింగ్ సాగినప్పటికీ.. ఆ సీన్స్ మధ్య మధ్యలో వచ్చిపోతుంటాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ఇది రీవేంజ్ డ్రామా అని సెకండాఫ్‌లో తెలుస్తుంది. అయితే అక్కడ కూడా కథనం ఆసక్తికరంగా సాగదు. జైలులో మొబైల్ ఫోన్ వాడడం, హత్య చేసినా ఏం జరగనట్లుగా చూపించడం..అంతా సినిమాటిక్‌గా సాగుంతుంది. క్లైమాక్స్ కూడా రొటీన్‌గా ఉంటుంది. రుద్ర పాత్రకి శ్రీరామ్ నిమ్మల న్యాయం చేశాడు. డ్యాన్స్‌తో పాటు ఫైట్ సీన్స్‌లో కూడా చక్కగా నటించాడు. ఇక విలన్‌గా రఘు కుంచె తనదైన నటనతో మెప్పించాడు. రుద్ర ప్రియురాలు ప్రియగా (ఎల్సా ఘోష్) మెప్పించింది. తెరపై అందంగా కనిపించది. వీణ పాత్రకి శుభశ్రీ న్యాయం చేసింది. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతిక నిపుణుల పనితీరు పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. -
రుద్రవీణ: శ్రీకాంత్ చేతుల మీదుగా ‘బంగారు బొమ్మ’ పాట
మధుసూదన్ రెడ్డి దర్శకత్వంలో శ్రీరామ్ నిమ్మల, ఎల్సా గోష్, శుభశ్రీ సోనియా హీరోహీరోయిన్లుగా తెరకెక్కతున్న చిత్రం ‘రుద్రవీణ’. సాయి విల్లా సినిమాస్ పతాకంలో రాగుల గౌరమ్మ సమర్పణలో రాగుల లక్ష్మణ్, రాగుల శ్రీనులు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ దశలో ఉన్న ఈచిత్రం నుంచి బంగారు బొమ్మ పాట రిలీజైంది. చిత్ర బృందం సమక్షంలో నటుడు శ్రీకాంత్ హైదరాబాద్‌లో ఈ పాటను లాంచ్ చేశాడు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ.. ‘రుద్రవీణ టైటిల్ బాగుంది. ఈ టైటిల్ మన తెలుగు ప్రేక్షకులందరికి సుపరిచితమే. గతంలో అన్నయ్య చిరంజీవి నటించిన రుద్రవీణ మూవీ మంచి మ్యూజికల్ హిట్‌గా నిలిచింది. అలాంటి గొప్ప టైటిల్‌తో వస్తున్న ఈ సినిమా నుంచి విడుదలైన బంగారు బొమ్మ పాట విన్నాను. చాలా బాగా నచ్చింది. ఈ పాటతో పాటు ఈ సినిమాలోని అన్ని పాటలు మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’ అన్నారు. ఇక చివరిగా ఈ సినిమాకు పని చేసిన టెక్నిషియన్స్, ఆర్టిస్టులందరిక ఆల్ ద బెస్ట్ చెప్పారు. ఇక నిర్మాతలు మాట్లాడుతూ.. చిరంజీవి గారి స్ఫూర్తితో ఇండస్ట్రీకి వచ్చి సినిమాలు తీస్తున్నామన్నారు. ‘మెగా ఫ్యామిలీది గోల్డెన్ హ్యాండ్ అని ఎలా భావిస్తామో వారి తరువాత శ్రీకాంత్ గారిది కూడా అంతే గోల్డెన్ హ్యాండ్. అలాంటి శ్రీకాంత్ గారి చేతుల మీదుగా మా సినిమా తొలి సాంగ్‌ను రిలీజ్ అవ్వడం సంతోషంగా ఉంది’ అన్నారు. మహావీర్ సంగీతం అందించిన ఈ చిత్రంలో శ్రీరామ్ నిమ్మల, ఎల్సా గోష్ , శుభశ్రీ,, రఘు కుంచె, ధనరాజ్, గెటప్ శ్రీను, చమ్మక్ చంద్ర, చలాకి చంటి, సోనియా తదితరులు నటిస్తున్నారు. -
అప్పటి హిట్ టైటిల్.. ఇప్పుడు రిపీట్..
ఒక సినిమాకి కథ ఎంత ముఖ్యమో టైటిల్ కూడా అంతే ముఖ్యం. పేరు ఎంత క్యాచీగా ఉంటే ప్రేక్షకుల దృష్టిని అంతగా ఆకట్టుకుంటుంది. అందుకే ఒక్కొక్కసారి హిట్ అయిన పాత సినిమాల పేర్లను టైటిల్‌గా పెడుతుంటారు. అఫ్కోర్స్ కథకు తగ్గట్టుగా ఉందా అని కూడా చూస్తారనుకోండి. ఇంకో విషయం ఏంటంటే.. ఇలా పాత సినిమాల టైటిల్స్ వాడాలంటే ఆ సినిమా విడుదలై ఐదేళ్లయినా అయ్యుండాలి లేదా ఆ నిర్మాత అనుమతి ఇస్తే పెట్టుకోవచ్చు. ప్రస్తుతం తెలుగులో 5 టైటిల్స్ రిపీట్ అయ్యాయి. పాత చిత్రాల హిట్ టైటిల్స్‌తో రూపొందుతున్న తాజా చిత్రాలపై ఓ లుక్కేద్దాం.. అప్పుడు రొమాంటిక్.. ఇప్పుడు యాక్షన్ 'విక్రమ్' నాగార్జున హీరోగా పరిచయమైన తొలి చిత్రం ‘విక్రమ్’. వి. మధుసూదన్ రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నాగేశ్వరరావు పెద్ద కుమారుడు అక్కినేని వెంకట్ నిర్మించారు. రొమాంటిక్ యాక్షన్‌గా రూపొందిన ఈ సినిమా 1986లో విడుదలై మంచి విజయం సాధించింది. ఆ సినిమా విడుదలైన 36 ఏళ్లకు మరోసారి ‘విక్రమ్’ పేరు తెరపైకి వస్తోంది. కమల్‌హాసన్ హీరోగా లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ చిత్రం ‘విక్రమ్’. విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలు చేసిన ఈ చిత్రంలో హీరో సూర్య అతిథిగా చేశారు. అప్పటి ‘విక్రమ్’ రొమాంటిక్ యాక్షన్ అయితే ఈ ‘విక్రమ్’ యాక్షన్ థ్రిల్లర్. తెలుగు, తమిళంలో ఈ నెల 3న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ 'మేజర్' వేరు రవిచంద్రన్ హీరోగా నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన కన్నడ చిత్రం ‘సిపాయి’. ఇందులో సౌందర్య కథానాయికగా నటించగా హీరో చిరంజీవి ముఖ్య పాత్ర చే శారు. 1996లో విడుదలై కన్నడంలో మంచి విజయం సాధించిన ఈ సినిమాని 1998లో ‘మేజర్’ పేరుతో తెలుగులో డబ్ చేసి, విడుదల చేశారు. ఈ చిత్రంలో మేజర్ చంద్రకాంత్ పాత్రను చిరంజీవి చేశారు. ఇది రొమాంటిక్, యాక్షన్ ఓరియంటెడ్ మూవీ అయితే అడివి శేష్ హీరోగా నటించిన తాజా ‘మేజర్’ కథ వేరు. ఇది బయోపిక్. 26/11 ముంబై దాడుల్లో దేశం కోసం ప్రాణాలు అర్పించిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితంతో ఈ సినిమా రూపొందింది. తెలుగు, మలయాళ, హిందీ భాషల్లో శశికిరణ్ తిక్క దర్శకత్వంలో రూపొం దిన ఈ చిత్రం జూన్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రేమ 'ఖుషి' ‘నువ్వు గుడుంబా సత్తి అయితే నేను సిద్ధు.. సిద్ధార్థ్ రాయ్’ అంటూ ‘ఖుషి’లో పవన్ కల్యాణ్ చెప్పిన డైలాగ్ ప్రేక్షకులకు గుర్తుండే ఉంటుంది. ఎస్.జె. సూర్య దర్శకత్వంలో పవన్ కల్యాణ్, భూమిక జంటగా నటించిన ఈ చిత్రం 2001లో విడుదలైంది. లవ్, కామెడీ ఎంటర్టైనర్గా ఈ చిత్రం రూపొందింది. తాజాగా విజయ్ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న చిత్రానికి ‘ఖుషి’ టైటిల్‌ని అనౌన్స్ చేశారు. ఆ ‘ఖుషి’లానే ఈ ‘ఖుషి’ కూడా లవ్, రొమాంటిక్ ఎంటర్టైనర్. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో ఈ ఏడాది డిసెంబర్ 23న విడదల కానుంది. చారిత్రక 'కంచుకోట' ఎన్టీఆర్, కాంతారావు హీరోలుగా, సావిత్రి, దేవిక హీరోయిన్లుగా నటించిన జానపద చిత్రం ‘కంచుకోట’. సీఎస్ రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రం 1967లో విడుదలై ఘనవిజయం సాధించింది. ఇప్పుడు ‘కంచుకోట’ పేరుతో ఓ సినిమా రూపొందుతోంది. మదన్ హీరోగా, ఆశ, దివ్య హీరోయిన్లు. ప్రతాని రామకృష్ణ గౌడ్ ముఖ్య పాత్ర చేస్తున్నారు. ఎమ్.ఏ చౌదరి, వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా హిస్టారికల్ నేపథ్యంలో ఉంటుంది. రివెంజ్ 'రుద్రవీణ' చిరంజీవి హీరోగా నటించిన చిత్రం ‘రుద్రవీణ’. కె.బాలచందర్ దర్శకత్వంలో 1988లో విడుదలైన ఈ సినిమా మ్యూజికల్ హిట్‌గా నిలిచింది. అప్పటివరకూ మాస్ యాక్షన్ రోల్స్ చేస్తూ వచ్చిన చిరంజీవి ఈ చిత్రంలో అందుకు భిన్నంగా కనిపించారు. కాగా ‘రుద్రవీణ’ పేరుతో తాజాగా ఓ సినిమా రూపొందింది. శ్రీరామ్ నిమ్మల హీరోగా, ఎల్సా, శుభశ్రీ హీరోయిన్లుగా మధుసూదన్ రెడ్డి దర్శకత్వం వహించారు. రివెంజ్ డ్రామాతో వస్తున్న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. -
చిరంజీవి సినిమా టైటిల్‌తో కొత్త చిత్రం
బాలచందన్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘రుద్రవీణ’ చిత్రం అప్పట్లో ఎంతసూపర్ హిట్ అయిందో అందరికి తెలిసిందే.అలాంటి టైటిల్ తో ఇప్పటి వరకు ఏ హీరో కూడా సినిమా తీసి మెప్పించిన దాఖలాలు లేవు.అయితే తాజాగా ఇప్పుడు అదే టైటిల్ తో ఇప్పటి తరానికి అనుగుణంగా ఒక కొత్త రకమైన రీవేంజ్ డ్రామాతో దర్శకుడు మధుసూదన్ రెడ్డి ఓ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. రాగుల గౌరమ్మ సమర్పణలో సాయి విల సినిమాస్ పతాకంపై శ్రీరామ్, ఎల్సా, శుభశ్రీ హీరో హీరోయిన్లు గా నటిస్తున్న ఈ చిత్రాన్ని రాగుల లక్ష్మణ్, రాగుల శ్రీనులు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పాత సినిమా టైటిల్ కు ఏ మాత్రం మచ్చ రానీవకుండా దానికి తగ్గట్టే ఇప్పటి తరానికి అనుగుణంగా ఒక కొత్త రకమైన రీవేంజ్ డ్రామాతో వస్తున్న ఈ సినిమాను కూడా ప్రేక్షకులను ఆదరించి అలరించేలా అనేక జాగ్రత్తలు తీసుకుని ఈ సినిమాను రూపొందించా మని దర్శక, నిర్మాతలు చెపుతున్నారు.చిరంజీవి టైటిల్ తో వస్తున్న ఈ సినిమా ఏమాత్రం ఆకట్టుకుంటుందో చూడాలి మరి. -
లాంఛనంగా ప్రారంభమైన 'రుద్రవీణ'
శ్రీరామ్ నిమ్మల, ఎల్సా ఘోష్, శుభశ్రీ, సోనియా సత్య హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘రుద్రవీణ’. జి. మధుసూదన్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సంగీతదర్శకుడు రఘు కుంచె ప్రత్యేక పాత్ర చేస్తున్నారు. సాయివీల సినిమాస్ పతాకంపై రాగుల లక్ష్మణ్ నిర్మిస్తున్న ఈ చిత్రం యానాంలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. జి. మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ–‘‘సరికొత్త కథా కథనాలతో మా ‘రుద్రవీణ’ తెరకెక్కుతోంది. ప్రతిభ ఉన్న కొత్త నటీనటులతో పాటు మంచి సాంకేతిక నిపుణుల సపోర్ట్‌తో సినిమాను క్వాలిటీగా, అందరికీ నచ్చేలా తీస్తాం. మా సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా యానాంలోనే జరుగుతోంది’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: జీఎల్ఎన్ బాబు, సంగీతం: మహావీర్ యేలేందర్, ప్రత్యేక పర్యవేక్షణ: కె. త్రివిక్రమ రావు. -
తరలిరాద తనే వసంతం...
రుద్రవీణ చిత్రంలోని ఒక అభ్యుదయ గీతం ఇది. సంగీత విద్వాంసుడి కుమారుడు... అడవిలో కట్టెలు కొట్టుకునే వారి దగ్గరకు వచ్చినప్పుడు, ‘మీ నాన్నగారి సంగీతం వినలేకపోయాం, మీరైనా మాకు పాట వినిపించండి...’ అని కోరినప్పుడు, శ్రామిక ప్రజల కోసం పాడే పాట ఇది. సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు వసంతాన్ని తెలుగు ముంగిళ్లలోకి తెచ్చిన పాట. సహజంగా అభ్యుదయ గీతాల్లో కాస్తంత అలజడిని రేపే లక్షణముంటుంది. కాని అభ్యుదయాన్ని అందమైన వనకన్యలా మలచిన పాట. ఆ పాటలో అభ్యుదయం ఉంటుంది, ఆశలు ఉంటాయి, వికాసం ఉంటుంది. కళ్లు మూసుకుని ఒకసారి వింటే కళ్లు తెరిపించే పాట. జీవితంలోనే శ్రుతిలయలుంటాయి. బ్రతుకు శ్రుతిలో ఉంటే, గుండె చప్పుడులో లయ ఉంటుంది. జీవితమే ఒక నాటకరంగం, అందులో మనమంతా పాత్రధారులం అని వేదాంతం చెప్పిన అంశాన్ని ‘బ్రతుకున కళకైనా ఏ కలకైనా జీవిత రంగం వేదిక కాదా...’ అని చెప్పారు. ప్రపంచంలో ఎవరి పనులు వారు చేసినా చేయకపోయినా కాలం ఆగదు. కోయిల పాడినా పాడకపోయినా వసంత కాలం వస్తుంది, తన ధర్మాన్ని, కర్తవ్యాన్ని నెరవేరుస్తుంది. వసంతం వస్తే కోయిల కూస్తుంది. కోయిల కూసింది కదా అని వసంతం రాదు. వెదురుతో రూపొందిన మురళి పెదవికి తగిలితేనే స్వరాలు పలుకుతాయి. ఎత్తుగడే చాలా అందంగా ప్రారంభించారు సిరివెన్నెల... ‘తరలిరాద తనే వసంతం తన దరికిరాని వనాల కోసం...’ అంటూ. వసంతం ప్రవేశిస్తేనే వనాలు సౌరభాలు విరజిమ్ముతాయి. వనాల సౌరభాన్ని చూడడానికి వసంతం స్వయంగా వస్తుంది. శ్రామికుల కష్టాన్ని, వారి శ్రమసౌందర్యాన్ని చూడడానికే తాను వచ్చాననే అంతరార్థాన్ని ఇందులో ఎంతో అందంగా వివరించారు. ‘గగనాల దాకా అల సాగకుంటే మేఘాల రాగం ఇల చేరుకోదా...’ సముద్రాలలో నీరు ఆవిరి రూపంగా మారి ఆకాశం చేరి, మేఘాలుగా మారకపోతే, వర్షాలు పడవు. శ్రామికుడు కష్టపడి పండించకపోయినా, ఏ పని చేయకపోయినా మానవ మనుగడ సాగదు అనే విషయాన్ని భావకవిత్వంలో పండించారు సిరివెన్నెల. –సంభాషణ: డాక్టర్ వైజయంతి