ఓ అద్భుతమైన సామాజిక ప్రయత్నం
చిరంజీవిని ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో ఎంపిక చేసే ముందు పరీక్షించిన వారిలో దర్శకులు కె.బాలచందర్ కూడా ఉన్నారట. అందుకే బాలచందర్ తెరకెక్కించిన ‘ఇది కథకాదు, 47 రోజులు, ఆడవాళ్ళూ మీకు జోహార్లు’ వంటి సినిమాల్లో చిరంజీవి విలక్షణమైన పాత్రలలో
కనిపించారు. ఆ గురుభక్తితోనే చిరంజీవి నిర్మాతగా తన తొలి సొంత సినిమాకు బాలచందర్‌ను దర్శకుడిగా ఎంచుకున్నారు. చిరంజీవి సమర్పకునిగా నాగబాబు నిర్మాతగా ఉన్న ఈ సినిమా (రుద్రవీణ)కు సహనిర్మాతగా పవన్ కల్యాణ్ వ్యవహరించారు. అందుకే టైటిల్స్‌లో ఆయన పేరు కొణిదల కల్యాణ్ కుమార్ అని కనిపిస్తుంది.
అద్భుతమైన ప్రయత్నం
నిజానికి అప్పటికే చిరంజీవి సినిమా అంటే బ్రేక్ డ్యాన్సులు, ఫైట్స్‌కు పెట్టింది పేరు. అటువంటిది ఆయన వాటిని పక్కన పెట్టి సాధారణ నటుడిలా సినిమా కథలో ఒదిగిపోయి చేసిన ఒక అసామాన్య చిత్రం ‘రుద్రవీణ’. మసిబట్టిన సాంప్రదాయాలకు, మసకబారిన సిద్ధాంతాలకు ఎదురొడ్డి నిలిచి చాందసాన్ని ఛేదించే అద్భుతమైన ఓ సామాజిక ప్రయత్నం ఈ సినిమా. అందుకే చిరంజీవికి నచ్చిన టాప్ టెన్ సినిమాల్లో ‘రుద్రవీణ’దే అగ్రతాంబూలం. వాస్తవానికి ఈ సినిమాకు పేరు పెట్టడానికంటే ముందు... గణపతి శాస్త్రి బిలహరి రాగంలో నిష్ణాతుడైనందున బిలహరి అని పేరు పెట్టాలనుకున్నారు. ఆ రోజుల్లో రాగాల పేర్లతో చాలా సినిమాలొచ్చాయి. ‘శివరంజని, శంకరాభరణం, ఆనంద భైరవి’ వంటివి అలా వచ్చినవే. అందువల్ల బిలహరి అని ముందుగా అనుకున్నా... చివరికి ఆ పేరు వద్దనుకుని గణపతి శాస్త్రి స్వభావం రుద్రావతారమే కాబట్టి ‘రుద్రవీణ’ అని పెట్టారు.
జాతీయ అవార్డు సాధించిన సినిమా
1988 మార్చి 4న రిలీజైన ఈ సినిమాలో ప్రతీ పాత్ర చాలా సహజంగా ఉంటుంది. ప్రతీ వ్యక్తిని ప్రశ్నించే విధంగా ఉంటుంది. ‘రుద్రవీణ’ ఓ క్లాసిక్. 70 రోజుల పాటు చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమాను ఎక్కువగా మద్రాసు, కాంచీపురం, కుర్తాళం, శ్రీనగర్ పరిసరప్రాంతాల్లో చిత్రీకరించారు. అప్పట్లో ఈ సినిమాకు సుమారు 80 లక్షల వ్యయమైంది. ఆ సమయానికి చిరంజీవికి బీభత్సమైన మాస్ ఇమేజ్ ఉంది. చిరంజీవి అంటేనే మాస్‌కు మరో పేరులా సాగుతున్న రోజుల్లో ఆయన కమర్షియల్ సినిమాల నడుమ ‘రుద్రవీణ’ నిలబడలేకపోయింది.
కానీ, జాతీయ స్థాయిలో జాతీయ సమైక్యతను ప్రబోధించే నర్గీస్ దత్ ఉత్తమ చిత్రం పురస్కారాన్ని అందుకుంది. ఇళయరాజాకు జాతీయ ఉత్తమ సంగీత దర్శకుడు పురస్కారం లభించింది. ఇది ఆయనకు మూడో జాతీయ పురస్కారం. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు ఉత్తమ గాయకుడిగా ఇది నాలుగో పురస్కారం. రాష్ట్ర స్థాయిలో నంది అవార్డుల్లో ఈ సినిమా ఉత్తమ నటుడిగా జ్యూరీ పురస్కారం దక్కించుకోగలిగింది. గణేశ్ పాత్రోకి మాటల రచయితగా నంది పురస్కారాన్ని తీసుకువచ్చింది ‘రుద్రవీణ’.
వాణిజ్యపరంగా పరాజయం పాలైన ఈ సినిమాకు రూ. 6 లక్షలు నష్టం వాటిల్లిందట. కానీ ‘రుద్రవీణ’ పలికించిన రాగాలు మాత్రం సినీ ప్రియులను అలరించాయి. అదే సంవత్సరం బాలచందర్ ఈ సినిమాను తమిళంలో ‘ఉన్నాల్ ముడియుమ్ తంబి’గా కమల్‌హాసన్ , శివాజీ గణేశన్ తో రీమేక్ చేశారు. అయితే ‘రుద్రవీణౖ’పె అప్పట్లో చాలా వివాదాలు నడిచాయి. ముఖ్యంగా ఈ సినిమా 1984లో దర్శకుడు మాదాల రంగారావు తెరకెక్కించిన ‘జనం మనం’ సినిమా కథను యాజ్ ఇట్ ఈజ్‌గా తీశారని అప్పట్లో పెద్ద రచ్చ జరిగింది. తన చిత్రాన్ని కాపీ కొట్టి దర్శకుడు బాలచందర్ ‘రుద్రవీణ’ని తెరకెక్కించాడని... 13 రీళ్ల వరకు రెండు సినిమాలు ఒకేలా ఉంటాయని మాదాల రంగారావు ఆరోపించారు. ఈ విషయంపై ఆయన ప్రెస్‌మీట్ పెట్టి ‘రుద్రవీణ’ టీమ్‌కి వార్నింగ్ కూడా ఇచ్చారు.
విషయాన్ని కోర్టు వరకు తీసుకెళ్లకుండా చిరంజీవిపై ఉన్న గౌరవం కారణంగా సామరస్యంగా పరిష్కరించుకుందామని చెప్పారు. చివరికి ఈ వివాదం ఏమైందనే విషయం ఎవరికీ తెలీదు. ఇప్పుడున్నట్టు మీడియా ఆ రోజుల్లో ఉండి ఉంటే విషయం ఇంకెంత చర్చకు దారి తీసేదో.ఏది ఏమైనా ఆర్థికంగా ఈ చిత్రం ఆశించిన ఫలితం సాధించకపోయినా, వివాదాలు ఎదురైనా.. అవన్నీ పక్కనపెడితే ‘రుద్రవీణ’ ఓ క్లాసిక్. – దాచేపల్లి సురేష్‌కుమార్
Comments
Please login to add a commentAdd a comment