
– ఆది పినిశెట్టి
‘‘వైశాలి’ చిత్రం తర్వాత డైరెక్టర్ అరివళగన్, నా కాంబినేషన్‌లో సినిమా చేయాలని అనుకున్నాం. అయితే సరికొత్త కథ, కాన్సెప్ట్ కుదరలేదు. ఇన్నేళ్లకు ‘శబ్దం’తో కుదిరింది. ఈ మూవీ ప్రేక్షకులకు మంచి అనుభూతినిస్తుంది. ఈ చిత్రం నా కెరీర్‌లో ప్రత్యేకమైనది’’ అన్నారు ఆది పినిశెట్టి. హీరో ఆది పినిశెట్టి, డైరెక్టర్ అరివళగన్ కాంబినేషన్‌లో తెరకెక్కిన తెలుగు–తమిళ చిత్రం ‘శబ్దం’. 7ఎ ఫిల్మ్స్‌పై శివ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 28న విడుదల కానుంది.
ఎన్ సినిమాస్ ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో, మైత్రీ డిస్ట్రిబ్యూషన్ ద్వారా నైజాంలో రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా ఆది పినిశెట్టి విలేకరులతో మాట్లాడుతూ– ‘‘సూపర్ నేచురల్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘శబ్దం’. మంచి కథా బలంతో పాటు భావోద్వేగాలున్న హారర్ మూవీ. రెగ్యులర్ హారర్ సినిమాలకి భిన్నంగా ఉంటుంది. ఆత్మలని సైంటిఫిక్ మెథడ్‌లో అన్వేషించే విధానం కొత్తగా ఉంటుంది. స్క్రీన్‌ప్లే ఆసక్తిగా ఉంటుంది.
ఈ మూవీలో పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ క్యారెక్టర్ నాది. శబ్దంతోనే ఆత్మలని పసిగడుతుంటాను. తమన్‌గారి మ్యూజిక్, నేపథ్య సంగీతం మా సినిమాకి చాలా ప్లస్. కెమేరామేన్ అరుణ్ అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. ‘శబ్దం’ని తెలుగులో హీరో నానీ గారికే తొలుత చూపించాను. సినిమా చాలా బాగుందని చెప్పారు.
‘నిన్ను కోరి’ మూవీ తర్వాత మేమిద్దరం కలిసి నటించే అవకాశం రాలేదు. ఆయన సినిమాలో మళ్లీ నటించే అవకాశం వస్తే కథ కూడా వినకుండా నటిస్తాను. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్ సినిమాస్ వారు మా సినిమాని తెలుగులో రిలీజ్ చేయడం అదృష్టంగా భావిస్తున్నాం. ఇక హీరోగా ‘డ్రైవ్’ అనే సినిమా చేశాను. ‘అఖండ 2’లో ఓ పాత్ర చేస్తున్నాను. అలాగే ‘మరకతమణి 2’ షూటింగ్ జరుగుతోంది. దేవా కట్టాగారి దర్శకత్వంలో ‘మయసభ’ అనే ఓటీటీ ప్రాజెక్ట్ చేస్తున్నాను’’ అని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment