![Chiranjeevi as Chief Guest for Laila Movie Mega Mass Event](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/laila.jpg.webp?itok=uKADAJFo)
సాహు గారపాటి, అనిల్ రావిపూడి, చిరంజీవి, విశ్వక్ సేన్, రామ్ నారాయణ్, ఆకాంక్షా శర్మ
‘‘ఇండస్ట్రీలో అందరూ ఒక కుటుంబ సభ్యుల్లా కలిసి మెలిసి, మంచి సుహృద్భావ వాతావరణంలో ఉన్నరోజున అందరూ ఆనందంగా, గొప్పగా చెప్పుకుంటారు. అందుకే సాహు, విశ్వక్ సేన్(Vishwak Sen) వచ్చి అడగ్గానే ‘లైలా’(Laila) ఫంక్షన్‌కి వచ్చాను. నాకు తెలిసి ఇకపై ఆ కాంపౌండ్.. ఈ కాంపౌండ్ అంటారని అనుకోవడం లేదు. ఇండస్ట్రీ అంతా ఒకటే కాంపౌండ్ అంతే’’ అని హీరో చిరంజీవి(Chiranjeevi) అన్నారు. విశ్వక్ సేన్, ఆకాంక్షా శర్మ జంటగా నటించిన చిత్రం ‘లైలా’. రామ్ నారాయణ్ దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్ పై సాహు గారపాటి నిర్మించిన ఈ మూవీ ఈ నెల 14న విడుదల కానుంది.
ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ‘లైలా మెగా మాస్ ఈవెంట్’కి ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి మాట్లాడుతూ–‘‘విశ్వక్ సేన్ ‘లైలా’ ఫంక్షన్‌కి నేను వెళుతున్నానని చెప్పినప్పుడు కొందరు.. ‘విశ్వక్ సేన్ ఫంక్షన్‌కి వెళుతున్నావా? అతను మన మనిషి కాదు.. అవతల బాలకృష్ణ... అప్పుడప్పుడు తారక్ అంటాడు’ అన్నారు. మనుషులన్నాక వేరే వాళ్లమీద అభిమానం, ప్రేమ ఉండకూడదా? నామీద ఆ΄్యాయత ఉండకూడదా? ఇదేంటిది?. మా ఇంట్లోనే మా అబ్బాయికి(రామ్‌చరణ్) సూర్య అంటే చాలా ఇష్టం.
అంత మాత్రాన వాడి ఫంక్షన్స్‌కి నేను వెళ్లకూడదా? వాడితో కలిసి భోజనం చేయకూడదా? వాడితో ఉండకూడదా?. మా హీరోల మధ్య సఖ్యత ఉండదేమో అనుకుని గతంలో అభిమానులు కొట్టుకుని చచ్చేవాళ్లు. వాల్‌పోస్టర్లు చింపుకునేవాళ్లు. నెల్లూరులోని మా కజిన్స్‌లో ఇద్దరు సొంత అన్నదమ్ములైనా ఒకరు ఎన్టీఆర్, మరొకరు ఏఎన్‌ఆర్‌గార్లను అభిమానించే వాళ్లు. వాళ్లిద్దరూ ఓ రోజు రక్తం వచ్చేలా కొట్టుకున్నారు.. అప్పుడు నేను వాళ్ల కంటే చిన్నవాణ్ణి కావడంతో కంగారు పడ్డాను. సినిమా హీరోలంటే బాగానే ఉంటారు.. కానీ వీళ్లు కొట్టుకుని చస్తారేంటి అని ఆరోజే అనిపించింది.
నేను ఫిల్మ్ యాక్టర్ అయిన తర్వాత హీరోల మధ్య ఓ సఖ్యత, సుహృద్భావ వాతావరణం ఏర్పాటు చేయాలని బలంగా కోరుకున్నాను. మద్రాస్‌లో హనీ హౌస్‌లో అందరం కలిసి పార్టీలు చేసుకునే వాళ్లం. ఈ రోజుకి నేను, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేశ్ అంతా కలిసికట్టుగా ఉంటాం. మా మధ్య ఎలాంటి అరమరికలు లేవు. మన ఇమేజ్, ఫ్యాన్ బేస్ పెరగాలంటే మనం చేసే సినిమాలను బట్టి ఉంటుందే తప్ప మనం దూరంగా ఉండటం వల్ల కాదు. ‘పుష్ప 2’ సినిమా పెద్ద హిట్ అయినందుకు గర్విస్తాను.
మన సినిమాలు ఆడొచ్చు, ఆడక పోవచ్చు కానీ, ఇండస్ట్రీలో ఓ సినిమా ఆడిందంటే ప్రతి ఒక్కరూ హర్షించాలి. ఎందుకంటే ఓ సినిమా మీద ఎంతో మంది జీవితాలు ఆధారపడి ఉంటాయి. ఒక్క హిట్ ఏ హీరోకి వచ్చినా సరే అందరం ఆనంద పడాలి. ఆ వచ్చిన డబ్బు మళ్లీ ఇండస్ట్రీలోనే సినిమాలపైనే పెడతారు నిర్మాతలు. ‘లైలా’ ట్రైలర్ చూసిన తర్వాత విశ్వక్ నిజంగా ఆడపిల్ల అయ్యుంటే గుండెజారి గల్లంతయ్యేది(నవ్వుతూ).. అంతగ్లామర్‌గా ఉన్నాడు. ‘లైలా’ బ్లాక్‌బస్టర్ గ్యారెంటీ’’ అన్నారు.
విశ్వక్ సేన్ మాట్లాడుతూ–‘‘నా సినిమాని సపోర్ట్ చేయడానికి చిరంజీవిగారు రావడం అదృష్టంగా భావిస్తున్నాను’’ అని తెలిపారు. డైరెక్టర్ రామ్ నారాయణ్ మాట్లాడుతూ– ‘‘విశ్వక్‌గారు ‘లైలా’ సినిమా కథ ఒప్పుకోవడమే నాకు ఇచ్చిన పెద్ద గిఫ్ట్.. ఇది జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment