
'భోళాశంకర్' పరాజయం తర్వాత చిరంజీవి చాలా సినిమాలను లైన్‌లో పెట్టారు. ముఖ్యంగా యంగ్ డైరెక్టర్స్ కథలను ఎక్కువగా వింటున్నారని తెలుస్తోంది. ఇప్పటికే విశ్వంభరతో ఆయన బిజీగా ఉన్నారు. అయితే, దసరా మూవీతో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన టాలీవుడ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో చిరు ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో బాలీవుడ్‌లో ఒకప్పుడు అందాలభామగా గుర్తింపు తెచ్చుకున్న రాణీ ముఖర్జీ నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
మెగాస్టార్ చిరుతో క్రేజీ కాంబోను హీరో నాని సెట్ చేశారని తెలుస్తోంది. అందుకే ఈ చిత్రానికి సమర్పకుడిగా నాని వ్యవహరిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ గురించి హీరో నాని ట్విటర్(ఎక్స్) వేదికగా గతంలో పంచుకున్నారు. ఈ మూవీకి సంబంధించిన పోస్టర్‌ను కూడా ఆయన షేర్ చేశారు. చేతులకు రక్తం కారుతున్న పోస్టర్‌ను విడుదల చేసి ఫ్యాన్స్‌లో హైప్ పెంచారు.

అయితే, ఈ మూవీలో చిరు సరసన నటించే హీరోయిన్ పాత్ర కథకు చాలా ప్రాముఖ్యతను ఇస్తుందట. ఆ పాత్రకు రాణీ ముఖర్జీ అయితే సెట్ అవుతుందని దర్శకుడు శ్రీకాంత్ ఓదెల అన్నారని తెలుస్తోంది. ఇదే విషయాన్ని చిరుతో చెప్పగా.. ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. తన వయసుకు తగ్గట్టు సరిజోడీగా రాణీ ముఖర్జీ మంచి సెలక్షన్ అని చిరు కూడా అన్నారట. ఇదే వార్త బాలీవుడ్ సర్కిల్‌లో ట్రెండ్ అవుతుంది.