తనకు వారసుడు కావాలని మనసులో మాట బయటపెట్టారు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi). ఈసారైనా రామ్‌చరణ్ (Ram Charan)కు కొడుకు పుడితే బాగుండు అని ఆకాంక్షించారు. బ్రహ్మానందం, ఆయన తనయుడు రాజా గౌతమ్ ప్రధాన పాత్రల్లో నటించిన బ్రహ్మా ఆనందం సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌కు చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చిరంజీవి తన కుటుంబం గురించి మాట్లాడుతూ.. ఇంట్లో ఉన్నప్పుడు నాకు మనవరాళ్లతో ఉన్నట్లుగా అనిపించదు.
ఒక్క మగపిల్లాడు లేడు
లేడీస్ హాస్టల్ వార్డెన్‌లా ఉన్నట్లు అనిపిస్తుంది. చుట్టూ ఆడపిల్లలే.. ఒక్క మగపిల్లాడు లేడు. చరణ్.. ఈసారైనా సరే ఒక మగపిల్లాడిని కనరా.. నా వారసత్వం ముందుకువెళ్లాలని కోరిక. మళ్లీ ఇంకో అమ్మాయిని కంటాడేమోనని నా భయం అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై నెట్టింట దుమారం చెలరేగింది. చిరంజీవి వారసుడిని కోరుకోవడం తప్పు లేదు కానీ మళ్లీ ఆడపిల్ల పుడుతుందేమోనని భయంగా ఉందనడం కరెక్ట్ కాదని పలువురూ అభిప్రాయపడుతున్నారు. కాగా రామ్‌చరణ్- ఉపాసన దంపతులకు 2023లో క్లీంకార పుట్టింది.
సినిమా
బ్రహ్మా ఆనందం సినిమా విషయానికి వస్తే.. బ్రహ్మానందం (Brahmanandam), ఆయన కుమారుడు గౌతమ్ తాతామనవడిగా నటించారు. వెన్నెల కిశోర్, ప్రియ వడ్లమాని కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆర్‌వీఎస్ నిఖిల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఉమేష్ కుమార్, సావిత్ర సమర్పణలో రాహుల్ యాదవ్ నక్కా నిర్మించారు. ఈ మూవీ ఫిబ్రవరి 14న విడుదల కానుంది.
రాజకీయాలపై చిరు కామెంట్స్
ఈ క్రమంలో ఫిబ్రవరి 11న బ్రహ్మా ఆనందం ప్రీరిలీజ్ ఏర్పాటు చేశారు. ఈ ఫంక్షన్‌లో చిరంజీవి రాజకీయాలు, సినిమాల గురించి మాట్లాడుతూ.. సినిమాల్లో ఉన్నప్పుడు ఎంతో ఉత్సాహంగా ఉండేవాడిని. రాజకీయాల్లోకి వెళ్లినప్పుడు ఒత్తిడిగా ఫీలయ్యాను. ప్రతి ఒక్కరినీ ఏదో ఒకటి అనాలని తిట్లు రాసుకోవాల్సి వచ్చేది. అది నాకు మరింత ఒత్తిడిగా అనిపించింది. నవ్వడమే మర్చిపోయాను.
ఆ సినిమాతో మళ్లీ నవ్వడం ప్రారంభించా..
నాలో హాస్య గ్రంథులు పోయాయేమో అనుకున్నాను. సినిమాల్లోకి తిరిగివచ్చాకే మళ్లీ నా పెదాలపై చిరునవ్వు వచ్చింది. ఖైదీ నెంబర్ 150 మూవీతో నవ్వడం ప్రారంభించాను. ఈ జన్మంతా రాజకీయాలకు దూరంగానే ఉంటూ సినిమాలకు అత్యంత దగ్గరగా ఉంటాను. అయినా సరే చాలామందికి నాపై చాలా అనుమానాలు వస్తున్నాయి. కానీ నేను రాజకీయాల్లోకి వెళ్లను అని క్లారిటీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment