టైటిల్: రుద్రవీణ
నటీనటులు: శ్రీరామ్ నిమ్మల, ఎల్సా ఘోష్, శుభశ్రీ, రఘు కుంచె, గెటప్ శ్రీను, చలాకీ చంటి తదితరులు
నిర్మాత : లక్ష్మణ రావు రాగుల
దర్శకత్వం: మధుసూదన్ రెడ్డి
సంగీతం: మహావీర్
సినిమాటోగ్రఫీ: జి ఎల్ బాబు
ఎడిటర్: నాగేశ్వర్ రెడ్డి
విడుదల తేది: అక్టోబర్ 28, 2022
‘రుద్రవీణ’ కథేంటంటే..
లాలప్ప (రఘు కుంచె) యానాం లో పెద్ద రౌడీ. రాజకీయ నాయకులు అండదండలతో యానాంలో అక్రమ వ్యాపారాలు చేస్తుంటాడు. ‘లాలప్ప పన్ను’పేరుతో నగరంలోని చిరు వ్యాపారస్తుల నుంచి డబ్బులు వసూలు చేస్తుంటారు. ప్రజలకు కూడా లాలప్ప మనుషులు అంటే చాలా భయం. అలాంటి సమయంలో రుద్ర(శ్రీరామ్ నిమ్మల) వరుసగా లాలప్ప మనుషులను హత్య చేస్తుంటాడు. దీంతో లాలప్ప రుద్ర గురించి ఆరా తీస్తాడు. అసలు రుద్ర ఎవరు? ఎందుకు లాలప్ప మనుషులను హత్య చేస్తున్నాడు? వీణ(శుభ శ్రీ)తో రుద్రకు ఉన్న సంబంధం ఏంటి? ఐపీఎల్‌కు సెలెక్ట్ అయినా రుద్ర.. ఎందుకు జైలుపాలయ్యాడు? హత్యలు చేసేది రుద్రనే అని తెలిసిన తర్వాత ప్రియురాలు ప్రియ(ఎల్సా ఘోష్) ఎలాంటి నిర్ణయం తీసుకుంది? చివరకు లాలప్పను రుద్ర ఎలా చంపాడు? అనేదే మిగతా కథ.
ఎలా ఉందంటే..
బాలచందన్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘రుద్రవీణ’ చిత్రం అప్పట్లో ఎంతసూపర్ హిట్ అయిందో అందరికి తెలిసిందే. అలాంటి సూపర్ హిట్ టైటిల్‌తో రావడంతో ‘రుద్రవీణ’పై ఓ మోస్తారు అంచనాలు పెరిగాయి. కానీ ఆ అంచనాలను ఈ ‘రుద్ర వీణ’ అందుకోలేకపోయింది. టైటిల్ పవర్‌ఫుల్‌గా ఉంది కానీ.. కథలో అది మిస్ అయింది. కథలో వచ్చే ముఖ్యమైన డైలాగ్స్ విషయంలో కూడా దర్శకుడు జాగ్రత్తలు తీసుకోలేదనిపిస్తుంది. ఓ సీన్‌లో విలన్‌తో ఎమ్మార్వో ‘నీలాంటి వాళ్లను నా సర్వీసులో చాలా మందిని చూశా’అంటాడు.. అప్పుడు విలన్ ‘నా లాంటి వాడిని చూడలేదు’అంటాడు. అక్కడ ‘నన్ను చూడలేదు’ అంటే దానికో అర్థం ఉంటుంది కానీ.. విలన్ కూడా అదే డైలాగ్ చెప్పడం ఏంటో ఎవరికి అర్థం కాదు.
అలాగే హీరో కొట్టకముందే విలన్స్ పైకి వెళ్లిపడడం.. పొంతనలేని సీన్స్ ప్రేక్షకుడి సహనానికి పరీక్షగా మారుతాయి. విలన్ మనుషులను హీరో చంపిన తీరు కూడా సాదా సీదాగా ఉంటుంది. హీరోయిన్‌తో లవ్‌ట్రాక్ కాస్త ఎంటర్‌టైనింగ్ సాగినప్పటికీ.. ఆ సీన్స్ మధ్య మధ్యలో వచ్చిపోతుంటాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ఇది రీవేంజ్ డ్రామా అని సెకండాఫ్‌లో తెలుస్తుంది. అయితే అక్కడ కూడా కథనం ఆసక్తికరంగా సాగదు. జైలులో మొబైల్ ఫోన్ వాడడం, హత్య చేసినా ఏం జరగనట్లుగా చూపించడం..అంతా సినిమాటిక్‌గా సాగుంతుంది. క్లైమాక్స్ కూడా రొటీన్‌గా ఉంటుంది.
రుద్ర పాత్రకి శ్రీరామ్ నిమ్మల న్యాయం చేశాడు. డ్యాన్స్‌తో పాటు ఫైట్ సీన్స్‌లో కూడా చక్కగా నటించాడు. ఇక విలన్‌గా రఘు కుంచె తనదైన నటనతో మెప్పించాడు. రుద్ర ప్రియురాలు ప్రియగా (ఎల్సా ఘోష్) మెప్పించింది. తెరపై అందంగా కనిపించది. వీణ పాత్రకి శుభశ్రీ న్యాయం చేసింది. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతిక నిపుణుల పనితీరు పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment