టాలీవుడ్ ట్రెండ్!
సినిమా కథ మొత్తాన్ని ఒక్కమాటలో చెప్పేసేదే టైటిల్. అంతే కాకుండా మొదట ప్రేక్షకులను ఆకర్షించేంది కూడా టైటిలే. సినిమాను జనం వద్దకు తీసుకువెళ్లేదీ ఈ టైటిలే అని చెప్పడంలో అతిశయోక్తిలేదు. ప్రస్తుతం మూవీ టైటిల్స్ సెంటిమెంట్, ట్రెండ్... ఇలా అనేక అంశాలపై ఆధారపడి పెడుతున్నారు. సెంటిమెంట్ ప్రభావం బలంగా పాతుకుపోయింది. అయినప్పటికీ అందరూ టైటిల్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు.
ఒక్కో టైంలో ఒక్కో ట్రెండ్ నడుస్తూ ఉంటుంది. ఒకప్పుడు క్యాచీగా ఉండే రెండక్షరాలు, మూడక్షరాల టైటిల్స్తో చాలా సినిమాలు వచ్చేవి. ఇప్పుడు తెలుగు సినిమాల టైటిల్స్ పొడవు పెరిగింది. సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు సూపర్ హిట్ కావటంతో పొడవాటి టైటిల్స్ పెట్టడం మొదలుపెట్టారు. ఊకొడతారా ఉలిక్కిపడతారా, మల్లెలతీరంలో సిరిమల్లె పువ్వు... లాంటి పేర్లు పెడుతున్నారు. అలాంటి పేర్లు ఎన్నని పెడతారు. అందుకే పాటల పల్లవులను టైటిల్స్గా మర్చేస్తున్నారు. ఎటో వెళ్లిపోయింది మనసు, ఊహలు గుసగుసలాడే, గుండెజారి గల్లంతయ్యిందే, గోవిందుడు అందరివాడిలే, దిక్కులు చూడకు రామయ్యా......ప్రస్తుతానికి ఈ ట్రెండ్ సాగుతోంది.
చిన్న సినిమాల విషయం పక్కనపెడితే, బిగ్ ప్రాజెక్ట్స్ చేసే స్టార్ హీరోలు టైటిల్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. సాధారణంగా తమ స్టార్ డమ్కు ఉపయోగపడే టైటిల్స్ను మాత్రమే ఎంచుకుంటారు. అయితే ఇప్పుడు మన హీరోలు అవేమీ ఆలోచించటంలేదు. అత్తారింటికి దారేది, గోవిందుడు అందరివాడేలే, గోపాలా గోపాలా... వంటి టైటిల్స్ చూస్తే అర్ధమైపోతుంది. మన హీరోలు కూడా తమ స్టార్ డమ్ను వదిలివేసి, ట్రెండ్నే ఫాలో అయిపోతున్నారు. అయితే సంతోషకరమైన విషయం ఏమిటంటే తెలుగుదనానికి దగ్గరగా ఉండే పేర్లే ఎక్కువగా పెడుతున్నారు.
**