
హర్షిత్ రెడ్డి, సి. మల్గిరెడ్డి, శ్రియ కొంఠం, చరణ్ పెరి, షాలినీ కొండేపూడి, గవిరెడ్డి శ్రీనివాస్, శ్రావణి ముఖ్యపాత్రల్లో నటించిన చిత్రం ‘శుభం’. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పతాకంపై సమంత నిర్మించిన తొలి చిత్రం ఇది. అలాగే ఈ సినిమాలో ఓ కీలకపాత్రలోనూ నటించారు సమంత. ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 9న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు.
‘ఆ సీరియల్ టీవీలో వస్తున్నంత సేపు నా పెళ్ళాం చాలా తేడాగా ప్రవర్తించింది రా.., ఇంత జరుగుతుంటే ఊళ్లో ఒక్కడన్నా బయటకు వచ్చి చెప్పాడ్రా... అసలు ఒరేయ్... ఊరంతా తెలిసిన సీక్రెట్ రా ఇది... మొత్తం మగవాళ్ళ పరువంతా డేంజర్‌లో పడింది’ అనే సంభాషణలు ‘శుభం’ ట్రైలర్‌లో ఉన్నాయి. ఓ ఊర్లో మహిళలందరూ టీవీలో ఓ సీరియల్ చూసి, వింత వింతగా ప్రవర్తిస్తుంటారు. దెయ్యం పట్టినట్టుగా మహిళలు ప్రవర్తిస్తుంటే.. వారి నుంచి తప్పించుకునేందుకు ఊర్లో పురుషులంతా అష్టకష్టాలు పడుతుంటారు. అప్పుడు ఓ మాతాజీలా సమంత వస్తారు. ఆ నెక్ట్స్ ఏం జరిగింది? అనే కథాంశంతో ‘శుభం’ సినిమా రూపొందిందని విడుదలైన ట్రైలర్ స్పష్టం చేస్తోంది.