
‘‘జీవితంలో మనం తీసుకునే ఒక నిర్ణయాన్ని దృష్టిలో ఉంచుకొని కెరీర్ ఎలా ఉంటుందో చెప్పలేం. ఒకవేళ ఎవరైనా అలా నిర్ణయిస్తే అది అబద్ధమే అవుతుంది. తెలిసీ తెలియక తీసుకున్న ఎన్నో నిర్ణయాలు కెరీర్‌పై ప్రభావం చూపుతాయి’’ అని సమంత అన్నారు. తమిళ చిత్ర పరిశ్రమలో ఇటీవల నిర్వహించిన ‘గోల్డెన్ క్వీన్’ పురస్కారాల్లో’ గోల్డెన్ క్వీన్ అవార్డు అందుకున్నారు సమంత.
అనంతరం ఆమె తన కెరీర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘ఇంతమంది అభిమానులను సొంతం చేసుకోవడం నా అదృష్టంగా భావిస్తాను. నా అదృష్టంతోపాటు నేను పడిన కష్టమే ఈరోజు ఇంతమంది అభిమానం సంపాదించుకోవడానికి కారణం అయింది. ఇది దేవుడిచ్చిన వరంగా భావిస్తున్నాను’’ అని చె΄్పారు సమంత. ఇంకా తన వ్యక్తిగత జీవితం గురించి ఆమె మాట్లాడుతూ– ‘‘నా ఆరోగ్యం బాగాలేనప్పుడు రాహుల్ రవీంద్రన్ (నటుడు, దర్శకుడు) ఉదయం నుంచి సాయంత్రం వరకూ నాతోనే ఉంటూ జాగ్రత్తగా చూసుకున్నాడు.
మా అనుబంధానికి పేరు పెట్టలేను. ఫ్రెండా? సోదరుడా? కుటుంబ సభ్యుడా? రక్త సంబంధీకుడా? అనేది చెప్పలేను’’ అన్నారు. ఇక సమంత కెరీర్ విషయానికొస్తే... ప్రస్తుతం ‘రక్త్ బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్‌డమ్’ అనే వెబ్ సిరీస్ చేస్తున్నారు. అలాగే తన సొంత బ్యానర్ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్‌పై ఆమె నిర్మించిన తొలి చిత్రం ‘శుభం’ మే 9న రిలీజ్ కానుంది.