
‘‘మహిళలు ఎంతో సాధిస్తున్నారు. కానీ పీరియడ్స్ గురించి మాట్లాడటానికి ఇప్పటికీ ఇబ్బందికరమైన వాతావరణమే ఉంది. ఈ విషయం గురించి మాట్లాడాలంటే మౌనం... బిడియం... గుసగుసలు... ఇలాంటి పరిస్థితే ఉంది’’ అని పేర్కొన్నారు సమంత. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటారామె. ఎప్పటికప్పుడు ఏదో ఒక విషయాన్ని షేర్ చేస్తూ తన అభిమానులతో టచ్‌లో ఉంటారు.
ఇందులో భాగంగా తాజాగా తన పాడ్ కాస్ట్‌లో ఆరోగ్య నిపుణురాలు రాశీ చౌదరితో రుతుక్రమ ఆరోగ్య సమస్యల గురించి మాట్లాడారు సమంత. అలాగే ఎండోమెట్రియోసిస్ (గర్భాశయం లోపలి పొర) వంటి దీర్ఘకాలిక రుతుక్రమ రుగ్మతలపై తన అబీప్రాయాలను పంచుకున్నారామె. ‘‘ఎండోమెట్రియోసిస్‌తో ఒక సెలబ్రిటీగా నేను ఇబ్బందులు పడ్డాను. షూటింగ్, పని తాలూకు ఒత్తిడి... ఇలాంటి వాటితో చాలా బాధపడ్డాను. రుతుక్రమ సమస్యల గురించి అమ్మాయిలు మాట్లాడాలి... అవగాహన పెంచుకోవాలి. పురుషులు కూడా తెలుసుకోవాలి’’ అని తెలిపారు సమంత.
ఇక సినిమాల విషయానికి వస్తే... విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘ఖుషి’ (2023) తర్వాత మరో చిత్రంలో నటించలేదు సమంత. అయితే గతేడాది ‘సిటాడెల్ హన్నీ బన్నీ’ అనే బాలీవుడ్ వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకులను పలకరించారు. ప్రస్తుతం ‘రక్త్ బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్‌డమ్’ అనే వెబ్ సిరీస్ చేస్తున్నారామె. అలాగే తన సొంత బ్యానర్ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్‌పై సమంత నిర్మించిన తొలి చిత్రం ‘శుభం’ షూటింగ్ పూర్తయింది. త్వరలోనే ఈ చిత్రం విడుదల కానుంది.