
‘‘హారర్, కాలేజ్ లవ్‌స్టోరీ సినిమాలు చేయాలనుకోవడం లేదు. ఒకవేళ ఎవరైనా నాకు అలాంటి కథలు చెప్పాలనుకుంటే సమయం వృథా చేసుకోవద్దని చెబుతాను. ‘ఓదెల 2’ చిత్రం హారర్ ఫిల్మ్ కాదు.. దైవానికి, దుష్ట శక్తికి మధ్య వైరం. ఈ మూవీలో నేను ఓ ఆత్మ పాత్ర చేశాను. హీరో, విలన్ అని కాదు.. ప్రేక్షకుల చేత మంచి నటుడిగా పేరు తెచ్చుకోవాలన్నదే నా లక్ష్యం’’ అని వశిష్ఠ ఎన్ . సింహా (Vasishta N. Simha) చెప్పారు. తమన్నా భాటియా లీడ్ రోల్‌లో నటించిన చిత్రం ‘ఓదెల 2’(Odela 2 Movie). దర్శకుడు సంపత్‌నంది సూపర్ విజన్‌లో అశోక్ తేజ దర్శకత్వంలో డి. మధు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న విడుదలైంది.
ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించిన వశిష్ట ఎన్ . సింహా బుధవారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ– ‘‘కిరాక్ పార్టీ’ (2018) సినిమాలోని ‘నీచమైన..’ అనే పాటను పాడి, సింగర్‌గా తెలుగులోకి వచ్చాను నేను. కన్నడలో నన్ను సింగర్‌గా పరిచయం చేసిన మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోక్‌నాథ్‌గారే తెలుగులోనూ గాయకుడిగా పరిచయం చేశారు. ఇక ‘ఓదెల రైల్వేస్టేషన్ ’ సినిమా తర్వాత ఓ రోజు సంపత్ నందిగారు కాల్ చేసి, ‘ఓదెల 2’ గురించి, నా పాత్ర గురించి చెప్పినప్పుడు సర్‌ప్రైజ్ అయ్యాను.
ఈ తరహా దెయ్యం పాత్ర నేను ఎప్పుడూ చేయలేదని వెంటనే ఓకే చెప్పాను. ఈ సినిమాలోని సమాధి శిక్ష సీక్వెన్స్ సవాల్‌గా అనిపించింది. ‘ఓదెల 2’ లో స్క్రీన్ పై తిరుపతి ఉన్నా లేకపోయినా అతని నామస్మరణ మాత్రం సినిమాలోని క్యారెక్టర్స్ చెబుతూనే ఉంటాయి. అలా ఈ సినిమాకు ఎవరైనా హీరో ఉంటే అది తిరుపతి పాత్రే.
తమన్నాగారు నాగసాధువుగా అద్భుతంగా నటించారు. సంపత్‌నందిగారు ‘ఓదెల 2’ కథను అద్భుతంగా రాశారు. అశోక్ తేజ మంచి విజన్ ఉన్న డైరెక్టర్. డి.మధుగారు ప్యాషనేట్ ప్రొడ్యూసర్. డిఫరెంట్ రోల్స్‌తో ఆడియన్స్ నన్ను గుర్తుపెట్టుకునే పాత్రలు చేయాలని ఉంది’’ అని అన్నారు.