రుత్విక, సిక్కి రెడ్డిలకు టైటిల్స్
సాక్షి, హైదరాబాద్: తమ విజయపరంపరను కొనసాగిస్తూ హైదరాబాద్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణులు గద్దె రుత్విక శివాని... సిక్కి రెడ్డి రష్యా ఓపెన్ గ్రాండ్‌ప్రి టోర్నమెంట్‌లో టైటిల్స్‌ను సొంతం చేసుకున్నారు. రష్యాలోని వ్లాదివోస్తోక్ నగరంలో ఆదివారం ముగిసిన ఈ టోర్నమెంట్‌లో రుత్విక శివాని మహిళల సింగిల్స్ విభాగంలో... సిక్కి రెడ్డి మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో విజేతలుగా నిలిచారు. మహిళల సింగిల్స్ ఫైనల్లో రుత్విక 21-10, 21-13తో ఎవగెనియా కొసెట్‌స్కాయ (రష్యా)పై గెలుపొందగా... మిక్స్‌డ్ డబుల్స్ ఫైనల్లో సిక్కి రెడ్డి-ప్రణవ్ చోప్రా ద్వయం 21-17, 21-19తో వ్లాదిమిర్ ఇవనోవ్-వలెరియా సొరోకినా (రష్యా) జంటను ఓడించింది.
విజేతలుగా నిలిచిన రుత్విక శివానికి 4,125 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 2 లక్షల 74 వేలు)తోపాటు 5500 ర్యాంకింగ్ పాయింట్లు... సిక్కి రెడ్డి జంటకు 4,345 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 2 లక్షల 89 వేలు)తోపాటు 5500 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఎవగెనియాతో జరిగిన ఫైనల్లో రుత్విక పూర్తి ఆధిపత్యం చలాయించింది. కేవలం 26 నిమిషాల్లోనే తన ప్రత్యర్థిని ఓడించి కెరీర్‌లో తొలిసారి గ్రాండ్‌ప్రి స్థాయి టైటిల్‌ను కై వసం చేసుకుంది. మరోవైపు సిక్కి రెడ్డి జంటకిది ఈ ఏడాది రెండో గ్రాండ్‌ప్రి టైటిల్. ఇంతకుముందు సిక్కి-ప్రణవ్ బ్రెజిల్ గ్రాండ్‌ప్రి టోర్నీలో విజేతగా నిలిచింది.
అయితే పురుషుల సింగిల్స్ విభాగంలో హైదరాబాద్ ప్లేయర్ సిరిల్ వర్మకు నిరాశ ఎదురైంది. ఫైనల్లో సిరిల్ వర్మ 21-16, 19-21, 10-21తో జుల్ఫాద్లి జుల్కిఫ్లి (మలేసియా) చేతిలో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచాడు. సిరిల్ వర్మకు 2,090 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. లక్షా 39 వేలు)తోపాటు 4680 ర్యాంకింగ్ పాయింట్లు దక్కాయి.