Rutvika
-
ఫైనల్లో రుత్విక
ముంబై: సొంతగడ్డపై సింగిల్స్ విభాగాల్లో టైటిల్స్ సాధించేందుకు భారత క్రీడాకారులు గద్దె రుత్విక శివాని, లక్ష్య సేన్ మరో విజయం దూరంలో ఉన్నారు. టాటా ఓపెన్ ఇండియా ఇంటర్నేషనల్ చాలెంజ్ బ్యాడ్మింటన్ టోర్నీలో హైదరాబాద్ అమ్మాయి రుత్విక, ఉత్తరాఖండ్ కుర్రాడు లక్ష్య సేన్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో రుత్విక 21–17, 21–9తో ఎం.థినా (మలేసియా)పై గెలుపొందింది. మరో సెమీఫైనల్లో హైదరాబాద్‌కే చెందిన ఇరా శర్మ 22–24, 21–11, 19–21తో రియా ముఖర్జీ (భారత్) చేతిలో పోరాడి ఓడింది. ఆదివారం జరిగే ఫైనల్లో రియా ముఖర్జీతో రుత్విక తలపడుతుంది. మరోవైపు పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో లక్ష్య సేన్ 21–10, 21–12తో అభిషేక్ యెలెగార్ (భారత్)ను ఓడించాడు. రెండో సెమీఫైనల్లో సితికోమ్ థమాసిన్ (థాయ్‌లాండ్) 22–20, 21–6తో మిథున్ మంజునాథ్ (భారత్)పై గెలిచి లక్ష్య సేన్‌తో టైటిల్ పోరుకు సిద్ధమయ్యాడు. పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో సుమీత్ రెడ్డి–మనూ అత్రి (భారత్) ద్వయం 14–21, 20–22తో మనీపోంగ్ జోంగ్జిత్–నాంతకర్న్ యోర్డ్‌ఫైసాంగ్ (థాయ్‌లాండ్) జంట చేతిలో ఓడిపోయింది. -
సెమీస్‌లో రుత్విక
ముంబై: టాటా ఓపెన్ ఇండియా ఇంటర్నేషనల్ చాలెంజ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి గద్దె రుత్విక శివాని సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో రుత్విక 17–21, 21–10, 21–17తో హైదరాబాద్‌కే చెందిన రెండో సీడ్ కుదరవల్లి శ్రీకృష్ణప్రియపై విజయం సాధించింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 60వ స్థానంలో ఉన్న శ్రీకృష్ణప్రియపై రుత్వికకిది వరుసగా మూడో విజయం కావడం విశేషం. మరోవైపు హైదరాబాద్‌కే చెందిన మరో క్రీడాకారిణి ఇరా శర్మ సంచలన విజయంతో సెమీస్‌లోకి అడుగు పెట్టింది. లాల్‌బహదూర్ ఇండోర్ స్టేడియంలో ‘ద్రోణాచార్య’ అవార్డీ ఎస్.ఎం.ఆరిఫ్ వద్ద శిక్షణ పొందుతోన్న 17 ఏళ్ల ఇరా క్వార్టర్ ఫైనల్లో 18–21, 21–18, 21–19తో టాప్ సీడ్ రితూపర్ణ దాస్ (భారత్)ను బోల్తా కొట్టించింది. పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సుమీత్ రెడ్డి–మనూ అత్రి (భారత్) జంట 24–22, 23–21తో ఇంకారత్–తనూపత్ (థాయ్‌లాండ్) జోడీపై గెలిచింది. శనివారం జరిగే మహిళల సింగిల్స్ సెమీఫైనల్స్‌లో రియా ముఖర్జీ (భారత్)తో ఇరా శర్మ; థినా (మలేసియా)తో రుత్విక తలపడతారు. -
క్వార్టర్స్‌లో ఓడిన రుత్విక
హో చి మిన్ (వియత్నాం): వియత్నాం ఓపెన్ గ్రాండ్ ప్రి బ్యాడ్మింటన్ టోర్నీ మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో రుత్విక శివాని 21–18, 15–21, 8–21తో దినర్ అయుస్టీన్ (ఇండోనేసియా) చేతిలో పరాజయం పాలైంది. పురుషుల సింగిల్స్‌లోనూ లక్ష్యసేన్ క్వార్టర్స్‌లోనే వెనుదిరిగాడు. జపాన్‌కు చెందిన కొడై నరోఓకా 21–17, 21–23, 21–10తో లక్ష్యసేన్‌పై గెలిచాడు. ఈ టోర్నీలో భారత్‌కు చెందిన అర్జున్– శ్లోక్ ద్వయం సెమీస్‌కు చేరుకుంది. -
క్వార్టర్స్‌లో రుత్విక
సాక్షి, హైదరాబాద్: వియత్నాం ఓపెన్ గ్రాండ్‌ప్రి బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో తెలుగు అమ్మాయిలు గద్దె రుత్విక శివాని, గుమ్మడి వృశాలిలకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. రుత్విక క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించగా... వృశాలి ప్రిక్వార్టర్ ఫైనల్లో పోరాడి ఓడింది. వియత్నాంలోని హో చి మిన్ సిటీలో గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో రుత్విక 21–15, 21–12తో వాన్ యి తాంగ్ (చైనీస్ తైపీ)పై గెలుపొందింది. వృశాలి 8–21, 21–12, 10–21తో ఆరో సీడ్ చెన్ సు యు (చైనీస్ తైపీ) చేతిలో పరాజయం పాలైంది. భారత్‌కే చెందిన శ్రేయాన్షి పరదేశి 6–21, 21–16, 21–23తో మూడో సీడ్ దినార్ అయుస్టిన్ (ఇండోనేసియా) చేతిలో ఓడిపోయింది. పురుషుల సింగిల్స్ విభాగంలో లక్ష్య సేన్ క్వార్టర్ ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకున్నాడు. ప్రిక్వార్టర్ ఫైనల్లో లక్ష్య సేన్ 21–14, 21–12తో త్రుయోంగ్ తన్ లాంగ్ (వియత్నాం)పై గెలుపొందాడు. శుక్రవారం జరిగే క్వార్టర్ ఫైనల్స్‌లో దినార్‌తో రుత్విక శివాని; కొడాయ్ నరావుకా (జపాన్)తో లక్ష్య సేన్ తలపడతారు. -
రుత్విక, సిక్కి రెడ్డిలకు టైటిల్స్
సాక్షి, హైదరాబాద్: తమ విజయపరంపరను కొనసాగిస్తూ హైదరాబాద్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణులు గద్దె రుత్విక శివాని... సిక్కి రెడ్డి రష్యా ఓపెన్ గ్రాండ్‌ప్రి టోర్నమెంట్లో టైటిల్స్‌ను సొంతం చేసుకున్నారు. రష్యాలోని వ్లాదివోస్తోక్ నగరంలో ఆదివారం ముగిసిన ఈ టోర్నమెంట్లో రుత్విక శివాని మహిళల సింగిల్స్ విభాగంలో... సిక్కి రెడ్డి మిక్స్డ్ డబుల్స్ విభాగంలో విజేతలుగా నిలిచారు. మహిళల సింగిల్స్ ఫైనల్లో రుత్విక 21-10, 21-13తో ఎవగెనియా కొసెట్‌స్కాయ (రష్యా)పై గెలుపొందగా... మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లో సిక్కి రెడ్డి-ప్రణవ్ చోప్రా ద్వయం 21-17, 21-19తో వ్లాదిమిర్ ఇవనోవ్-వలెరియా సొరోకినా (రష్యా) జంటను ఓడించింది. విజేతలుగా నిలిచిన రుత్విక శివానికి 4,125 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 2 లక్షల 74 వేలు)తోపాటు 5500 ర్యాంకింగ్ పాయింట్లు... సిక్కి రెడ్డి జంటకు 4,345 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 2 లక్షల 89 వేలు)తోపాటు 5500 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఎవగెనియాతో జరిగిన ఫైనల్లో రుత్విక పూర్తి ఆధిపత్యం చలాయించింది. కేవలం 26 నిమిషాల్లోనే తన ప్రత్యర్థిని ఓడించి కెరీర్లో తొలిసారి గ్రాండ్‌ప్రి స్థాయి టైటిల్‌ను కై వసం చేసుకుంది. మరోవైపు సిక్కి రెడ్డి జంటకిది ఈ ఏడాది రెండో గ్రాండ్‌ప్రి టైటిల్. ఇంతకుముందు సిక్కి-ప్రణవ్ బ్రెజిల్ గ్రాండ్‌ప్రి టోర్నీలో విజేతగా నిలిచింది. అయితే పురుషుల సింగిల్స్ విభాగంలో హైదరాబాద్ ప్లేయర్ సిరిల్ వర్మకు నిరాశ ఎదురైంది. ఫైనల్లో సిరిల్ వర్మ 21-16, 19-21, 10-21తో జుల్ఫాద్లి జుల్కిఫ్లి (మలేసియా) చేతిలో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచాడు. సిరిల్ వర్మకు 2,090 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. లక్షా 39 వేలు)తోపాటు 4680 ర్యాంకింగ్ పాయింట్లు దక్కాయి. -
ఫైనల్లో రుత్విక, సిరిల్ వర్మ
న్యూఢిల్లీ: నిలకడైన ప్రదర్శనను కొనసాగిస్తూ భారత యువ బ్యాడ్మింటన్ క్రీడాకారులు గద్దె రుత్విక శివాని, సిరిల్ వర్మ రష్యా గ్రాండ్‌ప్రి టోర్నమెంట్లో టైటిల్ పోరుకు అర్హత సాధించారు. తమ కెరీర్లో వీరిద్దరూ తొలిసారి ఓ గ్రాండ్‌ప్రి స్థాయి టోర్నీలో ఫైనల్‌కు చేరారు. రష్యాలోని వ్లాదివొస్తోక్ నగరంలో శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో రుత్విక శివాని 22-20, 21-13తో రెండో సీడ్ సెనియా పొలికర్పోవా (రష్యా)ను ఓడించగా... పురుషుల సింగిల్స్ సెమీస్‌లో సిరిల్ 24-22, 21-16తో అనతోలి యార్ట్‌సెవ్ (రష్యా)పై గెలిచాడు. మిక్స్డ్ డబుల్స్ సెమీఫైనల్లో తెలంగాణ అమ్మాయి సిక్కి రెడ్డి తన భాగస్వామి ప్రణవ్ చోప్రాతో కలిసి ఫైనల్‌కు చేరింది. సెమీఫైనల్లో సిక్కి-ప్రణవ్ ద్వయం 21-11, 21-17తో అనతోలి యార్ట్‌సెవ్-ఎవగెనియా కొసెట్స్కాయా (రష్యా) జంటపై నెగ్గింది. ఆదివారం జరిగే ఫైనల్స్‌లో ఎవగెనియా కొసెట్స్కాయాతో రుత్విక శివాని; జుల్ఫాద్లి జుల్కిఫ్లి (మలేసియా)తో సిరిల్ వర్మ; ఇవనోవ్-సొరోకినా (రష్యా)లతో సిక్కి-ప్రణవ్ తలపడతారు.