
ముంబై: టాటా ఓపెన్ ఇండియా ఇంటర్నేషనల్ చాలెంజ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ అమ్మాయి గద్దె రుత్విక శివాని సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో రుత్విక 17–21, 21–10, 21–17తో హైదరాబాద్‌కే చెందిన రెండో సీడ్ కుదరవల్లి శ్రీకృష్ణప్రియపై విజయం సాధించింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 60వ స్థానంలో ఉన్న శ్రీకృష్ణప్రియపై రుత్వికకిది వరుసగా మూడో విజయం కావడం విశేషం. మరోవైపు హైదరాబాద్‌కే చెందిన మరో క్రీడాకారిణి ఇరా శర్మ సంచలన విజయంతో సెమీస్‌లోకి అడుగు పెట్టింది.
లాల్‌బహదూర్ ఇండోర్ స్టేడియంలో ‘ద్రోణాచార్య’ అవార్డీ ఎస్.ఎం.ఆరిఫ్ వద్ద శిక్షణ పొందుతోన్న 17 ఏళ్ల ఇరా క్వార్టర్ ఫైనల్లో 18–21, 21–18, 21–19తో టాప్ సీడ్ రితూపర్ణ దాస్ (భారత్)ను బోల్తా కొట్టించింది. పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సుమీత్ రెడ్డి–మనూ అత్రి (భారత్) జంట 24–22, 23–21తో ఇంకారత్–తనూపత్ (థాయ్‌లాండ్) జోడీపై గెలిచింది. శనివారం జరిగే మహిళల సింగిల్స్ సెమీఫైనల్స్‌లో రియా ముఖర్జీ (భారత్)తో ఇరా శర్మ; థినా (మలేసియా)తో రుత్విక తలపడతారు.
Comments
Please login to add a commentAdd a comment