మెల్‌బోర్న్: టెన్నిస్ సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో స్టార్ ప్లేయర్లు ఇగా స్వియాటెక్ (పోలాండ్), యానిక్ సినెర్ (ఇటలీ) తమ దూకుడు కొనసాగిస్తున్నారు. మహిళల సింగిల్స్ విభాగంలో రెండో సీడ్ స్వియాటెక్ వరుసగా ఐదో మ్యాచ్‌లోనూ వరుస సెట్‌లలో నెగ్గగా... పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ సినెర్ కూడా వరుస సెట్‌లలో తన ప్రత్యర్థిని చిత్తు చేశాడు.
బుధవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో స్వియాటెక్ 6–1, 6–2తో ఎనిమిదో సీడ్ ఎమ్మా నవారో (అమెరికా)పై గెలిచింది. 89 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో స్వియాటెక్ కేవలం మూడు గేమ్‌లు మాత్రమే కోల్పోయింది. నవారో సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసిన స్వియాటెక్ 22 విన్నర్స్ కొట్టింది.
మరో క్వార్టర్ ఫైనల్లో 19వ సీడ్ మాడిసన్ కీస్ (అమెరికా) 3–6, 6–3, 6–4తో స్వితోలినా (ఉక్రెయిన్)ను ఓడించి మూడోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సెమీఫైనల్‌కు చేరుకుంది. నేడు జరిగే సెమీఫైనల్స్‌లో బదోసా (స్పెయిన్)తో డిఫెండింగ్ చాంపియన్ సబలెంకా (బెలారస్); కీస్‌తో స్వియాటెక్ తలపడతారు.
షెల్టన్ తొలిసారి...
పురుషుల సింగిల్స్‌లో టాప్ సీడ్ యానిక్ సినెర్ టైటిల్ నిలబెట్టుకునే దిశగా మరో అడుగు వేయగా... అమెరికా రైజింగ్ స్టార్ బెన్ షెల్టన్ తొలిసారి ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు.
క్వార్టర్ ఫైనల్లో సినెర్ 6–3, 6–2, 6–1తో ఎనిమిదో సీడ్ అలెక్స్ డిమినార్ (ఆ్రస్టేలియా)పై... షెల్టన్ 6–4, 7–5, 4–6, 7–6 (7/4)తో లొరెంజో సొనెగో (ఇటలీ)పై గెలుపొందారు. డిమినార్‌తో 1 గంట 48 నిమిషాల్లోనే ముగిసిన మ్యాచ్‌లో సినెర్‌కు ఏ దశలోనూ ఇబ్బంది ఎదురుకాలేదు. 27 వినర్స్ కొట్టిన సినెర్... ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment