sikki reddy
-
సిక్కి–సుమీత్ జోడీ శుభారంభం
లక్నో: సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో భారత జోడీలు శుభారంభం చేశాయి. తెలంగాణకు చెందిన సిక్కి రెడ్డి–సుమీత్ రెడ్డి ద్వయం... గద్దె రుత్విక శివాని–రోహన్ కపూర్ జోడీ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు అర్హత పొందాయి. తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో టాప్ సీడ్ సిక్కి–సుమీత్ 21–10, 21–18తో సంజీత్ సుబ్రమణియన్–గౌరీ కృష్ణ (భారత్)లపై... రుత్విక–రోహన్ 21–14, 21–12తో నితిన్– అనఘా (భారత్)లపై విజయం సాధించారు. హైదరాబాద్‌కే చెందిన కె.మనీషా–షేక్ గౌస్ జోడీ కూడా ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరింది. తొలి రౌండ్లో మనీషా–õÙక్ గౌస్ 21–16, 12–21, 21–19తో నితిన్ కుమార్–రిధి కౌర్ తూర్ (భారత్)లను ఓడించారు. మహిళల సింగిల్స్ విభాగంలో భారత ప్లేయర్లు నవ్య కందేరి, తన్వీ శర్మ, మాన్సి సింగ్ మెయిన్ ‘డ్రా’కు అర్హత పొందారు. క్వాలిఫయింగ్ మ్యాచ్‌ల్లో నవ్య 21–8, 21–8తో సాక్షి గహ్లావత్పై, తన్వీ శర్మ 21–12, 21–10తో ఆశి రావత్‌పై, మాన్సి సింగ్ 21–11, 14–21, 21–12తో బోనం ప్రశంసపై గెలిచారు. పురుషుల సింగిల్స్ విభాగంలో భారత క్రీడాకారులు రిత్విక్, సిద్ధార్థ్ ప్రతాప్ సింగ్, సనీత్ దయానంద్ మెయిన్ ‘డ్రా’కు చేరుకున్నారు. మరోవైపు పురుషుల డబుల్స్ విభాగం నుంచి టాప్ సీడ్ సాతి్వక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జోడీ చివరి నిమిషంలో వైదొలిగింది. -
Denmark Open 2024: కళ్లన్నీ వాళ్లిద్దరిపైనే..
ఒడెన్స్ (డెన్మార్క్): ఈ సీజన్లో ఫామ్‌లోకి వచ్చేందుకు భారత స్టార్ షట్లర్ పీవీ సింధు పట్టుదలగా ఉంది. గత వారం ఫిన్లాండ్లో జరిగిన ఆర్క్టిక్ ఓపెన్ వైఫల్యాన్ని అధిగమించి డెన్మార్క్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నీలో శుభారంభం చేయాలనే లక్ష్యంతో సింధు సన్నద్ధమైంది.ఆ అడ్డంకిని దాటితేనేరెండు ఒలింపిక్ పతకాలు సాధించిన సింధుకు గత ఈవెంట్లో అనూహ్యంగా తొలి రౌండ్లోనే కెనడా ప్లేయర్ మిచెల్లీ లీ చేతిలో ఓటమి ఎదురైంది. గతంలో మిచెల్లీపై పదిసార్లు విజయం సాధించిన భారత షట్లర్‌కు ఫిన్లాండ్లో మాత్రం నిరాశ ఎదురైంది. తాజా డెన్మార్క్ ఓపెన్ తొలి రౌండ్లో ఆమె చైనీస్ తైపీకి చెందిన పాయ్ యు పొతో తలపడుతుంది. ఈ అడ్డంకిని దాటితే సింధుకు రెండో రౌండ్లో చైనా షట్లర్ హాన్ యువె ఎదురవనుంది. మహిళల సింగిల్స్‌లో ఆమెతో పాటు మాళవిక బన్సోద్, ఆకర్షి కశ్యప్, ఉన్నతి హుడాలు కూడా ఈ టోరీ్నలో శుభారంభంపై దృష్టి సారించారు. లక్ష్య సేన్ గాడిన పడతాడా?పురుషుల సింగిల్స్‌లో భారత స్టార్ లక్ష్య సేన్ కూడా మెరుగైన ఆటతీరుతో ఈ సీజన్లో గాడిన పడేందుకు శ్రమిస్తున్నాడు. ఈ టోర్నీలో 23 ఏళ్ల లక్ష్య సేన్ తొలిరౌండ్లో లూ గ్వాంగ్ జు (చైనా)తో పోటీపడతాడు. ఈ మ్యాచ్‌లో గెలిస్తే రెండో రౌండ్లో కిష్టమైన ప్రత్యర్థి ఎదురవనున్నాడు. ఇండోనేసియాకు షట్లర్ జొనాథన్ క్రిస్టీతో లక్ష్య సేన్ తలపడే అవకాశముంది.డబుల్స్లోఇక మహిళల డబుల్స్‌లో గాయత్రి–ట్రెసా జాలీ జంట తొలి రౌండ్లో ఐదో సీడ్ పియర్లీ తన్–తినా మురళీధరన్ (మలేసియా) జోడీతో ఆడుతుంది. మిక్స్డ్ డబుల్స్‌లో సిక్కి రెడ్డి–సుమిత్ రెడ్డి ద్వయానికి తొలి రౌండ్లో కెవిన్లీ– ఎలియాన జంగ్ (కెనడా) జంట ఎదురవుతుంది. గతంలో భారత క్రీడాకారులకు డెన్మార్క్ ఓపెన్ కలిసొచ్చింది. సింగిల్స్‌లో ప్రకాశ్ పదుకొనే (1980లో), శ్రీకాంత్ (2017లో), సైనా నెహా్వల్ (2012లో) విజేతలుగా నిలిచారు. -
చైనా ఓపెన్‌లో భారత షట్లర్లకు నిరాశ
చాంగ్జౌ: చైనా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోర్నీలో మాళవిక బన్సోద్ మినహా మిగతా భారత క్రీడాకారులంతా తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టారు. పురుషుల సింగిల్స్‌లో కిరణ్ జార్జి... మహిళల సింగిల్స్‌లో హైదరాబాద్ అమ్మాయి సామియా ఇమాద్ ఫారూఖి, ఆకర్షి కశ్యప్ తొలి రౌండ్‌ను దాటలేకపోయారు.మహిళల డబుల్స్లోఇక మహిళల డబుల్స్‌లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ, రుతూపర్ణ–శ్వేతాపర్ణ జోడీలు... మిక్స్డ్ డబుల్స్లోసిక్కి రెడ్డి–సుమీత్ రెడ్డి, సతీశ్ కుమార్–ఆద్యా జంటలకు నిరాశ ఎదురైంది. ప్రపంచ 40వ ర్యాంకర్ కిరణ్ జార్జి సంచలన విజయాన్ని సాధించే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. ప్రపంచ 13వ ర్యాంకర్ కెంటా నిషిమోటో (జపాన్)తో జరిగిన మ్యాచ్‌లో కిరణ్ జార్జి 21–4, 10–21, 21–23తో ఓడిపోయాడు.నిర్ణాయక మూడో గేమ్‌లో కిరణ్ రెండు మ్యాచ్ పాయింట్లను వృథా చేసుకోవడం గమనార్హం. సామియా 9–21, 7–21తో క్రిస్టీ గిల్మోర్ (స్కాట్లాండ్) చేతిలో... ఆకర్షి 15–21, 19–21తో చియు పిన్ చెయిన్ (చైనీస్ తైపీ) చేతిలో ఓటమి పాలయ్యారు.మహిళల డబుల్స్‌లో గాయత్రి–ట్రెసా జాలీ 21–16, 15–21, 17–21తో సెయి పె షాన్–హంగ్ ఎన్ జు (చైనీస్ తైపీ) చేతిలో... రుతూపర్ణ–శ్వేతాపర్ణ 11–21, 21–16, 11–21తో టెంగ్ చున్ సున్–యాంగ్ చున్ యున్ (చైనీస్ తైపీ) చేతిలో పరాజయం చవిచూశారు. సిక్కి రెడ్డి–సుమీత్ రెడ్డికీ ఓటమేమిక్స్డ్ డబుల్స్‌లో భారత నంబర్‌వన్ జోడీ సిక్కి రెడ్డి–సుమీత్ రెడ్డి 10–21, 16–21తో టాన్ కియాన్ మెంగ్–లాయ్ పె జింగ్ (మలేసియా) జంట చేతిలో... సతీశ్–ఆద్యా ద్వయం 14–21, 11–21తో చెన్ టాంగ్ జె–తో ఈ వె (మలేసియా) జోడీ చేతిలో ఓడిపోయాయి. -
ప్రిక్వార్టర్ ఫైనల్లో సిక్కి రెడ్డి–సుమీత్ రెడ్డి జోడీ
హాంకాంగ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో సిక్కి రెడ్డి–సుమీత్ రెడ్డి (భారత్) జోడీ శుభారంభం చేసింది. హాంకాంగ్‌లోని కౌలూన్ పట్టణంలో జరుగుతున్న ఈ టోరీ్నలో బుధవారం జరిగిన మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో తెలంగాణకు చెందిన సిక్కి–సుమీత్ ద్వయం 21–9, 21–10తో భారత్ తరఫున బరిలోకి దిగిన తెలంగాణ జోడీ కోనా తరుణ్–శ్రీకృష్ణప్రియపై గెలిచింది. నేడు జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్లో గో సూన్ హువాట్–లాయ్ షెవోన్ జేమీ (మలేసియా)లతో సిక్కి–సుమీత్ తలపడతారు. మరో తొలి రౌండ్ మ్యాచ్‌లో అశిత్ సూర్య–అమృత (భారత్) జంట 16–21, 20–22తో మింగ్ చె లు–హుంగ్ ఎన్ జు (చైనీస్ తైపీ) ద్వయం చేతిలో ఓడిపోయింది. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో ప్రియాన్షు రజావత్ (భారత్) 9–21, 21–16, 9–21తో టకుమా ఉబయాషి (జపాన్) చేతిలో... కిరణ్ జార్జి (భారత్) 16–21, 16–21తో సులి యాంగ్ (చైనీస్ తైపీ) చేతిలో పరాజయం పాలయ్యారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో తాన్యా హేమంత్ (భారత్) 16–21, 21–23తో కొమాంగ్ అయు కాయదేవి (ఇండోనేసియా) చేతిలో... ఆకర్షి కశ్యప్ (భారత్) 15–21, 9–21తో అయా ఒహోరి (జపాన్) చేతిలో ఓటమి చవిచూశారు. -
క్వార్టర్ ఫైనల్లో సిక్కి–సుమీత్ జోడీ
సిడ్నీ: ఆ్రస్టేలియన్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో సిక్కి రెడ్డి–సుమీత్ రెడ్డి (భారత్) జోడీ వరుసగా రెండో విజయం సాధించింది. గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో తెలంగాణకు చెందిన సిక్కి–సుమీత్ ద్వయం 21–11, 21–11తో కాయ్ చెన్ తియో–కాయ్ కి తియో (ఆ్రస్టేలియా) జంటను ఓడించింది. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ ఐదో ర్యాంక్ జోడీ జియాంగ్ జెన్ బాంగ్–వె యా జిన్ (చైనా)తో సిక్కి–సుమీత్ జంట తలపడుతుంది. పురుషుల సింగిల్స్ విభాగంలో భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. భారత నంబర్‌వన్ ప్రణయ్, సమీర్ వర్మ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించగా... కిరణ్ జార్జి ఓడిపోయాడు. ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో సమీర్ 21–14, 14–21, 21–19తో 2021 ప్రపంచ చాంపియన్ లో కీన్ యె (సింగపూర్)ను బోల్తా కొట్టించగా... ప్రణయ్ 21–17, 21–15తో మిషా జిల్బెర్మన్ (ఇజ్రాయెల్)పై గెలిచాడు. కిరణ్ జార్జి 20–22, 6–21తో కెంటా నిషిమోటో (జపాన్) చేతిలో ఓడిపోయాడు. మహిళల సింగిల్స్‌లో ఆకర్షి కశ్యప్ క్వార్టర్ ఫైనల్ చేరగా... మాళవిక, అనుపమ నిష్క్రమించారు. ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో ఆకర్షి 21–16, 21–13తో కాయ్ కి తియో (ఆస్ట్రేలియా)పై గెలిచింది. మాళవిక 17–21, 21–23తో ఎస్తెర్ నురిమి (ఇండోనేసియా) చేతిలో, అనుపమ 11–21, 18–21తో పుత్రి కుసుమ వర్ధిని (ఇండోనేసియా) చేతిలో ఓటమి చవిచూశారు. -
సిక్కి–సుమీత్ జోడీ శుభారంభం
సిడ్నీ: ఆ్రస్టేలియన్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో సిక్కి రెడ్డి–సుమీత్ రెడ్డి (భారత్) జోడీ శుభారంభం చేసింది. బుధవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో తెలంగాణకు చెందిన సిక్కి–సుమీత్ ద్వయం 21–17, 21–19తో వోంగ్ టియెన్ సి–లిమ్ చియెవ్ సియెన్ (మలేసియా) జంటపై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరింది. మరో తొలి రౌండ్ మ్యాచ్‌లో శ్రీకృష్ణప్రియ–కోన తరుణ్ (భారత్) జంట 6–21, 11–21తో హూ పాంగ్ రోన్–చెంగ్ సు యెన్ (మలేసియా) ద్వయం చేతిలో ఓడిపోయింది. ప్రణయ్, సమీర్ ముందంజ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత ప్లేయర్లు హెచ్ఎస్ ప్రణయ్, సమీర్ వర్మ, కిరణ్ జార్జి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో ప్రణయ్ 21–10, 23–21తో యోగర్ కోల్హో (బ్రెజిల్)పై, సమీర్ వర్మ 21–10, 21–10తో రికీ టాంగ్ (ఆస్ట్రేలియా)పై, కిరణ్ 21–17, 21–10తో జియోడాంగ్ షాంగ్ (కెనడా)పై గెలిచారు.ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో మిథున్ మంజునాథ్ (భారత్) 17–21, 17–21తో అల్వి ఫర్హాన్ (ఇండోనేసియా) చేతిలో, శంకర్ ముత్తుస్వామి (భారత్) 16–21, 21–18, 10–21తో లీ జి జియా (మలేసియా) చేతిలో, అభిషేక్ (భారత్) 9–21, 15–21తో మిషా జిల్బెర్మన్ (ఇజ్రాయెల్) చేతిలో ఓడిపోయారు. పోరాడి ఓడిన సామియా మహిళల సింగిల్స్ విభాగంలో భారత ప్లేయర్లు ఆకర్షి కశ్యప్, మాళవిక, అనుపమ ఉపాధ్యాయ్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి చేరారు. హైదరాబాద్ అమ్మాయి సామియా ఫారూఖీ తొలి రౌండ్లో 23–21, 13–21, 22–24తో టాప్ సీడ్ పాయ్ యు పో (చైనీస్ తైపీ) చేతిలో పోరాడి ఓడిపోయింది. ఆకర్షి 21–14, 21–11తో పొలీనా బురోవా (ఉక్రెయిన్)పై, మాళవిక 21–10, 21–8తో మోపాటి కెయురపై, అనుపమ 21–14, 23–21తో వోంగ్ లింగ్ చింగ్ (మలేసియా)పై గెలిచారు. -
సెమీస్‌లో ఓడిన సిక్కిరెడ్డి–సుమీత్ జోడీ
మాడ్రిడ్: స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ వరల్డ్ టూర్ సూపర్–300 టోర్నీలో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. బరిలో మిగిలిన మిక్స్డ్ డబుల్స్ జోడీ సిక్కి రెడ్డి–సుమీత్ రెడ్డి సెమీఫైనల్లో వెనుదిరిగింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ 66వ ర్యాంక్‌లో ఉన్న సిక్కి–సుమీత్ 17–21, 12–21తో ప్రపంచ 17వ ర్యాంక్‌లో ఉన్న రినోవ్ రివాల్డీ–పితా మెంతారి (ఇండోనేసియా) జంట చేతిలో ఓడిపోయింది. సిక్కి–సుమీత్ జోడీకి 2,940 డాలర్ల (రూ. 2 లక్షల 45 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 4,900 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
సెమీస్‌లో సిక్కి–సుమీత్ జోడి
మాడ్రిడ్: బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ (సూపర్ 300) టోర్నీ స్పెయిన్ మాస్టర్స్‌లో భారత ఆటగాళ్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో స్టార్ ప్లేయర్ పీవీ సింధు ఓడగా...మిక్స్డ్ డబుల్స్‌లో సిక్కి రెడ్డి – సుమీత్ రెడ్డి జోడి సెమీఫైనల్లోకి ప్రవేశించింది. మహిళల డబుల్స్‌లో, పురుషుల డబుల్స్‌లో కూడా భారత జోడీలు క్వార్టర్స్‌లో వెనుదిరిగాయి. శుక్రవారం జరిగిన క్వార్టర్స్ మ్యాచ్‌లో సింధు పోరాడి ఓడింది. ఈ మ్యాచ్‌లో థాయిలాండ్‌కు చెందిన ఆరో సీడ్ సుపనిద కేట్‌టాంగ్ 24–26, 21–17, 22–20తో రెండో సీడ్ సింధును ఓడించింది. 77 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో ఇద్దరు షట్లర్లూ ఒక్కో పాయింట్ కోసం తీవ్రంగా పోరాడారు. తొలి గేమ్‌లో 4–8తో వెనుకబడిన తర్వాత వరుస 7 పాయింట్లతో సింధు 11–8కి వెళ్లింది. అయితే ఆ తర్వాత సుపనిద కోలుకుంది. దాంతో స్కోరు 17–17, 20–20, 24–24 వరకు సమంగా సాగగా, చివరకు గేమ్ సింధు గెలుచుకుంది. రెండో గేమ్‌లో 8–11తో వెనుకబడి కూడా సుపనిద పోరాడి గేమ్‌ను సొంతం చేసుకోగలిగింది. చివరి గేమ్‌లో 8–4తో సింధు ముందంజ వేసింది. అయితే భారత షట్లర్ వరుస తప్పిదాలతో ప్రత్యర్థికి అవకాశం కల్పించింది. ఒక దశలో వరుస 10 పాయింట్లలో 9 సుపనిద ఖాతాలోకే చేరాయి. 15–20తో ఓటమి దాదాపు ఖాయమైన దశలో సింధు వరుసగా 5 మ్యాచ్ పాయింట్లు సాధించి 20–20 వరకు తీసుకొచ్చింది. అయితే వరుస రెండు పాయింట్లతో సుపనిద ఆట ముగించడంతో రాకెట్ విసిరేసి సింధు కోర్టులోనే కుప్పకూలిపోయింది. డబుల్స్ జోడీల పరాజయం... 41 నిమిషాల పాటు సాగిన మిక్స్డ్ డబుల్స్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో సుమీత్ – సిక్కి జోడి 14–21, 21–11, 21–17 స్కోరుతో ఇండోనేసియాకు చెందిన రేహన్ నౌఫల్ – లిసా ఆయు ద్వయంపై విజయం సాధించింది. తొలి గేమ్‌ను కోల్పోయినా...పట్టుదలగా ఆడిన భారత జంట తర్వాతి రెండు గేమ్‌లలో సత్తా చాటి సెమీస్‌లోకి అడుగు పెట్టింది. మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో భారత్‌కు చెందిన మూడో సీడ్ అశ్విని పొన్నప్ప – తనీషా క్రాస్టోకు ఓటమి ఎదురైంది. ఆరో సీడ్ లీ చియా సిన్ – టెంగ్ చున్ సున్ (చైనీస్ తైపీ) వరుస గేమ్‌లలో 21–12, 21–10తో అశ్విని – తనీషాలను చిత్తు చేశారు. పురుషుల డబుల్స్ క్వార్టర్స్‌లోలో భారత్‌కు చెందిన ఎనిమిదో సీడ్ ధ్రువ్ కపిల – ఎంఆర్ అర్జున్ 19–21, 23–21, 17–21 తేడాతో మలేసియాకు చెందిన జునేదీ ఆరిఫ్ – రాయ్ కింగ్ చేతిలో పరాజయంపాలయ్యారు. -
ప్రిక్వార్టర్ ఫైనల్లో సిక్కి–సుమీత్ జోడీ
గువాహటి: స్వదేశంలో జరుగుతున్న గువాహటి మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–100 బ్యాడ్మింటన్ టోర్నీ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో సిక్కి రెడ్డి–సుమీత్ రెడ్డి (భారత్) జోడీ శుభారంభం చేసింది. బుధవారం జరిగిన తొలి రౌండ్లో తెలంగాణకు చెందిన సిక్కి–సుమీత్ ద్వయం 20–22, 21–15, 21–16తో రఫ్లీ రమంద–ఇందా సరి జమీల్ (ఇండోనేసియా) జంటను ఓడించింది. పురుషుల సింగిల్స్ రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో సాయిప్రణీత్ 21–14, 17–21, 7–21తో కువో కువాన్ లిన్ (చైనీస్ తైపీ) చేతిలో... తరుణ్ 11–21, 14–21తో జియా జెంగ్ జేసన్ (సింగపూర్) చేతిలో... ప్రణయ్ 12–21, 17–21తో కార్తికేయ (భారత్) చేతిలో ఓడిపోయారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో హైదరాబాద్ అమ్మాయి సామియా 21–12, 21–11తో తెలంగాణకే చెందిన గద్దె రుత్విక శివానిపై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరింది. -
చైనాలో.. అదరగొట్టనున్న.. తెలంగాణ బిడ్డ! అరుదైన అవకాశం!!
సాక్షి, మహబూబాబాద్: చైనాలోని హాంగ్జౌ వేదికగా శనివారం నుంచి ఆసియా గేమ్స్ ప్రారంభం కానున్నాయి. బ్యాడ్మింటన్ విభాగంలో మహబూబాబాద్ జిల్లాకు చెందిన క్రీడాకారిణి సిక్కిరెడ్డి ప్రతిభ కనబర్చనున్నారు. పతకం సాధించి తెలంగాణకు పేరు తేవాలని తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు, జిల్లాకు చెందిన ప్రముఖులు కోరుతున్నారు. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం జయపురం గ్రామానికి చెందిన నెలకుర్తి కృష్ణారెడ్డి, మాధవి దంపతుల కుమార్తె సిక్కిరెడ్డి. బాల్యంలో ఇక్కడే ఆటలో ఓనమాలు దిద్దారు. తండ్రి ఉద్యోగరీత్యా ఖమ్మం, హైదరాబాద్‌లో పని చేయడంతో అక్కడ బ్యాడ్మింటన్‌లో పూర్తి మెలకువలు నేర్చుకున్నారు. ఎడమ చేతివాటంతో చిన్నతనం నుంచి ప్రతిభ కనబర్చిన సిక్కిరెడ్డి 2014 మే నెలలో ఢిల్లీ ఉబర్ కప్‌లో కాంస్యం, 2015లో నేషనల్ గేమ్స్‌లో బంగారు పతకం, కామన్వెల్త్లో కాంస్యం.. ఇలా అనేక పతకాలు కైవసం చేసుకున్నారు. అరుదైన అవకాశం.. ఆసియా గేమ్స్‌లో 40 దేశాలకు పైగా.. 41 క్రీడాంశాల్లో 655 మంది క్రీడాకారులు పాల్గొననున్నారు. ఇందులో తెలంగాణ నుంచి 16 మంది పాల్గొంటున్నారు. వీరిలో మహబూబాబాద్ జిల్లాకు చెందిన సిక్కిరెడ్డి ఉండడం గర్వకారణం. -
మా బిడ్డకు కేపీ చౌదరితో అసలు పరిచయమే లేదు.. అనవసరంగా: సిక్కిరెడ్డి తల్లి
KP Chowdary Case: తమ కూతురికి డ్రగ్స్ కేసుతో ఎలాంటి సంబంధం లేదని బ్యాడ్మింటన్ ప్లేయర్ సిక్కిరెడ్డి తల్లి మాధవి స్పష్టం చేశారు. కనీస విచారణ చేయకుండా.. తన ఆటతో దేశానికి పేరు ప్రఖ్యాతలు తెచ్చిన సిక్కిరెడ్డి పేరును కస్టడీ రిపోర్ట్ లో పెట్టడం సరికాదని పేర్కొన్నాడు. కాగా ‘కబాలి’ సినిమా తెలుగు నిర్మాత కేపీ చౌదరిని డ్రగ్స్ కేసులో పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. పలువురు సెలబ్రిటీలతో అతడికి సత్సంబంధాలు ఉన్నాయన్న వార్తలు టాలీవుడ్లో ప్రకంపనలు రేపుతున్నాయి. అదే విధంగా కస్టడీ రిపోర్టులో బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సిక్కిరెడ్డి పేరు ఉండటం విస్మయపరిచింది. ఈ నేపథ్యంలో ఆమె తల్లి మాధవి మీడియాతో మాట్లాడారు. కేపీ చౌదరితో తమ బిడ్డకు అసలు పరిచయమే లేదని తెలిపారు. ఇల్లు కావాలంటే వారం రోజుల పాటు కేపీ చౌదరిని తమ నివాసంలో ఉండమని చెప్పామే తప్ప అతడు ఇలాంటి వాడని తెలియదని వాపోయారు. వారం రోజులు ఇల్లు కావాలంటే ‘‘మాకు 2011 నుంచి కేపీ చౌదరి తెలుసు. ఒక వారం రోజుల పాటు ఇల్లు కావాలంటే స్నేహితహిల్స్లో ఉన్న మా ఇంట్లో ఉండమని చెప్పాను. కానీ అతడికి డ్రగ్స్ అలవాటు ఉందని మాకు తెలియదు. ఇప్పటికే పోలీసులు వచ్చి స్నేహిత హిల్స్ లో ఉన్న ఇంటి సీసీ ఫుటేజ్ తీసుకున్నారు. సిక్కిరెడ్డికి ఇంకా ఈ విషయం తెలియదు. నా బిడ్డకు కేపీ చౌదరికి ఎలాంటి పరిచయం లేదు. కావాలంటే సీసీ ఫుటేజ్ చూసుకోండి. మా అమ్మాయి పార్టీలకు వెళ్లదు.. మందు అలవాటు లేదు. ఎలాంటి విచారణకైనా మేము సిద్ధం’’ అని సిక్కిరెడ్డి తల్లి మాధవి అన్నారు. చదవండి: ఆమె అందానికి క్లీన్‌బౌల్డ్! షేన్ వార్న్‌తో బార్లో తొలిసారి చూశా.. సంపాదనలోనూ పెను సంచలనం.. విండీస్‌ను మట్టికరిపించిన పసికూన -
ఐదేళ్ల తర్వాత అంతర్జాతీయ టైటిల్.. చాంపియన్ సమీర్ వర్మ
Slovenia Open- 2023: ఐదేళ్ల తర్వాత భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ సమీర్ వర్మ తన కెరీర్లో మరో అంతర్జాతీయ టైటిల్‌ను సాధించాడు. స్లొవేనియా ఓపెన్ ఇంటర్నేషనల్ చాలెంజ్ టోర్నీలో సమీర్ వర్మ విజేతగా నిలిచాడు. ఫైనల్లో సమీర్ వర్మ 21–18, 21–14తో సు లి యాంగ్ (చైనీస్ తైపీ)పై నెగ్గాడు. విజేతగా నిలిచిన సమీర్‌కు 1200 డాలర్ల (రూ. 99 వేలు) ప్రైజ్‌మనీ దక్కింది. చివరిసారి సమీర్ వర్మ 2018లో సయ్యద్ మోదీ సూపర్–300 టోర్నీలో టైటిల్ సాధించాడు. ఇక టోర్నీలో సిక్కి రెడ్డి- రోహన్ కపూర్ జోడీ మిక్స్డ్ డబుల్స్‌లో రజతం సాధించారు. అర్జున్ ఖాతాలో మూడో ‘డ్రా’ షార్జా మాస్టర్స్ అంతర్జాతీయ చెస్ టోర్నీలో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్ మూడో ‘డ్రా’ నమోదు చేశాడు. షాంట్ సర్గ్‌సియాన్ (అర్మేనియా)తో సోమవారం జరిగిన ఆరో రౌండ్ గేమ్‌ను అర్జున్ 34 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. ఈ టోర్నీలో రెండు గేముల్లో గెలిచి, మూడు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని, మరో గేమ్‌లో ఓడిన అర్జున్ 3.5 పాయింట్లతో 18వ ర్యాంక్‌లో ఉన్నాడు. భారత్‌కే చెందిన గ్రాండ్‌మాస్టర్లు ప్రజ్ఞానంద, నిహాల్ సరీన్, ఆర్యన్ చోప్రా నాలుగు పాయింట్లతో ఉమ్మడిగా రెండో ర్యాంక్‌లో ఉన్నారు. మాజీ టాప్ ర్యాంక్ జోడీకి సాకేత్–యూకీ షాక్ పారిస్: లియోన్ –250 ఏటీపీ టెన్నిస్ టోర్నమెంట్లో సాకేత్ మైనేని–యూకీ బాంబ్రీ (భారత్) జోడీ సంచలన విజయంతో శుభారంభం చేసింది. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సాకేత్–యూకీ ద్వయం 7–6 (7/4), 3–6, 10–8తో ‘సూపర్ టైబ్రేక్’లో ప్రపంచ మాజీ నంబర్‌వన్ జోడీ సెబాస్టియన్ కబాల్–రాబర్ట్ ఫరా (కొలంబియా) జోడీపై గెలిచి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. గంటా 53 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో సాకేత్, యూకీ రెండు ఏస్‌లు సంధించి, ఆరు డబుల్ ఫాల్ట్‌లు చేశారు. తమ ర్యాంకింగ్ ఆధారంగా వచ్చే వారం పారిస్‌లో మొదలయ్యే ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ పురుషుల డబుల్స్ మెయిన్ ‘డ్రా’కు సాకేత్, యూకీ అర్హత పొందారు. -
రన్నరప్ సిక్కి రెడ్డి జోడీ
Sikki Reddy: స్లొవేనియా ఓపెన్ ఇంటర్నేషనల్ చాలెంజ్ బ్యాడ్మింటన్ టోర్నీ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో తెలంగాణ అమ్మాయి సిక్కి రెడ్డి రన్నరప్‌గా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో టాప్ సీడ్ సిక్కి రెడ్డి–రోహన్ కపూర్ (భారత్) జోడీ 12–21, 13–21తో మూడో సీడ్ జెస్పర్ టాఫ్ట్–క్లారా గావర్సన్ (డెన్మార్క్) ద్వయం చేతిలో ఓడిపోయింది. సెమీఫైనల్లో సిక్కి–రోహన్ 21–15, 21–19తో మాడ్స్ వెస్టర్‌గార్డ్–క్రిస్టిన్ బుష్ (డెన్మార్క్)లపై గెలిచారు. ఇది కూడా చదవండి: ‘డ్రా’తో గట్టెక్కిన భారత్ అడిలైడ్: ఆస్ట్రేలియా మహిళల జట్టుతో మూడు మ్యాచ్‌ల సిరీస్ ను భారత జట్టు ‘డ్రా’తో ముగించింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయి సిరీస్‌ను కోల్పోయిన భార త్ ఆదివారం జరిగిన మూడో మ్యాచ్‌ను 1–1తో ‘డ్రా’ చేసుకుంది. మాడిసన్ బ్రూక్స్ (25వ ని. లో) చేసిన గోల్‌తో ఆస్ట్రేలియా 1–0తో ఆధిక్యంలోకి వెళ్లగా... దీప్ గ్రేస్ ఎక్కా (42వ ని.లో) గోల్‌తో భారత్ స్కోరును సమంచేసింది. ఈ మ్యాచ్‌తో భారత కెప్టెన్ సవితా పూనియా, డిఫెండర్ నిక్కీ ప్రధాన్ తమ కెరీర్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్నారు. -
మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లో సిక్కి రెడ్డి–రోహన్ జోడీ
ఇండియా ఇంటర్నేషనల్ చాలెంజ్ బ్యాడ్మింటన్ టోర్నీలో తెలంగాణ అమ్మాయి సిక్కి రెడ్డి మిక్స్డ్ డబుల్స్‌లో ఫైనల్‌కు చేరింది. బెంగళూరులో శనివారం జరిగిన సెమీఫైనల్లో సిక్కి రెడ్డి–రోహన్ కపూర్ (భారత్) జోడీ 21–17, 14–21, 21–16తో షేక్ గౌస్–మనీషా (భారత్) ద్వయంపై గెలిచింది. నేడు జరిగే ఫైనల్లో అశ్విని పొన్నప్ప–సాయి ప్రతీక్ (భారత్)లతో సిక్కి–రోహన్ తలపడతారు. మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో తెలంగాణ అమ్మాయి గద్దె రుత్విక శివాని ఫైనల్లోకి దూసుకెళ్లింది. సెమీఫైనల్లో రుత్విక 21–16, 19–21, 21–16తో మాన్సి సింగ్ (భారత్)పై నెగ్గింది. నేడు జరిగే ఫైనల్లో తాన్యా హేమంత్‌తో రుత్విక ఆడుతుంది. పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో పంజాల విష్ణువర్ధన్ గౌడ్–గరగ కృష్ణప్రసాద్ (భారత్) జోడీ 15–21, 18–21తో చలోంపన్–నాంథకర్న్ (థాయ్‌లాండ్) ద్వయం చేతిలో ఓడిపోయింది. -
సాయిప్రణీత్‌కు స్వర్ణం
సాక్షి, హైదరాబాద్: జాతీయ క్రీడల్లో తెలంగాణ ఖాతాలో గురువారం మూడు స్వర్ణాలు చేరాయి. బ్యాడ్మింటన్‌లో రెండు పతకాలు సాధించిన జట్టుకు బాస్కెట్‌బాల్‌లో కూడా మరో బంగారు పతకం దక్కింది. పురుషుల సింగిల్స్ ఫైనల్లో తెలంగాణ షట్లర్ సాయిప్రణీత్ 21–11, 12–21, 21–16తో మిథున్ మంజునాథ్ (కర్నాటక)ను ఓడించి విజేతగా నిలిచాడు. మహిళల డబుల్స్‌లో ఫైనల్లో ఎన్.సిక్కిరెడ్డి–పుల్లెల గాయత్రి గోపీచంద్ ద్వయం పసిడి పతకాన్ని తమ ఖాతాలో వేసుకుంది. ఫైనల్లో సిక్కి–గాయత్రి 21–14, 21–11తో శిఖా గౌతమ్–అశ్విని భట్ (కర్నాటక)ను చిత్తు చేశారు. మహిళల బాస్కెట్‌బాల్ 5–5 ఈవెంట్లో కూడా తెలంగాణకు స్వర్ణం లభించింది. హోరాహోరీగా సాగిన ఫైనల్లో తెలంగాణ 67–62 పాయింట్ల తేడాతో తమిళనాడుపై విజయం సాధించింది. మూడు క్వార్టర్లు ముగిసే సరికి 5 పాయింట్లతో వెనుకబడి ఉన్న తెలంగాణ నాలుగో క్వార్టర్లో 10 పాయింట్ల ఆధిక్యం సాధించి విజయాన్నందుకోవడం విశేషం. తెలంగాణ స్విమ్మర్ వ్రిత్తి అగర్వాల్ ఖాతాలో మరో పతకం చేరింది. మహిళల 1500 మీటర్ల ఫ్రీస్టయిల్లో రెండో స్థానంలో నిలిచిన విృత్తి రజత పతకాన్ని అందుకుంది. -
Vietnam Open: భారత్‌కు నిరాశ.. సిక్కిరెడ్డి- రోహన్ కపూర్ జోడీకి తప్పని ఓటమి
Vietnam Open 2022- హో చి మిన్ సిటీ: వియత్నాం ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–100 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. మిక్స్డ్ డబుల్స్ బరిలో మిగిలిన ఏకైక జోడీ సిక్కి రెడ్డి–రోహన్ కపూర్ (భారత్) సెమీఫైనల్లో వెనుదిరిగింది. 37 నిమిషాలపాటు జరిగిన సెమీఫైనల్లో టాప్ సీడ్ రెహాన్ నౌఫల్–లీసా కుసుమవతి (ఇండోనేసియా) ద్వయం 21–16, 21–14తో సిక్కి రెడ్డి–రోహన్ జోడీపై గెలిచి ఫైనల్ చేరింది. సెమీస్‌లో ఓడిన భారత జంటకు 1,050 డాలర్ల (రూ. 85 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 3,850 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
Vietnam Open 2022: సిక్కి రెడ్డి–రోహన్ కపూర్ జోడీ జోరు
హో చి మిన్ సిటీ: వియత్నాం ఓపెన్ సూపర్–100 బ్యాడ్మింటన్ టోర్నీలో సిక్కి రెడ్డి–రోహన్ కపూర్ (భారత్) జోడీ జోరు కొనసాగుతోంది. గతవారం ఛత్తీస్‌గఢ్ ఇంటర్నేషనల్ చాలెంజ్ టోర్నీలో టైటిల్ నెగ్గిన సిక్కి–రోహన్ ద్వయం వియత్నాం ఓపెన్‌లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన మిక్స్డ్ డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో తెలంగాణ అమ్మాయి సిక్కి రెడ్డి, ఢిల్లీ ప్లేయర్ రోహన్ కపూర్ 21–19, 21–17తో మూడో సీడ్ చాన్ పెంగ్ సూన్–చెయ యీ సీ (మలేసియా) జోడీపై సంచలన విజయం సాధించారు. 34 ఏళ్ల చాన్ పెంగ్ సూన్ 2016 రియో ఒలింపిక్స్‌లో మిక్స్డ్ డబుల్స్‌లో రజత పతకం సాధించడం విశేషం. నేడు జరిగే సెమీఫైనల్లో టాప్ సీడ్ రెహన్ నౌఫల్–లీసా కుసుమవతి (ఇండోనేసియా) జోడీతో సిక్కి రెడ్డి–రోహన్ తలపడతారు. Tel Aviv Tennis Tournament: టైటిల్‌కు గెలుపు దూరంలో... టెల్ అవీవ్: భారత టెన్నిస్ డబుల్స్ స్టార్ రోహన్ బోపన్న ఈ ఏడాది మూడో టైటిల్‌కు విజయం దూరంలో నిలిచాడు. టెల్ అవీవ్ ఏటీపీ–250 టోర్నీలో బోపన్న (భారత్)– మిడిల్‌కూప్ (నెదర్లాండ్స్) జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో టాప్ సీడ్ బోపన్న–మిడిల్‌కూప్ ద్వయం 4–6, 7–6 (7/3), 10–8తో ‘సూపర్ టైబ్రేక్’లో డూంబియా–రెబూల్ (ఫ్రాన్స్) జోడీపై గెలిచింది. 42 ఏళ్ల బోపన్న ఈ ఏడాది పుణే ఓపెన్, అడిలైడ్ ఓపెన్లలో డబుల్స్ టైటిల్స్ సాధించాడు. -
Vietnam Open: పోరాడి ఓడిన రుత్విక.. అదరగొట్టిన సిక్కిరెడ్డి- రోహన్ జోడీ
Vietnam Open 2022- హో చి మిన్ సిటీ: వియత్నాం ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–100 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో తెలుగమ్మాయి సిక్కిరెడ్డి మిక్స్డ్ డబుల్స్‌లో దూసుకెళుతోంది. రోహన్ కపూర్‌తో జతకట్టిన ఆమె క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన ప్రిక్వార్టర్స్‌లో సిక్కిరెడ్డి– రోహన్ జోడీ 21–10, 19–21, 21–18తో ఎనిమిదో సీడ్ యుంగ్ షింగ్ చొయ్–ఫాన్ క యాన్ (హాంకాంగ్) జంటను కంగు తినిపించింది. శుక్రవారం జరిగే క్వార్టర్ ఫైనల్లో భారత ద్వయం మలేసియాకు చెందిన మూడో సీడ్ చాన్ పెంగ్ సున్–చి యి సి జోడీతో తలపడుతుంది. పురుషుల సింగిల్స్‌లో తెలంగాణ షట్లర్ మేకల కిరణ్ కుమార్ ప్రిక్వార్టర్స్‌లో పరాజయం చవిచూశాడు. వరుస విజయాలతో ప్రిక్వార్టర్స్ చేరిన కిరణ్ ఇక్కడ మాత్రం వరుస గేముల్లో 15–21, 10–21తో చిమ్ జున్ వి (మలేసియా) చేతిలో ఓడిపోయాడు. మహిళల సింగిల్స్‌లోనూ భారత ప్లేయర్లకు ప్రిక్వార్టర్స్‌లోనే చుక్కెదురైంది. హైదరాబాద్ షట్లర్ గద్దె రుత్విక శివాని 21–15, 18–21, 17–21తో స్థానిక ప్లేయర్ తి త్రంగ్ వు చేతిలో పోరాడి ఓడింది. మిగతా మ్యాచ్‌ల్లో రీతుపర్ణ దాస్ 15–21, 16–21తో తి ఫుంగ్తుయ్ ట్రాన్ (వియత్నాం) చేతిలో ఓడిపోగా... నీలూరి ప్రేరణ 3–21, 7–21తో టాప్‌సీడ్ అయ ఒహొరి (జపాన్) ధాటికి నిలువలేకపోయింది. -
Vietnam Open Badminton: ప్రిక్వార్టర్ ఫైనల్లో సిక్కి రెడ్డి–రోహన్ జోడీ
హో చి మిన్ సిటీ: వియత్నాం ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–100 బ్యాడ్మింటన్ టోర్నీ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో సిక్కి రెడ్డి–రోహన్ కపూర్ (భారత్) జోడీ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. బుధవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో తెలంగాణ అమ్మాయి సిక్కి రెడ్డి–రోహన్ కపూర్ ద్వయం 14–21, 21–9, 21–12తో హరిహరన్–లక్ష్మి ప్రియాంక (భారత్) జోడీపై గెలిచింది. పురుషుల సింగిల్స్ విభాగంలో సంచలన ఫలితాలు నమోదయ్యాయి. 2019 ప్రపంచ చాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత, 40వ ర్యాంకర్ సాయిప్రణీత్ రెండో రౌండ్లోనే నిష్క్రమించాడు. తొలి రౌండ్లో ‘బై’ పొంది నేరుగా రెండో రౌండ్ మ్యాచ్ ఆడిన రెండో సీడ్ సాయిప్రణీత్ 21–17, 18–21, 13–21తో 225వ ర్యాంకర్ సతీశ్ కుమార్ (భారత్) చేతిలో ఓడిపోయాడు. తెలంగాణ ప్లేయర్ మేకల కిరణ్ కుమార్ వరుసగా రెండు విజయాలతో ప్రిక్వార్టర్ ఫైనల్ చేరాడు. తొలి రౌండ్లో కిరణ్ 21–10, 15–21, 21–10తో ప్రపంచ 68వ ర్యాంకర్ శుభాంకర్ డే (భారత్)పై నెగ్గి...రెండో రౌండ్లో 16–21, 21–14, 21–19తో ఫోన్ ప్యా నైంగ్ (మయాన్మార్)ను ఓడించాడు. -
Uber Cup: టోర్నీకి సిక్కి రెడ్డి దూరం.. కారణమిదే
Uber Cup Tourney: Sikki Reddy- Ashwini Ponnappa: భారత బ్యాడ్మింటన్ డబుల్స్ స్టార్ సిక్కి రెడ్డి ప్రముఖ టీమ్ ఈవెంట్ ఉబెర్ కప్ నుంచి వైదొలిగింది. ఆమె పొత్తికడుపు కండరాల్లో గాయమైంది. కోలుకునేందుకు సిక్కి రెడ్డికి 4 నుంచి 6 వారాల సమయం పడుతుందని డాక్టర్లు తేల్చారు. దాంతో వచ్చే నెల 8 నుంచి 15 వరకు బ్యాంకాక్‌లో జరిగే ఉబెర్ కప్ నుంచి సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప జంట వైదొలిగింది. ఈ జోడీ స్థానంలో సిమ్రన్æ–రితిక జంటను ఉబెర్ కప్ కోసం ఎంపిక చేసినట్లు భారత బ్యాడ్మింటన్ సంఘం తెలిపింది. చదవండి: రజతం నెగ్గిన రెజ్లర్లు అన్షు, రాధిక.. మనీషాకు కాంస్యం -
Swiss Open 2022: మెయిన్ ‘డ్రా’కు సుమీత్ రెడ్డి–అశ్విని జంట
Swiss Open 2022: స్విస్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో సుమీత్ రెడ్డి–అశ్విని పొన్నప్ప (భారత్) జంట మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించింది. క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో సుమీత్–అశ్విని ద్వయం 18–21, 21–16, 21–17తో మ్యాడ్స్ వెస్టర్‌గార్డ్–నటాషా (డెన్మార్క్) జోడీపై నెగ్గింది. ఇదిలా ఉండగా.. సిక్కి రెడ్డి–సాయిప్రతీక్; పుల్లెల గాయత్రి–ధ్రువ్; అర్జున్–ట్రెసా జాలీ జోడీలకు నేరుగా మెయిన్ ‘డ్రా’లో చోటు దక్కింది. చదవండి: క్రికెట్ చరిత్రలో అత్యంత చెత్త నిర్ణయానికి 30 ఏళ్లు.. -
సిక్కి రెడ్డి–ధ్రువ్ జంట సంచలనం
బాలి: ఇండోనేసియా మాస్టర్స్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో సిక్కి రెడ్డి–ధ్రువ్ కపిల (భారత్) జంట సంచలనం సృష్టించింది. బుధవారం జరిగిన మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 178వ ర్యాంక్‌లో ఉన్న సిక్కి రెడ్డి–ధ్రువ్ ద్వయం 21–11, 22–20తో ప్రపంచ 5వ ర్యాంక్, రెండో సీడ్ ప్రవీణ్ జోర్డాన్–మెలాతి దెవా ఒక్తావియాంతి (ఇండోనేసియా) జంటను బోల్తా కొట్టించింది. కేవలం 30 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో రెండో గేమ్‌లో సిక్కి–ధ్రువ్ జోడీ 15–19తో వెనుకబడింది. అయితే ఒక్కసారిగా చెలరేగిన సిక్కి–ధ్రువ్ వరుసగా ఐదు పాయింట్లు గెలిచి 20–19తో ఆధిక్యంలోకి వచ్చారు. ఆ తర్వాత ఒక పాయింట్ కోల్పోయినా... వెంటనే రెండు పాయింట్లు గెలిచి గేమ్‌తోపాటు మ్యాచ్‌ను సొంతం చేసుకున్నారు. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో సుమిత్ రెడ్డి–అశ్విని పొన్నప్ప (భారత్) 15–21, 16–21తో హఫీజ్ ఫైజల్–గ్లోరియా (ఇండోనేసియా) జోడీ చేతిలో... వెంకట్ గౌరవ్ ప్రసాద్–జూహీ దేవాంగన్ (భారత్) 15–21, 12–21తో చాంగ్ తక్ చింగ్–ఎన్జీ వింగ్ యుంగ్ (హాంకాంగ్) చేతిలో ఓడిపోయారు. పురుషుల సింగిల్స్ విభాగంలో భారత ప్లేయర్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మాజీ వరల్డ్ నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్ 21–18, 15–21, 21–16తో క్రిస్టోవ్ పొపోవ్ (ఫ్రాన్స్)పై... హెచ్ఎస్ ప్రణయ్ 22–20, 21–19తో డారెన్ లియు (మలేసియా)పై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరారు. కామన్వెల్త్ గేమ్స్ మాజీ చాంపియన్ పారుపల్లి కశ్యప్ 10–21, 19–21తో హాన్స్ క్రిస్టియన్ విటింగస్ (డెన్మార్క్) చేతిలో... ప్రపంచ 16వ ర్యాంకర్ సాయిప్రణీత్ 21–16, 14–21, 20–22తో హిరెన్ రుస్తావితో (ఇండోనేసియా) చేతిలో ఓడిపోయి తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టారు. -
Sudirman Cup: చైనా చేతిలో ఓటమి.. లీగ్ దశలోనే అవుట్
వాంటా (ఫిన్లాండ్): వరుసగా రెండో పరాజయంతో సుదిర్మన్ కప్ ప్రపంచ మిక్స్డ్ టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ నుంచి భారత్ లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టనుంది. క్వార్టర్ ఫైనల్ ఆశలు సజీవంగా ఉండాలంటే గ్రూప్ ‘ఎ’లో డిఫెండింగ్ చాంపియన్ చైనాపై కచ్చితంగా గెలవాల్సిన భారత జట్టు 0–5తో దారుణంగా ఓడిపోయింది. పురుషుల డబుల్స్‌మ్యాచ్‌లో అర్జున్ –ధ్రువ్ కపిల జంట 20–22, 17–21తో లియు చెంగ్–జౌ హావో డాంగ్ జోడీ చేతిలో ఓడింది. మహిళల సింగిల్స్‌లో అదితి భట్ 9–21, 8–21తో చెన్ యు ఫె చేతిలో... పురుషుల సింగిల్స్‌లో 15వ ర్యాంకర్ సాయి ప్రణీత్ 10–21, 10–21తో షి యుకీ చేతిలో... మహిళల డబుల్స్‌లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప 16–21, 13–21తో జెంగ్ యు–లి వెన్ మె చేతిలో... మిక్స్డ్ డబుల్స్‌లో కిడాంబి శ్రీకాంత్–రితూపర్ణ 9–21, 9–21తో డు యు–ఫెంగ్ యాన్ జె చేతిలో ఓడిపోయారు. చదవండి: Formula 1: హామిల్టన్ ‘విక్టరీల సెంచరీ’.... -
Sudirman Cup: స్టార్ ప్లేయర్లు లేకుండానే.. బరిలో భారత జట్టు
వాంటా (ఫిన్లాండ్): స్టార్ ప్లేయర్లు సింధు, సైనా, సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి గైర్హాజరీలో ప్రతిష్టాత్మక సుదిర్మన్ కప్ ప్రపంచ మిక్స్డ్ టీమ్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత జట్టు తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. గ్రూప్ ‘ఎ’లో డిఫెండింగ్ చాంపియన్ చైనా, థాయ్‌లాండ్, ఫిన్లాండ్ జట్లతో భారత్ ఉంది. ఆదివారం జరిగే తొలి లీగ్ మ్యాచ్‌లో థాయ్‌లాండ్‌తో భారత్ ఆడనుంది. 27న రెండో లీగ్ మ్యాచ్‌లో చైనాతో, 29న మూడో లీగ్ మ్యాచ్‌లో ఫిన్లాండ్తో టీమిండియా తలపడనుంది. భారత్ క్వార్టర్ ఫైనల్ దశ చేరాలంటే రెండు మ్యాచ్‌ల్లో గెలవాల్సి ఉంటుంది. ఇక ప్రతి పోటీలో ఐదు మ్యాచ్‌లు (పురుషుల సింగిల్స్, మహిళల సింగిల్స్, పురుషుల డబుల్స్, మహిళల డబుల్స్, మిక్స్డ్ డబుల్స్) జరుగుతాయి. ఐదింటిలో మూడు మ్యాచ్‌ల్లో గెలిచిన జట్టుకు విజయం ఖరారవుతుంది. భారత్ తరఫున పురుషుల సింగిల్స్ మ్యాచ్‌లో ఒలింపియన్ సాయిప్రణీత్ లేదా మాజీ నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్ బరిలోకి దిగుతారు. మహిళల డబుల్స్‌లో సిక్కి రెడ్డి–అశి్వని పొన్నప్ప జంట... పురుషుల డబుల్స్‌లో అర్జున్–ధ్రువ్ కపిల జోడీ... మహిళల సింగిల్స్‌లో మాళవిక బన్సోద్ లేదా అదితి భట్ ఆడే అవకాశముంది. మిక్స్డ్ డబుల్స్‌లో సిక్కి రెడ్డి/అశ్విని పొన్నప్పలతో ఎవరు జత కడతారో వేచి చూడాలి. ►ఈ టోర్నీ తొలి రోజు మ్యాచ్‌లను మధ్యాహ్నం గం. 12:30 నుంచి స్టార్ స్పోర్ట్స్–3లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. -
ప్రిక్వార్టర్ ఫైనల్లో సిక్కి రెడ్డి–ప్రణవ్ జంట
పారిస్: ఓర్లియాన్స్ మాస్టర్స్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో మిక్స్డ్ డబుల్స్ విభాగంలో సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా (భారత్) జంట ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. తొలి రౌండ్లో సిక్కి రెడ్డి–ప్రణవ్ ద్వయం 21–7, 21–18తో డొమినిక్–సెరెనా (ఆస్ట్రియా) జోడీపై గెలిచింది. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సైనా నెహ్వాల్ 21–9, 21–5తో రాచెల్ (ఐర్లాండ్)పై, ఐరా శర్మ 12–21, 21–14, 21–17తో లియోనైస్ (ఫ్రాన్స్)పై నెగ్గి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరారు. పురుషుల సింగిల్స్ రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో కిడాంబి శ్రీకాంత్ 21–15, 21–10తో భారత్‌కే చెందిన అజయ్ జయరామ్‌పై, కిరణ్ జార్జి 13–21, 21–16, 23–21తో సహచరుడు ప్రణయ్‌పై, చిరాగ్ సేన్ 21–13, 21–12తో చికో వార్దోయో (ఇండోనేసియా)పై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టారు. మరో రెండో రౌండ్ మ్యాచ్‌లో పారుపల్లి కశ్యప్ 7–21, 17–21తో తోమా జూనియర్ పొపోవ్ (ఫ్రాన్స్) చేతిలో ఓడిపోయాడు. -
సిక్కి రెడ్డికి ‘నెగెటివ్’
సాక్షి, హైదరాబాద్: భారత మహిళల డబుల్స్ స్టార్ షట్లర్ నేలకుర్తి సిక్కి రెడ్డికి, బ్యాడ్మింటన్ బృందం ఫిజియోథెరపిస్ట్ చల్లగుండ్ల కిరణ్‌కు ఊరట లభించింది. ఈనెల 7న గచ్చిబౌలిలోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో జాతీయ శిక్షణ శిబిరం ప్రారంభమైన సందర్భంగా భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) నిబంధనల ప్రకారం శిబిరంతో సంబంధమున్న క్రీడాకారులకు, కోచ్‌లకు, సహాయక సిబ్బందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఇందులో సిక్కి రెడ్డి, కిరణ్‌లకు కరోనా పాజిటివ్ రాగా... ఇతరులకు నెగెటివ్ వచ్చింది. అయితే పాజిటివ్ వచ్చిన సిక్కి రెడ్డి, కిరణ్‌లో కరోనా లక్షణాలు లేకపోవడంతో శుక్రవారం మళ్లీ స్థానిక కార్పొరేట్ ఆసుపత్రిలో శిబిరంతో సంబంధమున్న వారందరూ కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఈసారి సిక్కి రెడ్డి, కిరణ్‌లకు కరోనా ‘నెగెటివ్’ ఫలితం వచ్చింది. -
కరోనా బారిన షట్లర్ సిక్కి రెడ్డి
సాక్షి, హైదరాబాద్: దాదాపు ఐదు నెలల విరామం తర్వాత... ఈనెల 7న మొదలైన జాతీయ బ్యాడ్మింటన్ శిక్షణ శిబిరానికి కరోనా వైరస్ కారణంగా ఆదిలోనే అంతరాయం ఏర్పడింది. గచ్చిబౌలిలోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో జరుగుతున్న ఈ శిబిరంలో పాల్గొంటున్న మహిళల డబుల్స్ స్టార్ షట్లర్ నేలకుర్తి సిక్కి రెడ్డి, ఫిజియోథెరపిస్ట్ చల్లగుండ్ల కిరణ్ కరోనా వైరస్ బారిన పడ్డారు. భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) కచ్చితమైన నిబంధనల ప్రకారం శిబిరంలో పాల్గొంటున్న క్రీడాకారులు, కోచ్‌లు, సహాయక సిబ్బందికి కలిపి మొత్తం 20 మందికి మంగళవారం కోవిడ్–19 పరీక్షలు నిర్వహించారు. ఇందులో ప్రపంచ చాంపియన్ పీవీ సింధు, ఆమె తండ్రి పీవీ రమణ, చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్, సాయిప్రణీత్, కిడాంబి శ్రీకాంత్ సహా 18 మందికి నెగెటివ్ ఫలితం రాగా... సిక్కి రెడ్డి, ఫిజియోథెరపిస్ట్ కిరణ్‌లకు కరోనా పాజిటివ్ తేలిందని భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) ఒక ప్రకటనలో తెలిపింది. అయితే వీరిద్దరికీ ఎలాంటి లక్షణాలు లేవని ‘బాయ్’ వివరించింది. శానిటైజ్ చేసేందుకు అకాడమీని తాత్కాలికంగా మూసివేశారు. మంగళవారం కరోనా పరీక్షలకు హాజరైన వారందరూ శుక్రవారం స్థానిక కార్పొరేట్ ఆసుపత్రిలో మరోసారి కోవిడ్ టెస్టులు చేయించుకుంటారని తెలిసింది. సిక్కి రెడ్డి, కిరణ్ ప్రైమరీ కాంటాక్ట్‌లను గుర్తించి వారందరికీ ఆర్టీ–పీసీఆర్ పరీక్ష చేయనున్నారు. ‘భారత స్పోర్ట్స్ అథారిటీ నిబంధనల ప్రకారం జాతీయ శిక్షణ శిబిరంతో సంబంధం ఉన్న క్రీడాకారులకు, కోచ్‌లకు, సహాయ సిబ్బందికి, కార్యాలయ సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇందులో ఇద్దరికి పాజిటివ్ వచ్చింది. కోచింగ్ క్యాంప్ మళ్లీ సజావుగా సాగేందుకు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాం. సాధ్యమైనంత త్వరలో మళ్లీ శిబిరం ప్రారంభమవుతుందని ఆశిస్తున్నాం’ అని జాతీయ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ వ్యాఖ్యానించారు. -
షట్లర్లకు ఐఓసీ పరీక్షలు
న్యూఢిల్లీ: ఆటలన్నీ అటకెక్కాయి. లాక్‌డౌనే ముందంజ (పొడిగింపు) వేస్తోంది. స్టేడియాలు మూతపడ్డాయి. రాకెట్స్ ఓ మూలన పడ్డాయి. ఆటగాళ్లు గడపదాటే పరిస్థితి లేదాయే! దీంతో క్రీడల కోటాలో ఉద్యోగాలిచ్చిన సంస్థలు తమ ఆటగాళ్లకు ఆన్లైన్ పరీక్షలు పెడుతున్నాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) సంస్థ బ్యాడ్మింటన్ ఆటగాళ్లు ఈ ఖాళీ సమయంలో ఆన్లైన్లో కోర్సు చదివి పరీక్షలు రాయాల్సిందిగా కోరింది. సైబర్ సెక్యూరిటీ, ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్, ప్రొడక్ట్ మెయింటెనెన్స్ తదితర కోర్సులు చదివి (ఆన్లైన్లో) అసెస్మెంట్ పరీక్షలు రాయాలని సూచించింది. 2018 కామన్వెల్త్ గేమ్స్‌లో మహిళల డబుల్స్ కాంస్య పతక విజేత సిక్కి రెడ్డి, సింగిల్స్ ఆటగాడు పారుపల్లి కశ్యప్, డబుల్స్ ప్లేయర్ చిరాగ్ షెట్టి తదితరులు ఐఓసీ సూచించిన అసెస్మెంట్ టెస్టులు రాసే పనిలో పడ్డారు. దీనిపై తెలుగమ్మాయి సిక్కి రెడ్డి మాట్లాడుతూ ‘మాకు కొన్ని కోర్సులు చదివి ఆన్లైన్లో పరీక్షలు రాయాలని ఐఓసీ మెయిల్ చేసింది. నిజంగా ఈ కోర్సులు చాలా ఆసక్తిగా, ఉపయోగకరంగా ఉన్నాయి. రాకెట్‌తో కసరత్తు, ఫిట్నెస్ కోసం వార్మప్ చేసే నేను ఇప్పుడైతే కోర్సు పూర్తిచేసే పనిలో ఉన్నాను. ఈ నెల 4న కోర్సు మొదలుపెట్టాను. ఇందులో సుమారు 40 నుంచి 50 టాపిక్స్ ఉంటాయి. కొన్ని 15 నిమిషాల్లో పూర్తయితే మరికొన్నింటికి 45 నిమిషాలు పడుతుంది. ఆ వెంటే పరీక్షలు కూడా రాయాలి. ఇందులో పాస్ కావాలంటే 80 శాతం మార్కులు రావాలి’ అని వివరించింది. 2014 కామన్వెల్త్ గేమ్స్ చాంపియన్ కశ్యప్ మాట్లాడుతూ ‘ఈ కోర్సు మెటీరియల్ చదివి తీరాలన్నంతగా ఆసక్తిగా ఉంది. ఐఓసీ కంపెనీ చేసే ప్రాసెసింగ్‌పై మాకు అవగాహన కల్పించేలా ఉంది. ఇంధన వనరుల ఉత్పాదకత, దీనికోసం తీసుకునే భద్రత చర్యలు, పెట్రోల్ బంకుల నిర్వహణ తీరు తెలిసింది. ఈ కోర్సుల ఆలోచన చాలా మంచి నిర్ణయం. పూర్తిస్థాయి అథ్లెట్లమైన మాకు ఇది తెలిసేది కాదు. కానీ ఇప్పుడు లాక్డౌన్ వల్ల తెలియని విషయాలు నేర్చుకునే వీలు దొరికింది’ అని అన్నాడు. చిరాగ్ షెట్టి కూడా కోర్సులోని పాఠ్యప్రణాళిక, ఆన్లైన్ పరీక్షలు చాలా బాగున్నాయని చెప్పాడు. మహ మ్మారి విలయతాండవంతో ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) అన్ని టోర్నీలను జూలై వరకు రద్దు చేసింది. -
ఈసారైనా సాధించేనా!
గతేడాది విశ్వ విజేతగా అవతరించి అందరిచేతా శభాష్ అనిపించుకోవడంతోపాటు విమర్శకుల నోళ్లు మూయించిన తెలుగు తేజం, భారత స్టార్ షట్లర్ పూసర్ల వెంకట (పీవీ) సింధు కొత్త ఏడాదిలో తొలి టైటిల్ కోసం వేట మొదలు పెట్టనుంది. బ్యాడ్మింటన్‌లో అతి పురాతనమైన, అత్యంత ప్రతిష్టాత్మక టోర్నీగా భావించే ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ టోర్నమెంట్లో టైటిల్ నెగ్గడమే లక్ష్యంగా 24 ఏళ్ల సింధు బరిలోకి దిగనుంది. ఈ సీజన్లో మలేసియా మాస్టర్స్, ఇండోనేసియా మాస్టర్స్ టోర్నీల్లో ఆడిన ఈ ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి క్వార్టర్ ఫైనల్ అడ్డంకిని దాటలేకపోయింది. ఈ రెండు టోర్నీల తర్వాత దాదాపు 50 రోజుల విరామం లభించడంతో సింధు ఆల్ ఇంగ్లండ్ ఓపెన్‌కు పకడ్బందీగా సిద్ధమైంది. కోవిడ్–19 వైరస్ నేపథ్యంలో పలువురు సహచర క్రీడాకారులు ఈ టోర్నీ నుంచి వైదొలిగినా సింధు మాత్రం ఆల్ ఇంగ్లండ్ ఓపెన్‌కు సమాయత్తమయింది. సింధుతోపాటు మాజీ రన్నరప్ సైనా నెహ్వాల్... పురుషుల సింగిల్స్‌లో మాజీ నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్, సాయిప్రణీత్, పారుపల్లి కశ్యప్ ఈ మెగా టోర్నమెంట్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. బర్మింగ్‌హామ్: పద్దెనిమిదేళ్లుగా భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులను ఊరిస్తోన్న ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ టైటిల్‌ను సాధించాలనే తపనతో మరోసారి మనోళ్లు సమాయత్తమయ్యారు. నేటి నుంచి మొదలయ్యే ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 టోర్నమెంట్లో సింధుతోపాటు సైనా, శ్రీకాంత్, సాయిప్రణీత్, కశ్యప్, లక్ష్య సేన్ సింగిల్స్ బరిలో ఉన్నారు. ముందుగా ఎంట్రీలు పంపించినా... కోవిడ్–19 వైరస్ నేపథ్యంలో ఏడుగురు భారత ఆటగాళ్లు (సింగిల్స్‌లో ప్రణయ్, సమీర్ వర్మ, సౌరభ్ వర్మ; డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి; సుమీత్ రెడ్డి–మనూ అత్రి జోడీలు) ఈ టోర్నీ నుంచి వైదొలిగారు. శతాబ్దంకంటే ఎక్కువ చరిత్ర ఉన్న ఈ టోర్నీలో భారత్ నుంచి ఇద్దరు మాత్రమే చాంపియన్స్‌గా నిలిచారు. ప్రకాశ్ పదుకొనే (1980లో), పుల్లెల గోపీచంద్ (2001లో) ఈ ఘనత వహించారు. 2001 తర్వాత 2015లో సైనా నెహ్వాల్ మాత్రమే ఒకసారి ఫైనల్‌కు చేరుకొని తుది మెట్టుపై తడబడి రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకుంది. తొలి రౌండ్లోనే... 110వ సారి నిర్వహిస్తున్న ఈ టోర్నీలో ఈసారి భారత క్రీడాకారులకు క్లిష్టమైన ‘డ్రా’ ఎదురైంది. మహిళల సింగిల్స్‌లో ప్రపంచ చాంపియన్ పీవీ సింధు తొలి రౌండ్లో చైనా సంతతికి చెందిన అమెరికా ప్లేయర్ బీవెన్ జాంగ్‌తో... ప్రపంచ మూడో ర్యాంకర్ అకానె యామగుచి (జపాన్)తో సైనా నెహ్వాల్ తలపడనున్నారు. గెలుపోటముల ముఖాముఖి రికార్డులో సింధు 5–4తో ఆధిక్యంలో ఉండగా... సైనా మాత్రం 2–8తో వెనుకబడి ఉంది. ఒకవేళ సింధు, సైనా తొలి రౌండ్ అడ్డంకి దాటినా తర్వాత రౌండ్లలో వీరిద్దరికి క్లిష్టమైన ప్రత్యర్థులే ఎదురుకానున్నారు. సింధు తొలి రౌండ్లో గెలిస్తే ప్రిక్వార్టర్ ఫైనల్లో సుంగ్ జీ హున్ (కొరియా) లేదా నిచావోన్ జిందాపోల్ (థాయ్‌లాండ్) ఎదురుపడతారు. ఇందులోనూ గెలిస్తే క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ మాజీ చాంపియన్ నొజోమి ఒకుహారాతో సింధు ఆడే అవకాశం ఉంటుంది. సెమీఫైనల్లో వరల్డ్ నంబర్‌వన్ చెన్ యుఫె (చైనా) లేదా ప్రపంచ మాజీ చాంపియన్ రచనోక్ (థాయ్‌లాండ్) సింధుకు ఎదురుకావొచ్చు. మరోవైపు సైనా తొలి రౌండ్‌ను దాటితే ప్రిక్వార్టర్ ఫైనల్లో సయాక తకహాషి (జపాన్), క్వార్టర్ ఫైనల్లో రియో ఒలింపిక్స్ చాంపియన్ కరోలినా మారిన్ (స్పెయిన్)... సెమీఫైనల్లో రెండో సీడ్ తై జు యింగ్ (చైనీస్ తైపీ) లేదా ఏడో సీడ్ హి బింగ్జియావో (చైనా) ప్రత్యర్థులుగా ఉంటారు. ఈ నేపథ్యంలో ఈసారైనా సింధు, సైనా అద్భుతం చేస్తారో లేదో వేచి చూడాలి. శ్రీకాంత్ గాడిలో పడేనా! కొంతకాలంగా ఫామ్ కోల్పోయి తడబడుతోన్న ప్రపంచ మాజీ నంబర్‌వన్, ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్‌కు తొలి రౌండ్లోనే రియో ఒలింపిక్స్ చాంపియన్ చెన్ లాంగ్ (చైనా) ఎదురుకానున్నాడు. ఈ ఏడాది శ్రీకాంత్ నాలుగు టోర్నీలు ఆడగా మూడింటిలో తొలి రౌండ్లోనే ఓడిపోయి, మరో టోర్నీలో ప్రిక్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించాడు. గతేడాది ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం నెగ్గిన భమి డిపాటి సాయిప్రణీత్ తొలి రౌండ్లో జావో జున్‌పెంగ్ (చైనా)తో... లీ చెయుక్ యియు (హాంకాంగ్)తో లక్ష్య సేన్... రుస్తావిటో (ఇండోనేసియా)తో కశ్యప్ తలపడనున్నారు. మొత్తం 11 లక్షల డాలర్ల ప్రైజ్‌మనీతో నిర్వహిస్తున్న ఈ టోర్నీలో పురుషుల, మహిళల సింగిల్స్ విభాగాల్లో విజేతలుగా నిలిచిన వారికి 77 వేల డాలర్ల చొప్పున (రూ. 57 లక్షలు) అందజేస్తారు. పురుషుల డబుల్స్‌లో ఈసారి భారత్ నుంచి ప్రాతినిధ్యం లేకుండా పోయింది. మహిళల డబుల్స్‌లో నేలకుర్తి సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప; దండు పూజ–సంజన సంతోష్ జోడీలు... మిక్స్డ్ డబుల్స్‌లో సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా జంట బరిలో ఉన్నాయి. అశ్విని, సిక్కి రెడ్డి, ప్రణవ్ చోప్రా, లక్ష్య సేన్ ►1900 ఆల్ ఇంగ్లండ్ టోర్నీ ప్రారంభమైన ఏడాది. తొలి, రెండో ప్రపంచ యుద్ధ సమయాల్లో మినహా మిగతా సంవత్సరాలలో ఈ టోర్నీ కొనసాగింది. ►2 ఆల్ ఇంగ్లండ్ ఓపెన్‌లో అత్యధిక టైటిల్స్ నెగ్గిన దేశాల సంఖ్య. చైనా, డెన్మార్క్ ఆటగాళ్లు 20 సార్లు చొప్పున ఈ టోర్నీలో విజేతగా నిలిచారు. ►1 ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ టైటిల్‌ను అత్యధికసార్లు గెలిచిన ప్లేయర్ రూడీ హర్తానో. ఇండోనేసియాకు చెందిన రూడీ హర్తానో ఓవరాల్‌గా ఎనిమిదిసార్లు విజేతగా నిలువగా... 1968 నుంచి 1974 వరకు వరుసగా ఏడేళ్లు టైటిల్ గెలిచాడు. ►7 ఇప్పటివరకు సింధు ఏడుసార్లు ఆల్ ఇంగ్లండ్ టోర్నీలో ఆడింది. 2018లో సెమీఫైనల్ చేరడమే ఆమె అత్యుత్తమ ప్రదర్శన. 2017లో క్వార్టర్ ఫైనల్ చేరిన సింధు నాలుగుసార్లు (2012, 2014, 2016, 2019) తొలి రౌండ్లో, ఒకసారి రెండో రౌండ్లో (2013) ఓడిపోయింది. ►14 ఆల్ ఇంగ్లండ్ టోర్నీలో సైనా ఆడనుండటం ఇది వరుసగా 14వ ఏడాది. 2007 నుంచి ఈ టోర్నీలో ఆడుతున్న సైనా ఒకసారి ఫైనల్, రెండుlసార్లు సెమీస్, ఆరుసార్లు క్వార్టర్ ఫైనల్ చేరింది. -
బెంగళూరు రాప్టర్స్దే పీబీఎల్ టైటిల్
సాక్షి, హైదరాబాద్: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) చరిత్రలో టైటిల్ నిలబెట్టుకున్న తొలి జట్టుగా బెంగళూరు రాప్టర్స్ జట్టు నిలిచింది. గచ్చి బౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో ఆదివారం జరిగిన టైటిల్ పోరులో డిఫెండింగ్ చాంపియన్ బెంగళూరు రాప్టర్స్ జట్టు 4–2తో తొలిసారి ఫైనల్ చేరిన నార్త్ ఈస్టర్న్ వారియర్స్ జట్టును ఓడించింది. తొలి పురుషుల సింగిల్స్ మ్యాచ్‌లో తెలుగు తేజం భమిడిపాటి సాయిప్రణీత్ 14–15, 15–9, 15–3తో లీ చెయుక్ యియు (వారియర్స్)పై నెగ్గి బెంగళూరుకు 1–0 ఆధిక్యాన్ని అందించాడు. ఆ తర్వాత పురుషుల డబుల్స్ మ్యాచ్‌లో బొదిన్ ఇసారా–లీ యోంగ్ డే (వారియర్స్) జంట 15–11, 13–15, 15–14తో అరుణ్ జార్జి–రియాన్ అగుంగ్ సపుత్రో (బెంగళూరు) జోడీపై గెలిచింది. ఈ మ్యాచ్‌ను వారియర్స్ ‘ట్రంప్’గా ఎంచుకోవడంతో ఆ జట్టు 2–1తో ఆధిక్యంలోకి వెళ్లింది. మూడో మ్యాచ్‌గా జరిగిన మహిళల సింగిల్స్‌లో తై జు యింగ్ (బెంగళూరు) 15–9, 15–12తో మిచెల్లి లీని ఓడించింది. దాంతో స్కోరు 2–2తో సమమైంది. నాలుగో మ్యాచ్‌గా జరిగిన మిక్స్డ్ డబుల్స్‌లో చాన్ పెంగ్ సూన్–ఎమ్ హై వన్ (బెంగళూరు) ద్వయం 15–14, 14–15, 15–12తో గారగ కృష్ణప్రసాద్–కిమ్ హా నా (వారియర్స్) జోడీపై నెగ్గింది. ఈ మ్యాచ్‌ను బెంగళూరు ‘ట్రంప్’గా ఎంచుకోవడంతో ఆ జట్టు 4–2తో ఆధిక్యంలోకి వెళ్లి విజయాన్ని ఖాయం చేసుకుంది. చివరిదైన ఐదో మ్యాచ్‌లో నార్త్ ఈస్టర్న్ వారియర్స్ జట్టు గెలిచినా తుది ఫలితం మారే అవకాశం లేకపోవడంతో దానిని నిర్వహించలేదు. విజేత బెంగళూరు జట్టుకు ట్రోఫీతోపాటు రూ. 3 కోట్లు ప్రైజ్‌మనీగా లభించాయి. రన్నరప్ నార్త్ ఈస్టర్న్ వారియర్స్ జట్టుకు రూ. కోటీ 50 లక్షలు... సెమీఫైనల్స్‌లో ఓడిన పుణే సెవెన్ ఏసెస్, చెన్నై సూపర్ స్టార్స్ జట్లకు రూ. 75 లక్షల చొప్పున ప్రైజ్‌మనీ దక్కింది. లీగ్ దశలో నిలకడగా ఆడిన హైదరాబాద్ హంటర్స్ క్రీడాకారిణి నేలకుర్తి సిక్కి రెడ్డికి ‘ఇండియన్ ప్లేయర్ ఆఫ్ ద లీగ్’ పురస్కారం లభించింది. తై జు యింగ్ ‘ప్లేయర్ ఆఫ్ ద లీగ్’ అవార్డు సొంతం చేసుకుంది. హైదరాబాద్ హంటర్స్‌కే చెందిన ప్రియాన్షు రజావత్‌కు ‘ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద లీగ్’ అవార్డు దక్కింది. -
విజేత సౌరభ్ వర్మ
సాక్షి, హైదరాబాద్: జాతీయ చాంపియన్ సౌరభ్ వర్మ ఈ ఏడాది రెండో అంతర్జాతీయ సింగిల్స్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో ఆదివారం ముగిసిన హైదరాబాద్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–100 టోర్నమెంట్లో సౌరభ్ వర్మ పురుషుల సింగిల్స్ విభాగంలో చాంపియన్‌గా నిలిచాడు. 52 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో సౌరభ్ వర్మ 21–13, 14–21, 21–16తో లో కీన్ యె (సింగపూర్)పై విజయం సాధించాడు. మేలో సౌరభ్ వర్మ స్లొవేనియా ఇంటర్నేషనల్ చాలెంజ్ టోర్నీలోనూ విజేతగా నిలిచాడు. ‘ఈ టోర్నీలో నా ప్రదర్శన పట్ల చాలా సంతృప్తిగా ఉన్నాను. పలు హోరాహోరీ మ్యాచ్‌ల్లో విజయాన్ని అందుకున్నాను. ఫైనల్లో తొలి గేమ్ గెలిచాక రెండో గేమ్‌లో ఆధిక్యంలో ఉన్న దశలో ఏకాగ్రత కోల్పోయాను. తొందరగా మ్యాచ్‌ను ముగించాలనే ఉద్దేశంతో అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకున్నాను. అయితే నిర్ణాయక మూడో గేమ్‌లో మళ్లీ వ్యూహం మార్చి ప్రత్యర్థిపై పైచేయి సాధించాను’ అని మధ్యప్రదేశ్‌కు చెందిన 26 ఏళ్ల సౌరభ్ వర్మ వ్యాఖ్యానించాడు. విజేతగా నిలిచిన సౌరభ్ వర్మకు 5,625 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 3 లక్షల 98 వేలు)తోపాటు 5,500 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. మహిళల డబుల్స్ విభాగంలో టాప్ సీడ్ నేలకుర్తి సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప (భారత్) జంటకు నిరాశ ఎదురైంది. బేక్ హా నా–జుంగ్ క్యుంగ్ యున్ (దక్షిణ కొరియా) జోడీతో జరిగిన ఫైనల్లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప ద్వయం 17–21, 17–21తో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచింది. రన్నరప్‌గా నిలిచిన సిక్కి–అశ్విని జోడీకి 2,850 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 2 లక్షలు)తోపాటు 4,680 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
టైటిల్ పోరులో సిక్కి–అశ్విని జంట
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది తొలి అంతర్జాతీయ డబుల్స్ టైటిల్ సాధించేందుకు నేలకుర్తి సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప (భారత్) జంట విజయం దూరంలో నిలిచింది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న హైదరాబాద్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–100 టోర్నమెంట్లో మహిళల డబుల్స్ విభాగంలో టాప్ సీడ్ సిక్కి రెడ్డి–అశ్విని ద్వయం ఫైనల్లోకి అడుగు పెట్టింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో సిక్కి–అశ్విని జంట 21–12, 21–12తో ఫాన్ కా యాన్–వు యి టింగ్ (హాంకాంగ్) ద్వయంపై విజయం సాధించింది. నేడు జరిగే ఫైనల్లో బేక్ హా నా–జుంగ్ క్యుంగ్ యున్ (దక్షిణ కొరియా) జోడీతో సిక్కి–అశ్విని జంట తలపడుతుంది. ఫైనల్లో సౌరభ్... పురుషుల సింగిల్స్ విభాగంలో భారత జాతీయ చాంపియన్ సౌరభ్ వర్మ టైటిల్ పోరుకు అర్హత సాధించాడు. సెమీఫైనల్లో ఏడో సీడ్ సౌరభ్ 23–21, 21–16తో ఇస్కందర్ జుల్కర్నైన్ (మలేసియా)పై గెలిచాడు. నేడు జరిగే ఫైనల్లో లో కీన్ యె (సింగపూర్)తో సౌరభ్ తలపడతాడు. -
సెమీస్‌లో సిక్కి రెడ్డి–అశ్విని జోడీ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–100 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో నేలకుర్తి సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప (భారత్) ద్వయం సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో శుక్రవారం జరిగిన మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ సిక్కి రెడ్డి–అశ్విని జంట 21–16, 21–15తో ఎనిమిదో సీడ్ జక్కంపూడి మేఘన–పూర్వీషా రామ్ (భారత్) జోడీపై విజయం సాధించింది. పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో రెండో సీడ్ సుమీత్ రెడ్డి–మను అత్రి (భారత్) జోడీ 21–19, 11–21, 17–21తో నా సుంగ్ సెయుంగ్–వాంగ్ చాన్ (దక్షిణ కొరియా) జంట చేతిలో... శ్లోక్ రామచంద్రన్–అర్జున్ (భారత్) ద్వయం 19–21, 9–21తో లీ జె హుయ్–యాంగ్ పు సువాన్ (చైనీస్ తైపీ) జంట చేతిలో ఓడిపోయాయి. సౌరభ్ వర్మ ముందంజ... పురుషుల సింగిల్స్‌లో భారత ఆటగాళ్లకు మిశ్రమ ఫలితాలు లభించాయి. జాతీయ చాంపియన్ సౌరభ్ వర్మ సెమీఫైనల్‌కు చేరుకోగా... ఐదో సీడ్ శుభాంకర్ డే పోరాటం ముగిసింది. క్వార్టర్ ఫైనల్స్‌లో సౌరభ్ వర్మ 21–18, 21–9తో భారత్‌కే చెందిన అజయ్ జయరామ్‌పై నెగ్గగా... శుభాంకర్ డే 11–21, 16–21తో లో కీన్ యె (సింగపూర్) చేతిలో ఓడిపోయాడు. -
ప్రిక్వార్టర్స్‌లో అశ్విని–సిక్కి రెడ్డి జంట
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–100 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో టాప్ సీడ్ అశ్విని పొన్నప్ప–సిక్కి రెడ్డి, ఎనిమిదో సీడ్ మేఘన జక్కంపూడి–పూర్వీషా రామ్ జోడీలు శుభారంభం చేశాయి. గచ్చిబౌలిలోని పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో జరుగుతోన్న ఈ టోర్నీలో మహిళల డబుల్స్ విభాగంలో ఈ జంటలు ప్రిక్వార్టర్స్‌కు చేరుకున్నాయి. బుధవారం మహిళల డబుల్స్ తొలి రౌండ్లో టాప్‌సీడ్ అశ్విని–సిక్కి రెడ్డి ద్వయం 21–13, 13–21, 21–16తో తాన్ పెర్లీ కూంగ్‌లీ–మురళీథరన్ థినా (మలేసియా) జోడీపై గెలుపొందగా... మేఘన–పూర్వీషా జంట 21–10, 21–6తో అన్ను ధన్కర్–అనుభా కౌశిక్ (భారత్) జోడీని సులువుగా ఓడించింది. పురుషుల డబుల్స్‌లో ప్రణవ్ చోప్రా–రోహన్ కపూర్ జంట తొలి రౌండ్లోనే పరాజయం పాలైంది. అర్జున్–శ్లోక్ ద్వయం ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో ఏడో సీడ్ ప్రణవ్ చోప్రా–రోహన్ కపూర్ ద్వయం 18–21, 21–13, 14–21తో షోహిబుల్ ఫక్రీ–బగాస్ మౌలానా (ఇండోనేసియా) జోడీ చేతిలో ఓడిపోయింది. ఎనిమిదో సీడ్ అర్జున్–శ్లోక్ (భారత్) జంట 21–11, 21–8తో గౌరవ్–దీపక్ ఖత్రి (భారత్) జోడీపై గెలుపొంది ముందంజ వేసింది. ఇతర తొలిరౌండ్ మ్యాచ్‌ల్లో వైభవ్–ప్రకాశ్ రాజ్ (భారత్) జంట 21–18, 17–21, 21–18తో అమర్– ముహమ్మద్ అమీర్ (మలేసియా) జోడీపై, విఘ్నేశ్–దీప్ (భారత్) ద్వయం 21–14, 21–19తో సెంథిల్ గోవింద్– రెహాన్ (భారత్) జోడీపై గెలుపొందాయి. మహిళల డబుల్స్ తొలిరౌండ్ ఫలితాలు: నాలుగో సీడ్ వింగ్ యుంగ్–యెంగ్ టింగ్ (హాంకాంగ్) ద్వయం 21–10, 21–13తో రియా ముఖర్జీ–అనురా ప్రభుదేశాయ్ (భారత్) జోడీపై, పూజ దండు–సంజన సంతోష్ (భారత్) ద్వయం 1–0తో రుతుపర్ణ–ఆరతి (భారత్) జోడీపై, గావో జి యావో–పెంగ్ కిన్ (చైనా) ద్వయం 21–15, 21–16తో కుహూ గార్గ్–అనౌష్క పరీఖ్ (భారత్) జంటపై గెలుపొంది ముందంజ వేశాయి. -
సిక్కి రెడ్డి జంటకు మిశ్రమ ఫలితాలు
జకార్తా : ప్రతిష్టాత్మక ఇండోనేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ డబుల్స్ విభాగంలో భారత జోడీలకు మిశ్రమ ఫలితాలు లభించాయి. మిక్స్డ్ డబుల్స్‌లో తెలంగాణ ప్లేయర్ నేలకుర్తి సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా (భారత్) జంట... పురుషుల డబుల్స్‌లో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) ద్వయం ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరాయి. మహిళల డబుల్స్‌లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప (భారత్) జంట తొలి రౌండ్లోనే నిష్క్రమించింది. మంగళవారం మొదలైన ఈ టోర్నీలో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప ద్వయం 20–22, 22–20, 20–22తో వివియన్ హూ–యాప్ చెంగ్ వెన్ (మలేసియా) జంట చేతిలో పోరాడి ఓడింది. 75 నిమిషాలపాటు జరిగిన ఈ హోరాహోరీ మ్యాచ్‌లో మూడో గేమ్‌లో సిక్కి ద్వయం 20–19తో విజయానికి పాయింట్ దూరంలో నిలిచింది. అయితే మలేసియా జోడీ మ్యాచ్ పాయింట్ కాపాడుకోవడంతోపాటు వరుసగా మూడు పాయింట్లు గెలిచి విజయాన్ని ఖాయం చేసుకుంది. మిక్స్డ్ డబుల్స్ మ్యాచ్‌లో సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా జోడీ 25–23, 16–21, 21–19తో రాబిన్ తబెలింగ్–సెలెనా పీక్ (నెదర్లాండ్స్) జంటపై కష్టపడి గెలిచింది. 63 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో భారత జంట తొలి గేమ్‌లో 16–20తో వెనుకబడింది. ఈ కీలకదశలో ఒత్తిడికి లోనుకాకుండా ఆడిన సిక్కి–ప్రణవ్ వరుసగా నాలుగు పాయింట్లు సాధించి స్కోరును 20–20తో సమం చేశారు. ఆ తర్వాత ఆధిక్యం దోబూచులాడినా చివరకు సిక్కి జోడీదే పైచేయిగా నిలిచింది. రెండో గేమ్‌లో తడబడిన భారత జంట నిర్ణాయక మూడో గేమ్‌లో 14–18తో వెనుకంజలో నిలిచింది. మరోసారి భారత ద్వయం సంయమనంతో ఆడి వరుసగా ఆరు పాయింట్లు గెలిచి 20–18తో ఆధిక్యంలోకి వచ్చింది. ఆ తర్వాత మరో పాయింట్ చేజార్చుకున్నా... వెంటనే మరో పాయింట్ గెలిచి గేమ్‌తోపాటు మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. పురుషుల డబుల్స్ మ్యాచ్‌లో సాత్విక్–చిరాగ్ శెట్టి జోడీ 21–19, 18–21, 21–19తో గో సె ఫె–నూర్ ఇజుద్దీన్ (మలేసియా) జంటను ఓడించింది. నేడు జరిగే సింగిల్స్ మ్యాచ్‌ల్లో భారత స్టార్స్ పీవీ సింధు, శ్రీకాంత్, సాయిప్రణీత్, ప్రణయ్... పురుషుల డబుల్స్‌లో సుమీత్ రెడ్డి–మను అత్రి జోడీ... మిక్స్డ్ డబుల్స్‌లో సాత్విక్ –అశ్విని జంట బరిలోకి దిగనున్నాయి. అయా ఒహోరి (జపాన్)తో సింధు; నిషిమోటో (జపాన్)తో శ్రీకాంత్; వోంగ్ వింగ్ కి విన్సెంట్ (హాంకాంగ్)తో సాయిప్రణీత్; షి యుకి (చైనా)తో ప్రణయ్ తలపడతారు. మిన్ చున్– హెంగ్ (చైనీస్ తైపీ)లతో సుమీత్–మను అత్రి; తొంతోవి అహ్మద్–విన్నీ కాండో (ఇండోనేసియా)లతో సాత్విక్–అశ్విని ఆడతారు. (ఉదయం 8 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం) -
సిక్కి–అశ్విని జంట శుభారంభం
నేడు జరిగే పురుషుల సింగిల్స్ మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో థమాసిన్ (థాయ్‌లాండ్)తో గురుసాయిదత్; వోంగ్ వింగ్ కి విన్సెంట్ (హాంకాంగ్)తో శ్రీకాంత్; కార్తికేయ్ (భారత్)తో సాయిప్రణీత్; లీ చెయుక్ యియు (హాంకాంగ్)తో పారుపల్లి కశ్యప్; జాన్ జార్గెన్‌సన్ (డెన్మార్క్)తో రాహుల్ యాదవ్ తలపడతారు. మహిళల సింగిల్స్ మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో చనాన్‌చిదా జుచారోయెన్ (థాయ్‌లాండ్)తో గుమ్మడి వృశాలి; ఇంతనోన్ రచనోక్ (థాయ్‌లాండ్)తో చుక్కా సాయిఉత్తేజిత రావు; హి బింగ్జియావో (చైనా)తో ప్రాషి జోషి; ముగ్ధా ఆగ్రేతో పీవీ సింధు ఆడతారు. న్యూఢిల్లీ: సొంతగడ్డపై భారత మహిళల డబుల్స్ నంబర్‌వన్ జంట నేలకుర్తి సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప అద్భుత ప్రదర్శన చేసింది. మంగళవారం మొదలైన ఇండియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నమెంట్లో సంచలన విజయంతో శుభారంభం చేసింది. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో సిక్కి– అశ్విని ద్వయం 22–20, 21–19తో ఆరో సీడ్, ప్రపంచ 18వ ర్యాంక్ జోడీ లి వెన్మె–జెంగ్ యు (చైనా)పై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఇతర డబుల్స్ మ్యాచ్‌ల్లో రాచపల్లి లీలాలక్ష్మి–వర్ష బేలవాడి (భారత్) ద్వయం 2–21, 7–21తో కితితారకుల్–రవింద (థాయ్‌లాండ్) జోడీ చేతిలో... జక్కంపూడి మేఘన–పూర్వీషా రామ్ (భారత్) జంట 16–21, 19–21తో లైసువాన్–మింగ్‌చువా (థాయ్‌లాండ్) జోడీ చేతిలో ఓడిపోయాయి. మెయిన్ ‘డ్రా’కు రాహుల్ యాదవ్, ప్రాషి ఊహించినట్టే క్వాలిఫయింగ్ విభాగంలో ఆతిథ్య భారత క్రీడాకారులు ఆధిపత్యాన్ని చాటుకున్నారు. పురుషుల సింగిల్స్, మహిళల సింగిల్స్‌లలో అందుబాటులో ఉన్న మొత్తం ఎనిమిది బెర్త్‌లను భారత క్రీడాకారులే సంపాదించడం విశేషం. పురుషుల డబుల్స్‌లో నాలుగు, మహిళల డబుల్స్‌లో మూడు, మిక్స్డ్ డబుల్స్‌లో మరో మూడు బెర్త్‌లు భారత్ ఖాతాలోకే వచ్చాయి. పురుషుల సింగిల్స్‌లో హైదరాబాద్ ఆటగాడు చిట్టబోయిన రాహుల్ యాదవ్‌తోపాటు కార్తీక్ జిందాల్, సిద్ధార్థ్ ఠాకూర్, కార్తికేయ్ గుల్షన్ కుమార్ మెయిన్ ‘డ్రా’కు అర్హత పొందారు. క్వాలిఫయింగ్‌లో రాహుల్ తొలి మ్యాచ్‌లో 21–11, 21–12తో రేపూడి అనీత్ కుమార్ (భారత్)పై, రెండో మ్యాచ్‌లో 21–14, 21–15తో అనంత్ శివం జిందాల్ (భారత్)పై గెలుపొందాడు. ఇతర రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో సిద్ధార్థ్ ఠాకూర్ 21–6, 21–13తో గుర్ప్రతాప్ సింగ్ (భారత్)పై, కార్తీక్ 21–12, 21–23, 21–19తో దున్నా శరత్ (భారత్)పై, కార్తికేయ్ 21–16, 21–13తో సిద్ధార్థ్ (భారత్)పై విజయం సాధించారు. మహిళల సింగిల్స్ క్వాలిఫయింగ్‌లో హైదరాబాద్ అమ్మాయి ప్రాషి జోషి 21–14, 21–17తో శ్రుతి ముందాడ (భారత్)పై, రితిక 21–6, 21–6తో దోహ హనీ (ఈజిప్ట్)పై గెలిచారు. భారత్‌కే చెందిన రియా ముఖర్జీ, వైదేహిలకు తమ ప్రత్యర్థుల నుంచి వాకోవర్ లభించింది. -
ఘనంగా సిక్కి రెడ్డి, సుమీత్ రెడ్డిల వివాహం
భారత బ్యాడ్మింటన్ డబుల్స్ స్టార్స్ నేలకుర్తి సిక్కి రెడ్డి, సుమీత్ రెడ్డిల వివాహం హైదరాబాద్‌లో శనివారం రాత్రి ఘనంగా జరిగింది. తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. భారత బ్యాడ్మింటన్ స్టార్స్ సైనా, పీవీ సింధు, తెలంగాణ రాష్ట్ర క్రీడా శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం ఉపాధ్యక్షుడు చాముండేశ్వరీనాథ్ కూడా ఈ పెళ్లికి హాజరయ్యారు. -
ఘనంగా : సిక్కి రెడ్డి, సుమీత్ రెడ్డిల వివాహం
-
బ్యాడ్మింటన్ ప్లేయర్ సిక్కి రెడ్డికి వైఎస్ జగన్ అభినందన
గత దశాబ్దకాలంగా అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తున్న హైదరాబాద్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి నేలకుర్తి సిక్కి రెడ్డిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభినందించారు. హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్ నివాసంలో వైఎస్ జగన్‌ను కలిసిన సిక్కి రెడ్డి ఈ సందర్భంగా వచ్చే నెలలో జరిగే తన వివాహానికి ఆహ్వానిస్తూ శుభలేఖను అందజేసింది. గతేడాది ప్రతిష్టాత్మక ‘అర్జున అవార్డు’ గెల్చుకున్న సిక్కి రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్ భవిష్యత్‌లో ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. -
సిక్కి–అశ్విని జోడీ శుభారంభం
ఓడెన్స్: డెన్మార్క్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో నేలకుర్తి సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప (భారత్) ద్వయం శుభారంభం చేసింది. బుధవారం జరిగిన మహిళల డబుల్స్ తొలి రౌండ్లో సిక్కి రెడ్డి–అశ్విని జంట 21–7, 21–11తో ఏరియల్ లీ–సిడ్నీ లీ (అమెరికా) జోడీపై ఘనవిజయం సాధించింది. కేవలం 20 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో భారత జంటకు ఏమాత్రం పోటీ ఎదురుకాలేదు. రెండు గేమ్‌ల ఆరంభ దశలో పాయింట్లు కోల్పోయినా ఆ వెంటనే జోరు పెంచి భారత జంట అలవోకగా విజయాన్ని ఖాయం చేసుకుంది. మరో మ్యాచ్‌లో జక్కంపూడి మేఘన–పూర్వీషా రామ్ (భారత్) జోడీ 17–21, 11–21తో ఎమ్మా కార్ల్సన్–జోనా మాగ్నుసన్ (స్వీడన్) ద్వయం చేతిలో ఓడింది. మంగళవారం ఆలస్యంగా జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌లో భారత స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ అలవోక విజయాన్ని అందుకున్నాడు. హాన్స్ క్రిస్టియన్ విటింగస్ (డెన్మార్క్)తో జరిగిన మ్యాచ్‌లో శ్రీకాంత్ 21–16, 21–10తో గెలుపొందాడు. మరో మ్యాచ్‌లో సాయిప్రణీత్ (భారత్) 21–12, 14–21, 15–21తో హువాంగ్ యుజియాంగ్ (చైనా) చేతిలో ఓడిపోయాడు. గురువారం జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో చైనా దిగ్గజం లిన్ డాన్‌తో శ్రీకాంత్; జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా)తో సమీర్ వర్మ; అకానె యామగుచి (జపాన్)తో సైనా నెహ్వాల్; లీ సో హీ–షిన్ సెయుంగ్ చాన్ (దక్షిణ కొరియా)లతో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప తలపడతారు. ముఖాముఖి రికార్డులో శ్రీకాంత్ 1–3తో... సైనా 1–6తో వెనుకబడి ఉండగా... సమీర్ వర్మ 1–0తో ఆధిక్యంలో ఉన్నాడు. 2016 రియో ఒలింపిక్స్‌లో చివరిసారి లిన్ డాన్‌తో తలపడ్డ శ్రీకాంత్ 3 గేములపాటు పోరాడి ఓడిపోయాడు. సైనా నెహ్వాల్ 2014 చైనా ఓపెన్‌లో చివరిసారి యామగుచిపై విజయం సాధించింది. -
అర్జున వెనుక.. అమ్మానాన్న
కృష్ణార్జునులు డబుల్స్ ఆడి...కురుక్షేత్రంలో విజయం సాధించారు. సిక్కీరెడ్డి తండ్రి కృష్ణారెడ్డి.. ‘ఆడేది నువ్వు. ఆడించేది నీ ప్రతిభ’అంటూ కూతుర్ని క్రీడా కురుక్షేత్రానికి సిద్ధం చేశాడు. ఆ అమ్మాయి ఆడింది. ‘అర్జున’ అవార్డు గెలిచింది. సిక్కీరెడ్డి ‘డబుల్స్’లో కాంస్య కనకాలను, రజతాలను సాధించడం వెనుక.. తండ్రి కృషి మాత్రమే కాదు...తల్లి కష్టం కూడా ఉంది. ఇద్దరూ కలిసి ఆడించారు. దేశానికొక క్రీడాకారిణిని అందించారు. అర్జునుడు నేల మీదనున్న నీటిలోకి చూస్తూ పైకప్పుకున్న మత్సా్యన్ని ఛేదించాడు. ఇది విలుకాడిగా పరిణితి చెందిన తర్వాత. అంతకంటే ముందు.. చాలా చిన్నప్పుడు.. అంటే... విలువిద్య మొదలుపెట్టేటప్పుడు ‘ఎదురుగా ఏం కనిపిస్తోంది’ అని ద్రోణాచార్యుడు అడిగితే ‘పక్షి కన్ను మాత్రమే కనిపిస్తోంది’ అన్నాడు. అదే స్ఫూర్తితో బ్యాడ్మింటన్ ఆడుతోంది అర్జున అవార్డు గ్రహీత సిక్కీరెడ్డి. ప్రత్యర్థి స్థానంలో కాబోయే భర్త సుమీత్ ఉన్నప్పుడు కూడా తనకు ‘కనిపించేది ప్రత్యర్థి ఆటగాడు మాత్రమే’ అన్నారామె. లక్ష్యం మీద అంతటి ఏకాగ్రత, ఉండబట్టే ఆమెను అంత పెద్ద అవార్డు వరించిందనిపించింది ఆమెతో మాట్లాడుతున్నప్పుడు. నాన్న నాటారు.. అమ్మ పెంచారు నేలకుర్తి సిక్కీ రెడ్డి పుట్టింది నల్లగొండ జిల్లా కోదాడలో. ఆమె సొంతూరు వరంగల్ (అవిభజిత) జిల్లా జయపురం. పెరిగింది హైదరాబాద్‌లో. ఎనిమిదేళ్ల వయసులో పట్టుకున్న రాకెట్‌ని పాతికేళ్లు వచ్చినా వదలకపోవడమే ఆమె విజయరహస్యం. తండ్రి కృష్ణారెడ్డి నేషనల్ వాలీబాల్ ప్లేయర్. పిల్లలిద్దరినీ క్రీడాకారులను చేయాలని ఉండేదాయనకు. సెలవులు వస్తే చాలు.. కొడుకు, కూతురు ఇద్దరినీ సమ్మర్ క్యాంపులకు తీసుకెళ్లేవారు. సిక్కీ రాకెట్ పట్టుకోవడంలో ఈజ్ ఉందని, బ్యాడ్మింటన్‌లో కోచింగ్ ఇప్పించమని చెప్పేవారు ఆమె ఆటను చూసినవారు. అది సిక్కీ బ్యాడ్మింటన్ క్రీడాప్రస్థానానికి శ్రీకారం. అలా సిక్కీ అనే మొక్కను వాళ్ల నాన్న బ్యాడ్మింటన్ తోటలో నాటారు. స్పోర్ట్స్‌కు అవసరమైన మెటీరియల్ సేకరణ నుంచి టోర్నమెంట్లకు తీసుకెళ్లడం వంటివన్నీ తల్లి మాధురి చూసుకునేవారు. ‘‘క్రీడాకారులను తయారు చేయడం చిన్న విషయం కాదు, అమ్మానాన్నలు తమ జీవితాన్ని పిల్లల కోసమే అంకితం చేయాల్సి ఉంటుంది. మా అమ్మానాన్న నా కోసమే జీవించారు’’ అంటూ బాల్యాన్ని గుర్తు చేసుకున్నారు సిక్కీరెడ్డి. ఇల్లు కొనలేకపోయారు ‘‘అన్నయ్యకు, నాకు కోచింగ్ ఇప్పించడం కోసం అమ్మ చాలా వదులుకోవాల్సి వచ్చింది. చెన్నై, కొచ్చి, బెంగళూరు, చండీగఢ్, పుణే.. ఇలా ఏడాది పొడవునా ఎక్కడో ఓ చోట టోర్నమెంట్లు జరుగుతూనే ఉంటాయి. ఇద్దర్నీ తీసుకెళ్లేది. ప్రాక్టీస్ చేయడం, ఆడటం తప్ప మరొకటి తెలిసే వయసు కాదు మాది. మేము ఏమి తినాలో కూడా అమ్మే చూసుకునేది. డబ్బు చాలా ఖర్చయ్యేది. ఒక దశలో నాన్నకు వచ్చే డబ్బు సరిపోక అమ్మ తన నగలను తాకట్టు పెట్టింది. అలాంటి రోజుల్లో కనుక ఆమె.. ‘మన ఆర్థిక పరిస్థితి ఇలా ఉంది కాబట్టి ఆటను కొనసాగించడం కష్టం, మామూలుగా స్కూలుకి వెళ్లండి’ అని చెప్పి ఉంటే.. మేము అలాగేనని తలూపేవాళ్లం కదా. మమ్మల్ని క్రీడాకారులుగా తయారు చేయడానికి అమ్మానాన్న చాలా రాజీలు పడాల్సి వచ్చింది. అన్నయ్యకు యాక్సిడెంట్ కావడంతో ఇంటర్ తర్వాత ప్రాక్టీస్ ఆపేసి చదువుకే పరిమితమయ్యాడు. ఇబ్బందులు పడుతూ కూడా నా ప్రాక్టీస్‌ని కొనసాగించారు. నా కోచింగ్ కోసం ఎన్ని ఇళ్లు మారారో చెప్పలేను. దిల్షుక్నగర్, బాగ్‌లింగంపల్లి, గచ్చిబౌలి, లింగంపల్లి, అత్తాపూర్ తర్వాత ఇప్పుడు మాదాపూర్‌లో ఉంటున్నాం. అది కూడా అద్దె ఇల్లే. నా కోచింగ్ అనేది లేకపోతే ఎప్పుడో ఇల్లు కొనుక్కోగలిగే వాళ్లు. ఏడాది విరామం క్రీడాకారిణిగా మంచి ఆహారం తీసుకునే దాన్ని, అలాగని ప్రత్యేకమైన ఆహారం ఏమీ లేదు. రాగి వంటి మన నేచురల్ఫుడ్డే మంచిది. గుడ్లు, చికెన్, తాజా పళ్ల రసాలు, డ్రై ఫ్రూట్స్ ఉండేలా చూసేది అమ్మ. బయటి ఫుడ్ పెట్టేది కాదు. ఇప్పుడు నాలుగేళ్ల నుంచి స్పోర్ట్స్ డైటీషియన్ ఇచ్చిన చార్ట్ ప్రకారం తీసుకుంటున్నాను. చిన్నప్పటి నుంచి కూడా నేను ఆడుతున్నంత సేపూ ఎక్కడ గాయాలు తగులుతాయోనని చూసుకుంటూ ఉండేది అమ్మ. లెవెన్త్ క్లాస్‌లో నెల్లూరులో ఉడెన్ కోర్టులో జంప్ చేసినప్పుడు మోకాలి దగ్గర టప్ మన్న శబ్దం వినిపించింది. రెస్ట్ సరిపోతుందని, సర్జరీ అవసరం లేదనుకున్నాం. మలేసియాలో జూనియర్ ఏసియన్ ఆడుతున్నప్పుడు మోకాలికి గాయం అయింది. నాలుగు నెలల పాటు అడుగు నేల మీద పెట్టలేక పోయాను. పూర్తిగా బెడ్‌రెస్ట్, మూడు సర్జరీలయ్యాయి. పూర్తిగా కోలుకోవడానికి ఏడాది పట్టింది. ‘నేను తిరిగి ఆడగలుగుతానా అని గోపీ అన్న (కోచ్ గోపీచంద్) ను అడిగేదాన్ని. అన్నకు కూడా అలాగే గాయమైంది. అదే మాట చెబుతూ ‘డాక్టర్లు చెప్పినంత ఆలస్యం ఏమీ కాదు, ఒక నెలలో నడుస్తావు’ అంటూ బాగా ధైర్యం చెప్పారు. ప్రతి ఆటా ఒక పాఠమే! క్రీడాకారులను తీర్చిదిద్దడానికి కోచ్‌లు పడే శ్రమ ఇంత అని చెప్పలేం. ఆట నేర్పించి వదిలేయరు. టోర్నమెంట్లకు వస్తారు. ప్రాక్టీస్‌లో చూపించినంత నైపుణ్యం పోటీలో చూపిస్తున్నామా లేదా అని చూస్తారు. ఎక్కడైనా పొరపాటు చేస్తున్నామా అనేది గమనిస్తారు, మొత్తంగా మా ఆటను అధ్యయనం చేస్తూ నోట్స్ రాసుకుంటారు. ఆ పొరపాట్లు మళ్లీ చేయకుండా శిక్షణనిస్తారు. గెలుపు కొన్నిసార్లు మనవైపు ఉంటుంది, కొన్నిసార్లు ప్రత్యర్థి వైపు ఉంటుంది. అయితే ప్రతి పోటీలోనూ ఏదో ఒకటి నేర్చుకుంటాం. ప్రత్యర్థి ఆట తీరులో కొన్ని ప్రత్యేకమైన నైపుణ్యాలను కూడా తెలుసుకోగలుగుతాం. సౌకర్యాలు పెరిగాయి మా చిన్నప్పటి కంటే ఇప్పుడు క్రీడలకు సౌకర్యాలు బాగా పెరిగాయి. ప్రాక్టీస్‌కు అనువైన మంచి వాతావరణం ఉంది. అయితే అప్పట్లో బ్యాడ్మింటన్ షటిల్ రూపాయికొచ్చేది, ఇప్పుడది వందకు పైనే ఉంది. అప్పుడు ఐదొందలకు వచ్చిన షూస్ ఇప్పుడు ఐదువేలు. ఇక రాకెట్ ధరలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. దాంతో ఇది రిచ్ పీపుల్ గేమ్ అనే మాట వినిపిస్తోంది. కానీ ఇప్పుడు మిడిల్ క్లాస్ ఇన్కమ్ కూడా దానికి తగ్గట్టే పెరిగింది. ఖర్చులకు భయపడి స్పోర్ట్స్ మీద ఇష్టాన్ని వదులుకోనక్కర్లేదనే చెప్తాను. నాకు మొదట్లో స్పాన్సర్షిప్ పెద్దగా రాకపోయినా ఇప్పుడు కొంత బెటర్‌గానే ఉంది. నైపుణ్యం ఉండి, కోచింగ్ తీసుకోవడానికి కుటుంబ ఆర్థిక పరిస్థితి సహకరించని వాళ్లకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సహాయం చేస్తోంది. స్పోర్ట్స్‌లో రాణించడంతోపాటు గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తే ఉద్యోగావకాశాలు చాలా ఉన్నాయి. అలాగని స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం కోసమే ఆట ఆడాలనుకుంటే ఎప్పటికీ రాణించలేరు. ఆట మీద వ్యామోహంతోనే ఆడాలి. నాకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఉద్యోగం ఇచ్చింది. ప్రాక్టీస్‌కు తగిన వెసులుబాటు ఇస్తున్నారు. 2020 ఒలింపిక్స్ కోసం ప్రాక్టీస్ చేస్తున్నాను. ఆనందాన్ని కొలవలేను బ్యాడ్మింటనే నాకు జీవితం. అర్జున అవార్డు అందుకోవడం ఎలా ఉందంటే... ‘ఇలా’ అని చెప్పడానికి మాటలు తెలియడం లేదు. దేశం నన్ను అక్కున చేర్చుకున్నందుకు ‘ఇంత’ అని చెప్పలేనంత సంతోషం కలిగింది. ఆ ఆనందాన్ని కొలిచే కొలబద్ద ఉండదు. దేశానికి గుర్తింపు తేవాలనే కోరిక క్రీడాకారులందరికీ ఉంటుంది. అలా దేశానికి అందిన గౌరవంలో నా పాత్ర ఉండాలనేదే నా ఆకాంక్ష.’’ సిక్కీ... నాన్న పెట్ సిక్కీ పేరు సింధుజ. ఇంట్లో సిక్కీ అని పిలిచేవాళ్లం. వాళ్ల నాన్నకు కూతురంటే చెప్పలేనంత మురిపెం. స్కూల్లో చేర్చేటప్పుడు కూడా అదే పేరు చెప్పారు. సిక్కీనా... ఆశ్చర్యంగా అడిగినప్పుడు రెడ్డి జత చేశారు. అలా సిక్కీరెడ్డి అయింది. ఇప్పటికీ అలా ఎందుకు చేశారని ఎవరైనా అడిగితే ‘అందరూ నాలాగే ముద్దుగా పిలవాలని’ నవ్వుతారు. గాయపడిన తర్వాత ఆడటానికి భయపడే పిల్లల్ని చాలామందిని చూశాను. కానీ సిక్కీ అలా భయపడలేదు. వాళ్ల నాన్నే ఆమె ధైర్యం. తను మంచి సింగిల్స్ ప్లేయర్. అండర్ 19 సింగిల్స్‌లో హ్యాట్రిక్ విజయాలు సాధించింది. కాలి గాయం తర్వాత డబుల్స్ మీద కాన్సెంట్రేట్ చేసింది. మా అమ్మాయి ఆట కోసం మేము చాలా రాజీ పడిన మాట నిజమే. బంధువుల పెళ్లిళ్లు, ఇతర కార్యాలకు వెళ్లడం కుదిరేది కాదు. కొందరు అర్థం చేసుకునే వాళ్లు, కొన్ని నిష్టూరాలు కూడా ఉంటాయి. నేననే కాదు.. స్పోర్ట్స్ పర్సన్ పేరెంట్స్ అందరి పరిస్థితీ దాదాపుగా ఇలాగే ఉంటుంది. వెనక్కి గుర్తు చేసుకుంటే నాకు బాధనిపించేది ఒక్కటే. మా నాన్న పండుగలకు పిలిచినా వెళ్లలేకపోయేదాన్ని. ‘నా బిడ్డని చూడాలని నాకున్నట్లే, నీ బిడ్డని బాగా చూసుకోవాలని నీకు ఉండడం తప్పేమీ కాదులే’ అనేవారు. ప్రాక్టీస్ లేని రోజుల్లో వెళ్లి కనిపించినా సరే, పండక్కి రాలేదనే బాధ వ్యక్తమయ్యేది ఆయన మాటల్లో. నాన్న ఉండి ఉంటే... సిక్కీ అర్జున అవార్డు అందుకోవడం చూసి ఎంత సంతోషించేవారో. సిక్కీ అర్జున అవార్డు అందుకున్నప్పటి నుంచి నాన్న తరచూ గుర్తుకు వస్తున్నాడు. – మాధవి, సిక్కీరెడ్డి తల్లి డైలీ రొటీన్ ఉదయం ఆరున్నర నుంచి రెండు గంటల పాటు ప్రాక్టీస్, తర్వాత ఓ గంట సేపు బ్రేక్ ఫాస్ట్ కోసం బ్రేక్. పది నుంచి పన్నెండున్నర – ఒంటి గంట వరకు రెండవ సెషన్ ప్రాక్టీస్. లంచ్ అవర్ తర్వాత గంట సేపు నిద్రపోతాను. సాయంత్రం నాలుగు నుంచి ఏడు గంటల వరకు ప్రాక్టీస్, అరగంట సేపు రికవరీ మసాజ్ ఉంటుంది. అప్పుడు ఇంటికి వస్తే కొంత సేపు అమ్మానాన్నలతో కబుర్లు, అది రిలాక్సేషన్ టైమ్. సుమీత్ కూడా అప్పుడే కాల్ చేస్తాడు. సుమీత్ చిన్నప్పటి నుంచి తెలుసు. బాగా అల్లరి. అంకుల్ (సుమీత్ నాన్నగారు) అథ్లెటిక్ కోచ్. అంకుల్ దగ్గర మాట వినడని బ్యాడ్మింటన్‌లో చేర్చారు. సుమీత్‌తో కలిసి ఆడలేదు, కానీ గత ఏడాది సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ మిక్స్డ్ డబుల్స్‌లో ఒకరితో ఒకరం ఆడాం. – సిక్కీరెడ్డి, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, అర్జున అవార్డు గ్రహీత ఇంటర్వ్యూ: వాకా మంజులారెడ్డి -
నేడే జాతీయ క్రీడా పురస్కారాల ప్రదానం
భారత జాతీయ క్రీడా పురస్కారాల ప్రదానోత్సవం నేడు న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరుగనుంది. సాయంత్రం 5 గంటలకు మొదలయ్యే ఈ కార్యక్రమాన్ని దూరదర్శన్ (డీడీ) నేషనల్ చానెల్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ‘రాజీవ్ ఖేల్‌రత్న’ను ఈసారి భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి, మేటి వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను అందుకోనున్నారు. ఉత్తమ క్రీడాకారులకు ఇచ్చే ‘అర్జున అవార్డు’ కోసం 20 మందిని ఎంపిక చేశారు. ఈ జాబితాలో తెలంగాణ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి నేలకుర్తి సిక్కి రెడ్డి కూడా ఉంది. -
సిక్కి, శ్రీనివాసరావులకు వైఎస్ జగన్ అభినందన
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక క్రీడా పురస్కారాలు దక్కించుకున్న ఆంధ్రప్రదేశ్ కోచ్ ఆచంట శ్రీనివాసరావు, తెలంగాణ ప్లేయర్ సిక్కిరెడ్డిలకు ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. వీరు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. టేబుల్ టెన్నిస్ (టీటీ)లో శ్రీనివాసరావు ద్రోణాచార్య, బ్యాడ్మింటన్‌లో సిక్కిరెడ్డి అర్జున అవార్డులకు ఎంపికయ్యారు. -
కోహ్లికి ఖేల్‌రత్న.. సిక్కి రెడ్డికి అర్జున
సాక్షి, న్యూఢిల్లీ: క్రీడారంగంలో అత్యున్నత పురస్కారమైన రాజీవ్ ఖేల్‌రత్న అవార్డుని టీమిండియా సారథి విరాట్ కోహ్లీ అందుకోనున్నాడు. 2018 సంవత్సరానికి గానూ క్రీడా పురస్కారాలను కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటించింది. ఈ ఏడాది కోహ్లీతో పాటు వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చానులకు ఖేల్‌రత్న అవార్డుకు కేంద్రం ఎంపిక చేసింది. తెలుగు రాష్ట్రాల నుంచి ఈసారి ఒక్కరికే అర్జున అవార్డు ఖాయమైంది. తెలంగాణకు చెందిన బ్యాడ్మింటన్ డబుల్స్ స్పెషలిస్ట్ ప్లేయర్ సిక్కి రెడ్డి అర్జున అవార్డు పురస్కారం అందుకోనున్నారు. ఇక గతకొంత కాలంగా టేబుల్ టెన్నిస్‌లో ఎంతో మందికి శిక్షణనిస్తూ ఎన్నో పతకాలు సాధించడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్న కోచ్ శ్రీనివాస్ దోణాచార్య అవార్డు అందుకోనున్నారు. ఈ క్రీడా పురస్కారాలను సెప్టెంబర్ 25న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా రాష్ట్రపతి భవన్లో జరిగే ఓ కార్యక్రమంలో క్రీడాకారులు అందుకోనున్నారు. అవార్డు గ్రహీతలకు వైఎస్ జగన్ అభినందనలు కేంద్రం ప్రకటించిన క్రీడా పురస్కారాలకు ఎంపికైన క్రీడాకారులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ట్విటర్ ద్వారా అభినందనలు తెలిపారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన కోచ్ శ్రీనివాసరావు, బాడ్మింటన్ క్రీడాకారిణి సిక్కిరెడ్డిలను ప్రత్యేకంగా అభినందించారు. ఇరువురుకి లభించిన అవార్డులు రెండు తెలుగు రాష్ట్రాలకు ఎంతో గర్వ కారణమని పేర్కొన్నారు. ఇక గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ కూడా అవార్డులకు ఎంపికైన ఇరు రాష్ట్రాలకు చెందిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సిక్కిరెడ్డి, కోచ్ శ్రీనివాస్‌లను ప్రత్యేకంగా అభినందించారు. ఈ ఏడాది క్రీడా పురస్కారాలకు ఎంపికైనది వీరే.. రాజీవ్ గాంధీ ఖేల్‌రత్న: విరాట్ కోహ్లి (క్రికెట్), మీరాబాయి చాను (వెయిట్ లిఫ్టింగ్). అర్జున అవార్డు: నేలకుర్తి సిక్కి రెడ్డి (బ్యాడ్మింటన్), హిమ దాస్ (అథ్లెటిక్స్), స్మృతి మంధాన (క్రికెట్), సవిత పూనియా (హాకీ), రాహీ సర్నోబాత్ (షూటింగ్), శ్రేయసి సింగ్ (షూటింగ్), మనిక బాత్రా (టేబుల్ టెన్నిస్), పూజా కడియాన్ (వుషు), నీరజ్ చోప్రా (అథ్లెటిక్స్), రోహన్ బోపన్న (టెన్నిస్), జి. సత్యన్ (టేబుల్ టెన్నిస్), జిన్సన్ జాన్సన్ (అథ్లెటిక్స్), సతీశ్ కుమార్ (బాక్సింగ్), మన్‌ప్రీత్ సింగ్ (హాకీ), అంకుర్ మిట్టల్ (షూటింగ్), సుమీత్ (రెజ్లింగ్), రవి రాథోడ్ (పోలో), శుభాంకర్ శర్మ (గోల్ఫ్), అంకుర్ ధామ (పారాథ్లెటిక్స్), మనోజ్ సర్కార్ (పారా బ్యాడ్మింటన్). ద్రోణాచార్య అవార్డు: జీవన్‌జ్యోత్ తేజ (ఆర్చరీ), ఎస్.ఎస్.పన్ను (అథ్లెటిక్స్), సి.ఎ.కుట్టప్ప (బాక్సింగ్), విజయ్ శర్మ (వెయిట్ లిఫ్టింగ్), ఎ. శ్రీనివాసరావు (టేబుల్ టెన్నిస్) క్లారెన్స్ లోబో (హాకీ), తారక్ సిన్హా (క్రికెట్), జీవన్ కుమార్ శర్మ (జూడో), వి.ఆర్.బీడు (అథ్లెటిక్స్). ధ్యాన్‌చంద్ అవార్డు: సత్యదేవ్ ప్రసాద్ (ఆర్చరీ), భరత్ చెత్రి (హాకీ), బాబీ అలోసియస్ (అథ్లెటిక్స్), దత్తాత్రేయ దాదూ చౌగ్లే (రెజ్లింగ్). -
‘మిక్స్డ్’ ఫైనల్లో సిక్కి–ప్రణవ్ జంట
సాక్షి, హైదరాబాద్: కెరీర్లో మరో అంతర్జాతీయ మిక్స్డ్ డబుల్స్ టైటిల్ సాధించేందుకు తెలంగాణ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సిక్కి రెడ్డి విజయం దూరంలో నిలిచింది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం లో జరుగుతున్న హైదరాబాద్ ఓపెన్‌లో సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా (భారత్) జంట మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. సెమీఫైనల్లో టాప్ సీడ్ సిక్కి–ప్రణవ్ ద్వయం 21–19, 21–15తో చాంగ్ టక్ చింగ్–ఎన్జీ వింగ్ యంగ్ (హాంకాంగ్) జోడీపై నెగ్గింది. పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జోడీ 21–14, 21–6తో అరుణ్ జార్జి–సాన్యమ్ శుక్లా (భారత్) జంటను అలవోకగా ఓడించి ఫైనల్‌కు చేరింది. పురుషుల సింగిల్స్‌లో హైదరాబాద్ ప్లేయర్ గురుసాయిదత్ పోరాటం ముగిసింది. సెమీఫైనల్లో గురుసాయిదత్ 21–16, 15–21, 11–21తో భారత్‌కే చెందిన సమీర్ వర్మ చేతిలో ఓడిపోయాడు. నేడు జరిగే ఫైనల్స్‌లో పురుషుల డబుల్స్‌లో అక్బర్–ఇస్ఫహాని (ఇండోనేసియా) జంటతో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ద్వయం... పురుషుల సింగిల్స్‌లో సూంగ్ జూ వెన్ (మలేసియా)తో సమీర్ వర్మ... మిక్స్డ్ డబుల్స్‌లో అక్బర్–వినీ ఒక్తవినా (ఇండోనేసియా) జోడీతో సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా జంట తలపడతాయి. ►నేటి ఫైనల్స్ మధ్యాహ్నం గం. 2.00 నుంచి డీడీ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం -
సిక్కి జంట శుభారంభం
అంచనాలకు అనుగుణంగా రాణించి ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారులు శుభారంభం చేశారు. మహిళల డబుల్స్‌లో సంయోగిత–ప్రజక్తా సావంత్ జంట మినహా తొలి రోజు బరిలోకి దిగిన వారందరూ విజయం రుచి చూడటం విశేషం. భారత నంబర్‌వన్ మిక్స్డ్ డబుల్స్ జోడీ సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా... పురుషుల సింగిల్స్‌లో సమీర్ వర్మ, ప్రణయ్ అలవోక విజయాలతో రెండో రౌండ్లోకి ప్రవేశించారు. భారత ఆటగాళ్ల నేటి షెడ్యూల్ మహిళల సింగిల్స్: సైనా నెహ్వాల్ (vs) దెమిర్బాగ్ (టర్కీ) పురుషుల సింగిల్స్: శ్రీకాంత్ (vs) ఎన్‌హట్ ఎన్గుయెన్ (ఐర్లాండ్) మహిళల డబుల్స్: కుహూ గార్గ్, నింగ్షీ హజారికా (vs) చాంగ్ చింగ్ హుయ్, యాంగ్ చింగ్ టున్ (చైనీస్ తైపీ); మేఘన, పూర్వీషా (vs) దెబోరా జిలి, ఇమ్కె వాన్ డెర్ (నెదర్లాండ్స్); సిక్కి, అశ్విని (vs) చియాంగ్ కై సిన్, హుంగ్ షి హాన్ (చైనీస్ తైపీ) పురుషుల డబుల్స్: సాత్విక్, చిరాగ్ శెట్టి (vs) మార్కస్ ఇలిస్, క్రిస్ లాంగ్రిడ్జ్ (ఇంగ్లండ్); కోన తరుణ్, సౌరభ్ శర్మ (vs) ఆర్ చిన్ చుంగ్, టాంగ్ చున్ మాన్ (హాంకాంగ్); అర్జున్, శ్లోక్ (vs) ఓంగ్ యు సిన్, తియో ఎ యి (మలేసియా) మిక్స్డ్ డబుల్స్: సిక్కి, ప్రణవ్ (vs) హఫీజ్, గ్లోరియా (ఇండోనేసియా); సౌరభ్ శర్మ, అనుష్క (vs) చాన్ పెంగ్ సూన్, (vs) లియు యింగ్ (మలేసియా); సాత్విక్, అశ్విని (vs) లామ్స్‌ఫస్, ఇసాబెల్ (జర్మనీ); రోహన్, కుహూ (vs) క్రిస్, గాబ్రియేలా (ఇంగ్లండ్) ఉదయం గం. 7.30 నుంచి స్టార్ స్పోర్ట్స్–2లో ప్రత్యక్ష ప్రసారం -
మన పోరాటం ముగిసింది
సింగపూర్ సిటీ: సింగపూర్ ఓపెన్‌లో భారత ప్లేయర్ల పోరాటం ముగిసింది. ప్రిక్వార్టర్స్‌లోనే సౌరభ్ వర్మ, శుభాంకర్ ఓటమి పాలయ్యారు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ మ్యాచ్‌లో సౌరభ్ వర్మ 21–18, 15–21, 11–21తో తైన్ మిన్హ్ ఎన్గుయెన్ (వియత్నాం) చేతిలో, శుభాంకర్ 13–21, 14–21తో చౌ టైన్ చెన్ చేతిలో ఓటమి పాలయ్యారు. మహిళల సింగిల్స్ విభాగంలో రుత్విక శివాని, రితూపర్ణ దాస్ కూడా ప్రిక్వార్టర్స్ దశను దాటలేకపోయారు. రుత్విక శివాని 8–21, 15–21తో సయాక తలకహాషి (జపాన్) చేతిలో... రితూపర్ణ దాస్ 21–15, 13–21, 16–21తో యూలియా యుసేఫిన్ సుసాంటో (ఇండోనేసియా) చేతిలో ఓటమి పాలయ్యారు. మిక్స్డ్ డబుల్స్ ప్రిక్వార్టర్స్‌లో సిక్కిరెడ్డి–ప్రణవ్ చోప్రా ద్వయం 15–21, 11–21తో చాంగ్ తక్ చింగ్–వింగ్ యుంగ్ (హాంకాంగ్) జంట చేతిలో ఓడింది. సాత్విక్ సాయిరాజ్ రాంకీరెడ్డి–అశ్విని పొన్నప్ప జోడీ 14–21, 21–16, 14–21తో లీ చున్ హై రెగినాల్డ్–చౌ హై వాహ్ (హాంకాంగ్) ద్వయం చేతిలో ఓడింది. పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్స్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జంట 17–21, 18–21తో యున్ని –యియాన్‌గ్యు (చైనా) జోడీ చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. -
స్టార్.. స్టార్
సాక్షి,సిటీబ్యూరో: బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సిక్కిరెడ్డికి గురువారం కారుబహూకరించారు. గచ్చిబౌలి పుల్లెల గోపీచంద్ అకాడమీలోజరిగిన ఈ కార్యక్రమానికి విచ్చేసిన అక్కినేని నాగార్జున..స్టార్ ప్లేయర్ పీవీ సింధుతో ఇలా సరదాగా కనిపించారు. -
సిక్కి మరిన్ని విజయాలు సాధిస్తుంది
సాక్షి, హైదరాబాద్: గతంతో పోలిస్తే ఇప్పుడు డబుల్స్వైపు మొగ్గు చూపేందుకు ఆటగాళ్లు మరింత ఆసక్తి కనబరుస్తున్నారని జాతీయ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ అన్నారు. అంతర్జాతీయస్థాయిలో గత మూడేళ్లుగా నిలకడగా రాణిస్తున్న హైదరాబాద్ డబుల్స్ క్రీడాకారిణి సిక్కి రెడ్డికి ప్రోత్సాహకంగా ఇటీవలే తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం ఉపాధ్యక్షుడు చాముండేశ్వరీనాథ్ ఫోర్డ్ ఎకో స్పోర్ట్ కారును నజరానాగా ఇస్తామని ప్రకటించారు. ఆయన తన హామీ నిలబెట్టుకుంటూ గచ్చిబౌలిలోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో గురువారం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సినీ నటుడు అక్కినేని నాగార్జున ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి కారు తాళాలను సిక్కి రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా గోపీచంద్ మాట్లాడుతూ ‘కొన్నాళ్లుగా సిక్కి రెడ్డి అద్భుతంగా ఆడుతోంది. కోచ్‌గా ఆమె ఆటతీరుపట్ల నేను సంతోషంగా ఉన్నాను. ఇప్పటివరకు ఆమె సాధించిన విజయాలు ఆరంభం మాత్రమే. కారు నజరానాలాంటి ప్రోత్సాహంతో భవిష్యత్‌లో ఆమె నుంచి మరిన్ని విజయాలు వస్తాయని గట్టి నమ్మకంతో ఉన్నాను’ అని అన్నారు. గత నెలలో గోల్డ్‌కోస్ట్‌లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో సిక్కి రెడ్డి టీమ్ విభాగంలో స్వర్ణం, మహిళల డబుల్స్ విభాగంలో కాంస్య పతకం సాధించింది. ‘క్రీడాకారులకు చాముండేశ్వరీనాథ్ అందిస్తున్న ప్రోత్సాహం ప్రశంసనీయం. పీబీఎల్‌లో సిక్కి రెడ్డి మ్యాచ్‌లు చూశాను. ఆమె ఆటతీరు అద్భుతం. ప్రపంచ సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో టాప్–3లో ఉన్న సింధుకు అభినందనలు. ఇక గోపీచంద్ అకాడమీ చాంపియన్స్‌కు అడ్డాగా మారిపోయింది’ అని నాగార్జున వ్యాఖ్యానించారు. స్వర్ణం సాధిస్తే మరో కారు... ‘మూడేళ్లుగా సిక్కి సాధించిన విజయాలు అసాధారణం. భవిష్యత్‌లో సిక్కి గనుక ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్ లేదా ఆసియా చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిస్తే ఆమెకు మరో కారును బహుమతిగా అందజేస్తాను’ అని చాముండేశ్వరీనాథ్ తెలిపారు. ‘నా విజయాలకు గుర్తింపుగా కారు అందజేసినందుకు చాముండీ అంకుల్‌కు ధన్యవాదాలు. ఎల్లవేళలా నన్ను ప్రోత్సహిస్తున్నందుకు కోచ్ గోపీచంద్ సర్‌కు, నా తోటి క్రీడాకారిణి పీవీ సింధుకు కృతజ్ఞతలు’ అని సిక్కి తెలిపింది. -
‘అర్జున’కు సిక్కి రెడ్డి పేరు సిఫారసు
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయస్థాయిలో కొన్నేళ్లుగా నిలకడగా రాణిస్తున్న తెలంగాణ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సిక్కి రెడ్డి పేరును భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) ‘అర్జున అవార్డు’కు సిఫారసు చేసింది. ఈ మేరకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖకు సిక్కి రెడ్డి పేరును ‘బాయ్’ అధ్యక్షుడు హిమంత బిశ్వ శర్మ నామినేట్ చేశారు. ఇటీవలే గోల్డ్‌కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్‌లో మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో స్వర్ణం నెగ్గిన భారత జట్టులో సభ్యురాలిగా ఉన్న సిక్కి, మహిళల డబుల్స్‌లో అశ్విని పొన్నప్పతో కలిసి కాంస్య పతకం సాధించింది. -
మంచి రోజులొచ్చాయి!
భారత బ్యాడ్మింటన్ ముఖచిత్రం గత పదేళ్లలో ఎంతగానో మారింది. అయితే గొప్ప విజయాలన్నీ సింగిల్స్‌లోనే వస్తుండటం... డబుల్స్, మిక్స్డ్ డబుల్స్‌లో ఫలితాలు మరీ గొప్పగా లేకపోవడంతో ఏదో లోటుగా కనిపించేది. అయితే కొంతకాలంగా డబుల్స్‌లోనూ మన వాళ్లు మెరిపించి, మురిపిస్తున్నారు. ఒకప్పుడు బలహీన విభాగం అనే స్థాయి నుంచి నేడు బలమైన విభాగం స్థాయికి డబుల్స్ కేటగిరీ ఎదిగింది. సాక్షి క్రీడావిభాగం: ఇప్పటివరకు భారత బ్యాడ్మింటన్ చరిత్రను పరిశీలిస్తే సింగిల్స్ విభాగానికి ఇచ్చినంత ప్రాధా న్యం డబుల్స్‌కు ఇవ్వలేదు. అయితే ఇప్పుడిపుడే ఈ పరిస్థితిలో మార్పు వస్తోంది. డబుల్స్ విభాగాలకు ప్రత్యేక కోచ్‌ను ఏర్పాటు చేశాక నెమ్మదిగా ఫలితాలు వస్తున్నాయి. కామన్వెల్త్ గేమ్స్‌లో డబుల్స్ జోడీల ప్రదర్శనే ఇందుకు నిదర్శనం. 2006, 2010, 2014 కామన్వెల్త్ గేమ్స్‌లలో మలేసియా జట్టు మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో విజేతగా నిలిచి హ్యాట్రిక్ నమోదు చేసింది. ఏ రకంగా చూసినా మలేసియా జట్టు పటిష్టమైనదే. డబుల్స్ క్రీడాకారులు సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి, అశ్విని పొన్నప్ప, సిక్కి రెడ్డి, ప్రణవ్ చోప్రా అద్భుతంగా ఆడి మలేసియాను ఓడించి తొలిసారి భారత్ విజేతగా నిలవడంలో కీలకపాత్ర పోషించారు. ఆశలు రేకెత్తిస్తూ... కామన్వెల్త్ గేమ్స్‌లోనే కాకుండా గతేడాది కాలంగా పురుషుల డబుల్స్‌లో సాత్విక్–చిరాగ్ జంట అద్భుత ఫలితాలు సాధిస్తోంది. తమకంటే మెరుగైన జోడీలకు గట్టిపోటీనిస్తూ, ఒక్కోసారి వారిని ఓడిస్తూ సంచలన విజయాలు సాధిస్తోంది. ముఖ్యంగా 17 ఏళ్ల సాత్విక్ ఆటతీరు అందర్నీ ఆకట్టుకుంటోంది. ఆరు అడుగుల ఎత్తు ఉన్న సాత్విక్ సంధిస్తున్న స్మాష్‌లు, భాగస్వాములతో కనబరుస్తున్న సమన్వయం అతనికి ఉజ్వల కెరీర్ ఉందని చెబుతున్నాయి. మిక్స్డ్ డబుల్స్‌లో అశ్వినితో కలిసి సాత్విక్ అద్భుత ఆట కనబరుస్తున్నాడు. 2016లో సాత్విక్–చిరాగ్ జంట నాలుగు అంతర్జాతీయ డబుల్స్ టైటిల్స్‌ను సొంతం చేసుకుంది. మనీషాతో కలిసి మిక్స్డ్ డబుల్స్‌లో ఆడిన సాత్విక్ 2016లో మూడు అంతర్జాతీయ టైటిల్స్ గెల్చుకున్నాడు. గతేడాది చిరాగ్‌తో కలిసి వియత్నాం ఇంటర్నేషనల్ టోర్నీ టైటిల్ గెలిచిన సాత్విక్... ఈ ఏడాది ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్ రెండో రౌండ్లో చిరాగ్‌తో కలిసి ప్రపంచ రెండో ర్యాంక్ జంట మథియాస్ బో–మోగెన్సన్ (డెన్మార్క్) జంటను ఓడించినంత పనిచేశాడు. సూపర్ సిరీస్ స్థాయి టోర్నీల్లో ఇంతవరకు భారత పురుషుల డబుల్స్ జంటకు టైటిల్ లభించలేదు. ప్రస్తుతం సాత్విక్–చిరాగ్ శెట్టి ఆటతీరు పరిశీలిస్తే భవిష్యత్‌లో ఆ లోటు తీరుతుందనే నమ్మకం కనిపిస్తోంది. అశ్విని అద్భుతః కామన్వెల్త్ గేమ్స్‌లో అశ్విని పొన్నప్ప ప్రదర్శనను ఎంత ప్రశంసించినా తక్కువే. క్లిష్టమైన పరిస్థితుల్లో ఆమె ఒకేరోజు నాలుగు డబుల్స్ మ్యాచ్‌లు ఆడాల్సి వచ్చింది. ముఖ్యంగా ఫైనల్లో తొలి మ్యాచ్‌లో సాత్విక్‌తో కలిసి మిక్స్డ్ డబుల్స్‌లో అందించిన విజయం భారత శిబిరంలో నూతనోత్సాహన్ని నింపింది. 2007 నుంచి అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌లో కొనసాగుతున్న 28 ఏళ్ల అశ్విని మహిళల డబుల్స్‌లో వరుసగా మూడు కామన్వెల్త్ గేమ్స్‌లో పతకాలు నెగ్గడం విశేషం. 2010 గేమ్స్‌లో జ్వాలతో స్వర్ణం... 2014 గేమ్స్‌లో జ్వాలతో కలిసి రజతం... 2018 గోల్డ్‌కోస్ట్ గేమ్స్‌లో సిక్కి రెడ్డితో కలిసి కాంస్యం సాధించింది. ఇవే కాకుండా ఆసియా క్రీడల్లో, ఆసియా చాంపియన్‌షిప్‌లో, ఉబెర్ కప్‌లో అశ్విని పతకాలు సాధించింది. జ్వాలతో భాగస్వామ్యం ముగిశాక కొంతకాలం తడబడిన అశ్వినికి సిక్కి రూపంలో మంచి భాగస్వామి లభించడంతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది. సూపర్ సిక్కి... డబుల్స్‌లో నిలకడగా రాణిస్తున్న మరో ప్లేయర్ సిక్కి రెడ్డి. తెలంగాణకు చెందిన 24 ఏళ్ల సిక్కి ఒకప్పుడు సింగిల్స్‌కు ప్రాధాన్యత ఇచ్చేది. 2008లో పుణేలో జరిగిన కామన్వెల్త్ యూత్ గేమ్స్‌లో మహిళల సింగిల్స్‌లో సైనా విజేతగా నిలువగా... సిక్కి రెడ్డి రన్నరప్‌గా నిలిచింది. మహిళల డబుల్స్‌లో తులసీతో కలిసి టైటిల్‌ను సొంతం చేసుకుంది. అయితే గాయాల కారణంగా డబుల్స్వైపు మొగ్గు చూపిన ఆమె ఈ విభాగంలోనూ రాణిస్తూ తన కంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. గోల్డ్‌కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్‌లో అశ్వినితో కలిసి మహిళల డబుల్స్‌లో కాంస్యం గెలిచిన సిక్కి... గతేడాది సయ్యద్ మోదీ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీ మహిళల డబుల్స్‌లో రన్నరప్‌గా నిలిచింది. అదే టోర్నీలో ప్రణవ్ చోప్రాతో కలిసి మిక్స్డ్ డబుల్స్‌లో టైటిల్ గెలిచింది. 2016లో ప్రణవ్‌తోనే కలిసి రష్యా, బ్రెజిల్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ టైటిల్స్‌ను సొంతం చేసుకుంది. 2014, 2016 ఉబెర్ కప్‌లో టీమ్ విభాగంలో... 2014 ఆసియా క్రీడల్లో కాంస్యం గెలిచిన జట్టులో సభ్యురాలిగా ఉన్న సిక్కి ఓవరాల్‌గా తొమ్మిది అంతర్జాతీయ టైటిల్స్‌ను గెల్చుకుంది. -
సిక్కిరెడ్డికి స్వర్ణం
అంతర్జాతీయ వేదికపై ఓరుగల్లు క్రీడాతేజం ప్రతిభ కనబరిచింది. ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్‌లో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌లో వరంగల్ ముద్దుబిడ్డ సిక్కిరెడ్డి షటిల్ బ్యాడ్మింటన్ మిక్స్డ్ డబుల్స్‌లో బంగారు పతకం సాధించింది. భారత కీర్తిపతాకను ప్రపంచపటాన రెపరెపలాడించింది. ఇప్పటికే షటిల్ బ్యాడ్మింటన్‌లో అనేక అవార్డులు, రివార్డులు సొంతం చేసుకున్న ఆమె ప్రతిష్టాత్మక కామన్వెల్త్ క్రీడల్లో గోల్డ్‌మెడల్ సాధించడంతో ఉమ్మడి వరంగల్ జిల్లా క్రీడాకారులు, క్రీడాభిమానుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. వరంగల్ రూరల్, నర్సింహులపేట(డోర్నకల్): ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్ నగరంలో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో షటిల్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి నెలకుర్తి సిక్కిరెడ్డి స్వర్ణం సాధించారు. మిక్స్డ్ డబుల్స్‌లో గోల్డ్‌మెడల్ సాధించి భారత కీర్తిపతాకను ప్రపంచపటాన రెపరెపలాడించారు. డబుల్ మిక్స్డ్ విభాగం ఫైనల్ మ్యాచ్‌లో మలేషియాకు చెందిన వివాన్ షూ, మీ కూన్ చౌతో ఇండియా తరఫున సిక్కిరెడ్డి, అశ్విని పొన్నప్ప తలపడ్డారు. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో 21–18, 21–19 తేడాతో మలేషియా టీమ్‌పై గెలిచారు. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలోని జయపురం గ్రామానికి చెందిన నెలకుర్తి కృష్ణారెడ్డి, మాధవి దంపతుల కుమార్తె సిక్కిరెడ్డి బాల్యం నుంచే ఆటలపై ఆసక్తి కనబరిచేవారు. కొన్నేళ్లుగా ఆమె హైదరాబాద్‌లోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో శిక్షణ పొందుతున్నారు. ఇప్పటి వరకు సుమారు 101 సార్లు ఇండియా తరఫున ప్రాతినిథ్యం వహించి పోటీల్లో పాలొన్నారు. 16 బంగారు పతకాలు, మూడు బ్రాంజ్, ఐదు సిల్వర్ పతకాలు సాధించారు. ఆమె ప్రపంచంలో పాకిస్థాన్ మినహా షటిల్ బ్యాడ్మింటన్ క్రీడలు జరిగిన దాదాపు అన్ని దేశాల్లో ఆడడం విశేషం. ఎంబీఏ పూర్తి చేసిన సిక్కిరెడ్డి షటిల్ బ్యాడ్మింటన్‌లో నంబర్ వన్ ర్యాంకింగ్ కోసం శిక్షణ తీసుకుంటున్నారు. దక్షిణ కొరియాలో జరిగిన ఏషియన్ గేమ్స్‌లో పాల్గొని బ్రాంజ్ మెడల్ సాధించినందుకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో ఆమెకు ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్‌గా ఉద్యోగం ఇచ్చారు. ఆమె సాధించిన మరికొన్ని ప్రముఖ టైటిల్స్ ♦ 2013లో జరిగిన బహ్రెయిన్ ఇంటర్నేషనల్ చాలెంజ్ బ్యాడ్మింటన్ టోర్నీలో మహిళల డబుల్స్‌లో సిక్కిరెడ్డి జంట స్వర్ణం సాధించింది. ♦ మిక్స్డ్ డబుల్స్‌లో సిక్కిరెడ్డి ద్వయం రన్నరప్‌గా నిలిచింది. ♦ పోలిష్ ఓపెన్ ఇంటర్నేషనల్ చాలెంజ్ బ్యాడ్మింటన్ టోర్నీని సిక్కిరెడ్డి జోడీ గెలుచుకుంది. ♦ తొలిసారిగా భారత మహిళా జట్టు ఉబెర్ కప్‌లో పతకం సాధించి చరిత్ర సృష్టించిన ఘనత కూడా సిక్కిరెడ్డిదే కావడం విశేషం. గోపీచంద్ అకాడమీలోమూడో క్రీడాకారిణి 2004 నుంచి సింగిల్స్‌లోనే షటిల్ ఆడిన సిక్కిరెడ్డికి 2010లో మోకాలికి సర్జరీ కావడంతో డబుల్స్‌లోనే ఆడుతున్నారు. కొన్నేళ్లుగా గోపీచంద్ అకాడమీలో బ్యాడ్మింటన్‌లో శిక్షణ పొందుతూ అంతర్జాతీయ స్థాయి టైటిల్ దక్కించుకున్న వారిలో సిక్కిరెడ్డి మూడో క్రీడాకారిణి. మొదటి, రెండు స్థానాల్లో సైనా నెహ్వాల్, సింధూ ఉన్నారు. వారు సింగిల్ ప్లేయర్స్ కాగా.. సిక్కిరెడ్డి డబుల్స్, మిక్స్డ్ డబుల్స్‌లో సత్తా చాటుతున్నారు. ప్రతిష్టాత్మక కామన్వెల్త్ క్రీడల్లో గోల్డ్‌మెడల్ సాధించడంతో క్రీడాకారులు, క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
నాన్న ప్రోత్సాహంతోనే ఒలింపిక్స్ స్థాయికి..
వరంగల్ స్పోర్ట్స్ : క్రీడాకారుడికి సాధించాలనే తపన, అందుకు తగిన కృషి ఉంటేనే సరిపోదు, అనుకున్న క్రీడల్లో రాణించాలంటే ఆటల్లో కొత్త మెళకవల కోసం సరికొత్తగా ఆలోచించే సృజనాత్మకమైన శక్తి కలిగి ఉండాలని ఇండియన్ డబుల్స్ షటిల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు బుస్సు సుమిత్‌రెడ్డి అన్నారు. హన్మకొండ భీమారంలో సమీపంలోని కిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతున్న క్రీడా వార్షికోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరైన సుమిత్రెడ్డిని ‘సాక్షి’ పలకరించింది. ఈ సందర్భంగా ఆయన ఒలింపిక్స్ స్థాయికి ఎదిగిన తీరుతోపాటు యువ క్రీడాకారులకు పలు సూచనలు అందించారు. అవి ఆయన మాటల్లోనే.. మాది రంగారెడ్డి జిల్లా గున్గల్. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఆబిడ్స్‌లో ఉంటున్నాం. అమ్మ నిర్మలాదేవి ఆబిడ్స్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయురాలు. నాన్న చంద్రభాస్కర్‌రెడ్డి సైతం వ్యాయామ ఉపాధ్యాయుడే. ఆయన ప్రస్తుతం ధూల్‌పేటలోని జలక్షత్రియ పాఠశాల ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నారు. ఇద్దరూ వ్యాయామ ఉపాధ్యాయులే కావడం నా అదృష్టంగా భావిస్తా. నేను మొదటిసారి 2001లో బ్యాడ్మింటన్ రాకెట్‌ను పట్టుకున్నా. నా మొదటి కోచ్ గోవర్ధన్‌రెడ్డి నాకు క్రీడల్లో ఓనమాలు నేర్పిస్తే, పుల్లెల గోపీచంద్ కోచింగ్ క్రీడా పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించేలా చేసింది. ప్రతిరోజు నాన్న దగ్గరుండి ప్రాక్టీస్ చేయించేవాడు. అలా 17 సంవత్సరాల శిక్షణలో ఒలింపిక్స్ స్థాయికి ఎదిగాను. అదంతా నాన్న అందించిన ప్రోత్సాహమే. ఇండియా నుంచి షటిల్ బ్యాడ్మింటన్ డబుల్స్‌లో ఒలింపిక్స్‌లో ఆడే మొదటి అవకాశం నాకు రావడం అవధుల్లేని సంతోషాన్నిచ్చింది. నా జోడి మన్హోత్రితో కలిసి అనేక అంతర్జాతీయ స్థాయి పోటీల్లో మా సత్తా చాటాం. మా ఇద్దరి మధ్య మంచి అవగాహన ఉంటుంది. మన్హోత్రి తో కలిసి 2016 రియో ఒలంపిక్స్‌లో మా శాయశక్తులా ఆడాం. మూడు మ్యాచ్‌ల్లో మొదట జపాన్‌పై విజయం సాధించాం. అదే ఉత్సాహంతో చైనా, ఇండోనేషియాలతో ఆడినప్పటికీ విజయం సాధించలేకపోయాం. అయినప్పటికీ బలమైన ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇచ్చామన్న సంతృప్తి మాత్రం మాకు కలిగింది. వరంగల్ వేదికగా గతంలో రెండు రాష్ట్ర స్థాయి టోర్నమెంటుల్లో పాల్గొన్నాను. త్వ రలో వరంగల్ మా అత్తారి ఊరు కాబో తుండడం సంతోషంగా ఉంది. మహబూ బాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం జయపురం గ్రామానికి చెందిన అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి నెలకుర్తి సిక్కిరెడ్డితో ఇటీవల నిశ్చితార్థమైంది. ఇద్ద రం క్రీడాకారులం కావడం, అందులోనూ ఇద్దరం బ్యాడ్మింటన్ క్రీడాకారులం సంతో షంగా ఉంది’ అని ఆయన వెల్లడించారు. -
ప్రిక్వార్టర్స్‌లో సిక్కి రెడ్డి జంట
న్యూఢిల్లీ: ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి సిక్కి రెడ్డి మహిళల డబుల్స్ విభాగంలో, మిక్స్డ్ డబుల్స్ విభాగంలో శుభారంభం చేసింది. బుధవారం జరిగిన మహిళల డబుల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప (భారత్) ద్వయం 21–16, 21–16తో గాబ్రియెలా అడ్కాక్–జెస్సికా పగ్ (ఇంగ్లండ్) జంటపై... మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా (భారత్) జోడీ 21–15, 21–19తో హఫీజ్ ఫైజల్–షీలా దేవి (ఇండోనేసియా) జంటపై విజయం సాధించింది. మహిళల డబుల్స్ మరో మ్యాచ్‌లో మనీషా–మహిమా అగర్వాల్ (భారత్) జోడీ 9–21, 8–21తో జాంగ్‌కోల్ఫాన్ కితిహరాకుల్–రవింద ప్రజోంగ్‌జాయ్ (థాయ్‌లాండ్) జంట చేతిలో ఓడిపోయింది. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) 14–21, 17–21తో కిమ్ యాస్‌ట్రప్–ఆండెర్స్ రస్‌ముసేన్ (డెన్మార్క్) చేతిలో... సుమీత్ రెడ్డి–మనూ అత్రి (భారత్) 19–21, 19–21తో టకురో హోకి–యుగో కొబయాషి (జపాన్) చేతిలో... కోనా తరుణ్–ఫ్రాన్సిస్ ఆల్విన్ (భారత్) 10–21, 7–21తో టకుటో ఇనూ–యుకి కనెకో (జపాన్) చేతిలో ఓడిపోయారు. రితూపర్ణ ముందంజ మహిళల సింగిల్స్ విభాగంలో హైదరాబాద్ క్రీడాకారిణి రితూపర్ణ దాస్ ముందంజ వేయగా... శ్రీకృష్ణప్రియ, చుక్కా సాయి ఉత్తేజిత రావు తొలి రౌండ్లోనే నిష్క్రమించారు. రితూపర్ణ దాస్ 19–21, 21–15, 21–19తో చియాంగ్ మియ్ హుయ్ (చైనీస్ తైపీ)పై గెలుపొందగా... శ్రీకృష్ణప్రియ 11–21, 13–21తో ప్రపంచ రెండో ర్యాంకర్ సుంగ్ జీ హున్ (దక్షిణ కొరియా) చేతిలో, క్వాలిఫయర్ సాయి ఉత్తేజిత 17–21, 18–21తో లానీ అలెసాండ్రా మైనకి (ఇండోనేసియా) చేతిలో ఓటమి చవిచూశారు. -
సిక్కిరెడ్డి– ప్రణవ్ జోడి ఓటమి
బాసెల్ (స్విట్జర్లాండ్): భారత మిక్స్డ్ డబుల్స్ జంట ప్రణవ్ చోప్రా– సిక్కి రెడ్డి స్విస్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. శుక్రవారం జరిగిన క్వార్టర్స్ మ్యాచ్‌లో 19–21, 17–21తో చైనా జంట జాంగ్నాన్– లి యిన్హుయి చేతిలో సిక్కి–ప్రణవ్ ఓటమి పాలయ్యారు. తొలి గేమ్‌లో భారత జోడీ 15–5తో ఉన్న దశలో చైనా జోడీ జోరుపెంచింది. 19–19 స్కోరు సమం చేసి అదే జోరులో మరో రెండు పాయింట్లు సాధించి తొలి గేమ్‌ను భారత్‌కు దూరం చేసింది. రెండో గేమ్‌లో ఇరు జట్లు ఒక దశలో 6–6, 14–14తో సమంగా నిలిచినా చివర్లో వరుసగా ఐదు పాయింట్లు ఇచ్చి భారత జోడీ పరాజయం ఎదుర్కొంది. -
బ్యాడ్మింటన్‌లో మరో ‘జంట’
పెళ్లి చేసుకోనున్న సుమిత్, సిక్కి రెడ్డి సాక్షి, హైదరాబాద్: భారత బ్యాడ్మింటన్ డబుల్స్ క్రీడాకారులు సుమిత్ రెడ్డి, సిక్కి రెడ్డి ఒకింటి వారు కానున్నారు. హైదరాబాద్‌కు చెందిన సుమిత్, సిక్కి రెడ్డిల నిశ్చితార్థం ఫిబ్రవరి 1న జరుగనుంది. వివాహం డిసెంబరులో జరుగుతుంది. గతేడాది రియో ఒలింపిక్స్ పురుషుల డబుల్స్ విభాగంలో మనూ అత్రితో కలిసి 25 ఏళ్ల సుమిత్ భారత్ కు ప్రాతినిధ్యం వహించాడు. ఒలింపిక్స్ చరిత్రలో పురుషుల డబుల్స్ విభాగంలో పాల్ఠ్గన్న తొలి భారతీయ జోడీగా సుమిత్-మనూ అత్రి గుర్తింపు పొందింది. మనూ అత్రితో కలిసి సుమిత్ 2016లో కెనడా ఓపెన్, 2015లో మెక్సికో ఓపెన్ గ్రాండ్‌ప్రి డబులఖ్స టైటిల్స్ ను సాధించాడు. మరోవైపు 23 ఏళ్ల సిక్కి రెడ్డి గత ఏడాది మిక్స్డ్ డబుల్స్ విభాగంలో ప్రణవ్ చోప్రాతో కలిసి బ్రెజిలఖ ఓపెనఖ, రష్యా ఓపెన్ గ్రాండ్‌ప్రి టైటిల్స్ ను సొంతం చేసుకుంది. ప్రతిష్టాత్మక ‘ఉబెర్ కప్’లో రెండుసార్లు (2014, 2016లో) కాంస్యాలు సాధించిన... 2014 ఇంచియోన్ ఆసియా క్రీడల్లో కాంస్యం నెగ్గిన భారత జట్టులో సిక్కి రెడ్డి సభ్యురాలిగా ఉంది. భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు ‘జంట’గా మారడం కొత్తేం కాదు. గతంలో ‘అట్లాంటా ఒలింపియన్’... జాతీయ మాజీ చాంపియన్ పీవీవీ లక్ష్మిని ప్రస్తుత ? కోచ్ పుల్లెల గోపీచంద్; జాతీయ మాజీ చాంపియన్ సయాలీ గోఖలేను సాగర్ చోప్రా వివాహం చేసుకోగా... వారి బాటలోనే మరికొందరు నడుస్తున్నారు. గత నెలలో డబుల్స్ క్రీడాకారిణి ప్రద్న్యా గాద్రెను ప్రణవ్ చోప్రా పెళ్లాడగా... మహారాష్ట్ర క్రీడాకారిణి అరుంధతి పంతవానెను కేరళ ఆటగాడు అరుణ్ విష్ణు వివాహం చేసుకున్నాడు. -
రన్నరప్ సిక్కి-అశ్విని జంట
కార్డిఫ్: వేల్స్ ఓపెన్ ఇంటర్నేషనల్ చాలెంజ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో సిక్కి రెడ్డి-అశ్విని పొన్నప్ప (భారత్) ద్వయం రన్నరప్‌గా నిలిచింది. భారత కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి దాటాక జరిగిన మహిళల డబుల్స్ ఫైనల్లో సిక్కి-అశ్విని జోడీ 16-21, 11-21తో టాప్ సీడ్ ఓల్గా మొరోజోవా-అనస్తాసియా చెర్వికోవా (రష్యా) జంట చేతిలో ఓడిపోయింది. -
తుది పోరుకు సిక్కి-అశ్విని ద్వయం
న్యూఢిల్లీ: వేల్స్ ఓపెన్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో సిక్కి రెడ్డి-అశ్విని పొన్నప్ప (భారత్) జోడీ ఫైనల్‌కు చేరింది. శనివారం జరిగిన మహిళల డబుల్స్ సెమీఫైనల్లో సిక్కి-అశ్విని ద్వయం 21-16, 21-18తో సోఫీ బ్రౌన్-లారెన్ స్మిత్ (ఇంగ్లండ్) జంటపై విజయం సాధించింది. మిక్స్డ్ డబుల్స్‌లో మాత్రం హైదరాబాద్ క్రీడాకారిణి సిక్కి రెడ్డికి నిరాశ ఎదురైంది. సెమీఫైనల్లో సిక్కి-ప్రణవ్ చోప్రా జంట 16-21, 14-21తో గో సూన్ హువాట్-షెవోన్ జెమీ లాయ్ (మలేసియా) జోడీ చేతిలో ఓడిపోరుుంది. -
సెమీస్‌లో సిక్కి రెడ్డి-అశ్విని జంట
న్యూఢిల్లీ: వేల్స్ ఓపెన్ ఇంటర్నేషనల్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మారుు సిక్కి రెడ్డి మహిళల డబుల్స్ విభాగంలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. భారత్‌కే చెందిన అశ్విని పొన్నప్పతో జతకట్టిన సిక్కి రెడ్డి శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో 21-16, 21-18తో మూడో సీడ్ జెన్నీ మూర్-విక్టోరియా విలియమ్స్ (ఇంగ్లండ్) ద్వయంపై విజయం సాధించింది. మిక్స్డ్ డబుల్స్ విభాగంలో సహచరుడు ప్రణవ్ చోప్రాతో కలిసి సిక్కి రెడ్డి క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. రెండో రౌండ్లో సిక్కి-ప్రణవ్ జోడీ 21-16, 21-11తో మాక్స్ ఫ్లిన్-నికోలా గ్రిస్టీ (ఇంగ్లండ్) జంటపై గెలిచింది. పురుషుల సింగిల్స్ విభాగంలో సౌరభ్ వర్మ రెండో రౌండ్లోనే ఓటమి పాలయ్యాడు. -
రుత్విక, సిక్కి రెడ్డిలకు టైటిల్స్
సాక్షి, హైదరాబాద్: తమ విజయపరంపరను కొనసాగిస్తూ హైదరాబాద్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణులు గద్దె రుత్విక శివాని... సిక్కి రెడ్డి రష్యా ఓపెన్ గ్రాండ్‌ప్రి టోర్నమెంట్లో టైటిల్స్‌ను సొంతం చేసుకున్నారు. రష్యాలోని వ్లాదివోస్తోక్ నగరంలో ఆదివారం ముగిసిన ఈ టోర్నమెంట్లో రుత్విక శివాని మహిళల సింగిల్స్ విభాగంలో... సిక్కి రెడ్డి మిక్స్డ్ డబుల్స్ విభాగంలో విజేతలుగా నిలిచారు. మహిళల సింగిల్స్ ఫైనల్లో రుత్విక 21-10, 21-13తో ఎవగెనియా కొసెట్‌స్కాయ (రష్యా)పై గెలుపొందగా... మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లో సిక్కి రెడ్డి-ప్రణవ్ చోప్రా ద్వయం 21-17, 21-19తో వ్లాదిమిర్ ఇవనోవ్-వలెరియా సొరోకినా (రష్యా) జంటను ఓడించింది. విజేతలుగా నిలిచిన రుత్విక శివానికి 4,125 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 2 లక్షల 74 వేలు)తోపాటు 5500 ర్యాంకింగ్ పాయింట్లు... సిక్కి రెడ్డి జంటకు 4,345 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 2 లక్షల 89 వేలు)తోపాటు 5500 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఎవగెనియాతో జరిగిన ఫైనల్లో రుత్విక పూర్తి ఆధిపత్యం చలాయించింది. కేవలం 26 నిమిషాల్లోనే తన ప్రత్యర్థిని ఓడించి కెరీర్లో తొలిసారి గ్రాండ్‌ప్రి స్థాయి టైటిల్‌ను కై వసం చేసుకుంది. మరోవైపు సిక్కి రెడ్డి జంటకిది ఈ ఏడాది రెండో గ్రాండ్‌ప్రి టైటిల్. ఇంతకుముందు సిక్కి-ప్రణవ్ బ్రెజిల్ గ్రాండ్‌ప్రి టోర్నీలో విజేతగా నిలిచింది. అయితే పురుషుల సింగిల్స్ విభాగంలో హైదరాబాద్ ప్లేయర్ సిరిల్ వర్మకు నిరాశ ఎదురైంది. ఫైనల్లో సిరిల్ వర్మ 21-16, 19-21, 10-21తో జుల్ఫాద్లి జుల్కిఫ్లి (మలేసియా) చేతిలో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచాడు. సిరిల్ వర్మకు 2,090 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. లక్షా 39 వేలు)తోపాటు 4680 ర్యాంకింగ్ పాయింట్లు దక్కాయి. -
బ్రెజిల్ గ్రాండ్‌ప్రి విజేత సిక్కి రెడ్డి జంట
హైదరాబాద్: ఆద్యంతం నిలకడగా రాణించిన హైదరాబాద్ బ్యాడ్మింటన్ ప్లేయర్ సిక్కి రెడ్డి బ్రెజిల్ గ్రాండ్‌ప్రి టోర్నమెంట్లో మిక్స్డ్ డబుల్స్ టైటిల్‌ను సాధించింది. ఆదివారం బ్రెజిల్లో ముగిసిన ఈ టోర్నీ ఫైనల్లో టాప్ సీడ్ సిక్కి రెడ్డి-ప్రణవ్ చోప్రా (భారత్) ద్వయం 21-15, 21-16తో రెండో సీడ్ టోబీ ఎన్జీ-రాచెల్ హోండెరిచ్ (కెనడా) జోడీపై విజయం సాధించింది. టోర్నీ మొత్తంలో సిక్కి-ప్రణవ్ జంట తమ ప్రత్యర్థులకు ఒక్క గేమ్ కూడా కోల్పోకపోవడం విశేషం. ఇదే టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత్‌కే చెందిన ఆనంద్ పవార్ రన్నరప్‌గా నిలిచాడు. ఫైనల్లో ఆనంద్ పవార్ 21-18, 11-21, 17-21తో జుల్ఫాదిల్ జుల్కిఫిల్ (మలేసియా) చేతిలో ఓడిపోయాడు. -
సిక్కి జంటకే డబుల్స్ టైటిల్
సాక్షి, హైదరాబాద్: టాప్ సీడ్ హోదాకు తగ్గట్టు రాణించిన తెలంగాణ బ్యాడ్మింటన్ ప్లేయర్ సిక్కి రెడ్డి వరుసగా రెండో ఏడాది జాతీయ సీనియర్ చాంపియన్‌షిప్‌లో మహిళల డబుల్స్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. చండీగఢ్‌లో ఆదివారం ముగిసిన ఈ పోటీల్లో సిక్కి రెడ్డికి మిశ్రమ ఫలితాలు లభించాయి. మహారాష్ట్ర అమ్మాయి ప్రద్న్యా గాద్రెతో బరిలోకి దిగిన సిక్కి రెడ్డి డబుల్స్ ఫైనల్లో 22-20, 21-18తో రెండో సీడ్ అపర్ణా బాలన్-ప్రజక్తా సావంత్ (పీఎస్‌పీబీ) జంటను ఓడించింది. 44 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగినా కీలకదశలో సిక్కి జంట పైచేయి సాధించి టైటిల్‌ను ఖాయం చేసుకుంది. గతేడాది కూడా సిక్కి-ప్రద్న్యా జంటకే మహిళల డబుల్స్ టైటిల్ దక్కింది. మరోవైపు మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లో సిక్కి రెడ్డి-ప్రణవ్ చోప్రా (పీఎస్‌పీబీ) ద్వయం 20-22, 20-22తో అరుణ్ విష్ణు-అపర్ణా బాలన్ (పీఎస్‌పీబీ) జోడీ చేతిలో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచింది. సింగిల్స్ విభాగాల్లో ఇద్దరు కొత్త చాంపియన్లు అవతరించారు. అన్నదమ్ముల మధ్య జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో తమ్ముడు సమీర్ వర్మ (ఎయిరిండియా) 21-16, 21-16తో అన్న సౌరభ్ వర్మ (పీఎస్‌పీబీ)పై గెలిచి తొలిసారి జాతీయ చాంపియన్‌గా నిలిచాడు. మహిళల సింగిల్స్ ఫైనల్లో పి.సి.తులసి (కేరళ) 21-9, 21-13తో టాప్ సీడ్ తాన్వీ లాడ్ (పీఎస్‌పీబీ)పై నెగ్గి మొదటిసారి జాతీయ విజేతగా నిలిచింది. -
ఫైనల్లో సిక్కిరెడ్డి జోడి
శ్రీలంక ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ సాక్షి, హైదరాబాద్ : శ్రీలంక ఇంటర్నేషనల్ చాలెంజ్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత అమ్మాయిలు సిక్కి రెడ్డి-ప్రద్నా గాద్రె జోడి ఫైనల్లోకి దూసుకెళ్లింది. మహిళల సింగిల్స్ సెమీస్‌లో రెండోసీడ్ సిక్కి-ప్రద్నా 21-18, 21-9తో కైలాస్ ఆస్టర్మేయర్-నచ్చ సెంగ్చోటే (థాయ్‌లాండ్)పై గెలిచారు. మరో మ్యాచ్‌లో అపర్ణా బాలన్-ప్రజక్తా సావంత్ జోడి పోరాడి ఓడింది. మూడోసీడ్ చాయనిత్-మెనువాంగ్ (థాయ్‌లాండ్) 21-18, 21-19తో అపర్ణా-ప్రజక్తాలపై నెగ్గారు. మిక్స్డ్ డబుల్స్‌లో అరుణ్ విష్ణు-అపర్ణా బాలన్ జోడి టైటిల్ పోరుకు వెళ్లింది. సెమీస్‌లో ఈ జంట 21-19, 21-12తో ఇంద్ర మవాన్ (మలేసియా)-ప్రజక్తా సావంత్ (భారత్)లపై గెలిచింది. -
సిక్కిరెడ్డి జోడీకి ‘పోలిష్’టైటిల్
అర్లామౌ (పోలండ్): పోలిష్ ఓపెన్ ఇంటర్నేషనల్ చాలెంజ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌ను హైదరాబాద్ అమ్మాయి సిక్కిరెడ్డి జోడి గెలుచుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో సిక్కిరెడ్డి, ప్రద్య్నా గాద్రె (భారత్) జంట 21-16, 21-18 తేడాతో అలెక్స్ బ్రూస్, ఫిల్లిస్ చాన్ (కెనడా)ను ఓడించింది. ప్రారంభం నుంచే దూకుడును ప్రదర్శించిన భారత జోడి ఏ దశలోనూ ప్రత్యర్థికి అవకాశం ఇవ్వలేదు. -
సెమీస్‌లో సిక్కి రెడ్డి జంట
అర్లామౌ (పోలండ్): పోలిష్ ఓపెన్ ఇంటర్నేషనల్ చాలెంజ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి సిక్కి రెడ్డి తన భాగస్వామి ప్రద్న్యా గాద్రె (భారత్)తో కలిసి సెమీఫైనల్లోకి ప్రవేశించింది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో సిక్కి రెడ్డి-ప్రద్న్యా గాద్రె ద్వయం 21-19, 11-21, 21-14తో సెయి పె చెన్-వూ తి జంగ్ (చైనీస్ తైపీ) జోడీపై గెలిచింది. -
సిక్కి రెడ్డి-తరుణ్ జంటకు టైటిల్
రుమేనియా ఇంటర్నేషనల్ టోర్నీ సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయస్థాయిలో నిలకడగా రాణిస్తోన్న తెలంగాణ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సిక్కి రెడ్డి తన ఖాతాలో మరో టైటిల్‌ను జమ చేసుకుంది. హైదరాబాద్‌కే చెందిన కోనా తరుణ్‌తో కలిసి సిక్కి రెడ్డి రుమేనియా ఇంటర్నేషనల్ సిరీస్‌లో మిక్స్డ్ డబుల్స్ టైటిల్‌ను సొంతం చేసుకుం ది. తిమిసోరా పట్టణంలో ఆదివారం జరిగిన ఫైనల్లో సిక్కి రెడ్డి-తరుణ్ ద్వయం 11-7, 11-8, 11-4తో రెండో సీడ్ జోన్స్ రఫ్లీ జాన్సెన్-సిస్టియా జోటీ జాన్సెన్ (జర్మనీ) జంటను ఓడించింది. -
ఆమె నిజమైన ఫ్రెండ్ కాదు!
సైనా నెహ్వాల్ తనకు నిజమైన ఫ్రెండ్ కాదంటోంది బ్యాడ్మింటన్ తెలుగు తేజం పీవీ సింధు. సంచలన విజయాలతో దూసుకుపోతున్న సింధు తన గురించి పలు విషయాలు మీడియాతో పంచుకుంది. సైనాకు తనకు స్నేహం లేదని అలాగని శత్రుత్వం కూడా లేదని తెలిపింది. తాము 'హాయ్', 'హల్లో' మిత్రులమని స్పష్టం చేసింది. ఆటల్లో తాము సహ క్రీడాకారులమని పేర్కొంది. సిక్కి రెడ్డి(డబుల్స్ ప్లేయర్) తనకు మించి మిత్రురాలని, అన్ని విషయాలు ఆమెతో షేర్ చేసుకుంటానని వెల్లడించింది. తనకు తెలుగు సినిమాలంటే ఇష్టమని తెలిపింది. మహేష్‌బాబు, ప్రభాస్ తన అభిమాన నటులని చెప్పింది. అయితే సినిమా హిట్ అయితేనే చూస్తానని, ఫ్లాప్ అయితే చూడబోనని స్పష్టం చేసింది, విమాన ప్రయాణాల్లోనే సినిమాలు చూస్తానని... వీలు కుదిరితే స్నేహితులు, తల్లిదండ్రులతో కలిసి థియేటర్లను వెళతానని వెల్లడించింది. తనను ఎవరూ గమనించనప్పుడు మ్యూజిక్ వింటూ డాన్స్ చేస్తుంటానని చెప్పింది. ఇప్పటివరకు ప్రేమలో పడలేదని, తనకెవరూ బాయ్ఫెండ్ లేరని సింధు తెలిపింది. తన అక్క అంటే ఎంతో ఇష్టమని తెలిపింది. అయితే లక్నో గ్రాండ్ పిక్స్ టోర్నమెంట్ కారణంగా ఆమె పెళ్లికి హాజరుకాలేకపోయానని చెప్పింది. ఎనిమిదో తరగతి వరకు స్కూల్ కు మానకుండా వెళ్లేదాన్నని, బ్యాడ్మింటన్ ను సీరియస్ గా తీసుకున్నాక పాఠశాలకు ఎక్కువగా వెళ్లలేకపోయేదాన్ని అని వివరించింది. మాస్కోలో టోర్ని కారణంగా టెన్త్ క్లాస్ పరీక్షలు కూడా రాయలేకపోయానని వెల్లడించింది. 19 ఏళ్ల సింధు ఇప్పుడు బికామ్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. 18 ఏళకే అర్జున అవార్డు అందుకున్న సింధు అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని టైటిల్స్ సాధించాలన్న పట్టుదలతో ఉంది.