కరోనా బారిన షట్లర్‌ సిక్కి రెడ్డి | Badminton Player Sikky Reddy Tested Positive For Coronavirus | Sakshi
Sakshi News home page

కరోనా బారిన షట్లర్‌ సిక్కి రెడ్డి

Published Fri, Aug 14 2020 2:01 AM | Last Updated on Fri, Aug 14 2020 5:00 AM

Badminton Player Sikky Reddy Tested Positive For Coronavirus - Sakshi

ఈ నెల 7న అకాడమీలో తొలి రోజు సిక్కి రెడ్డి 

సాక్షి, హైదరాబాద్‌: దాదాపు ఐదు నెలల విరామం తర్వాత... ఈనెల 7న మొదలైన జాతీయ బ్యాడ్మింటన్‌ శిక్షణ శిబిరానికి కరోనా వైరస్‌ కారణంగా ఆదిలోనే అంతరాయం ఏర్పడింది. గచ్చిబౌలిలోని పుల్లెల గోపీచంద్‌ అకాడమీలో జరుగుతున్న ఈ శిబిరంలో పాల్గొంటున్న మహిళల డబుల్స్‌ స్టార్‌ షట్లర్‌ నేలకుర్తి సిక్కి రెడ్డి, ఫిజియోథెరపిస్ట్‌ చల్లగుండ్ల కిరణ్‌ కరోనా వైరస్‌ బారిన పడ్డారు. భారత స్పోర్ట్స్‌ అథారిటీ (సాయ్‌) కచ్చితమైన నిబంధనల ప్రకారం శిబిరంలో పాల్గొంటున్న క్రీడాకారులు, కోచ్‌లు, సహాయక సిబ్బందికి కలిపి మొత్తం 20 మందికి మంగళవారం కోవిడ్‌–19 పరీక్షలు నిర్వహించారు. ఇందులో ప్రపంచ చాంపియన్‌ పీవీ సింధు, ఆమె తండ్రి పీవీ రమణ, చీఫ్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్, సాయిప్రణీత్, కిడాంబి శ్రీకాంత్‌ సహా 18 మందికి నెగెటివ్‌ ఫలితం రాగా... సిక్కి రెడ్డి, ఫిజియోథెరపిస్ట్‌ కిరణ్‌లకు కరోనా పాజిటివ్‌ తేలిందని భారత బ్యాడ్మింటన్‌ సంఘం (బాయ్‌) ఒక ప్రకటనలో తెలిపింది.

అయితే వీరిద్దరికీ ఎలాంటి లక్షణాలు లేవని ‘బాయ్‌’ వివరించింది. శానిటైజ్‌ చేసేందుకు అకాడమీని తాత్కాలికంగా మూసివేశారు. మంగళవారం కరోనా పరీక్షలకు హాజరైన వారందరూ  శుక్రవారం స్థానిక కార్పొరేట్‌ ఆసుపత్రిలో మరోసారి కోవిడ్‌ టెస్టులు చేయించుకుంటారని తెలిసింది. సిక్కి రెడ్డి, కిరణ్‌ ప్రైమరీ కాంటాక్ట్‌లను గుర్తించి వారందరికీ ఆర్‌టీ–పీసీఆర్‌ పరీక్ష చేయనున్నారు. ‘భారత స్పోర్ట్స్‌ అథారిటీ నిబంధనల ప్రకారం జాతీయ శిక్షణ శిబిరంతో సంబంధం ఉన్న క్రీడాకారులకు, కోచ్‌లకు, సహాయ సిబ్బందికి, కార్యాలయ సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇందులో ఇద్దరికి పాజిటివ్‌ వచ్చింది. కోచింగ్‌ క్యాంప్‌ మళ్లీ సజావుగా సాగేందుకు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాం. సాధ్యమైనంత త్వరలో మళ్లీ శిబిరం ప్రారంభమవుతుందని ఆశిస్తున్నాం’ అని జాతీయ చీఫ్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ వ్యాఖ్యానించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement