గతేడాది విశ్వ విజేతగా అవతరించి అందరిచేతా శభాష్ అనిపించుకోవడంతోపాటు విమర్శకుల నోళ్లు మూయించిన తెలుగు తేజం, భారత స్టార్ షట్లర్ పూసర్ల వెంకట (పీవీ) సింధు కొత్త ఏడాదిలో తొలి టైటిల్ కోసం వేట మొదలు పెట్టనుంది. బ్యాడ్మింటన్‌లో అతి పురాతనమైన, అత్యంత ప్రతిష్టాత్మక టోర్నీగా భావించే ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ టోర్నమెంట్‌లో టైటిల్ నెగ్గడమే లక్ష్యంగా 24 ఏళ్ల సింధు బరిలోకి దిగనుంది. ఈ సీజన్‌లో మలేసియా మాస్టర్స్, ఇండోనేసియా మాస్టర్స్ టోర్నీల్లో ఆడిన ఈ ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి క్వార్టర్ ఫైనల్ అడ్డంకిని దాటలేకపోయింది. ఈ రెండు టోర్నీల తర్వాత దాదాపు 50 రోజుల విరామం లభించడంతో సింధు ఆల్ ఇంగ్లండ్ ఓపెన్‌కు పకడ్బందీగా సిద్ధమైంది. కోవిడ్–19 వైరస్ నేపథ్యంలో పలువురు సహచర క్రీడాకారులు ఈ టోర్నీ నుంచి వైదొలిగినా సింధు మాత్రం ఆల్ ఇంగ్లండ్ ఓపెన్‌కు సమాయత్తమయింది. సింధుతోపాటు మాజీ రన్నరప్ సైనా నెహ్వాల్... పురుషుల సింగిల్స్‌లో మాజీ నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్, సాయిప్రణీత్, పారుపల్లి కశ్యప్ ఈ మెగా టోర్నమెంట్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
బర్మింగ్‌హామ్: పద్దెనిమిదేళ్లుగా భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులను ఊరిస్తోన్న ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ టైటిల్‌ను సాధించాలనే తపనతో మరోసారి మనోళ్లు సమాయత్తమయ్యారు. నేటి నుంచి మొదలయ్యే ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 టోర్నమెంట్‌లో సింధుతోపాటు సైనా, శ్రీకాంత్, సాయిప్రణీత్, కశ్యప్, లక్ష్య సేన్ సింగిల్స్ బరిలో ఉన్నారు. ముందుగా ఎంట్రీలు పంపించినా... కోవిడ్–19 వైరస్ నేపథ్యంలో ఏడుగురు భారత ఆటగాళ్లు (సింగిల్స్‌లో ప్రణయ్, సమీర్ వర్మ, సౌరభ్ వర్మ; డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి; సుమీత్ రెడ్డి–మనూ అత్రి జోడీలు) ఈ టోర్నీ నుంచి వైదొలిగారు. శతాబ్దంకంటే ఎక్కువ చరిత్ర ఉన్న ఈ టోర్నీలో భారత్ నుంచి ఇద్దరు మాత్రమే చాంపియన్స్‌గా నిలిచారు. ప్రకాశ్ పదుకొనే (1980లో), పుల్లెల గోపీచంద్ (2001లో) ఈ ఘనత వహించారు. 2001 తర్వాత 2015లో సైనా నెహ్వాల్ మాత్రమే ఒకసారి ఫైనల్‌కు చేరుకొని తుది మెట్టుపై తడబడి రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకుంది.
తొలి రౌండ్‌లోనే...
110వ సారి నిర్వహిస్తున్న ఈ టోర్నీలో ఈసారి భారత క్రీడాకారులకు క్లిష్టమైన ‘డ్రా’ ఎదురైంది. మహిళల సింగిల్స్‌లో ప్రపంచ చాంపియన్ పీవీ సింధు తొలి రౌండ్‌లో చైనా సంతతికి చెందిన అమెరికా ప్లేయర్ బీవెన్ జాంగ్‌తో... ప్రపంచ మూడో ర్యాంకర్ అకానె యామగుచి (జపాన్)తో సైనా నెహ్వాల్ తలపడనున్నారు. గెలుపోటముల ముఖాముఖి రికార్డులో సింధు 5–4తో ఆధిక్యంలో ఉండగా... సైనా మాత్రం 2–8తో వెనుకబడి ఉంది. ఒకవేళ సింధు, సైనా తొలి రౌండ్ అడ్డంకి దాటినా తర్వాత రౌండ్‌లలో వీరిద్దరికి క్లిష్టమైన ప్రత్యర్థులే ఎదురుకానున్నారు. సింధు తొలి రౌండ్‌లో గెలిస్తే ప్రిక్వార్టర్ ఫైనల్లో సుంగ్ జీ హున్ (కొరియా) లేదా నిచావోన్ జిందాపోల్ (థాయ్‌లాండ్) ఎదురుపడతారు. ఇందులోనూ గెలిస్తే క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ మాజీ చాంపియన్ నొజోమి ఒకుహారాతో సింధు ఆడే అవకాశం ఉంటుంది. సెమీఫైనల్లో వరల్డ్ నంబర్‌వన్ చెన్ యుఫె (చైనా) లేదా ప్రపంచ మాజీ చాంపియన్ రచనోక్ (థాయ్‌లాండ్) సింధుకు ఎదురుకావొచ్చు. మరోవైపు సైనా తొలి రౌండ్‌ను దాటితే ప్రిక్వార్టర్ ఫైనల్లో సయాక తకహాషి (జపాన్), క్వార్టర్ ఫైనల్లో రియో ఒలింపిక్స్ చాంపియన్ కరోలినా మారిన్ (స్పెయిన్)... సెమీఫైనల్లో రెండో సీడ్ తై జు యింగ్ (చైనీస్ తైపీ) లేదా ఏడో సీడ్ హి బింగ్‌జియావో (చైనా) ప్రత్యర్థులుగా ఉంటారు. ఈ నేపథ్యంలో ఈసారైనా సింధు, సైనా అద్భుతం చేస్తారో లేదో వేచి చూడాలి.
శ్రీకాంత్ గాడిలో పడేనా!
కొంతకాలంగా ఫామ్ కోల్పోయి తడబడుతోన్న ప్రపంచ మాజీ నంబర్‌వన్, ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్‌కు తొలి రౌండ్‌లోనే రియో ఒలింపిక్స్ చాంపియన్ చెన్ లాంగ్ (చైనా) ఎదురుకానున్నాడు. ఈ ఏడాది శ్రీకాంత్ నాలుగు టోర్నీలు ఆడగా మూడింటిలో తొలి రౌండ్‌లోనే ఓడిపోయి, మరో టోర్నీలో ప్రిక్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించాడు. గతేడాది ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం నెగ్గిన భమి డిపాటి సాయిప్రణీత్ తొలి రౌండ్‌లో జావో జున్‌పెంగ్ (చైనా)తో... లీ చెయుక్ యియు (హాంకాంగ్)తో లక్ష్య సేన్... రుస్తావిటో (ఇండోనేసియా)తో కశ్యప్ తలపడనున్నారు. మొత్తం 11 లక్షల డాలర్ల ప్రైజ్‌మనీతో నిర్వహిస్తున్న ఈ టోర్నీలో పురుషుల, మహిళల సింగిల్స్ విభాగాల్లో విజేతలుగా నిలిచిన వారికి 77 వేల డాలర్ల చొప్పున (రూ. 57 లక్షలు) అందజేస్తారు.
పురుషుల డబుల్స్‌లో ఈసారి భారత్ నుంచి ప్రాతినిధ్యం లేకుండా పోయింది. మహిళల డబుల్స్‌లో నేలకుర్తి సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప; దండు పూజ–సంజన సంతోష్ జోడీలు... మిక్స్‌డ్ డబుల్స్‌లో సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా జంట బరిలో ఉన్నాయి.
అశ్విని, సిక్కి రెడ్డి, ప్రణవ్ చోప్రా, లక్ష్య సేన్
►1900 ఆల్ ఇంగ్లండ్ టోర్నీ ప్రారంభమైన ఏడాది. తొలి, రెండో ప్రపంచ యుద్ధ సమయాల్లో మినహా మిగతా సంవత్సరాలలో ఈ టోర్నీ కొనసాగింది.
►2 ఆల్ ఇంగ్లండ్ ఓపెన్‌లో అత్యధిక టైటిల్స్ నెగ్గిన దేశాల సంఖ్య. చైనా, డెన్మార్క్ ఆటగాళ్లు 20 సార్లు చొప్పున ఈ టోర్నీలో విజేతగా నిలిచారు.
►1 ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ టైటిల్‌ను అత్యధికసార్లు గెలిచిన ప్లేయర్ రూడీ హర్తానో. ఇండోనేసియాకు చెందిన రూడీ హర్తానో ఓవరాల్‌గా ఎనిమిదిసార్లు విజేతగా నిలువగా... 1968 నుంచి 1974 వరకు వరుసగా ఏడేళ్లు టైటిల్ గెలిచాడు.
►7 ఇప్పటివరకు సింధు ఏడుసార్లు ఆల్ ఇంగ్లండ్ టోర్నీలో ఆడింది. 2018లో సెమీఫైనల్ చేరడమే ఆమె అత్యుత్తమ ప్రదర్శన. 2017లో క్వార్టర్ ఫైనల్ చేరిన సింధు నాలుగుసార్లు (2012, 2014, 2016, 2019) తొలి రౌండ్‌లో, ఒకసారి రెండో రౌండ్‌లో (2013) ఓడిపోయింది.
►14 ఆల్ ఇంగ్లండ్ టోర్నీలో సైనా ఆడనుండటం ఇది వరుసగా 14వ ఏడాది. 2007 నుంచి ఈ టోర్నీలో ఆడుతున్న సైనా ఒకసారి ఫైనల్, రెండుlసార్లు సెమీస్, ఆరుసార్లు క్వార్టర్ ఫైనల్ చేరింది.
Comments
Please login to add a commentAdd a comment