All England Badminton tournament
-
All England Badminton 2024: సాత్విక్–చిరాగ్ జోడీపైనే ఆశలు!
బర్మింహమ్: ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత ప్లేయర్‌కు చివరిసారి 2001లో టైటిల్ లభించింది. ఆనాడు పురుషుల సింగిల్స్ విభాగంలో ప్రస్తుత టీమిండియా హెడ్ కోచ్ పుల్లెల గోపీచంద్ విజేతగా నిలిచాడు. ఆ తర్వాత 2015లో మహిళల సింగిల్స్‌లో సైనా నెహ్వల్... 2022లో పురుషుల సింగిల్స్‌లో లక్ష్య సేన్ ఫైనల్ చేరి రన్నరప్ ట్రోఫీలతో సరిపెట్టుకున్నారు. అయితే ఈసారి పురుషుల డబుల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టిలపై భారత బృందం భారీ ఆశలు పెట్టుకుంది. ఈ సీజన్లో వీరిద్దరు అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. ఆడిన మూడు టోరీ్నల్లోనూ (మలేసియా మాస్టర్స్, ఇండియా ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్) ఫైనల్ చేరారు. రెండింటిలో రన్నరప్‌గా నిలిచారు. ఆదివారం ముగిసిన ఫ్రెంచ్ ఓపెన్‌లో టైటిల్ కూడా దక్కించుకున్నారు. అంతా సవ్యంగా సాగితే... నేడు మొదలయ్యే ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్‌లో భారత బృందం 23 ఏళ్ల టైటిల్ నిరీక్షణకు తెరదించే అవకాశాలున్నాయి. కానీ ఈసారి అన్ని విభాగాల్లోనూ భారత క్రీడాకారులకు క్లిష్టమైన ‘డ్రా’ ఎదురైంది. తొలి రౌండ్ దాటాక ప్రతి మ్యాచ్‌లో మేటి ప్రత్యర్థులు సిద్ధంగా ఉండనున్నారు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో మాజీ చాంపియన్ మొహమ్మద్ అహ్సాన్–హెండ్రా సెతియవాన్ (ఇండోనేసియా)లతో సాత్విక్–చిరాగ్ తలపడతారు. సాత్విక్ ద్వయం ఈ అడ్డంకి దాటితే ప్రిక్వార్టర్ ఫైనల్లో షోహిబుల్ ఫిక్రి–మౌలానా బగస్ (ఇండోనేసియా) జోడీ.. క్వార్టర్ ఫైనల్లో ఆరోన్ చియా–సో వుయ్ యిక్ (మలేసియా) జంట ఎదురయ్యే చాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో సాత్విక్–చిరాగ్ జోడీ ప్రతి మ్యాచ్‌లో విశేషంగా రాణించాల్సి ఉంటుంది. ఇక పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో టాప్ సీడ్ అక్సెల్సన్ (డెన్మార్క్)తో కిడాంబి శ్రీకాంత్; సు లి యాంగ్ (చైనీస్ తైపీ)తో ప్రణయ్; ఎన్జీ జె యోంగ్ (మలేసియా)తో లక్ష్య సేన్; వర్దాయో (ఇండోనేసియా)తో ప్రియాన్షు తలపడతారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో వ్యోన్ లి (బెల్జియం)తో పీవీ సింధు ఆడుతుంది. ఈ మ్యాచ్‌లో సింధు గెలిస్తే ప్రిక్వార్టర్ ఫైనల్లో ఆమె ప్రత్యరి్థగా ప్రపంచ చాంపియన్, వరల్డ్ నంబర్‌వన్ ఆన్ సె యంగ్ (దక్షిణ కొరియా)తో ఉండనుంది. మహిళల డబుల్స్‌లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ; అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో జోడీలు బరిలో ఉన్నాయి. -
సంచలన విజయాలతో సెమీస్‌కు దూసుకెళ్లిన గాయత్రి – ట్రెసా జోడీ
బర్మింగ్‌హామ్: ప్రతిష్టాత్మక బీడబ్ల్యూఎఫ్ టూర్ సూపర్ 1000 టోర్నీ ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్‌లో పుల్లెల గాయత్రి గోపీచంద్ – ట్రెసా జాలీ దూకుడు కొనసాగుతోంది. మహిళల డబుల్స్‌లో గాయత్రి – ట్రెసా జంట వరుసగా రెండో ఏడాది ఈ టోర్నీ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో భారత ద్వయం 21–14, 18–21, 21–12 స్కోరుతో లీ వెన్ మీ – ల్యూ వాన్ వాన్ (చైనా)పై విజయం సాధించింది. 64 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన ఈ పోరులో ప్రపంచ 17వ ర్యాంక్ జోడి గాయత్రి – ట్రెసా అటు అటాకింగ్, ఇటు డిఫెన్స్‌లో చెలరేగింది. గత ఏడాది కామన్వెల్త్ క్రీడల్లో కాంస్యం సాధించినప్పటినుంచి వరుస విజయాలతో సత్తా చాటుతున్న భారత జంట అదే జోరును ఇక్కడా ప్రదర్శించింది. తొలి గేమ్‌ను ధాటిగా ప్రారంభించిన గాయత్రి – ట్రెసా 6–2తో ఆధిక్యంలోకి దూసుకెళ్లారు. అయితే చైనా జంట 6–6తో స్కోరును సమం చేసింది. ఈ దశలో మళ్లీ చెలరేగిన భారత జోడి ముందుగా 11–8తో ఆధిక్యం ప్రదర్శించి ఆ తర్వాత వరుస పాయింట్లతో 18–12కు దూసుకెళ్లి ఆపై గేమ్‌ను సొంతం చేసుకుంది. రెండో గేమ్‌లో మాత్రం భారత జంటకు గట్టి పోటీ ఎదురైంది. ఏ దశలోనూ ఆధిక్యం అందుకోలేకపోయిన గాయత్రి – ట్రెసా గేమ్‌ను కోల్పోయారు. చివరి గేమ్‌లో మాత్రం మన జట్టుదే హవా నడిచింది. వరుసగా ఆరు పాయింట్లతో 8–1తో ముందంజ వేసిన అనంతరం స్కోరు 11–4..13–5..15–8..18–10...ఇలా సాగింది. 20–12 వద్ద గాయత్రి కొట్టిన ఫోర్‌హ్యాండ్ స్మాష్‌తో భారత జంట విజయం ఖాయమైంది. సెమీ ఫైనల్లో కొరియాకు చెందిన బేక్ హ నా – లీ సొ హితో గాయత్రి – ట్రెసా తలపడతారు. -
క్వార్టర్ ఫైనల్లో లక్ష్యసేన్
ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ తెలుగుతేజం పీవీ సింధుకు మళ్లీ నిరాశనే మిగిల్చింది. ఒలింపిక్స్, ప్రపంచ చాంపియన్‌షిప్, కామన్వెల్త్, ఆసియా గేమ్స్ల్లో పతకాలు సాధించిన స్టార్‌కు ‘ఆల్‌ఇంగ్లండ్’ మాత్రం మరోసారి అందని ద్రాక్షే అయ్యింది. పురుషుల సింగిల్స్‌లో యువ సంచలనం లక్ష్యసేన్ భారత ఆశల పల్లకిని మోస్తున్నాడు. మూడో సీడ్ అంటోన్సెన్ను కంగుతినిపించి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. బర్మింగ్‌హామ్: భారత రైజింగ్ స్టార్ లక్ష్యసేన్ టోర్నీ టోర్నీకి తన రాకెట్ పదును పెంచుతున్నాడు. తాజాగా ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో దూసుకెళ్తున్నాడు. అన్‌సీడెడ్ లక్ష్యసేన్ ప్రిక్వార్టర్స్‌లో మూడో సీడ్ అండర్స్ అంటోన్సెన్‌పై సంచలన విజయం సాధించాడు. గతేడాది ఆల్ ఇంగ్లండ్ టోర్నీ, ప్రపంచ చాంపియన్‌షిప్ సెమీఫైనలిస్ట్ అయిన అంటొన్సెన్‌ను ఈ సారి ప్రిక్వార్టర్స్‌లోనే ఇంటిదారి పట్టించాడు. పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్ ఓడిపోగా... మహిళల సింగిల్స్‌లో వెటరన్ స్టార్ సైనా నెహ్వాల్, మాజీ ప్రపంచ చాంపియన్ సింధులకు నిరాశ ఎదురైంది. తమ ప్రత్యర్థుల చేతుల్లో ప్రిక్వార్టర్స్‌లో ఇద్దరూ పోరాడి ఓడారు. డబుల్స్‌లో గాయత్రీ–ట్రెసా జాలీ, సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ షెట్టి జోడీలు క్వార్టర్స్ చేరాయి. వరుస గేముల్లోనే... ప్రపంచ చాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత లక్ష్యసేన్ పట్టుదలతో ముందంజ వేస్తున్నాడు. గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో అతను 21–16, 21–18తో ప్రపంచ మూడో ర్యాంకర్ అండర్స్ అంటొన్సెన్ (డెన్మార్క్)పై అసాధారణ విజయం సాధించాడు. అంతర్జాతీయ టోర్నీలో తనకెదురైంది టాప్–3 ప్లేయర్ అయినా... లక్ష్యసేన్ మాత్రం ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా యథేచ్ఛగా తన ‘మిషన్’ పూర్తిచేశాడు. తొలి గేమ్‌లో 11–9తో ఆధిక్యంలోకి వచ్చాక మళ్లీ వెనుదిరిగి చూడలేదు. నెట్ వద్ద పాదరసంలా కదిలిన భారత ఆటగాడు అదేజోరు గేమ్‌ను వశం చేసుకున్నాడు. ఇండోనేసియా మాస్టర్స్ టోర్నీ రన్నరప్ అయిన అంటొన్సెన్ రెండో గేమ్‌లో సత్తాచాటాడు. దీంతో ఈ గేమ్ హోరాహోరీగా సాగింది. దీంతో రెండుసార్లు 14–14, 16–16వద్ద స్కోరు సమమైంది. వరుసగా రెండు పాయింట్లు సాధించి 18–16తో ఆధిక్యంలోకి వచ్చిన లక్ష్యషేన్ తర్వాత చకచకా పాయింట్లు సాధించి గేమ్‌తో పాటు మ్యాచ్‌ను గెలుచుకున్నాడు. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్లో భారత యువ షట్లర్... చైనాకు చెందిన లు గ్వాంగ్ జుతో తలపడతాడు. మరో ప్రిక్వార్టర్స్‌లో శ్రీకాంత్ 21–9, 18–21, 19–21తో ఐదో సీడ్ ఆంథోని సిన్సుకా (ఇండోనేసియా) చేతిలో కంగుతిన్నాడు. సింధు... మరో ‘సారీ’ ప్రతిష్టాత్మక టోర్నీల్లో పతకాలు గెలిచిన పూసర్ల వెంకట సింధుకు ఎందుకనో ఆల్ ఇంగ్లండ్ కలిసిరావడం లేదు. ఈ ఏడాదీ ఆమె పతకం లేకుండానే నిష్క్రమించింది. ప్రిక్వార్టర్స్‌లో ఆరో సీడ్ సింధు 19–21, 21–16, 17–21తో సయాక టకహషి (జపాన్) చేతిలో పరాజయం పాలైంది. సైనా నెహ్వాల్ 14–21, 21–17, 17–21తో రెండో సీడ్ యామగుచి (జపాన్) చేతిలో ఓడింది. ఫలితం నిరాశపరిచినప్పటికీ మాజీ ప్రపంచ నంబర్‌వన్ ఈ మ్యాచ్‌లో తన ఆటతీరుతో ఆకట్టుకుంది. మహిళల డబుల్స్ ప్రిక్వార్టర్స్‌లో పుల్లెల గాయత్రీ–ట్రెసా జాలీ తొలి గేమ్ కోల్పోయి రెండో గేమ్‌లో దూసుకెళుతుండగా 18–21, 19–14 స్కోరువద్ద ఆరో సీడ్ ప్రత్యర్థి జోడీ గ్రేసియా–అప్రియని (ఇండోనేసియా) రిటైర్ట్ హర్ట్‌గా వెనుదిరిగింది. దీంతో భారత జోడీ ముందంజ వేసింది. పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ షెట్టి జోడీ 21–7, 21–7తో మార్క్ లామ్స్‌ఫుజ్–మార్విన్ సీడెల్ (జర్మనీ) ద్వ యంపై ఏకపక్ష విజయాన్ని సాధించింది. కేవలం 27 నిమిషాల్లోనే భారత జంట మ్యాచ్‌ను ముగించింది. -
చాంప్స్ తై జు యింగ్, అక్సెల్సన్
బర్మింగ్‌హామ్: ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ మాజీ నంబర్‌వన్ విక్టర్ అక్సెల్సన్ (డెన్మార్క్)... మహిళల సింగిల్స్‌లో ప్రపంచ రెండో ర్యాంకర్ తై జు యింగ్ (చైనీస్ తైపీ) చాంపియన్స్‌గా నిలిచారు. 120 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ టోర్నమెంట్లో ఆదివారం జరిగిన ఫైనల్స్‌లో అక్సెల్సన్ 21–13, 21–14తో ప్రపంచ రెండో ర్యాంకర్, టాప్ సీడ్ చౌ తియెన్ చెన్ (చైనీస్ తైపీ)పై నెగ్గగా... తై జు యింగ్ 21–19, 21–15తో టాప్ సీడ్, ప్రపంచ నంబర్‌వన్ చెన్ యుఫె (చైనా)ను బోల్తా కొట్టించింది. 1999లో పీటర్ గేడ్ తర్వాత ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ టైటిల్‌ను గెలిచిన తొలి డెన్మార్క్ ప్లేయర్‌గా అక్సెల్సన్ గుర్తింపు పొందాడు. సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన అక్సెల్సన్, తై జు యింగ్‌లకు 77 వేల డాలర్ల చొప్పున (రూ. 57 లక్షలు) ప్రైజ్‌మనీ లభించింది. -
సింధు నిష్క్రమణ
బర్మింగ్‌హామ్: ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 టోర్నమెంట్లో ఈసారైనా టైటిల్ సొంతం చేసుకోవాలని ఆశించిన భారత స్టార్ ప్లేయర్ పీవీ సింధుకు నిరాశ ఎదురైంది. ప్రపంచ మాజీ చాంపియన్ ఒకుహారా (జపాన్)తో శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో ప్రస్తుత ప్రపంచ చాంపియన్ పీవీ సింధు 21–12, 15–21, 13–21తో పరాజయం పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. 68 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో సింధు తొలి గేమ్‌లో అద్భుతంగా ఆడినా... రెండో గేమ్ నుంచి తడబడింది. అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకుంది. -
ఈసారైనా సాధించేనా!
గతేడాది విశ్వ విజేతగా అవతరించి అందరిచేతా శభాష్ అనిపించుకోవడంతోపాటు విమర్శకుల నోళ్లు మూయించిన తెలుగు తేజం, భారత స్టార్ షట్లర్ పూసర్ల వెంకట (పీవీ) సింధు కొత్త ఏడాదిలో తొలి టైటిల్ కోసం వేట మొదలు పెట్టనుంది. బ్యాడ్మింటన్‌లో అతి పురాతనమైన, అత్యంత ప్రతిష్టాత్మక టోర్నీగా భావించే ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ టోర్నమెంట్లో టైటిల్ నెగ్గడమే లక్ష్యంగా 24 ఏళ్ల సింధు బరిలోకి దిగనుంది. ఈ సీజన్లో మలేసియా మాస్టర్స్, ఇండోనేసియా మాస్టర్స్ టోర్నీల్లో ఆడిన ఈ ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి క్వార్టర్ ఫైనల్ అడ్డంకిని దాటలేకపోయింది. ఈ రెండు టోర్నీల తర్వాత దాదాపు 50 రోజుల విరామం లభించడంతో సింధు ఆల్ ఇంగ్లండ్ ఓపెన్‌కు పకడ్బందీగా సిద్ధమైంది. కోవిడ్–19 వైరస్ నేపథ్యంలో పలువురు సహచర క్రీడాకారులు ఈ టోర్నీ నుంచి వైదొలిగినా సింధు మాత్రం ఆల్ ఇంగ్లండ్ ఓపెన్‌కు సమాయత్తమయింది. సింధుతోపాటు మాజీ రన్నరప్ సైనా నెహ్వాల్... పురుషుల సింగిల్స్‌లో మాజీ నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్, సాయిప్రణీత్, పారుపల్లి కశ్యప్ ఈ మెగా టోర్నమెంట్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. బర్మింగ్‌హామ్: పద్దెనిమిదేళ్లుగా భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులను ఊరిస్తోన్న ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ టైటిల్‌ను సాధించాలనే తపనతో మరోసారి మనోళ్లు సమాయత్తమయ్యారు. నేటి నుంచి మొదలయ్యే ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 టోర్నమెంట్లో సింధుతోపాటు సైనా, శ్రీకాంత్, సాయిప్రణీత్, కశ్యప్, లక్ష్య సేన్ సింగిల్స్ బరిలో ఉన్నారు. ముందుగా ఎంట్రీలు పంపించినా... కోవిడ్–19 వైరస్ నేపథ్యంలో ఏడుగురు భారత ఆటగాళ్లు (సింగిల్స్‌లో ప్రణయ్, సమీర్ వర్మ, సౌరభ్ వర్మ; డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి; సుమీత్ రెడ్డి–మనూ అత్రి జోడీలు) ఈ టోర్నీ నుంచి వైదొలిగారు. శతాబ్దంకంటే ఎక్కువ చరిత్ర ఉన్న ఈ టోర్నీలో భారత్ నుంచి ఇద్దరు మాత్రమే చాంపియన్స్‌గా నిలిచారు. ప్రకాశ్ పదుకొనే (1980లో), పుల్లెల గోపీచంద్ (2001లో) ఈ ఘనత వహించారు. 2001 తర్వాత 2015లో సైనా నెహ్వాల్ మాత్రమే ఒకసారి ఫైనల్‌కు చేరుకొని తుది మెట్టుపై తడబడి రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకుంది. తొలి రౌండ్లోనే... 110వ సారి నిర్వహిస్తున్న ఈ టోర్నీలో ఈసారి భారత క్రీడాకారులకు క్లిష్టమైన ‘డ్రా’ ఎదురైంది. మహిళల సింగిల్స్‌లో ప్రపంచ చాంపియన్ పీవీ సింధు తొలి రౌండ్లో చైనా సంతతికి చెందిన అమెరికా ప్లేయర్ బీవెన్ జాంగ్‌తో... ప్రపంచ మూడో ర్యాంకర్ అకానె యామగుచి (జపాన్)తో సైనా నెహ్వాల్ తలపడనున్నారు. గెలుపోటముల ముఖాముఖి రికార్డులో సింధు 5–4తో ఆధిక్యంలో ఉండగా... సైనా మాత్రం 2–8తో వెనుకబడి ఉంది. ఒకవేళ సింధు, సైనా తొలి రౌండ్ అడ్డంకి దాటినా తర్వాత రౌండ్లలో వీరిద్దరికి క్లిష్టమైన ప్రత్యర్థులే ఎదురుకానున్నారు. సింధు తొలి రౌండ్లో గెలిస్తే ప్రిక్వార్టర్ ఫైనల్లో సుంగ్ జీ హున్ (కొరియా) లేదా నిచావోన్ జిందాపోల్ (థాయ్‌లాండ్) ఎదురుపడతారు. ఇందులోనూ గెలిస్తే క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ మాజీ చాంపియన్ నొజోమి ఒకుహారాతో సింధు ఆడే అవకాశం ఉంటుంది. సెమీఫైనల్లో వరల్డ్ నంబర్‌వన్ చెన్ యుఫె (చైనా) లేదా ప్రపంచ మాజీ చాంపియన్ రచనోక్ (థాయ్‌లాండ్) సింధుకు ఎదురుకావొచ్చు. మరోవైపు సైనా తొలి రౌండ్‌ను దాటితే ప్రిక్వార్టర్ ఫైనల్లో సయాక తకహాషి (జపాన్), క్వార్టర్ ఫైనల్లో రియో ఒలింపిక్స్ చాంపియన్ కరోలినా మారిన్ (స్పెయిన్)... సెమీఫైనల్లో రెండో సీడ్ తై జు యింగ్ (చైనీస్ తైపీ) లేదా ఏడో సీడ్ హి బింగ్జియావో (చైనా) ప్రత్యర్థులుగా ఉంటారు. ఈ నేపథ్యంలో ఈసారైనా సింధు, సైనా అద్భుతం చేస్తారో లేదో వేచి చూడాలి. శ్రీకాంత్ గాడిలో పడేనా! కొంతకాలంగా ఫామ్ కోల్పోయి తడబడుతోన్న ప్రపంచ మాజీ నంబర్‌వన్, ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్‌కు తొలి రౌండ్లోనే రియో ఒలింపిక్స్ చాంపియన్ చెన్ లాంగ్ (చైనా) ఎదురుకానున్నాడు. ఈ ఏడాది శ్రీకాంత్ నాలుగు టోర్నీలు ఆడగా మూడింటిలో తొలి రౌండ్లోనే ఓడిపోయి, మరో టోర్నీలో ప్రిక్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించాడు. గతేడాది ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం నెగ్గిన భమి డిపాటి సాయిప్రణీత్ తొలి రౌండ్లో జావో జున్‌పెంగ్ (చైనా)తో... లీ చెయుక్ యియు (హాంకాంగ్)తో లక్ష్య సేన్... రుస్తావిటో (ఇండోనేసియా)తో కశ్యప్ తలపడనున్నారు. మొత్తం 11 లక్షల డాలర్ల ప్రైజ్‌మనీతో నిర్వహిస్తున్న ఈ టోర్నీలో పురుషుల, మహిళల సింగిల్స్ విభాగాల్లో విజేతలుగా నిలిచిన వారికి 77 వేల డాలర్ల చొప్పున (రూ. 57 లక్షలు) అందజేస్తారు. పురుషుల డబుల్స్‌లో ఈసారి భారత్ నుంచి ప్రాతినిధ్యం లేకుండా పోయింది. మహిళల డబుల్స్‌లో నేలకుర్తి సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప; దండు పూజ–సంజన సంతోష్ జోడీలు... మిక్స్డ్ డబుల్స్‌లో సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా జంట బరిలో ఉన్నాయి. అశ్విని, సిక్కి రెడ్డి, ప్రణవ్ చోప్రా, లక్ష్య సేన్ ►1900 ఆల్ ఇంగ్లండ్ టోర్నీ ప్రారంభమైన ఏడాది. తొలి, రెండో ప్రపంచ యుద్ధ సమయాల్లో మినహా మిగతా సంవత్సరాలలో ఈ టోర్నీ కొనసాగింది. ►2 ఆల్ ఇంగ్లండ్ ఓపెన్‌లో అత్యధిక టైటిల్స్ నెగ్గిన దేశాల సంఖ్య. చైనా, డెన్మార్క్ ఆటగాళ్లు 20 సార్లు చొప్పున ఈ టోర్నీలో విజేతగా నిలిచారు. ►1 ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ టైటిల్‌ను అత్యధికసార్లు గెలిచిన ప్లేయర్ రూడీ హర్తానో. ఇండోనేసియాకు చెందిన రూడీ హర్తానో ఓవరాల్‌గా ఎనిమిదిసార్లు విజేతగా నిలువగా... 1968 నుంచి 1974 వరకు వరుసగా ఏడేళ్లు టైటిల్ గెలిచాడు. ►7 ఇప్పటివరకు సింధు ఏడుసార్లు ఆల్ ఇంగ్లండ్ టోర్నీలో ఆడింది. 2018లో సెమీఫైనల్ చేరడమే ఆమె అత్యుత్తమ ప్రదర్శన. 2017లో క్వార్టర్ ఫైనల్ చేరిన సింధు నాలుగుసార్లు (2012, 2014, 2016, 2019) తొలి రౌండ్లో, ఒకసారి రెండో రౌండ్లో (2013) ఓడిపోయింది. ►14 ఆల్ ఇంగ్లండ్ టోర్నీలో సైనా ఆడనుండటం ఇది వరుసగా 14వ ఏడాది. 2007 నుంచి ఈ టోర్నీలో ఆడుతున్న సైనా ఒకసారి ఫైనల్, రెండుlసార్లు సెమీస్, ఆరుసార్లు క్వార్టర్ ఫైనల్ చేరింది. -
వారెవ్వా సింధు
బర్మింగ్‌హామ్: ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ టోర్నీలో తెలుగు తేజం పీవీ సింధు సెమీస్‌లోకి ప్రవేశించింది. చివరి వరకూ ఉత్కంఠ భరితంగా సాగిన మహిళల క్వార్టర్ ఫైనల్ పోరులో సింధు 20-22, 21-18, 21-18 తేడాతో జపాన్ క్రీడాకారిణి ఒకుహరాపై గెలిచి సెమీస్‌కు అర్హత సాధించింది. 84 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో సింధు శభాష్ అనిపించింది. హోరాహోరీగా సాగిన తొలి గేమ్‌ను సింధు చేజార్చుకుంది. ప్రతీ పాయింట్ కోసం ఇరువురి క్రీడాకారిణల మధ్య నువ్వా-నేనా అన్నట్లు సాగిన మొదటి గేమ్‌ను సింధు స్వల్ప తేడాతో కోల్పోయింది. ఇక రెండో గేమ్‌లో తొలి అర్థం భాగం వరకూ ఇరువురి మధ్య ఆసక్తికర పోరు సాగింది. కాగా, చక్కటి ప్లేస్‌మెంట్స్‌తో ఆకట్టుకున్న సింధు.. ఒకుహరాను ఒత్తిడిలోకి నెట్టింది. ఈ క్రమంలోనే రెండో గేమ్‌ను 21-18తో గెలిచి స్కోరును సమం చేసింది. అయితే నిర్ణయాత్మక మూడో గేమ్‌లో మాత్రం ఒకుహరా నుంచి సింధుకు తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. ఒకుహరా సుదీర్ఘ ర్యాలీలతో సింధును ఇబ్బంది పెట్టే యత్నం చేసింది. అయితే దాన్ని తన అనుభవంతో అధిగమించిన సింధు గేమ్‌తో పాటు మ్యాచ్‌ను కూడా సొంతం చేసుకుంది. ఫలితంగా ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ టోర్నీలో తొలిసారి సింధు సెమీస్‌లోకి ప్రవేశించి కొత్త చరిత్రను లిఖించింది. -
క్వార్టర్స్‌లోనే కథ ముగిసె...
ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ టోర్నీలో సైనా, సింధు పరాజయం బర్మింగ్‌హామ్: అందివచ్చిన అవకాశాలను అనుకూలంగా మల్చుకోవడంలో విఫలమైన భారత స్టార్స్ పీవీ సింధు, సైనా నెహ్వాల్... ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టోర్నమెంట్ నుంచి నిష్క్రమించారు. సింధు, సైనా పరాజయాలతో ఈ మెగా టోర్నీలో భారత క్రీడాకారుల కథ ముగిసింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో ఆరో సీడ్ సింధు 35 నిమిషాల్లో 14–21, 10–21తో టాప్ సీడ్, ప్రపంచ నంబర్‌వన్ తై జు యింగ్ (చైనీస్ తైపీ) చేతిలో... ఎనిమిదో సీడ్ సైనా 54 నిమిషాల్లో 20–22, 20–22తో మూడో సీడ్ సుంగ్ జీ హున్ (దక్షిణ కొరియా) చేతిలో ఓడిపోయారు. ఐదోసారి ఈ టోర్నీలో ఆడిన సింధు తొలిసారి క్వార్టర్స్‌కు చేరుకుంది. మరోవైపు 11వసారి ఈ టోర్నీలో అడుగుపెట్టిన సైనా క్వార్టర్స్‌లో ఓడిపోవడం ఇది ఐదోసారి. ఒకసారి రన్నరప్‌గా నిలిచిన ఈ హైదరాబాద్ క్రీడాకారిణి రెండుసార్లు సెమీస్‌లో, రెండుసార్లు తొలి రౌండ్లో, ఒకసారి రెండో రౌండ్లో నిష్క్రమించింది. క్వార్టర్స్‌లో ఓడిన సింధు, సైనాలకు 3,600 డాలర్ల చొప్పున (రూ. 2 లక్షల 39 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 6,050 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. తై జు యింగ్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలి గేమ్‌లో 10–7తో ఆధిక్యంలోకి వెళ్లిన సింధు ఆ తర్వాత అదే జోరును కొనసాగించడంలో విఫలమైంది. తై జు యింగ్ పలుమార్లు కొట్టిన క్రాస్‌కోర్టు రిటర్న్ షాట్లకు సింధు వద్ద సమాధానం లేకపోయింది. స్కోరు 12–12 వద్ద తై జు యింగ్ వరుసగా ఐదు పాయింట్లు నెగ్గి 17–12తో ఆధిక్యంలోకి వెళ్లింది. అదే క్రమంలో తొలి గేమ్‌ను సొంతం చేసుకుంది. రెండో గేమ్‌లోనూ తై జు యింగ్ దూకుడు కొనసాగించి సింధుకు కోలుకునే అవకాశం ఇవ్వలేదు. మరోవైపు సుంగ్ జీ హున్‌తో జరిగిన మ్యాచ్‌లో సైనా తొలి గేమ్‌లో ఒకదశలో 17–12తో ఆధిక్యంలో నిలిచింది. అయితే ఒక్కసారిగా తడబాటుకులోనైన సైనా వరుసగా ఎనిమిది పాయింట్లను కోల్పోయి 17–20తో వెనుకబడింది. ఈ దశలో సైనా వరుసగా మూడు పాయింట్లు నెగ్గి స్కోరును 20–20తో సమం చేసినా... ఆ వెంటనే మరో రెండు పాయింట్లు కోల్పోయి గేమ్‌ను చేజార్చుకుంది. రెండో గేమ్‌లో ఒకదశలో సైనా 11–8తో ఆధిక్యాన్ని సంపాదించినా... దానినీ కాపాడుకోలేకపోయింది. చివరకు రెండో గేమ్నూ 20–22తో కోల్పోయి ఓటమి చవిచూసింది.