క్వార్టర్స్‌లోనే కథ ముగిసె...
ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ టోర్నీలో సైనా, సింధు పరాజయం
బర్మింగ్‌హామ్: అందివచ్చిన అవకాశాలను అనుకూలంగా మల్చుకోవడంలో విఫలమైన భారత స్టార్స్ పీవీ సింధు, సైనా నెహ్వాల్... ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టోర్నమెంట్ నుంచి నిష్క్రమించారు. సింధు, సైనా పరాజయాలతో ఈ మెగా టోర్నీలో భారత క్రీడాకారుల కథ ముగిసింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో ఆరో సీడ్ సింధు 35 నిమిషాల్లో 14–21, 10–21తో టాప్ సీడ్, ప్రపంచ నంబర్‌వన్ తై జు యింగ్ (చైనీస్ తైపీ) చేతిలో... ఎనిమిదో సీడ్ సైనా 54 నిమిషాల్లో 20–22, 20–22తో మూడో సీడ్ సుంగ్ జీ హున్ (దక్షిణ కొరియా) చేతిలో ఓడిపోయారు.
ఐదోసారి ఈ టోర్నీలో ఆడిన సింధు తొలిసారి క్వార్టర్స్‌కు చేరుకుంది. మరోవైపు 11వసారి ఈ టోర్నీలో అడుగుపెట్టిన సైనా క్వార్టర్స్‌లో ఓడిపోవడం ఇది ఐదోసారి. ఒకసారి రన్నరప్‌గా నిలిచిన ఈ హైదరాబాద్ క్రీడాకారిణి రెండుసార్లు సెమీస్‌లో, రెండుసార్లు తొలి రౌండ్‌లో, ఒకసారి రెండో రౌండ్‌లో నిష్క్రమించింది. క్వార్టర్స్‌లో ఓడిన సింధు, సైనాలకు 3,600 డాలర్ల చొప్పున (రూ. 2 లక్షల 39 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 6,050 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.
తై జు యింగ్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలి గేమ్‌లో 10–7తో ఆధిక్యంలోకి వెళ్లిన సింధు ఆ తర్వాత అదే జోరును కొనసాగించడంలో విఫలమైంది. తై జు యింగ్ పలుమార్లు కొట్టిన క్రాస్‌కోర్టు రిటర్న్ షాట్‌లకు సింధు వద్ద సమాధానం లేకపోయింది. స్కోరు 12–12 వద్ద తై జు యింగ్ వరుసగా ఐదు పాయింట్లు నెగ్గి 17–12తో ఆధిక్యంలోకి వెళ్లింది. అదే క్రమంలో తొలి గేమ్‌ను సొంతం చేసుకుంది. రెండో గేమ్‌లోనూ తై జు యింగ్ దూకుడు కొనసాగించి సింధుకు కోలుకునే అవకాశం ఇవ్వలేదు.
మరోవైపు సుంగ్ జీ హున్‌తో జరిగిన మ్యాచ్‌లో సైనా తొలి గేమ్‌లో ఒకదశలో 17–12తో ఆధిక్యంలో నిలిచింది. అయితే ఒక్కసారిగా తడబాటుకులోనైన సైనా వరుసగా ఎనిమిది పాయింట్లను కోల్పోయి 17–20తో వెనుకబడింది. ఈ దశలో సైనా వరుసగా మూడు పాయింట్లు నెగ్గి స్కోరును 20–20తో సమం చేసినా... ఆ వెంటనే మరో రెండు పాయింట్లు కోల్పోయి గేమ్‌ను చేజార్చుకుంది. రెండో గేమ్‌లో ఒకదశలో సైనా 11–8తో ఆధిక్యాన్ని సంపాదించినా... దానినీ కాపాడుకోలేకపోయింది. చివరకు రెండో గేమ్‌నూ 20–22తో కోల్పోయి ఓటమి చవిచూసింది.