క్వార్టర్‌ ఫైనల్లో లక్ష్యసేన్‌ | All England Open Championships: Lakshya Sen Enters Quarterfinals | Sakshi
Sakshi News home page

క్వార్టర్‌ ఫైనల్లో లక్ష్యసేన్‌

Published Fri, Mar 18 2022 4:39 AM | Last Updated on Fri, Mar 18 2022 4:39 AM

All England Open Championships: Lakshya Sen Enters Quarterfinals - Sakshi

ప్రతిష్టాత్మక ఆల్‌ ఇంగ్లండ్‌  బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ తెలుగుతేజం పీవీ సింధుకు మళ్లీ నిరాశనే మిగిల్చింది. ఒలింపిక్స్, ప్రపంచ చాంపియన్‌షిప్, కామన్వెల్త్, ఆసియా గేమ్స్‌ల్లో పతకాలు సాధించిన స్టార్‌కు ‘ఆల్‌ఇంగ్లండ్‌’ మాత్రం మరోసారి అందని ద్రాక్షే అయ్యింది. పురుషుల సింగిల్స్‌లో యువ సంచలనం లక్ష్యసేన్‌ భారత ఆశల పల్లకిని మోస్తున్నాడు. మూడో సీడ్‌ అంటోన్సెన్‌ను కంగుతినిపించి క్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లాడు.

బర్మింగ్‌హామ్‌: భారత రైజింగ్‌ స్టార్‌ లక్ష్యసేన్‌ టోర్నీ టోర్నీకి తన రాకెట్‌ పదును పెంచుతున్నాడు. తాజాగా ఆల్‌ ఇంగ్లండ్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో దూసుకెళ్తున్నాడు. అన్‌సీడెడ్‌ లక్ష్యసేన్‌ ప్రిక్వార్టర్స్‌లో మూడో సీడ్‌ అండర్స్‌ అంటోన్సెన్‌పై సంచలన విజయం సాధించాడు. గతేడాది ఆల్‌ ఇంగ్లండ్‌ టోర్నీ, ప్రపంచ చాంపియన్‌షిప్‌ సెమీఫైనలిస్ట్‌ అయిన అంటొన్సెన్‌ను ఈ సారి ప్రిక్వార్టర్స్‌లోనే ఇంటిదారి పట్టించాడు. పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్‌ ఓడిపోగా... మహిళల సింగిల్స్‌లో వెటరన్‌ స్టార్‌ సైనా నెహ్వాల్, మాజీ ప్రపంచ చాంపియన్‌ సింధులకు నిరాశ ఎదురైంది. తమ ప్రత్యర్థుల చేతుల్లో  ప్రిక్వార్టర్స్‌లో ఇద్దరూ పోరాడి ఓడారు. డబుల్స్‌లో గాయత్రీ–ట్రెసా జాలీ, సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ షెట్టి జోడీలు క్వార్టర్స్‌ చేరాయి.

వరుస గేముల్లోనే...
ప్రపంచ చాంపియన్‌షిప్‌ కాంస్య పతక విజేత లక్ష్యసేన్‌ పట్టుదలతో ముందంజ వేస్తున్నాడు. గురువారం జరిగిన ప్రిక్వార్టర్‌ ఫైనల్లో అతను 21–16, 21–18తో ప్రపంచ మూడో ర్యాంకర్‌ అండర్స్‌ అంటొన్సెన్‌ (డెన్మార్క్‌)పై అసాధారణ విజయం సాధించాడు. అంతర్జాతీయ టోర్నీలో తనకెదురైంది టాప్‌–3 ప్లేయర్‌ అయినా... లక్ష్యసేన్‌ మాత్రం ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా యథేచ్ఛగా తన ‘మిషన్‌’ పూర్తిచేశాడు. తొలి గేమ్‌లో 11–9తో ఆధిక్యంలోకి వచ్చాక మళ్లీ వెనుదిరిగి చూడలేదు. నెట్‌ వద్ద పాదరసంలా కదిలిన భారత ఆటగాడు అదేజోరు గేమ్‌ను వశం చేసుకున్నాడు. ఇండోనేసియా మాస్టర్స్‌ టోర్నీ రన్నరప్‌ అయిన అంటొన్సెన్‌ రెండో గేమ్‌లో సత్తాచాటాడు.

దీంతో ఈ గేమ్‌ హోరాహోరీగా సాగింది. దీంతో రెండుసార్లు 14–14, 16–16వద్ద స్కోరు సమమైంది. వరుసగా రెండు పాయింట్లు సాధించి 18–16తో ఆధిక్యంలోకి వచ్చిన లక్ష్యషేన్‌ తర్వాత చకచకా పాయింట్లు సాధించి గేమ్‌తో పాటు మ్యాచ్‌ను గెలుచుకున్నాడు. నేడు జరిగే క్వార్టర్‌ ఫైనల్లో భారత యువ షట్లర్‌... చైనాకు చెందిన లు గ్వాంగ్‌ జుతో తలపడతాడు. మరో ప్రిక్వార్టర్స్‌లో శ్రీకాంత్‌ 21–9, 18–21, 19–21తో ఐదో సీడ్‌ ఆంథోని సిన్‌సుకా (ఇండోనేసియా) చేతిలో కంగుతిన్నాడు.

సింధు... మరో ‘సారీ’
ప్రతిష్టాత్మక టోర్నీల్లో పతకాలు గెలిచిన పూసర్ల వెంకట సింధుకు ఎందుకనో ఆల్‌ ఇంగ్లండ్‌ కలిసిరావడం లేదు. ఈ ఏడాదీ ఆమె పతకం లేకుండానే నిష్క్రమించింది. ప్రిక్వార్టర్స్‌లో ఆరో సీడ్‌ సింధు 19–21, 21–16, 17–21తో సయాక టకహషి (జపాన్‌) చేతిలో పరాజయం పాలైంది. సైనా నెహ్వాల్‌ 14–21, 21–17, 17–21తో రెండో సీడ్‌ యామగుచి (జపాన్‌) చేతిలో ఓడింది. ఫలితం నిరాశపరిచినప్పటికీ మాజీ ప్రపంచ నంబర్‌వన్‌ ఈ మ్యాచ్‌లో తన ఆటతీరుతో ఆకట్టుకుంది. మహిళల డబుల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో పుల్లెల గాయత్రీ–ట్రెసా జాలీ తొలి గేమ్‌ కోల్పోయి రెండో గేమ్‌లో దూసుకెళుతుండగా 18–21, 19–14 స్కోరువద్ద ఆరో సీడ్‌ ప్రత్యర్థి జోడీ గ్రేసియా–అప్రియని (ఇండోనేసియా) రిటైర్ట్‌ హర్ట్‌గా వెనుదిరిగింది. దీంతో భారత జోడీ ముందంజ వేసింది. పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ షెట్టి జోడీ 21–7, 21–7తో మార్క్‌ లామ్స్‌ఫుజ్‌–మార్విన్‌ సీడెల్‌ (జర్మనీ) ద్వ యంపై ఏకపక్ష విజయాన్ని సాధించింది. కేవలం 27 నిమిషాల్లోనే భారత జంట మ్యాచ్‌ను ముగించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement