భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుకు ఊరట విజయం దక్కింది. ప్యారిస్ ఒలింపిక్స్ తర్వాత ఆడుతున్న రెండో టోర్నమెంట్‌లో ఆమె జయకేతనం ఎగురవేసింది. విశ్వక్రీడల తర్వాత ఫిన్‌లాండ్‌లో జరిగిన ఆర్క్‌టిక్ ఓపెన్‌లో తొలి రౌండ్‌లోనే ఓడిన సింధు... మంగళవారం మొదలైన డెన్మార్క్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నీలో శుభారంభం అందుకుంది.
మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో చైనీస్ తైపీ క్రీడాకారిణి పాయ్ యు పోతో జరిగిన మ్యాచ్‌లో సింధు 21–8, 13–7తో విజయం సాధించింది. అయితే, తొలి గేమ్‌ను అలవోకగా నెగ్గిన సింధు రెండో గేమ్‌లో ఆరు పాయింట్ల ఆధిక్యంలో ఉన్నపుడు ఆమె ప్రత్యర్థి గాయం కారణంగా మ్యాచ్ నుంచి వైదొలిగింది. ఈ క్రమంలో సింధు విజేతగా నిలిచి ప్రిక్టార్టర్స్‌కు అర్హత సాధించింది.
ఇక నాలుగో సీడ్ హాన్ యువె (చైనా), పోర్న్‌పవీ చోచువోంగ్ (థాయ్‌లాండ్) మధ్య తొలి రౌండ్ మ్యాచ్ విజేతతో గురువారం జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్లో సింధు తలపడుతుంది. మరోవైపు.. భారత్‌కే చెందిన రైజింగ్ స్టార్స్ మాళవిక బన్సోద్, ఆకర్షి కశ్యప్ తొలి రౌండ్‌లోనే నిష్క్రమించారు.
మాళవిక 13–21, 12–21తో థుయ్ లిన్ ఎన్గుయెన్ (వియత్నాం) చేతిలో, ఆకర్షి కూడా 13–21, 12–21తో సుపనిద కటెథోంగ్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడిపోయారు. నేడు జరిగే తొలి రౌండ్ మ్యాచ్‌లో లౌరెన్ లామ్ (అమెరికా)తో ఉన్నతి హుడా పోటీపడుతుంది.
ఇదిలా ఉంటే.. పురుషుల సింగిల్స్‌లో భారత స్టార్ లక్ష్య సేన్ పోరాటం తొలి రౌండ్‌లోనే ముగిసింది. ప్రపంచ 18వ ర్యాంకర్ లు గ్వాంగ్ జు (చైనా)తో జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ 17వ ర్యాంకర్ లక్ష్య సేన్ 21–12, 19–21, 14–21తో పోరాడి ఓడిపోయాడు. మహిళల డబుల్స్ తొలి రౌండ్‌లో రుతూపర్ణ–శ్వేతాపర్ణ (భారత్) ద్వయం 18–21, 22–24తో చాంగ్ చింగ్ హుయ్–యాంగ్ చింగ్ టున్ (చైనీస్ తైపీ) జంట చేతిలో ఓటమి పాలైంది.
సోనమ్ గురికి రజతం
న్యూఢిల్లీ: అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య సీజన్ ముగింపు టోర్నీ వరల్డ్ కప్ ఫైనల్స్‌లో భారత జట్టు రజత పతకంతో బోణీ చేసింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో సోనమ్ మస్కర్ రజత పతకాన్ని సాధించింది. 22 ఏళ్ల సోనమ్ ఫైనల్లో 252.9 పాయింట్లు స్కోరు చేసి రెండో స్థానాన్ని దక్కించుకుంది.
పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో భారత షూటర్లు అర్జున్ (188.3 పాయింట్లు) ఐదో స్థానంలో, దివ్యాంశ్ (124 పాయింట్లు) ఎనిమిదో స్థానంలో నిలిచారు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో అర్జున్ సింగ్ (109.9 పాయింట్లు) చివరిదైన ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకోగా... మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో భారత షూటర్లు రిథమ్ (197.2 పాయింట్లు) నాలుగో స్థానంలో, సురభి (176.6 పాయింట్లు) 5వస్థానంలో నిలిచారు.
Comments
Please login to add a commentAdd a comment