పీవీ సింధు
బర్మింగ్‌హామ్: ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ టోర్నీలో తెలుగు తేజం పీవీ సింధు సెమీస్‌లోకి ప్రవేశించింది. చివరి వరకూ ఉత్కంఠ భరితంగా సాగిన మహిళల క్వార్టర్ ఫైనల్ పోరులో సింధు 20-22, 21-18, 21-18 తేడాతో జపాన్ క్రీడాకారిణి ఒకుహరాపై గెలిచి సెమీస్‌కు అర్హత సాధించింది. 84 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో సింధు శభాష్ అనిపించింది. హోరాహోరీగా సాగిన తొలి గేమ్‌ను సింధు చేజార్చుకుంది. ప్రతీ పాయింట్ కోసం ఇరువురి క్రీడాకారిణల మధ్య నువ్వా-నేనా అన్నట్లు సాగిన మొదటి గేమ్‌ను సింధు స్వల్ప తేడాతో కోల్పోయింది.
ఇక రెండో గేమ్‌లో తొలి అర్థం భాగం వరకూ ఇరువురి మధ్య ఆసక్తికర పోరు సాగింది. కాగా, చక్కటి ప్లేస్‌మెంట్స్‌తో ఆకట్టుకున్న సింధు.. ఒకుహరాను ఒత్తిడిలోకి నెట్టింది. ఈ క్రమంలోనే రెండో గేమ్‌ను 21-18తో గెలిచి స్కోరును సమం చేసింది. అయితే నిర్ణయాత్మక మూడో గేమ్‌లో మాత్రం ఒకుహరా నుంచి సింధుకు తీవ్ర ప‍్రతిఘటన ఎదురైంది. ఒకుహరా సుదీర్ఘ ర్యాలీలతో సింధును ఇబ్బంది పెట్టే యత్నం చేసింది. అయితే దాన్ని తన అనుభవంతో అధిగమించిన సింధు గేమ్‌తో పాటు మ్యాచ్‌ను కూడా సొంతం చేసుకుంది. ఫలితంగా ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ టోర్నీలో తొలిసారి సింధు సెమీస్‌లోకి ప్రవేశించి కొత్త చరిత్రను లిఖించింది.
Comments
Please login to add a commentAdd a comment