సమయం వచ్చింది సింధు
► కొరియా ఓపెన్ ఫైనల్లో ఒకుహారాతో అమీతుమీ
► సెమీస్‌లో హి బింగ్‌జియావోపై తెలుగు తేజం గెలుపు
► నేటి ఫైనల్స్ ఉదయం గం. 7.30 నుంచి స్టార్ స్పోర్ట్స్–2లో ప్రత్యక్ష ప్రసారం
మూడు వారాల క్రితం ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ ఫైనల్లో 110 నిమిషాల చిరస్మరణీయ పోరులో నొజోమి ఒకుహారా చేతిలో సింధు ఓడిపోయింది. ఆ ఓటమి తర్వాత ‘నా సమయం కూడా వస్తుంది’ అని సింధు వ్యాఖ్యానించింది. అయితే ఒకుహారా చేతిలో ఎదురైన ఆ పరాజయానికి ప్రతీకారం తీర్చుకునే అవకాశం 21 రోజుల్లోనే వస్తుందని భారత స్టార్ పీవీ సింధు కూడా ఊహించ లేదేమో! సియోల్‌లో జరుగుతున్న కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీలో సింధు, ఒకుహారా టైటిల్ పోరుకు సిద్ధమయ్యారు. గత ఓటమికి ఈసారి విజయం సాధించి లెక్క సరిచేయాలనే పట్టుదలతో ఈ తెలుగు తేజం ఉంది. అటు సింధు, ఇటు ఒకుహారా అద్వితీయమైన ఫామ్‌లో ఉండటంతో మరో హోరాహోరీ పోరు జరిగే అవకాశముంది.
సియోల్: తన కెరీర్‌లో మూడో సూపర్ సిరీస్ టైటిల్ సాధించేందుకు భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు మరో విజయం దూరంలో నిలిచింది. కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నమెంట్‌లో సింధు తొలిసారి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ప్రపంచ ఏడో ర్యాంకర్ హి బింగ్‌జియావో (చైనా)తో శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రపంచ నాలుగో ర్యాంకర్ సింధు 21–10, 17–21, 21–16తో గెలుపొందింది. ఈ మ్యాచ్‌కు ముందు ముఖాముఖి పోరులో 3–5తో వెనుకబడిన సింధు 66 నిమిషాల్లో హి బింగ్ జియావోను ఓడించింది.
ఆదివారం జరిగే ఫైనల్లో ప్రస్తుత ప్రపంచ చాంపియన్, తొమ్మిదో ర్యాంకర్ నొజోమి ఒకుహారా (జపాన్)తో సింధు ఆడుతుంది. ఫైనల్స్ షెడ్యూల్ ప్రకారం సింధు, ఒకుహారా ఫైనల్ నాలుగో మ్యాచ్‌గా జరగనుంది. భారత కాలమానం ప్రకారం వీరిద్దరి మ్యాచ్ ఉదయం 10 గంటల ప్రాంతంలో మొదలయ్యే అవకాశముంది. ఒకుహారాతో ముఖాముఖి రికార్డులో సింధు 3–4తో వెనుకబడి ఉంది. మూడు వారాల క్రితం స్కాట్లాండ్‌లోని గ్లాస్గో వేదికగా జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్ ఫైనల్లో సింధును ఓడించి జపాన్ తరఫున తొలి విశ్వవిజేతగా ఒకుహారా అవతరించింది.
హి బింగ్‌జియావోతో జరిగిన మ్యాచ్‌లో సింధు ఆరంభం నుంచే దూకుడు కనబరిచింది. తొలి గేమ్ ఆరంభంలోనే 9–1తో ఆధిక్యంలోకి వెళ్లిన ఆమె అదే జోరులో గేమ్‌ను దక్కించుకుంది. రెండో గేమ్‌లోనూ సింధు ఆధిక్యం ప్రదర్శించినా స్కోరు 16–16 వద్ద బింగ్‌జియావో వరుసగా నాలుగు పాయింట్లు గెలిచి 20–16తో ఆధిక్యంలోకి వెళ్లింది. అనంతరం సింధు ఒక పాయింట్ నెగ్గిన తర్వాత బింగ్‌జియావో మరో పాయింట్ సాధించి గేమ్‌ను సొంతం చేసుకుంది. నిర్ణాయక మూడో గేమ్‌లో ఇద్దరూ నువ్వా నేనా అన్నట్లు పోరాడారు. అయితే స్కోరు 13–12 వద్ద సింధు వరుసగా మూడు పాయింట్లు గెలిచి 16–12తో ముందంజ వేసింది. అనంతరం ఈ ఆధిక్యాన్ని కాపాడుకొని విజయాన్ని ఖాయం చేసుకుంది.