110 నిమిషాల విషాదం
► చిరస్మరణీయ ఫైనల్లో పోరాడి ఓడిన సింధు
► ఓడినా హృదయాలు గెల్చుకున్న తెలుగు తేజం
► రజత పతకంతో సంతృప్తి
► మహిళల సింగిల్స్ విజేత ఒకుహారా
►ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్
ప్రపంచ చాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ అంటే ఎలా ఉండాలి... ప్రత్యర్థులు కసితీరా కొదమ సింహాల్లా తలపడాలి. ఒక్కో పాయింట్ సాధించాలంటే శక్తియుక్తులు మొత్తం పణంగా పెట్టాలి... ప్రాణాలొడ్డినట్లు పోరాడాలి... కోర్టు అంటే కదనరంగంగా మారిపోవాలి... ఒంట్లో సత్తువ మొత్తం క్షీణిస్తున్నా...సమరంలో ఆఖరి క్షణం వరకు పట్టుదల ప్రదర్శించాలి. ఒక్క మాటలో చెప్పాలంటే పీవీ సింధు, నొజోమి ఒకుహరా మధ్య జరిగిన మ్యాచ్‌లా ఉండాలి.
గంటా 50 నిమిషాలు... మొత్తం 124 పాయింట్లు... 73 షాట్‌ల ర్యాలీ... కాళ్లు నొప్పి పెడుతున్నాయి, కండరాలు పట్టేస్తున్నాయి... అలసట ఆటపై ఆధిపత్యం ప్రదర్శిస్తోంది... స్మాష్ కొట్టడంకంటే తాము స్మాష్ కాకుండా ఉండిపోవడమే ముఖ్యంగా మారిపోతోంది. ఎనర్జీ డ్రింక్‌లు పని చేయడం లేదు. మధ్యలో స్కూల్ హెడ్మాస్టర్‌లా రిఫరీ మందలింపులు... ఇక చాలు నా వల్ల కాదంటూ అనిపిస్తున్న క్షణాన్నే ఎదురుగా ప్రపంచ చాంపియన్ హోదా ఆగిపోవద్దంటూ హెచ్చరిక.
ఎప్పటికీ మరచిపోలేని, బ్యాడ్మింటన్ చరిత్రలో అరుదైన మ్యాచ్ చివరకు జపాన్ అమ్మాయి వశమైంది. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ ఫైనల్లో భారత బిడ్డ, తెలుగు తేజం పూసర్ల వెంకట సింధుకు పరాజయం ఎదురైంది. పాయింట్లు చూస్తే పోరు హోరాహోరీగా సాగినట్లు అనిపిస్తున్నా... ఈ మ్యాచ్ గొప్పతనం గురించి స్కోరు బోర్డు చెప్పలేదనేది మాత్రం సత్యం. ఏ మ్యాచ్‌లోనైనా చివరకు విజేత ఒకరే. కానీ ఈ మ్యాచ్‌లో మాత్రం గెలుపు ఇద్దరిదీ. నిజంగా అవకాశం ఉంటే స్వర్ణం, వెండి మిశమ్రమైన ‘పచ్చ బంగారపు’ పతకాన్ని వీరిద్దరికి పంచేయడమే న్యాయంగా ఉండేదేమో!
గ్లాస్గో (స్కాట్లాండ్): భారత బ్యాడ్మింటన్ స్టార్ పూసర్ల వెంకట సింధు కల చెదిరింది. ప్రపంచ చాంపియన్‌గా నిలవాలని పట్టుదలగా శ్రమించిన ఆమెను తుది మెట్టుపై దురదృష్టం వెంటాడింది. ఆదివారం ఇక్కడ జరిగిన ఫైనల్లో నాలుగో సీడ్ సింధు 19–21, 22–20, 20–22 తేడాతో జపాన్‌కు చెందిన ఏడో సీడ్ నొజోమి ఒకుహారా చేతిలో పరాజయంపాలైంది. ఫలితంగా ఈ మెగా ఈవెంట్‌లో ఆమె రజత పతకానికే పరిమితమైంది. ఒకరితో మరొకరు పోటీ పడుతూ అసాధారణంగా సాగిన ఈ పోరులో ఆఖరి క్షణాల్లో జపాన్ అమ్మాయి ఒత్తిడిని అధిగమించడంలో సఫలమైంది. మూడు గేమ్‌లలోనూ అర్ధ భాగం ముగిసే సరికి ఆధిక్యంలో నిలిచిన సింధు... చివరి వరకు దానిని నిలబెట్టుకోలేకపోయింది.
తొలి గేమ్‌ను కోల్పోయినా...
ఈ మ్యాచ్‌కు ముందు ఇద్దరి మధ్య 3–3తో రికార్డు సమంగా ఉంది. అయితే టాప్ ఫామ్‌లో ఉన్న సింధుకు మెరుగైన అవకాశాలు కనిపించాయి. పైగా ప్రత్యర్థితో పోలిస్తే గత మ్యాచ్‌లు సునాయాసంగా గెలవడం వల్ల పెద్దగా అలసిపోకపోవడం కూడా ఆమెకు అనుకూలాంశంగా కనిపించింది. తొలి గేమ్‌ను తడబడుతూ ప్రారంభించిన సింధు ఆరంభంలో 3–5తో వెనుకబడింది. అయితే కోలుకొని చక్కటి రిటర్న్ షాట్‌లతో 11–5తో దూసుకుపోయింది. ఈ ఆధిక్యం 13–8కి పెరిగింది. అయితే ఒకుహారా పోరాడి స్కోరును 14–14తో సమం చేసింది. ఆ తర్వాత వరుసగా నాలుగు పాయింట్లు సాధించిన ఆమె 18–14తో ముందంజ వేసింది.
అయితే జపాన్ అమ్మాయి తప్పులతో స్కోరు 19–19 వద్ద సమమైంది. ఈ దశలో తడబడి షటిల్‌ను నెట్‌లోకి కొట్టిన సింధు, తొలి గేమ్‌ను ప్రత్యర్థికి సమర్పించుకుంది. అయితే రెండో గేమ్‌లో మాత్రం సింధు అద్భుతమైన ఆటను ప్రదర్శించింది. ఒక్కసారిగా ఆమె 5–1తో ఆధిక్యంలో నిలిచి, ఆ తర్వాత 9–3కు చేరింది. మరోసారి సింధు 11–8 గేమ్‌లో ముందుకు వెళ్లింది. ఈ సమయంలో వరుస ర్యాలీలతో ఇద్దరూ హోరాహోరీగా తలపడ్డారు. అయితే సింధు నియంత్రణ కోల్పోకుండా ఆడి ఆధిక్యం కోల్పోకుండా జాగ్రత్త పడింది. 18–16తో దానిని ఆమె కొనసాగించింది. స్కోరు 21–20 వద్ద ఉన్నప్పుడు గెలుపు పాయింట్ కోసం సాగిన ర్యాలీ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. ఏకంగా 73 షాట్‌ల ర్యాలీ తర్వాత సింధు పైచేయి చూపించి గేమ్‌ను సొంతం చేసుకుంది.
నిర్ణయాత్మక గేమ్‌లో...
అయితే అప్పటికే తీవ్రంగా పోరాడిన వీరిద్దరు బాగా అలసిపోయారు. మూడో గేమ్‌లో స్మాష్‌లలో వేగం తగ్గింది. ఇద్దరూ డ్రాప్ షాట్‌లు, ప్లేసింగ్ ద్వారానే పాయింట్లు రాబట్టేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఇద్దరూ జాగ్రత్తగా ఆడుతూ ఒక్కో పాయింట్ సాధించారు. విరామం సమయంలో 11–9తో సింధు ముందంజ వేయడం మినహా...మిగతా గేమ్ మొత్తం దాదాపు సమంగా సాగింది. 17–17 వద్ద సింధు రెండు పాయింట్లు సాధించి 19–17తో నిలిచింది. అయితే ఒకుహారా వరుసగా మూడు పాయింట్లు రాబట్టి 20–19తో ముందంజ వేసింది. మరో రెండు సార్లు సింధు మ్యాచ్ పాయింట్లు కాపాడుకోవడంలో సఫలమైనా...చివరకు జపాన్ అమ్మాయి స్మాష్‌ను అందుకోలేక భారత క్రీడాకారిణి కూలిపోయింది.
3 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో సింధు గెలిచిన పతకాల సంఖ్య. 2013, 2014లలో సింధు సెమీఫైనల్లో ఓడి కాంస్య పతకాలు సొంతం చేసుకుంది. భారత్ తరఫున అత్యధికంగా మూడు పతకాలు నెగ్గిన క్రీడాకారిణి కూడా సింధునే కావడం విశేషం.
1 ప్రపంచ చాంపియన్‌షిప్ చరిత్రలో ఏకకాలంలో భారత్‌కు రజతం, కాంస్యం లభించడం ఇదే తొలిసారి.
7 నాలుగు దశాబ్దాల ప్రపంచ చాంపియన్‌షిప్ పోటీల్లో భారత్ ఖాతాలో చేరిన పతకాలు. 1983లో ప్రకాశ్ పదుకొనే పురుషుల సింగిల్స్‌లో కాంస్యం నెగ్గగా... 2011లో గుత్తా జ్వాల–అశ్విని పొన్నప్ప జంట కాంస్యం దక్కించుకుంది. 2015లో మహిళల సింగిల్స్‌లో సైనా రజతం, ఈ ఏడాది కాంస్యం సాధించింది.
ఫలితంతో నేను తీవ్ర నిరాశ చెందాను. నిర్ణాయక మూడో గేమ్‌లో స్కోరు 20–20 వద్ద ఇద్దరికీ విజయావకాశాలు సమానంగా ఉన్నాయి. ఫైనల్ బరిలో ఉన్న వారెవరైనా స్వర్ణం కోసమే పోరాడతారు. నేను విజయానికి చేరువైనట్టే చేరువై దూరమైపోయాను. చివరి క్షణాల్లోనే అంతా తారుమారు అయింది. ఒకుహారా అసాధారణ క్రీడాకారిణి. గతంలో ఆమెతో ఆడినపుడల్లా మ్యాచ్‌లు హోరాహోరీగా సాగాయి. ఆమెను నేను ఏమాత్రం తక్కువ అంచనా వేయలేదు. సుదీర్ఘ మ్యాచ్‌కు సిద్ధమయ్యే వచ్చాను. ఈ రోజు నాది కాదంతే. దేశం కోసం రజతం గెలిచినందుకు చాలా గర్వంగా ఉంది. ఈ పతకం నాలో మరింత విశ్వాసాన్ని పెంచింది. భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధిస్తాను. –పీవీ సింధు