సియోల్: కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్ లో భారత స్టార్ షట్లర్, తెలుగమ్మాయి పీవీ సింధు విజేతగా నిలిచారు. ఆదివారం జరిగిన ఫైనల్లో పివి సింధు 22-20, 11-21, 21-18 తేడాతో జపాన్ క్రీడాకారిణి ఒకుహారాపై విజయం సాధించి కొరియా సూపర్ సిరీస్ ను కైవసం చేసుకున్నారు. తద్వారా ఈ టోర్నమెంట్ లో తొలిసారి సింధు విజేతగా అవతరించారు. ఇరువురి క్రీడాకారిణులు మధ్య హోరాహోరీగా సాగిన తుది పోరులో సింధు విజయం సాధించి ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ ఫైనల్లో ఒకుహురా చేతిలో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకున్నారు.
తొలి గేమ్ లో ఒకుహారా 12-9 తో ఆధిక్యంలో నిలిచిన సమయంలో సింధు వరుసగా పాయింట్ల సాధించి స్కోరును సమం చేశారు. ఆ తరువాత అదే ఊపును కొనసాగించి మరింత ఆధిక్యాన్ని సింధు సాధించారు. కాగా, ఆ దశలో పుంజుకున్న ఒకుహారా 19-18 తో ముందుకు దూసుకెళ్లారు. అయితే ఓ చక్కటి బ్రేక్ పాయింట్ ద్వారా ఒకుహారా ఆధిక్యాన్ని తగ్గించిన సింధు.. దాన్ని కాపాడుకుని తొలి గేమ్ ను 22-20తేడాతో సొంతం చేసుకున్నారు.
రెండో గేమ్ లో మాత్రం ఒకుహారా ఆది నుంచి పైచేయి సాధిస్తూ సింధును వెనక్కునెట్టింది. ఏ దశలోనూ సింధుకు అవకాశం ఇవ్వని ఒకుహారా అదే జోరును కొనసాగించి రెండో గేమ్ ను సాధించారు. దాంతో నిర్ణయాత్మక మూడో గేమ్ అనివార్యమైంది. మూడో గేమ్ లో ఒకుహారా-సింధుల మధ్య ఆసక్తికర పోరు సాగింది. నువ్వు-నేనా అన్న రీతిలో సాగిన ఫైనల్ గేమ్ లో సింధు పెద్దగా పొరపాట్లకు తావివ్వలేదు. కాగా, సింధు 19-16 పాయింట్లతో ఆధిక్యంలో ఉన్న దశలో ఒకుహోరా మరోసారి పుంజుకునే యత్నం చేశారు. ఈ క్రమంలోనే ఇరువురి మధ్య 56 సెకెండ్ల సుదీర్ఘమైన ర్యాలీ జరిగింది. ఇక్కడ ఒకుహారా పాయింట్ సాధించనప్పటికీ, సింధు మాత్రం ఎటువంటి ఒత్తిడికి లోను కాకుండా మూడు పాయింట్ల తేడాతో గేమ్ తో పాటు మ్యాచ్ ను కూడా సాధించారు. దాంతో కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్ ను సింధు కైవసం చేసుకున్నారు. తొలిసారి కొరియా ఓపెన్ ను అందుకున్న సింధును వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని టైటిల్ సాధించాలని ఆకాంక్షించారు. మరొకవైపు సింధును బిగ్ బి అమితాబచ్చన్ కొనియాడారు. ఇదొక స్వీట్ రివేంజ్ అంటూ అమితాబ్ ట్వీట్ చేశారు.