Korea Open Super Series
-
శాసించి...సాధించి
⇒ఒకుహారాపై ఈసారి సింధు పైచేయి ⇒మూడు గేముల్లో ప్రపంచ చాంపియన్‌పై విజయం ⇒కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్ కైవసం ⇒రూ. 28 లక్షల 83 వేల ప్రైజ్‌మనీ సొంతం వేదిక మారింది... టోర్నీ మారింది... పీవీ సింధు, నొజోమి ఒకుహారాల ఆట మాత్రం అబ్బురపరిచేలా సాగింది... ప్రతీ పాయింట్‌కు అసమాన పోరాటం... ఫిట్‌నెస్‌కు పరీక్ష పెట్టేలా సుదీర్ఘ ర్యాలీలు... కళ్లు చెదిరే స్మాష్‌లు... ఆధిక్యం దోబూచులాట... చివరకు ఒత్తిడికి ఎదురునిలిచిన సింధు విజేతగా అవతరించింది. కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్ నెగ్గిన తొలి భారతీయ ప్లేయర్‌గా చరిత్ర సృష్టించింది. తాజా గెలుపుతో మూడు వారాల క్రితం గ్లాస్గో నగరంలో ఒకుహారా చేతిలో ప్రపంచ చాంపియన్‌షిప్ ఫైనల్లో ఎదురైన పరాజయానికి ఈ తెలుగు అమ్మాయి ప్రతీకారం తీర్చుకుంది. తన కెరీర్లో మూడో సూపర్ సిరీస్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. సియోల్ (దక్షిణ కొరియా): భారత బ్యాడ్మింటన్ స్టార్ పూసర్ల వెంకట (పీవీ) సింధు అనుకున్నది సాధించింది. 110 నిమిషాలపాటు జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్ ఫైనల్లో ఒకుహారా చేతిలో ఓటమి ఎదురయ్యాక ‘నా సమయం కూడా వస్తుంది’ అని సింధు వ్యాఖ్యానించింది. ఆమె అన్నట్టే మూడు వారాల్లోనే ఒకుహారాతో లెక్క సరిచేసింది. వేదిక, టోర్నీ మారిందంతే. ఆదివారం ముగిసిన కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నమెంట్లో ప్రపంచ నాలుగో ర్యాంకర్ సింధు చాంపియన్‌గా అవతరించింది. ప్రపంచ చాంపియన్, తొమ్మిదో ర్యాంకర్ నొజోమి ఒకుహారా (జపాన్)తో 83 నిమిషాలపాటు జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో సింధు 22–20, 11–21, 21–18తో విజయం సాధించింది. విజేతగా నిలిచిన సింధుకు 45 వేల డాలర్ల (రూ. 28 లక్షల 83 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 9,200 ర్యాంకింగ్ పాయింట్లు లభించింది. సింధు కెరీర్లో ఇది మూడో సూపర్ సిరీస్ టైటిల్. గతంలో ఆమె చైనా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ (2016), ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ (2017)లో టైటిల్స్ గెలిచింది. ఈ విజయంతో ముఖాముఖి రికార్డులో సింధు, ఒకుహారా 4–4తో సమఉజ్జీగా నిలిచారు. పోటాపోటీ: ప్రపంచ చాంపియన్‌షిప్ ఫైనల్ మాదిరిగానే ఈ మ్యాచ్ కూడా ఆద్యంతం హోరాహోరీగా జరిగింది. సుదీర్ఘ ర్యాలీలు సాగడం, ఇద్దరిలో ఒకరు తప్పిదం చేయడంతో పాయింట్లు వచ్చాయి. తొలి గేమ్‌లో ఇద్దరితో ఆధిక్యం దోబూచులాడింది. చివర్లో సింధు 18–20తో వెనుకబడిన దశలో ఒక్కసారిగా చెలరేగి వరుసగా నాలుగు పాయింట్లు గెలిచి తొలి గేమ్‌ను దక్కించుకుంది. రెండో గేమ్‌లో సింధు ఆటతీరు ఒక్కసారిగా గాడి తప్పింది. పలుమార్లు అనవసర తప్పిదాలు చేసి పాయింట్లు కోల్పోయింది. ఈ గేమ్‌లో ఇద్దరి స్కోర్లు ఒక్కసారి కూడా సమం కాలేదు. నిర్ణాయక మూడో గేమ్‌లో సింధు మళ్లీ పుంజుకుంది. తప్పిదాలకు ఆస్కారం ఇవ్వకుండా ఆడుతూ 11–5తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆరు పాయింట్లతో వెనుకబడిన ఒకుహారా ఏమాత్రం పట్టువిడవకుండా పోరాడటంతో ఒకదశలో వీరిద్దరి మధ్య తేడా రెండు పాయింట్లకు చేరుకుంది. స్కోరు 20–18 వద్ద ఇద్దరి మధ్య 56 షాట్ల మారథాన్ ర్యాలీ జరగడం... చివరకు ఒకుహారా కొట్టిన షటిల్ బయటకు వెళ్లడంతో సింధు విజయం ఖాయమైంది. ప్రశంసల వర్షం: కొరియా ఓపెన్ టైటిల్ నెగ్గిన పీవీ సింధుపై ప్రశంసల వర్షం కురిసింది. ‘కొరియా ఓపెన్‌లో విజేతగా నిలిచినందుకు అభినందనలు. ఈ విజయంపట్ల దేశం మొత్తం గర్విస్తోంది’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. కేంద్ర క్రీడల మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్, తెలంగాణ సీఎం కె. చంద్రశేఖర్ రావు, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా సింధును ప్రశంసించారు. భవిష్యత్‌లో ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ విజయం ఎంతో ప్రత్యేకం. రెండో గేమ్‌లో నేను షటిల్‌ను నియంత్రించలేకపోయాను. ఇక మూడో గేమ్‌లో నేను ఆధిక్యంలో ఉన్నా ఒకుహారా పోరాటాన్ని ఆపలేదు. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో మూడో గేమ్‌లో నేను 19–17తో ముందంజలో ఉన్నా ఓడిపోయాను. అయితే ఈ మ్యాచ్‌లో నేను ప్రపంచ చాంపియన్‌షిప్ ఫైనల్ ఫలితం గురించి ఆలోచించలేదు. ఈ విజయం దేశ ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజున లభించడంతో ఆయనకు అంకితం ఇస్తున్నాను. – సింధు ప్రపంచ చాంపియన్‌షిప్ తర్వాత సింధులో అటాకింగ్ గేమ్ శైలిని మరింతగా పెంచాలని నిర్ణయించాం. ఆ దిశగా ప్రాక్టీస్ చేయించాం. 22 ఏళ్లకే సింధు చాలా గొప్ప విజయాలు సాధిం చింది. ఇదేస్థాయిలో నిలకడగా ఆడితే భవిష్యత్‌లో ఆమె కచ్చితంగా ప్రపంచ నంబర్‌వన్ అవుతుంది. – పుల్లెల గోపీచంద్, చీఫ్ కోచ్ -
సింధు ప్రతీకార విజయం
సియోల్: కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్ లో భారత స్టార్ షట్లర్, తెలుగమ్మాయి పీవీ సింధు విజేతగా నిలిచారు. ఆదివారం జరిగిన ఫైనల్లో పివి సింధు 22-20, 11-21, 21-18 తేడాతో జపాన్ క్రీడాకారిణి ఒకుహారాపై విజయం సాధించి కొరియా సూపర్ సిరీస్ ను కైవసం చేసుకున్నారు. తద్వారా ఈ టోర్నమెంట్ లో తొలిసారి సింధు విజేతగా అవతరించారు. ఇరువురి క్రీడాకారిణులు మధ్య హోరాహోరీగా సాగిన తుది పోరులో సింధు విజయం సాధించి ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ ఫైనల్లో ఒకుహురా చేతిలో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకున్నారు. తొలి గేమ్ లో ఒకుహారా 12-9 తో ఆధిక్యంలో నిలిచిన సమయంలో సింధు వరుసగా పాయింట్ల సాధించి స్కోరును సమం చేశారు. ఆ తరువాత అదే ఊపును కొనసాగించి మరింత ఆధిక్యాన్ని సింధు సాధించారు. కాగా, ఆ దశలో పుంజుకున్న ఒకుహారా 19-18 తో ముందుకు దూసుకెళ్లారు. అయితే ఓ చక్కటి బ్రేక్ పాయింట్ ద్వారా ఒకుహారా ఆధిక్యాన్ని తగ్గించిన సింధు.. దాన్ని కాపాడుకుని తొలి గేమ్ ను 22-20తేడాతో సొంతం చేసుకున్నారు. రెండో గేమ్ లో మాత్రం ఒకుహారా ఆది నుంచి పైచేయి సాధిస్తూ సింధును వెనక్కునెట్టింది. ఏ దశలోనూ సింధుకు అవకాశం ఇవ్వని ఒకుహారా అదే జోరును కొనసాగించి రెండో గేమ్ ను సాధించారు. దాంతో నిర్ణయాత్మక మూడో గేమ్ అనివార్యమైంది. మూడో గేమ్ లో ఒకుహారా-సింధుల మధ్య ఆసక్తికర పోరు సాగింది. నువ్వు-నేనా అన్న రీతిలో సాగిన ఫైనల్ గేమ్ లో సింధు పెద్దగా పొరపాట్లకు తావివ్వలేదు. కాగా, సింధు 19-16 పాయింట్లతో ఆధిక్యంలో ఉన్న దశలో ఒకుహోరా మరోసారి పుంజుకునే యత్నం చేశారు. ఈ క్రమంలోనే ఇరువురి మధ్య 56 సెకెండ్ల సుదీర్ఘమైన ర్యాలీ జరిగింది. ఇక్కడ ఒకుహారా పాయింట్ సాధించనప్పటికీ, సింధు మాత్రం ఎటువంటి ఒత్తిడికి లోను కాకుండా మూడు పాయింట్ల తేడాతో గేమ్ తో పాటు మ్యాచ్ ను కూడా సాధించారు. దాంతో కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్ ను సింధు కైవసం చేసుకున్నారు. తొలిసారి కొరియా ఓపెన్ ను అందుకున్న సింధును వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని టైటిల్ సాధించాలని ఆకాంక్షించారు. మరొకవైపు సింధును బిగ్ బి అమితాబచ్చన్ కొనియాడారు. ఇదొక స్వీట్ రివేంజ్ అంటూ అమితాబ్ ట్వీట్ చేశారు. -
ప్రపంచ చాంపియన్‌పై సింధు ప్రతీకార విజయం
-
సింధు తొలిసారి..
-
సింధు తొలిసారి..
సియోల్:కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో భారత స్టార్ షట్లర్ పివి సింధు ఫైనల్లోకి ప్రవేశించారు. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీ ఫైనల్లో సింధు 21-10, 17-21, 21-16 తేడాతో బింగ్జియావో(చైనా)పై గెలిచి ఫైనల్ కు చేరారు. తద్వారా కొరియో ఓపెన్ సూపర్ సిరీస్ లోకి తొలిసారి ఫైనల్లోకి ప్రవేశించారు. తొలి గేమ్ లో 9-3 తేడాతో స్పష్టమైన ఆధిక్యం సాధించిన సింధు.. వరుస పాయింట్లతో దూసుకుపోయింది. తొలి గేమ్ లో 13-6, 19-9 తేడాతో పైచేయి సాధించిన సింధు ఆ గేమ్ ను సునాయాసంగా గెలుచుకున్నారు. కాగా, రెండో గేమ్ లో బింగ్జియావో నుంచి సింధుకు ఊహించని ప్రతి ఘటన ఎదురైంది. రెండో గేమ్ లో సింధు 9-6 తేడాతో ఆధిక్యంలో నిలిచిన సమయంలో ఒక్కసారి బింగ్జియావో విజృంచింది. తొలుత 13-12తో సింధు ఆధిక్యాన్ని తగ్గించిన బింగ్జియావో.. అదే ఊపులో వరుస పాయింట్లను సాధించి గేమ్ ను కూడా సొంతం చేసుకుంది. దాంతో నిర్ణయాత్మక మూడో గేమ్ అనివార్యమైంది. హోరాహోరీగా సాగిన మూడో గేమ్ ను సింధు సొంతం చేసుకోవడమే కాకుండా మ్యాచ్ ను కూడా సాధించి తుదిపోరు అర్హత సాధించారు. ఆదివారం జరిగే ఫైనల్లో జపాన్ క్రీడాకారిణి ఒకుహరాతో సింధు తలపడనుంది. ఇటీవల జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్లో ఒకుహరా చేతిలో పరాజయం పాలైన సింధు ప్రతీకారం తీర్చుకోవడానికి ఉవ్విళ్లూరుతోంది. -
సెమీస్‌కు చేరిన సింధు
సియోల్: కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో తెలుగమ్మాయి పివి సింధు తన జోరును కొనసాగిస్తున్నారు. మహిళల సింగిల్స్ లో భాగంగా శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో సింధు విజయం సాధించి సెమీస్ బెర్తును ఖాయం చేసుకున్నారు. జపాన్ క్రీడాకారిణి మితానితో హోరా హోరీగా సాగిన పోరులో సింధు 21-19, 16-21, 21-10 తేడాతో గెలిచి సెమీస్‌లోకి ప్రవేశించారు. తొలి గేమ్ ను తుదికంటూ పోరాడి సాధించిన సింధు.. రెండో గేమ్ ను కోల్పోయారు. దాంతో నిర్ణయాత్మక మూడో గేమ్ అనివార్యమైంది. కాగా, ఆ గేమ్ లో ప్రత్యర్థి మితానీకి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా సింధు వరుస పాయింట్లతో దూసుకుపోయారు. 63 నిమిషాల పాటు జరిగిన పోరులో సింధు తన సుదీర్ఘమైన ర్యాలీలతో ఆకట్టుకున్నారు. మరొకవైపు పురుషుల సింగిల్స్ లో భారత క్రీడాకారుడు సమీర్ వర్మ పోరాటం ముగిసింది. క్వార్టర్ ఫైనల్లో సమీర్ వర్మ 22-20, 10-21, 13-21 తేడాతో కొరియా ఆటగాడు సన్ వాన్ చేతిలో ఓటమి పాలయ్యారు. -
ఫైనల్లో జయరామ్ కు నిరాశ
సియోల్:కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ లో భాగాంగా తొలిసారి సూపర్ సిరీస్ ఫైనల్ కు చేరుకున్నభారత బ్యాడ్మింటన్ ఆటగాడు అజయ్ జయరామ్ కు నిరాశే ఎదురైంది. ఆదివారం జరిగిన ఫైనల్లో జయరామ్ 14-21,13-21 తేడాతో ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు, ప్రపంచ చాంపియన్, డిఫెండింగ్ చాంపియన్ చెన్ లాంగ్(చైనా) చేతిలో ఓటమి చెందాడు. భారత స్టార్ ఆటగాళ్లు నిష్ర్కమించిన చోట తన పూర్వవైభవాన్ని చాటుకుంటూ ఫైనల్ కు చేరిన జయరామ్ ఫైనల్లో ఆశించిన స్థాయిలో రాణించలేదు. జయరామ్ వరుస సెట్లను చెన్ లాంగ్ కు అప్పగించి రన్నరప్ గా సరిపెట్టుకున్నాడు. ఈ టోర్నీ ఆద్యంతం అంచనాలు మించి రాణించిన జయరామ్ ఫైనల్లో మాత్రం చెన్ దాటికి తలవంచక తప్పలేదు. అన్ సీడెడ్ క్రీడాకారుడిగా బరిలోకి దిగిన జయరామ్ తొలి గేమ్ లో వరుసగా పాయింట్లు సాధించి ఆధిక్యం దిశగా దూసుకెళ్లినా.. స్కోరు 4-4 వద్ద ఉండగా చెన్ లాంగ్ దూకుడుగా ఆడాడు. ఈ క్రమంలో చెన్ 9-5 తో ముందంజ వేసి అదే ఊపును కడవరకూ కొనసాగించి సెట్ ను చేజిక్కించుకున్నాడు. అయితే రెండో సెట్ లో జయరామ్ చేసిన అనవసర తప్పిదాలను చెన్ ఉపయోగించుకున్నాడు. ఈ మ్యాచ్ లో లాంగ్ అద్భుతమైన ఎఫెన్స్, డిఫెన్స్ తో జయరామ్ కు కళ్లెం వేసి మరోసారి కొరియన్ సూపర్ సిరీస్ విజేతగా అవతరించాడు. దీంతో విజేత చెన్ లాంగ్‌కు 45 వేల డాలర్లు (రూ. 29 లక్షల 64 వేలు), రన్నరప్ అజయ్ జయరామ్‌కు 22 వేల 800 డాలర్లు (రూ. 15 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. ఇదిలా ఉండగా ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య ఆధ్వర్యంలో 2007లో సూపర్ సిరీస్ టోర్నమెంట్లు ప్రారంభమైన తర్వాత... భారత్ నుంచి సూపర్ సిరీస్ టోర్నీలో ఫైనల్‌కు చేరుకున్న మూడో ప్లేయర్‌గా జయరామ్ గుర్తింపు పొంది అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఇంతకుముందు భారత్ నుంచి సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్ సూపర్ సిరీస్ టోర్నీల్లో ఫైనల్‌కు చేరుకున్న వారిలో ఉన్నారు. -
అజయ్హో
ప్రపంచ ఏడో ర్యాంకర్‌పై సంచలన విజయం ♦ కెరీర్లో తొలిసారి ‘సూపర్’ ఫైనల్లోకి ♦ భారత్ నుంచి ఈ ఘనత సాధించిన మూడో ప్లేయర్ ♦ నేడు ప్రపంచ నంబర్‌వన్ చెన్ లాంగ్‌తో అమీతుమీ ♦ కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీ మూడేళ్ల క్రితం చివరి నిమిషంలో లండన్ ఒలింపిక్స్ బెర్త్‌ను పారుపల్లి కశ్యప్‌కు కోల్పోయి తీవ్ర నిరుత్సాహానికి గురైన అజయ్ జయరామ్... ఈ ఏడాది తన పాత చేదు జ్ఞాపకాలన్నింటినీ మర్చిపోయే ప్రదర్శన చేస్తున్నాడు. ఒకప్పుడు భారత నంబర్‌వన్‌గా చెలామణీ అయిన ఈ బెంగళూరు ప్లేయర్ తదనంతరం కశ్యప్, శ్రీకాంత్, గురుసాయిదత్, ప్రణయ్, ఆనంద్ పవార్, సాయిప్రణీత్ తదితర ఆటగాళ్ల దూకుడుకు వెనుకబడిపోయాడు. శ్రీకాంత్, కశ్యప్, ప్రణయ్ లాంటి ఆటగాళ్లపైనే అందరి దృష్టి కేంద్రీకృతమవుతున్న ప్రస్తుత తరుణంలో... జయరామ్ అందరి అంచనాలను తారుమారు చేస్తూ కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నమెంట్లో ఫైనల్‌కు దూసుకెళ్లాడు. తద్వారా మళ్లీ పూర్వ వైభవం దిశగా అడుగులు వేస్తున్నాడు. సియోల్ : భారత అగ్రశ్రేణి క్రీడాకారులు కిడాంబి శ్రీకాంత్, పారుపల్లి కశ్యప్, హెచ్ఎస్ ప్రణయ్ చేతులెత్తేసిన చోట... భారత్‌కే చెందిన మరో ప్లేయర్ అజయ్ జయరామ్ సంచలన ప్రదర్శనతో తన ఉనికిని చాటుకున్నాడు. అందర్నీ ఆశ్చర్యపరుస్తూ కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నమెంట్లో పురుషుల సింగిల్స్ విభాగంలో ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శనివారం జరిగిన సెమీఫైనల్లో ప్రపంచ 32వ ర్యాంకర్ అజయ్ జయరామ్ 21-19, 21-15తో ప్రపంచ ఏడో ర్యాంకర్ చెన్ చౌ తియెన్ (చైనీస్ తైపీ)పై వరుస గేముల్లో నెగ్గి టైటిల్ పోరుకు అర్హత సాధించాడు. ► ఆదివారం జరిగే ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్, ప్రపంచ చాంపియన్, టాప్ సీడ్ చెన్ లాంగ్ (చైనా)తో జయరామ్ అమీతుమీ తేల్చుకుంటాడు. ముఖాముఖి రికార్డులో జయరామ్ 0-1తో వెనుకంజలో ఉన్నాడు. 2014 హాంకాంగ్ ఓపెన్ తొలి రౌండ్లో చెన్ లాంగ్‌తో ఆడిన ఏకైక మ్యాచ్‌లో జయరామ్ వరుస గేముల్లో ఓడిపోయాడు. ► సెమీస్ చేరే క్రమంలో తనకంటే ఎంతో మెరుగైన ర్యాంక్ ఆటగాళ్లను ఓడించి ఆత్మవిశ్వాసంతో ఉన్న జయరామ్ అదే జోరును ఈ మ్యాచ్‌లోనూ ప్రదర్శించాడు. ఈ ఏడాది తన ప్రత్యర్థి చేతిలో రెండుసార్లు ఓడిపోయినప్పటికీ... ఆ మ్యాచ్‌ల్లో చేసిన తప్పిదాలను ఈసారి పునరావృతం చేయకుండా పక్కా ప్రణాళికతో ఆడి అనుకున్న ఫలితాన్ని సాధించాడు. ► జయరామ్ తొలి గేమ్‌లో 11-15తో.. రెండో గేమ్‌లో 12-14తో వెనుకబడ్డాడు. అయితే అతను ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా నిగ్రహంతో ఆడి స్కోరును సమం చేయడంతోపాటు ఆధిక్యంలోకి వెళ్లి విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. ఈ ఏడాది జయరామ్ మలేసియా మాస్టర్స్ గ్రాండ్‌ప్రి గోల్డ్, స్విస్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్, రష్యా ఓపెన్ గ్రాండ్‌ప్రి టోర్నీల్లో సెమీస్‌కు చేరుకున్నాడు. ► ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) ఆధ్వర్యంలో 2007లో సూపర్ సిరీస్ టోర్నమెంట్లు ప్రారంభమైన తర్వాత... భారత్ నుంచి సూపర్ సిరీస్ టోర్నీలో ఫైనల్‌కు చేరుకున్న మూడో ప్లేయర్‌గా జయరామ్ గుర్తింపు పొందాడు. ఇంతకుముందు భారత్ నుంచి సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్ సూపర్ సిరీస్ టోర్నీల్లో ఫైనల్‌కు చేరుకోవడంతోపాటు టైటిల్స్ కూడా నెగ్గిన సంగతి తెలిసిందే. గతంలో ప్రకాశ్ పదుకొనే, పుల్లెల గోపీచంద్ ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ టైటిల్స్ నెగ్గినపుడు ఆ టోర్నీలకు సూపర్ సిరీస్ హోదా లేదు. ► ‘‘నాకిది గొప్ప విజయం. వ్యూహాత్మకంగా, మానసికంగా కూడా సెమీస్‌లో మంచి ఆటతీరును కనబరిచాను. ఈ ఏడాది చెన్ చౌ తియెన్తో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయాను. ఈసారి చాలా ఓపికతో ఆడాను. నెట్ వద్ద, ర్యాలీల్లో పైచేయి సాధించాను. తొలిసారి సూపర్ సిరీస్ టోర్నీలో ఫైనల్ చేరినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ టోర్నీలోని గత మ్యాచ్‌ల ఫలితాలతో సంబంధం లేకుండా ఫైనల్ మ్యాచ్‌పై దృష్టి పెడతాను. చెన్ లాంగ్‌తో టైటిల్ పోరు క్లిష్టంగా ఉంటుందని భావిస్తున్నాను’’ -అజయ్ జయరామ్ -
కొరియా ఓపెన్ లో ముగిసిన భారత్ పోరాటం
సియోల్: కొరియా ఓపెన్ లో భారత బ్యాడ్మింటన్ పోరాటం ముగిసింది. డబుల్స్ విభాగంలో గురువారం జరిగిన రెండో రౌండ్ లో భారత్ షట్లర్లు గుత్తా జ్వాల-అశ్విన్ పొన్నప్ప జోడీలకు పరాభవం ఎదురుకావడంతో టోర్నీ నుంచి నిష్ర్కమించారు. యా నా జాంగ్, యంగ్ కిమ్ ల జోడీ చేతిలో 21-18,21-12 తేడాతో జ్వాల-అశ్వినిలు ఓటమి పాలైయ్యారు. మరోప్రక్క మిక్సిడ్ డబుల్స్ లో తరుణ్- కోనా జంట 10-21, 15-21 తేడాతో జర్మనీ జంట మైఖేల్ ఫక్స్, బిర్జిట్ మైఖేల్స్ చేతిలో చుక్కెదురైంది. వీరి ఓటమితో భారత్ పోరు ఆదిలోనే ముగిసినట్టయ్యింది. ముందురోజు మహిళల విభాగంలో మెరుపించి రెండో రౌండ్ కు చేరుకున్నగుత్తా జ్వాల-అశ్విని పొనప్ప జోడి ఈ గేమ్ లో కనీసం పోరాట పటిమను కూడా కనబరచకుండా ఓటమి చెందారు. అయితే పురుషుల సింగిల్స్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జాతీయ చాంపియన్ కిడాంబి శ్రీకాంత్, గురుసాయిదత్ తొలి రౌండ్లోనే నిష్ర్కమించారు. -
జ్వాల జోడి శుభారంభం
సియోల్: బ్యాడ్మింటన్ సీజన్‌లోని తొలి సూపర్ సిరీస్ టోర్నమెంట్ కొరియా ఓపెన్‌లో భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు లభించాయి. మహిళల డబుల్స్‌లో గుత్తా జ్వాల-అశ్విని పొనప్ప జోడి... మిక్స్డ్ డబుల్స్‌లో అశ్విని పొనప్ప-తరుణ్ కోనా జంట శుభారంభం చేశాయి. అయితే పురుషుల సింగిల్స్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జాతీయ చాంపియన్ కిడాంబి శ్రీకాంత్, గురుసాయిదత్ తొలి రౌండ్లోనే నిష్ర్కమించారు. భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్)తో నెలకొన్న వివాదాలు పరిష్కారం కావడంతో ఈ టోర్నీలో బరిలోకి దిగిన జ్వాల తొలి మ్యాచ్‌లో ఆకట్టుకుంది. భాగస్వామి అశ్వినితో కలిసి జ్వాల కేవలం 19 నిమిషాల్లో 21-10, 21-7తో అనా రాన్‌కిన్-మెడిలిన్ స్టాపిల్టన్ (న్యూజిలాండ్) జోడిని చిత్తు చేసింది. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో అశ్విని-తరుణ్ జోడి 22-20, 21-17తో జోన్స్ ష్కోట్లెర్-జోనా గోలిస్జ్యూస్కీ (జర్మనీ) జంటపై గెలిచింది. పురుషుల సింగిల్స్‌లో శ్రీకాంత్ 10-21, 11-21తో ఐదో సీడ్ కెనిచి టాగో (జపాన్) చేతిలో; గురుసాయిదత్ 11-21, 11-21తో టకుమా ఉయెదా (జపాన్) చేతిలో ఓటమి పాలయ్యారు. టాగోతో జరిగిన మ్యాచ్‌లో శ్రీకాంత్ ఏదశలోనూ ప్రత్యర్థికి పోటీనివ్వలేకపోయాడు. రెండు గేముల్లోనూ ఆరంభదశలో తప్పించి మిగతా సమయాల్లో పూర్తిగా వెనుకబడ్డాడు. గురువారం జరిగే రెండో రౌండ్లో మూడో సీడ్ యె నా జాంగ్-సో యంగ్ కిమ్ (కొరియా) జోడితో జ్వాల-అశ్విని; మైకేల్ ఫచ్స్-బిర్గిట్ మిచెల్స్ (జర్మనీ) ద్వయంతో అశ్విని-తరుణ్ పోటీపడతారు. వచ్చే వారం జరిగే మలేసియా ఓపెన్‌కు సన్నాహాల్లో భాగంగా కొరియా ఓపెన్‌లో సైనా, సింధు, కశ్యప్ బరిలోకి దిగలేదు.