సెమీస్కు చేరిన సింధు
సియోల్: కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో తెలుగమ్మాయి పివి సింధు తన జోరును కొనసాగిస్తున్నారు. మహిళల సింగిల్స్ లో భాగంగా శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో సింధు విజయం సాధించి సెమీస్ బెర్తును ఖాయం చేసుకున్నారు. జపాన్ క్రీడాకారిణి మితానితో హోరా హోరీగా సాగిన పోరులో సింధు 21-19, 16-21, 21-10 తేడాతో గెలిచి సెమీస్లోకి ప్రవేశించారు. తొలి గేమ్ ను తుదికంటూ పోరాడి సాధించిన సింధు.. రెండో గేమ్ ను కోల్పోయారు. దాంతో నిర్ణయాత్మక మూడో గేమ్ అనివార్యమైంది.
కాగా, ఆ గేమ్ లో ప్రత్యర్థి మితానీకి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా సింధు వరుస పాయింట్లతో దూసుకుపోయారు. 63 నిమిషాల పాటు జరిగిన పోరులో సింధు తన సుదీర్ఘమైన ర్యాలీలతో ఆకట్టుకున్నారు. మరొకవైపు పురుషుల సింగిల్స్ లో భారత క్రీడాకారుడు సమీర్ వర్మ పోరాటం ముగిసింది. క్వార్టర్ ఫైనల్లో సమీర్ వర్మ 22-20, 10-21, 13-21 తేడాతో కొరియా ఆటగాడు సన్ వాన్ చేతిలో ఓటమి పాలయ్యారు.