అజయ్హో
ప్రపంచ ఏడో ర్యాంకర్‌పై సంచలన విజయం
♦ కెరీర్‌లో తొలిసారి ‘సూపర్’ ఫైనల్లోకి
♦ భారత్ నుంచి ఈ ఘనత సాధించిన మూడో ప్లేయర్
♦ నేడు ప్రపంచ నంబర్‌వన్ చెన్ లాంగ్‌తో అమీతుమీ
♦ కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీ
మూడేళ్ల క్రితం చివరి నిమిషంలో లండన్ ఒలింపిక్స్ బెర్త్‌ను పారుపల్లి కశ్యప్‌కు కోల్పోయి తీవ్ర నిరుత్సాహానికి గురైన అజయ్ జయరామ్... ఈ ఏడాది తన పాత చేదు జ్ఞాపకాలన్నింటినీ మర్చిపోయే ప్రదర్శన చేస్తున్నాడు. ఒకప్పుడు భారత నంబర్‌వన్‌గా చెలామణీ అయిన ఈ బెంగళూరు ప్లేయర్ తదనంతరం కశ్యప్, శ్రీకాంత్, గురుసాయిదత్, ప్రణయ్, ఆనంద్ పవార్, సాయిప్రణీత్ తదితర ఆటగాళ్ల దూకుడుకు వెనుకబడిపోయాడు. శ్రీకాంత్, కశ్యప్, ప్రణయ్ లాంటి ఆటగాళ్లపైనే అందరి దృష్టి కేంద్రీకృతమవుతున్న ప్రస్తుత తరుణంలో... జయరామ్ అందరి అంచనాలను తారుమారు చేస్తూ కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నమెంట్‌లో ఫైనల్‌కు దూసుకెళ్లాడు. తద్వారా మళ్లీ పూర్వ వైభవం దిశగా అడుగులు వేస్తున్నాడు.
సియోల్ : భారత అగ్రశ్రేణి క్రీడాకారులు కిడాంబి శ్రీకాంత్, పారుపల్లి కశ్యప్, హెచ్‌ఎస్ ప్రణయ్ చేతులెత్తేసిన చోట... భారత్‌కే చెందిన మరో ప్లేయర్ అజయ్ జయరామ్ సంచలన ప్రదర్శనతో తన ఉనికిని చాటుకున్నాడు. అందర్నీ ఆశ్చర్యపరుస్తూ కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నమెంట్‌లో పురుషుల సింగిల్స్ విభాగంలో ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శనివారం జరిగిన సెమీఫైనల్లో ప్రపంచ 32వ ర్యాంకర్ అజయ్ జయరామ్ 21-19, 21-15తో ప్రపంచ ఏడో ర్యాంకర్ చెన్ చౌ తియెన్ (చైనీస్ తైపీ)పై వరుస గేముల్లో నెగ్గి టైటిల్ పోరుకు అర్హత సాధించాడు.
► ఆదివారం జరిగే ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్, ప్రపంచ చాంపియన్, టాప్ సీడ్ చెన్ లాంగ్ (చైనా)తో జయరామ్ అమీతుమీ తేల్చుకుంటాడు. ముఖాముఖి రికార్డులో జయరామ్ 0-1తో వెనుకంజలో ఉన్నాడు. 2014 హాంకాంగ్ ఓపెన్ తొలి రౌండ్‌లో చెన్ లాంగ్‌తో ఆడిన ఏకైక మ్యాచ్‌లో జయరామ్ వరుస గేముల్లో ఓడిపోయాడు.
► సెమీస్ చేరే క్రమంలో తనకంటే ఎంతో మెరుగైన ర్యాంక్ ఆటగాళ్లను ఓడించి ఆత్మవిశ్వాసంతో ఉన్న జయరామ్ అదే జోరును ఈ మ్యాచ్‌లోనూ ప్రదర్శించాడు. ఈ ఏడాది తన ప్రత్యర్థి చేతిలో రెండుసార్లు ఓడిపోయినప్పటికీ... ఆ మ్యాచ్‌ల్లో చేసిన తప్పిదాలను ఈసారి పునరావృతం చేయకుండా పక్కా ప్రణాళికతో ఆడి అనుకున్న ఫలితాన్ని సాధించాడు.
► జయరామ్ తొలి గేమ్‌లో 11-15తో.. రెండో గేమ్‌లో 12-14తో వెనుకబడ్డాడు. అయితే అతను ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా నిగ్రహంతో ఆడి స్కోరును సమం చేయడంతోపాటు ఆధిక్యంలోకి వెళ్లి విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. ఈ ఏడాది జయరామ్ మలేసియా మాస్టర్స్ గ్రాండ్‌ప్రి గోల్డ్, స్విస్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్, రష్యా ఓపెన్ గ్రాండ్‌ప్రి టోర్నీల్లో సెమీస్‌కు చేరుకున్నాడు.
► ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) ఆధ్వర్యంలో 2007లో సూపర్ సిరీస్ టోర్నమెంట్‌లు ప్రారంభమైన తర్వాత... భారత్ నుంచి సూపర్ సిరీస్ టోర్నీలో ఫైనల్‌కు చేరుకున్న మూడో ప్లేయర్‌గా జయరామ్ గుర్తింపు పొందాడు. ఇంతకుముందు భారత్ నుంచి సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్ సూపర్ సిరీస్ టోర్నీల్లో ఫైనల్‌కు చేరుకోవడంతోపాటు టైటిల్స్ కూడా నెగ్గిన సంగతి తెలిసిందే. గతంలో ప్రకాశ్ పదుకొనే, పుల్లెల గోపీచంద్ ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ టైటిల్స్ నెగ్గినపుడు ఆ టోర్నీలకు సూపర్ సిరీస్ హోదా లేదు.
► ‘‘నాకిది గొప్ప విజయం. వ్యూహాత్మకంగా, మానసికంగా కూడా సెమీస్‌లో మంచి ఆటతీరును కనబరిచాను. ఈ ఏడాది చెన్ చౌ తియెన్‌తో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయాను. ఈసారి చాలా ఓపికతో ఆడాను. నెట్ వద్ద, ర్యాలీల్లో పైచేయి సాధించాను. తొలిసారి సూపర్ సిరీస్ టోర్నీలో ఫైనల్ చేరినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ టోర్నీలోని గత మ్యాచ్‌ల ఫలితాలతో సంబంధం లేకుండా ఫైనల్ మ్యాచ్‌పై దృష్టి పెడతాను. చెన్ లాంగ్‌తో టైటిల్ పోరు క్లిష్టంగా ఉంటుందని భావిస్తున్నాను’’
-అజయ్ జయరామ్