Ajay Jayaram
-
భారత షట్లర్లకు కరోనా కష్టాలు!
సార్‌బ్రుకెన్ (జర్మనీ): కోవిడ్–19 కారణంగా వచ్చిన సుదీర్ఘ విరామం తర్వాత టోర్నీలో పాల్గొనేందుకు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలని భావించిన భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులకు చేదు అనుభవం ఎదురైంది. ఇక్కడ ప్రారంభమైన సార్లార్ లక్స్ ఓపెన్ సూపర్–100 టోర్నీనుంచి మన షట్లర్లు అజయ్ జయరాం, శుభాంకర్ డే అర్ధాంతరంగా తప్పుకోవాల్సి వచ్చింది. బుధవారమే మరో ఆటగాడు లక్ష్య సేన్ కూడా టోర్నీకి దూరమయ్యాడు. కరోనా భయమే దీనికంతటికీ కారణం. వివరాల్లోకెళితే... ఆటగాళ్లతో పాటు కోచ్ హోదాలో టోర్నీకి వచ్చిన లక్ష్య సేన్ తండ్రి డీకే సేన్ బుధవారం కరోనా ‘పాజిటివ్’గా తేలారు. దాంతో ఆయనతో కలిసి ఉన్న లక్ష్య సేన్ టోర్నీనుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అయితే సేన్‌తో కలిసి సాధన చేసిన, ప్రయాణించిన జయరామ్, శుభాంకర్ కూడా తప్పుకోవాలని టోర్నీ నిర్వాహకులు సూచించారు. ఈ విషయాన్ని ‘బీడబ్ల్యూఎఫ్’ కూడా ప్రకటించింది. దాంతో వీరిద్దరు కూడా నిష్క్రమించాల్సి వచ్చింది. అయితే నిబంధనల ప్రకారం కనీసం 10 నవంబర్ వరకు ఐసోలేషన్‌లో ఉండాలని చెప్పిన నిర్వాహకులు అందుకు తగినట్లుగా కనీస ఏర్పాట్లు కూడా చేయలేదు. ఎక్కడ ఉండాలో, అన్ని రోజులు ఖర్చులు ఎలా భరించాలనే విషయంపై కూడా స్పష్టతనివ్వకుండా వారి మానాన వారిని వదిలేశారు. నిజానికి వీరిద్దరికి ఎలాంటి లక్షణాలు లేవు. జర్మనీ రావడానికి ముందే చేయించుకున్న పరీక్షల ‘నెగెటివ్’ రిపోర్టులు కూడా ఉన్నాయి. డీకే సేన్ రిపోర్టు వచ్చే సమయానికి జయరామ్ ఒక మ్యాచ్ కూడా ఆడేశాడు. ఈ విషయంలో టోర్నీ ఆరంభంలో సరైన కోవిడ్–19 నిబంధనలు పాటించని నిర్వాహకులతో పాటు పరీక్షలు చేయించుకోకుండా వచ్చిన లక్ష్యసేన్ తప్పు కొంత వరకు ఉండగా... వీరిద్దరు కూడా బాధితులయ్యారు. తాజా పరిణామాలతో ఆందోళన చెందిన జయరామ్ తన బాధను ట్విట్టర్ ద్వారా పంచుకున్నాడు. ఎట్టకేలకు భారత క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్) దీనిపై స్పందించింది. వారి భోజన, వసతి ఖర్చులను తాము భరించనున్నట్లు స్పష్టం చేసింది. దాంతో ఊరట పొందిన జయరామ్...సాధ్యమైనంత తర్వాత స్వదేశం తిరిగొస్తామని విశ్వాసం వ్యక్తం చేశాడు. -
బ్యాడ్మింటన్‌కు వేళాయె!
ఒడెన్స్ (డెన్మార్క్): కరోనా వైరస్ కారణంగా మార్చి నెల రెండో వారం నుంచి అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లు నిలిచిపోయాయి. ఏడు నెలల విరామం తర్వాత ఎట్టకేలకు మళ్లీ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సందడి మొదలుకానుంది. నేటి నుంచి డెన్మార్క్ ఓపెన్ సూపర్–750 టోర్నమెంట్ జరగనుంది. పురుషుల సింగిల్స్‌లో భారత్ నుంచి ప్రపంచ మాజీ నంబర్‌వన్, ఆంధ్రప్రదేశ్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్‌తోపాటు లక్ష్య సేన్, అజయ్ జయరామ్, శుభాంకర్ డే తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. సరైన సన్నాహాలు లేని కారణంగా సైనా నెహ్వాల్, పీవీ సింధు, పారుపల్లి కశ్యప్ ఈ టోర్నీ నుంచి వైదొలిగారు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో టోబీ పెంటీ (ఇంగ్లండ్)తో శ్రీకాంత్; జేసన్ ఆంథోనీ (కెనడా)తో శుభాంకర్; అండెర్స్ ఆంటోన్సెన్ (డెన్మార్క్)తో అజయ్ జయరామ్; క్రిస్టో పొపోవ్ (ఫ్రాన్స్)తో లక్ష్య సేన్ ఆడనున్నారు. -
శ్రీకాంత్‌కు షాకిచ్చిన జయరామ్
బార్సిలోనా: కొంతకాలంగా పేలవ ప్రదర్శనతో నిరాశపరుస్తోన్న భారత బ్యాడ్మింటన్ స్టార్, ప్రపంచ మాజీ నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్ మళ్లీ తడబడ్డాడు. బార్సిలోనా స్పెయిన్ మాస్టర్స్ టోర్నమెంట్లో ప్రపంచ 12వ ర్యాంకర్ శ్రీకాంత్ ప్రిక్వార్టర్ ఫైనల్లోనే నిష్క్రమించాడు. భారత్‌కే చెందిన ప్రపంచ 68వ ర్యాంకర్ అజయ్ జయరామ్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీకాంత్ 28 నిమిషాల్లో 6–21, 17–21తో ఓడిపోయాడు. పురుషుల సింగిల్స్ మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో సమీర్ వర్మ (భారత్) 21–14, 16–21, 21–15తో కాయ్ షాఫెర్ (జర్మనీ)పై నెగ్గి క్వార్టర్ ఫైనల్ చేరాడు. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సైనా నెహా్వల్ (భారత్) 21–10, 21–19తో మరియా ఉలిటినా (ఉక్రెయిన్)పై గెలిచి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. మహిళల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సిక్కి రెడ్డి–అశి్వని (భారత్) జంట 18–21, 14–21తో గాబ్రియెలా–స్టెఫానీ (బల్గేరియా) జోడీ చేతిలో... మిక్స్డ్ డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా (భారత్) ద్వయం 16–21, 21–16, 13–21తో సూన్ హువాట్–లాయ్ షెవోన్ జేమీ (మలేసియా) జంట చేతిలో ఓడిపోయాయి. -
సాయి ఉత్తేజిత, జయరామ్ ఓటమి
న్యూఢిల్లీ: మకావు ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత క్రీడాకారులకు నిరాశాజనక ఫలితాలు ఎదురయ్యాయి. మహిళల సింగిల్స్ ఆంధ్రప్రదేశ్ అమ్మాయి చుక్కా సాయి ఉత్తేజిత రావు, పురుషుల సింగిల్స్‌లో అజయ్ జయరామ్ తొలి రౌండ్లోనే నిష్క్రమించారు. మకావులో బుధవారం జరిగిన మ్యాచ్‌ల్లో సాయి ఉత్తేజిత 19–21, 12–21తో ఆరో సీడ్ కాయ్ యాన్ యాన్ (చైనా) చేతిలో... జయరామ్ 16–21, 16–21తో సన్ ఫె జియాంగ్ (చైనా) చేతిలో ఓడిపోయారు. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో జక్కంపూడి మేఘన–పూరీ్వషా రామ్ (భారత్) జోడీ 17–21, 19–21తో లిన్ ఫాంగ్ లింగ్–జిన్ రు జౌ (చైనా) జంట చేతిలో... పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో వసంత కుమార్ హనుమయ్య–ఆశిత్ సూర్య (భారత్) ద్వయం 14–21, 14–21తో లిన్ చియా యు–యాంగ్ మింగ్ త్సె (చైనీస్ తైపీ) జోడీ చేతిలో ఓడిపోయాయి. -
అజయ్, మిథున్ పరాజయం
ఓర్లీన్స్ (ఫ్రాన్స్): భారత షట్లర్లు ఓర్లీన్స్ మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–100 బ్యాడ్మింటన్ టోర్నీలో నిరాశపరిచారు. గురువారం బరిలోకి దిగిన సింగిల్స్, డబుల్స్ ప్లేయర్లంతా పరాజయం చవిచూశారు. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో మిథున్ మంజునాథ్ 9–21, 18–21తో గత్రా ఫిలియంగ్ ఫిఖిహిలా కుపు (ఇండోనేసియా) చేతిలో ఓడిపోగా, అజయ్ జయరామ్‌కు 10–21, 17–21తో ఎనిమిదో సీడ్ థామస్ రూక్సెల్ (ఫ్రాన్స్) చేతిలో చుక్కెదురైంది. మహిళల సింగిల్స్‌లో ముగ్దా ఆగ్రేను 10–21, 19–21తో ఆరో సీడ్ సబ్రినా జాకెట్ (స్విట్జర్లాండ్) ఇంటిదారి పట్టించింది. మహిళల డబుల్స్‌లో ఆరో సీడ్ యుల్ఫిరా బర్కాన్– జౌజా ఫధిలా సుగియార్తో (ఇండోనేసియా) జోడీ 21–14, 18–21, 21–19తో పూజ దండు–సంజన జంటపై గెలిచింది. మిక్స్డ్ డబుల్స్‌లో ధ్రువ్ కపిల–కుహూ గార్గ్ జంట 21–23, 12–21తో నాలుగో సీడ్ ఎవెంజి డ్రిమిన్–ఎవ్‌జినియా దిమోవ (రష్యా) జోడీ చేతిలో ఓడింది. -
క్వార్టర్స్‌లో అజయ్ జయరామ్
తైపీ సిటీ: చైనీస్ తైపీ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ తరఫున అజయ్ జయరామ్ ఒక్కడే నిలిచాడు. పురుషుల సింగిల్స్‌లో అతను క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించగా, మాజీ జాతీయ చాంపియన్ సౌరభ్ వర్మ ఆట ప్రిక్వార్టర్స్‌లో ముగిసింది. భారత స్టార్లు దూరంగా ఉన్న ఈ టోర్నీలో మిగతా యువ షట్లర్లంతా తొలిరౌండ్లోనే కంగుతిన్నారు. గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో అజయ్ 21–10, 22–20తో డెన్మార్క్‌కు చెందిన కిమ్ బ్రూన్‌ను వరుస గేముల్లో ఓడించాడు. 30 ఏళ్ల భారత ఆటగాడు... క్వార్టర్స్‌లో లీ జి జియా (మలేసియా)తో తలపడతాడు. సౌరభ్ వర్మ 21–19, 21–23, 16–21తో జపాన్‌కు చెందిన రిచి తకషిత చేతిలో పరాజయం చవిచూశాడు. -
ప్రిక్వార్టర్స్‌లో అజయ్, సౌరభ్ వర్మ
తైపీ సిటీ: భారత షట్లర్లు అజయ్ జయరామ్, సౌరభ్ వర్మలు చైనీస్ తైపీ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో శుభారంభం చేశారు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో అజయ్ జయరామ్ 18–21, 21–17, 21–9తో హషిరు షిమోన (జపాన్)పై, సౌరభ్ వర్మ 18–21, 21–16, 21–13తో లీ చీ హో (చైనీస్ తైపీ)పై నెగ్గి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. తెలంగాణ కుర్రాడు చిట్టబోయిన రాహుల్ యాదవ్ 11–21, 9–21తో లూ చి హంగ్ (చైనీస్ తైపీ) చేతిలో, అభిషేక్ 5–21, 6–21తో ఐదో సీడ్ జాన్ ఒ జార్జెన్సెన్ (డెన్మార్క్) చేతిలో పరాజయం చవిచూశారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి చుక్కా సాయి ఉత్తేజిత రావు 15–21, 18–21తో చియాంగ్ ఇంగ్ లీ (చైనీస్ తైపీ) చేతిలో కంగుతినగా, హైదరాబాద్ అమ్మాయి శ్రీకృష్ణప్రియ 21–23, 20–22తో లిన్ యింగ్ చన్ (చైనీస్ తైపీ) చేతిలో పోరాడి ఓడింది. గురువారం జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో కిమ్ బ్రూన్ (డెన్మార్క్)తో అజయ్, రికి తకషిత (జపాన్)తో సౌరభ్ వర్మ తలపడతారు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో తరుణ్ కోన–లిమ్ కిమ్ వా (మలేసియా) ద్వయం 13–21, 10–21తో నాలుగో సీడ్ ఒగ్ యి సిన్–టే యి (మలేసియా) జంట చేతిలో పరాజయం పాలైంది. -
అజయ్, సౌరభ్ సత్తా చాటుతారా!
తైపీ సిటీ: స్టార్ షట్లర్లు దూరమైన చైనీస్ తైపీ వరల్డ్ టూర్ సూపర్ 300 టోర్నమెంట్లో సత్తా చాటా లని భారత ఆటగాళ్లు అజయ్ జయరామ్, సౌరభ్ వర్మ పట్టుదలగా ఉన్నారు. నేటినుంచి జరిగే ఈ టోర్నీకి పీవీ సింధు, సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్‌లు దూరంగా ఉన్నారు. ఈ నెలలోనే కీలకమైన డెన్మార్క్ ఓపెన్ (16 నుంచి 21 వరకు), ఫ్రెంచ్ ఓపెన్ (23 నుంచి 28 వరకు) టోర్నీలు ఉండడమే దీనికి కారణం. ఈ నేపథ్యంలో అజయ్ జయరామ్, మాజీ జాతీయ చాంపియన్ సౌరభ్ వర్మ లకు ఇది మంచి అవకాశం. మహిళల సింగిల్స్‌లో తెలుగమ్మాయిలు చుక్కా సాయి ఉత్తేజిత రావు, శ్రీకృష్ణప్రియలు బరిలోకి దిగుతున్నారు. వియ త్నాం, వైట్‌నైట్స్ టోర్నీలో ఫైనల్ చేరిన అజయ్ జయరామ్ ఈ టోర్నీలో టైటిల్‌పై కన్నేశాడు. తొలిరౌండ్లో అతను జపాన్‌కు చెందిన హషిరు షిమోనోతో తలపడనుండగా... ప్రపంచ 65వ ర్యాంకర్ సౌరభ్ వర్మ స్థానిక ఆటగాడు లీ చియ హవ్ను ఎదుర్కొంటాడు. మిగతా మ్యాచ్‌ల్లో చిట్టబోయిన రాహుల్... లు చియ హుంగ్ (తైపీ)తో, అభిషేక్... ఐదో సీడ్ జాన్ జొర్గెన్సన్ (డెన్మార్క్)తో పోటీపడతారు. మహిళల సింగిల్స్‌లో ఉత్తేజిత... చియాంగ్ యింగ్ లీ (తైపీ)తో, ముగ్ధ అగ్రే... ఏడో సీడ్ సోనియా (మలేసియా)తో, శ్రీకృష్ణప్రియ... లిన్ యింగ్ చన్ (తైపీ)తో తలపడనున్నారు. పురుషుల డబుల్స్‌లో ఒక్క తరుణ్ కోన మాత్రమే ఆడుతున్నాడు. అతను మలేసియాకు చెందిన లిమ్ కిమ్ వాతో జతకట్టగా, మహిళల డబుల్స్, మిక్స్డ్ డబుల్స్‌లో భారత షట్లర్లు ఎవరూ పాల్గొనడం లేదు. -
జయరామ్‌కు నిరాశ
సియెల్: కొరియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో క్వాలిఫయింగ్ విభాగంలో భారత క్రీడాకారులకు నిరాశ ఎదురైంది. బరిలో దిగిన ముగ్గురూ తొలి రౌండ్లోనే ఓడి మెయిన్ ‘డ్రా’కు అర్హత పొందలేకపోయారు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో అజయ్ జయరామ్ 26–24, 21–18తో జావో జున్‌పెంగ్ (చైనా) చేతిలో ఓడిపోయాడు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో వైదేహి 8–21, 8–21తో కిమ్ గా యున్ (కొరియా) చేతిలో... ముగ్ధ ఆగ్రే 8–21, 8–21తో ప్రపంచ మాజీ నంబర్‌వన్ లీ జురుయ్ (చైనా) చేతిలో ఓటమి పాలయ్యారు. -
రన్నరప్ జయరామ్
హో చి మిన్ సిటీ (వియత్నాం): సీజన్లో తొలి టైటిల్ సాధించాలని ఆశించిన భారత అగ్రశ్రేణి షట్లర్ అజయ్ జయరామ్‌కు నిరాశ ఎదురైంది. వియత్నాం ఓపెన్ బీడబ్ల్యూఎఫ్ టూర్ సూపర్–100 టోర్నమెంట్లో జయరామ్ రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. ఈ టోర్నీలో నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకున్న అజయ్ ఫైనల్ పోరులో మాత్రం చేతులెత్తేశాడు. ఆదివారం జరిగిన టైటిల్ పోరులో 30 ఏళ్ల భారత ఆటగాడు 14–21, 10–21తో రుస్తవిటో (ఇండోనేసియా) చేతిలో పరాజయం చవిచూశాడు. కేవలం 28 నిమిషాల్లోనే భారత ప్లేయర్ ఆట ముగిసింది. ‘ఫైనల్లో ఏ దశలోనూ నేను నిలకడగా ఆడలేదు. అనవసర తప్పిదాలు చాలా చేశాను. నెట్ వద్ద తడబడ్డాను. సుదీర్ఘ ర్యాలీలకు సరైన ఫినిషింగ్ కూడా ఇవ్వలేదు. గాయం నుంచి కోలుకున్నాక గత రెండు నెలల్లో మంచి ప్రదర్శనే చేశాను. రెండు టోర్నీల్లో రన్నరప్‌గా నిలిచాను’ అని జయరామ్ వ్యాఖ్యానించాడు. -
టైటిల్‌కు విజయం దూరంలో...
హో చి మిన్ సిటీ (వియత్నాం): ఈ సీజన్లో తొలి టైటిల్ సాధించే దిశగా భారత అగ్రశ్రేణి షట్లర్ అజయ్ జయరామ్ మరో అడుగు ముందుకేశాడు. వియత్నాం ఓపెన్ బీడబ్ల్యూఎఫ్ టూర్ సూపర్–100 టోర్నమెంట్లో జయరామ్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రపంచ 93వ ర్యాంకర్ జయరామ్ 21–14, 21–19తో 49వ ర్యాంకర్, ఏడో సీడ్ యు ఇగారషి (జపాన్)పై గెలుపొందాడు. ఆదివారం జరిగే ఫైనల్లో ప్రపంచ 79వ ర్యాంకర్ రుస్తవిటో (ఇండోనేసియా)తో జయరామ్ తలపడతాడు. మరో సెమీ ఫైనల్లో రుస్తవిటో 21–17, 19–21, 21–14తో భారత్‌కు చెందిన మిథున్‌ను ఓడించాడు. ఏడాది క్రితం 13 ర్యాంక్‌లో నిలిచిన జయరామ్ ఆ తర్వాత గాయం కారణంగా ఆరు నెలల పాటు ఆటకు దూరమయ్యాడు. ఫలితంగా అతని ర్యాంక్ పడిపోయింది. ఈ సంవత్సరం ఆరంభంలో పునరాగమనం చేసిన జయరామ్ ఎనిమిది టోర్నీలు ఆడాడు. వైట్ నైట్స్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచిన అతను యూఎస్ ఓపెన్‌లో సెమీఫైనల్లో నిష్క్రమించాడు. -
వియత్నాం ఓపెన్ టోర్నీ సెమీస్‌లో అజయ్ జయరామ్
తన నిలకడైన ప్రదర్శనను కొనసాగిస్తూ భారత అగ్రశ్రేణి షట్లర్ అజయ్ జయరామ్ వియత్నాం ఓపెన్ బీడబ్ల్యూఎఫ్ టూర్ సూపర్–100 టోర్నమెంట్లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. జయరామ్‌తోపాటు భారత్‌కే చెందిన మరో యువ ఆటగాడు మిథున్ మంజునాథ్ కూడా సెమీఫైనల్ బెర్త్‌ను ఖాయం చేసుకున్నాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో జయరామ్ 26–24, 21–17తో జియోడాంగ్ షెంగ్ (కెనడా)పై గెలుపొందగా... మిథున్ 17–21, 21–19, 21–11తో జెకి జౌ (చైనా)ను ఓడించాడు. -
రన్నరప్ జయరామ్
గాట్చిన (రష్యా): భారత మేటి షట్లర్ అజయ్ జయరామ్ వైట్‌నైట్స్ ఇంటర్నేషనల్ చాలెంజ్ బ్యాడ్మింటన్ టోర్నీలో రన్నరప్‌గా నిలిచాడు. టైటిల్ పోరులో అతను స్పెయిన్‌కు చెందిన టాప్ సీడ్ పాబ్లో అబియన్ చేతిలో పోరాడి ఓడాడు. 30 ఏళ్ల జయరామ్ గాయం నుంచి కోలుకున్నాక గత నెలలో బరిలోకి దిగిన యూఎస్ ఓపెన్ వరల్డ్ టూర్ ఈవెంట్లో సెమీస్ చేరుకున్నాడు. తాజాగా రష్యాలో జరిగిన ఈవెంట్ ఫైనల్లో 21–11, 16–21, 17–21తో పాబ్లో చేతిలో పరాజయం చవిచూశాడు. 55 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో తొలి గేమ్‌ను సునాయాసంగా గెలుచుకున్న భారత ఆటగాడు తర్వాతి రెండు గేముల్లో ప్రత్యర్థితో పోరాడినప్పటికీ ఫలితం సాధించలేకపోయాడు. పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో తరుణ్ కోనా–సౌరభ్ శర్మ జంట 21–18, 13–21, 17–21తో జార్నే జెయిస్–జాన్ కొలిన్ ఓల్కర్ (జర్మనీ) జోడీ చేతిలో ఓడింది. -
సెమీస్‌లో జయరామ్ ఓటమి
ఫులర్టన్ (అమెరికా): యూఎస్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ 300 టోర్నమెంట్లో భారత్ పోరాటం ముగిసింది. భారత షట్లర్ అజయ్ జయరామ్ సెమీస్‌లో ఓటమి చెంది ఇంటిదారి పట్టాడు. అజయ్ జయరామ్ 13- 21, 21-23 తేడాతో మార్క్ కాలిజో(నెదర్లాండ్స్) చేతిలో పరాజయం పాలై టోర్నీ నుంచి వైదొలిగాడు. తొలి గేమ్‌ను సునాయాసంగా చేజార్చుకున్న అజయ్ జయరామ్.. రెండో గేమ్‌లో మాత్రం కడవరకూ పోరాడాడు. కాగా, వరుసగా రెండు పాయింట్లు గెలిచిన కాలిజో గేమ్‌తో పాటు మ్యాచ్‌ను కూడా కైవసం చేసుకుని ఫైనల్‌కు చేరాడు. -
క్వార్టర్స్‌లో జయరామ్
ఫులర్టన్ (అమెరికా): భారత షట్లర్ అజయ్ జయరామ్ యూఎస్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ 300 టోర్నమెంట్ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో అజయ్ 19–21, 21–12, 21–16తో ఎనిమిదో సీడ్ యగోర్ కొయిలో (బ్రెజిల్)పై గెలిచి క్వార్టర్స్‌కు చేరాడు. తొలి గేమ్‌లో ఓటమి పాలైన అజయ్ వెంటనే పుంజుకొని వరుస గేముల్లో నెగ్గి మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. -
సింధు ముందుకు... సైనా ఇంటికి
సైనా నెహ్వాల్‌కు షాక్.. ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ వుహాన్: చైనాలో జరుగుతున్న ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత నం.1 షట్లర్ పీవీ సింధు, అజయ్ జయరామ్ ప్రిక్వార్టర్స్‌కు చేరారు. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలిరౌండ్లో ప్రపంచ మూడో ర్యాంకర్ సింధు 21–8, 21–18తో దినార్ ద్యా ఆయుస్తీన్ (ఇండోనేసియా)పై అలవోక విజయం సాధించింది. కేవలం 31 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో సింధు జోరుకు ప్రత్యర్థి బేజారైంది. తొలిగేమ్‌లో ఆరంభంలోనే 8–2తో ఆధిక్యంలోకి వెళ్లినా సిందు అదే జోరు కొనసాగించి గేమ్‌ను తన ఖాతాలో వేసుకుంది. అయితే రెండోగేమ్‌లో ప్రత్యర్థి నుంచి సింధుకు కొంచెం ప్రతిఘటన ఎదురైంది. ఆరంభంలో 7–1తో భారత స్టార్ ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే వరుసగా మూడు పాయింట్లు సాధించిన దినార్.. 4–7తో ప్రతిఘటించింది. ఈ దశలో ఆధిపత్యం ప్రదర్శించిన సింధు వరుసగా పాయింట్లు సాధించి 17–5, 19–10తో విజయం ముంగిట నిలిచింది. ఈదశలో వరుసగా ఏడు పాయింట్లు సాధించిన దినార్ 17–19తో ఆధిక్యాన్ని బాగా తగ్గించింది. ఈదశలో తేరుకున్న సింధు త్వరత్వరగా రెండు పాయింట్లు సాధించి ప్రత్యర్థి ఆట కట్టించింది. మరోవైపు పురుషుల సింగిల్స్‌లో భారత ప్లేయర్, ప్రపంచ 13వ ర్యాంకర్ జయరామ్ 21–18, 18–21, 21–19తో ఐదో సీడ్, ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ తియాన్ హువీ (చైనా)కు షాకిచ్చాడు. 70 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో తీవ్రంగా శ్రమించిన జయరామ్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రిక్వార్టర్స్‌లో అయా ఒహోరీ (జపాన్)తో సింధు, హుసు జెన్ హావో (చైనీస్‌తైపీ)తో జయరామ్ తలపడనున్నారు. మరోవైపు తొలిరౌండ్లోనే ప్రపంచ మాజీ నం.1 ప్లేయర్ సైనా నెహ్వాల్‌కు చుక్కెదురైంది. మహిళల సింగిల్స్ తొలిరౌండ్లో ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ సైనా 21–19, 16–21, 18–21తో ప్రపంచ 16వ ర్యాంకర్ సయాక సాటో (జపాన్) చేతిలో పోరాడి ఓడింది. పురుషుల విభాగం తొలిరౌండ్లో హెచ్ఎస్ ప్రణయ్ 16–21, 21–13, 19–21తో క లాంగ్ అంగూస్ (హాంకాంగ్) చేతిలో పోరాడి ఓడిపోయాడు. మరోవైపు డబుల్స్ విభాగంలోనూ భారత పోరాటం ముగిసింది. తొలుత జరిగిన పురుషు డబుల్స్ తొలిరౌండ్లో మనూ అత్రి–సుమీత్‌రెడ్డి జంట 21–9, 21–18తో ఐదోసీడ్, చైనీస్ ద్వయం ఫూ హాయ్ఫెంగ్–జాంగ్ నాన్ చేతిలో ఓడిపోయారు. మహిళల డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప–సిక్కిరెడ్డి జంట 20–22, 16–21తో దక్షిణ కొరియా జంట, చే యూ జెంగ్, కిమ్ సో యెంగ్ చేతిలో.. జక్కంపూడీ మేఘన–పూర్విషా జంట 11–21, 16–21తో దక్షిణ కొరియా జంట క్యుంగ్ ఉన్ జుంగ్–సెయుంగ్ చాన్ షిన్ చేతిలో ఓడిపోయింది. మరోవైపు మిక్సడ్ డబుల్స్‌లో ప్రణవ్ జెర్రీ చోప్రా–సిక్కిరెడ్డి జంట 15–21, 21–14, 16–21తో టాప్ సీడ్, చైనీస్ జంట జెంగ్ సీవీ–చెన్ కింగ్‌చెన్ చేతిలో పరాజయం పాలయ్యింది. -
జయరామ్ పోరు ముగిసె...
మలేసియా ఓపెన్ టోర్నీ కుచింగ్ (మలేసియా): ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ రెండో ర్యాంకర్ విక్టర్ అక్సెల్సన్ (డెన్మార్క్)పై సంచలన విజయం సాధించిన భారత నంబర్‌వన్ అజయ్ జయరామ్ అదే జోరును క్వార్టర్ ఫైనల్లో కొనసాగించలేపోయాడు. ఫలితంగా మలేసియా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ బ్యాడ్మింటన్ టోర్నీ నుంచి నిష్క్రమించాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 20వ ర్యాంకర్ జయరామ్ 18–21, 14–21తో ప్రపంచ ఐదో ర్యాంకర్ సన్ వాన్ హో (దక్షిణ కొరియా) చేతిలో ఓడిపోయాడు. సన్ వాన్ హో చేతిలో జయరామ్కిది వరుసగా నాలుగో పరాజయం కావడం గమనార్హం. 37 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో జయరామ్ తొలి గేమ్‌లో గట్టిపోటీనిచ్చినా రెండో గేమ్‌లో మాత్రం డీలా పడ్డాడు. జయరామ్ ఓటమితో ఈ టోర్నీలో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. మహిళల సింగిల్స్‌లో సైనా నెహ్వాల్, పీవీ సింధు... పురుషుల సింగిల్స్‌లో సాయిప్రణీత్... పురుషుల డబుల్స్‌లో సుమీత్ రెడ్డి–మనూ అత్రి... మహిళల డబుల్స్‌లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప... మిక్స్డ్ డబుల్స్‌లో సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా తొలి రౌండ్లోనే వెనుదిరిగారు. -
క్వార్టర్ ఫైనల్లో అజయ్ జయరామ్
మలేసియా ఓపెన్ కూచింగ్: భారత ఆటగాడు అజయ్ జయరామ్ మలేసియా ఓపెన్ సూపర్ సిరీస్‌లో సంచలన విజయం సాధించాడు. నాలుగు రోజుల క్రితం ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్ గెలిచి ఊపు మీదున్న విక్టర్ అక్సెల్సన్ను అతను కంగు తినిపించాడు. గురువారం జరిగిన ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లో అన్ సీడెడ్ జయరామ్ 9–21, 21–14, 21–19తో నాలుగో సీడ్ అక్సెల్సన్ను ఓడించాడు. 44 నిమిషాల పాటు హోరాహోరీగా జరిగిన ఈ సమరంలో భారత ఆటగాడు అసాధారణ పోరాటపటిమ కనబరిచాడు. తొలి గేమ్‌ను కోల్పోయినప్పటికీ రెండో గేమ్‌లో పుంజుకోవడంతో 8–3తో ఆధిక్యంలోకి వచ్చాడు. అయితే ప్రత్యర్థి కూడా దీటుగా బదులివ్వడంతో ఒక దశలో 12–12తో స్కోరు సమమైంది. అప్పుడు వరుసగా ఆరు పాయింట్లు సాధించి 18–12తో ప్రత్యర్థిని నిలువరించి గేమ్‌ను కైవసం చేసుకున్నాడు. నిర్ణాయక మూడో గేమ్‌లో కూడా ఇద్దరు నువ్వానేనా అన్నట్లు తలపడ్డారు. దీంతో 12–12, 18–18 వద్ద స్కోర్లు సమమయ్యాయి. ఆ తర్వాత దూసుకెళ్లి 20–18 ఆధిక్యంలో నిలిచిన జయరామ్ మరో పాయింట్‌తో మ్యాచ్‌లో గెలుపొందాడు. -
సైనా జోరుగా ముందుకు..
సారావక్ (మలేసియా): మలేసియా మాస్టర్స్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నమెంట్లో భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ మరో విజయం సాధించింది. వరుసగా మూడో విజయంతో సైనా నెహ్వాల్ సెమిఫైనల్స్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ సైనా 21-15, 21-14 తేడాతో ఇండోనేసియాకు చెందిన ఫిత్రియానిని ఓడించింది. వరుస పాయింట్లు సాధిస్తూ ఎనిమిదో సీడెడ్ ప్లేయర్ ఫిత్రియానిని తికమక పెట్టి తొలి సెట్ కైవసం చేసుకున్న టాప్ సీడ్ సైనా రెండో సెట్లోనూ పోరాటం కొనసాగించింది. 40 నిమిషాల్లో గేమ్ ముగించి సైనా సెమిస్లో ప్రవేశించింది. మరోవైపు పురుషుల సింగిల్స్ విభాగంలో ఆరో సీడ్ అజయ్ జయరామ్ కూడా క్వార్టర్ ఫైనల్లోనే ఇంటిదారి పట్టాడు. క్వార్టర్స్ మ్యాచ్‌లో ఆంథోనీ సినిసుకా గింటింగ్ (ఇండోనేసియా) చేతిలో 21-13, 21-8 తేడాతో జయరామ్ ఓటమిపాలయ్యాడు. రెండు వరుస సెట్లలో జయరామ్ చేతులెత్తేయడంతో ప్రత్యర్థి ఆంథోనీ కేవలం 28 నిమిషాల్లోనే నెగ్గి సెమిఫైనల్స్ చేరుకున్నాడు. -
ప్రిక్వార్టర్స్‌లో సైనా, జయరామ్
సారావక్ (మలేసియా): ఈ ఏడాది ఆడుతున్న తొలి అంతర్జాతీయ టోర్నమెంట్లో భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ శుభారంభం చేసింది. మలేసియా మాస్టర్స్ గ్రాండ్‌ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నీ మహిళల సింగిల్స్ విభాగంలో ఈ హైదరాబాద్ క్రీడాకారిణి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. బుధవారం జరిగిన తొలి రౌండ్లో టాప్ సీడ్ సైనా 21–9, 21–8తో చాసిని కొరెపాప్ (థాయ్‌లాండ్)పై గెలిచింది. కేవలం 25 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో ఏదశలోనూ సైనాకు పోటీ ఎదురుకాలేదు. తొలి గేమ్‌లో సైనా ఒకసారి వరుసగా ఏడు పాయింట్లు, మరోసారి వరుసగా ఐదు పాయింట్లు గెలిచింది. రెండో గేమ్‌లోనూ సైనా పూర్తి ఆధిపత్యం చలాయించింది. గురువారం జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్లో హనా రమాదిని (ఇండోనేసియా)తో సైనా ఆడుతుంది. పురుషుల సింగిల్స్ విభాగంలో ఆరో సీడ్ అజయ్ జయరామ్ (భారత్) ఒకే రోజు రెండు మ్యాచ్‌లు గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టాడు. తొలి రౌండ్లో జయరామ్ 21–10, 17–21, 21–14తో క్వాలిఫయర్ జున్ హావో లియోంగ్ (మలేసియా)పై, రెండో రౌండ్లో 21–9, 21–12తో సపుత్ర విక్కీ (ఇండోనేసియా)పై గెలిచాడు. సుమిత్ జంట ముందంజ పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సుమిత్ రెడ్డి–మనూ అత్రి (భారత్) ద్వయం 15–21, 21–13, 21–18తో జియా హువో చెన్–చున్ కాంగ్ షియా (మలేసియా) జంటపై నెగ్గి ప్రిక్వార్టర్స్‌లోకి ప్రవేశించగా... సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జోడీ 11–21, 15–21, 24–26తో చీ తీన్ తాన్–వీ జీన్ తాన్ (మలేసియా) జంట చేతిలో ఓడిపోయింది. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో గుత్తా జ్వాల–మనూ అత్రి (భారత్) జంట 21–19, 21–18తో లుఖి నుగ్రోహో–రిరిన్ అమెలియా (ఇండోనేసియా) ద్వయంపై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. -
డచ్ ఓపెన్‌లో రన్నరప్ జయరామ్
అల్మెరె (నెదర్లాండ్స): పీవీ సింధు (మకావు ఓపెన్, 2013, 14, 15) తర్వాత ఒకే అంతర్జాతీయ టోర్నమెంట్‌ను వరుసగా మూడేళ్లపాటు నెగ్గిన రెండో భారతీయ ప్లేయర్‌గా గుర్తింపు పొందాలని ఆశించిన అజయ్ జయరామ్‌కు నిరాశ ఎదురైంది. 2014, 2015లలో డచ్ ఓపెన్ టైటిల్ నెగ్గిన అజయ్ జయరామ్ ఈసారి మాత్రం రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. ఆదివారం జరిగిన డచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో టాప్ సీడ్ జయరామ్ 10-21, 21-17, 18-21తో వాంగ్ జు వీ (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయాడు. గతంలో వాంగ్ జు వీపై రెండుసార్లు నెగ్గిన జయరామ్ మూడో పర్యాయంలో మాత్రం ఓటమిని ఎదుర్కొన్నాడు. 55 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో జయరామ్‌కు గట్టిపోటీ ఎదురైంది. నిర్ణాయక మూడో గేమ్‌లో వాంగ్ ఆరంభంలోనే 4-0తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఆ తర్వాత జయరామ్ స్కోరును సమం చేసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోరుుంది. -
టైటిల్ పోరుకు జయరామ్
అల్మెరె (నెదర్లాండ్స): భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ క్రీడాకారుడు అజయ్ జయరామ్ డచ్ ఓపెన్ గ్రాండ్‌ప్రి టోర్నమెంట్లో టైటిల్ పోరుకు అర్హత సాధించాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో టాప్ సీడ్ జయరామ్ 21-18, 13-21, 21-13తో ఆండ్రెస్ అంటోన్సెన్ (డెన్మార్క్)పై గెలుపొందాడు. ఎమిల్ హోల్స్ట్ (డెన్మార్క్)-జు వీ వాంగ్ (చైనీస్ తైపీ) మధ్య రెండో సెమీఫైనల్ విజేతతో ఆదివారం జరిగే ఫైనల్లో జయరామ్ తలపడతాడు. 2014, 2015లలో ఈ టైటిల్ నెగ్గిన జయరామ్ ఈసారీ గెలిస్తే ‘హ్యాట్రిక్’ సాధిస్తాడు. మరోవైపు మిక్స్డ్ డబుల్స్ విభాగంలో హైదరాబాద్ అమ్మారుు సిక్కి రెడ్డి-ప్రణవ్ చోప్రా జంట పోరాటం ముగిసింది. సెమీఫైనల్లో సిక్కి రెడ్డి-ప్రణవ్ ద్వయం 19-21, 16-21తో సోరెన్ గ్రావోల్ట్- మైకెన్ ప్రుయెర్గార్డ్ (డెన్మార్క్) జోడీ చేతిలో ఓడిపోరుుంది. -
సెమీ ఫైనల్లో జయరామ్
అల్మెర(నెదర్లాండ్స్):డచ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో టాప్ సీడ్‌గా బరిలోకి దిగిన డిఫెండింగ్ చాంపియన్, భారత ఆటగాడు అజయ్ జయరామ్ సెమీస్‌లోకి ప్రవేశించాడు. పురుషుల సింగిల్స్ మ్యాచ్‌లో జయరామ్ 21-15, 21-18 తేడాతో కోల్హో డీ ఒలివైరా(బ్రెజిల్)పై గెలిచి సెమీస్ కు చేరాడు. కేవలం 32 నిమిషాల్లో ముగిసిన క్వార్టర్ ఫైనల్ పోరులో జయరామ్ ఏకపక్ష గేమ్‌లను సొంతం చేసుకున్నాడు. తొలి గేమ్ ను అవలీలగా గెలిచిన జయరామ్.. రెండో గేమ్‌లో మాత్రం కాస్త ప్రతిఘటన ఎదుర్కొన్నాడు. అయితే కీలక సమయంలో తన అనుభవాన్ని ఉపయోగించిన జయరామ్ సెమీస్‌లోకి దూసుకెళ్లాడు. తన కెరీర్లో వరుసగా రెండు సార్లు(2014, 15) డచ్ ఓపెన్‌ను గెలుచుకున్న జయరామ్.. హ్యాట్రిక్ టైటిల్ సాధించడానికి రెండు అడుగుల దూరంలో నిలిచాడు. గత రాత్రి జరిగిన మిక్స్డ్ డబుల్స్‌లో భారత జోడి ప్రణవ్ చెర్రీ చోప్రా-సిక్కి రెడ్డి జంట సెమీస్ కు చేరిన సంగతి తెలిసిందే. -
క్వార్టర్స్‌లో జయరామ్
ప్రిక్వార్టర్స్‌లో కశ్యప్ ఓటమి డచ్ ఓపెన్ బ్యాడ్మింటన్ అల్మెరా (నెదర్లాండ్స): డచ్ ఓపెన్‌లో భారత షట్లర్ అజయ్ జయరామ్ క్వార్టర్ ఫైనల్స్‌కు చేరాడు. కెరీర్లో రెండుసార్లు ఈ టైటిల్ గెలిచిన టాప్‌సీడ్ జయరామ్... గురువారం జరిగిన ప్రిక్వార్టర్స్‌లో మా రియస్ మైరే (నార్వే)పై 21-6, 21-6 తేడాతో సునాయాసంగా నెగ్గాడు. క్వార్టర్స్‌లో గోర్ కొయెల్హే డి ఒలివిరా (బ్రెజిల్)తో జయరామ్ తలపడతాడు. ఇక పారుపల్లి కశ్యప్ పోరాటం ప్రిక్వార్టర్స్‌లో ముగిసింది. తను 18-21, 18-21 తేడాతో రౌల్ మస్ట్ (ఈస్టోనియా) చేతిలో పరాజయం పాలయ్యాడు. మిక్స్డ్ డబుల్స్‌లో సుమిత్ రెడ్డి, మేఘన జంట క్వార్టర్స్‌కు చేరింది. ప్రిక్వార్టర్స్‌లో వీరు మాస్ జెల్లె, వాన్డర్పై 21-16, 21-18 (నెదర్లాండ్స) తేడాతో నెగ్గారు. మరోవైపు పురుషుల డబుల్స్‌లో టాప్ సీడ్స మను అత్రి, సుమీత్ రెడ్డి జోడితో పాటు ప్రణవ్, ఆక్షయ్ దే వాల్కర్ జోడి కూడా తొలి రౌండ్లోనే వెనుదిరిగారు. -
జయరామ్‌కు చుక్కెదురు
న్యూఢిల్లీ: ఇండోనేసియా మాస్టర్స్ గ్రాండ్‌ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. బరిలో మిగిలిన ఏకై క ప్లేయర్ అజయ్ జయరామ్ క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయాడు. ఇండోనేసియాలోని బాలిక్పాపన్ పట్టణంలో శుక్రవారం ఏకపక్షంగా జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ 21వ ర్యాంకర్ జయరామ్ 12-21, 10-21తో ప్రపంచ 41వ ర్యాంకర్ యూకీ షి (చైనా) చేతిలో పరాజయం పాలయ్యాడు. 32 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో తొలి గేమ్ ఆరంభంలో చైనా ప్లేయర్‌కు కాస్త పోటీనిచ్చిన జయరామ్ ఆ తర్వాత తడబడ్డాడు.ఈ టోర్నీలో భారత్ తరఫున పాల్గొన్న సారుుప్రణీత్, ప్రణయ్ మూడో రౌండ్లో, కశ్యప్ రెండో రౌండ్లో, సిరిల్ వర్మ, హర్షిల్ డాని, కౌశల్ తొలి రౌండ్లో ఓడిపోయారు. మహిళల సింగిల్స్‌లో రుత్విక శివాని, పీసీ తులసీ, తన్వీ లాడ్ తొలి రౌండ్లోనే వెనుదిరిగారు. -
క్వార్టర్ ఫైనల్లో జయరాం
బలిక్పపన్: ఇండోనేసియా గ్రాండ్ ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత ఆటగాడు అజయ్ జయరాం క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. జయరాం మినహా మిగతా భారత షట్లర్లంతా టోర్నీనుంచి నిష్ట్రమించారు. ప్రిక్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో జయరాం రెక్సీ మేగానంద (ఇండోనేసియా)పై 18-21, 21-12, 21-19 స్కోరుతో విజయం సాధించాడు. అంతకు ముందు రెండో రౌండ్ మ్యాచ్‌లో అజయ్... భారత్‌కే చెందిన పారుపల్లి కశ్యప్‌పై గెలుపొందడం విశేషం. గాయంనుంచి కోలుకున్న తర్వాత మొదటి టోర్నీ ఆడుతున్న కశ్యప్ తొలి మ్యాచ్ విజయం తర్వాత ముందుకు వెళ్లలేకపోయాడు. జయరాం 21-7, 21-12తో కశ్యప్‌ను చిత్తు చేశాడు. ఈ మ్యాచ్ 27 నిమిషాల్లోనే ముగిసింది. ఇతర మ్యాచ్‌లలో సాయి ప్రణీత్ 14-21, 13-21తో బూన్సాక్ (థాయిలాండ్) చేతిలో, హెచ్ఎస్ ప్రణయ్ 21-19, 19-21, 21-23తో జియాంక్ హువాంగ్ (చైనా) చేతిలో పరాజయం పాలయ్యారు. -
సెమీస్‌లో జయరామ్
ఎల్ మాంటె (అమెరికా): భారత షట్లర్ అజయ్ జయరామ్... యూఎస్ ఓపెన్ గ్రాండ్ ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నీలో సెమీస్‌లోకి ప్రవేశించాడు. శుక్రవారం అర్ధరాత్రి జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ఫైనల్లో నాలుగోసీడ్ జయరామ్ 21-11, 21-11తో సహచరుడు ఆనంద్ పవార్‌పై నెగ్గాడు. పురుషుల డబుల్స్‌లో మను అత్రి-సుమీత్ రెడ్డి 21-18, 7-21, 16-21తో టకురో హోకి-కోబాషి (జపాన్) చేతిలో ఓడారు. మహిళల డబుల్స్‌లో పూర్విషా-మేఘన ద్వయం 15-21, 12-21తో రెండోసీడ్ ఇవా లీ-లిన్ ఒబానా (అమెరికా) చేతిలో పరాజయం చూవిచూసింది. -
సెమీస్ కు జయరామ్
ఎల్ మాంటే (యూఎస్):యూఎస్ ఓపెన్ గ్రాండ్ ప్రి బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్ అజయ్ జయరామ్ సెమీ ఫైనల్లోకి ప్రవేశించాడు. ఈ టోర్నీలో మిగతా భారత షట్లర్లు విఫలమైనా అజయ్ జయరామ్ అంచనాలను అందుకుంటూ సెమీస్‌లోకి చేరాడు. శనివారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో జయరామ్ 21-11, 21-11 తేడాతో మరో భారత ఆటగాడు ఆనంద్ పవార్‌ను ఓడించి సెమీస్‌కు దూసుకెళ్లాడు. ఆది నుంచి పవార్‌పై పైచేయి సాధించిన జయరామ్ వరుస రెండు గేమ్‌లను గెలుచుకుని టైటిల్ వేటకు రెండు అడుగుల దూరంలో నిలిచాడు. తొలి గేమ్‌ను అవలీలగా గెలిచిన జయరామ్.. రెండో గేమ్‌లో కూడా అదే స్థాయి ఆట తీరును కనబరిచాడు. మరోవైపు పురుషుల డబుల్స్‌లో మను అత్రి- సుమీత్ల జోడి 21-18, 7-21, 16-21 తేడాతో హోకీ-యూగో కాబాయాషి(జపాన్) చేతిలో ఓటమి పాలై టోర్నీ నిష్క్రమించారు. కేవలం 52 నిమిషాలపాటు జరిగిన పోరులో భారత డబుల్స్ జంట పరాజయం పొందింది. కాగా, మహిళల డబుల్స్ విభాగంలో పూర్విష-మేఘన జోడి లిన్ ఒబానానా-ఏవా లీ(అమెరికా) ద్వయం చేతిలో ఓటమి చెందింది. -
క్వార్టర్స్‌కు జయరామ్, పవర్
ఎల్ మాంటే (యూఎస్) :యూఎస్ ఓపెన్ గ్రాండ్ ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్లు అజయ్ జయరామ్, ఆనంద్ పవర్లు క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. శుక్రవారం జరిగిన ప్రిక్వార్టర్స్‌లో జయరామ్ 21-11, 21-15 తేడాతో పెడ్రో మార్టిన్స్(పోర్చుగల్)పై గెలవగా, పవర్ 21-10, 21-13 తేడాతో భారత్ కే చెందిన ప్రతుల్ జోషిపై విజయం సాధించాడు. మరోవైపు పురుషుల డబుల్స్‌లో మను అత్రి- సుమీత్ రెడ్డిల జోడి, మహిళల డబుల్స్‌లో పూర్విషా రామ్-మేఘనా జక్కంపూడిలు క్వార్టర్స్‌లోకి చేరారు. అత్రి సుమిత్ రెడ్డిల జోడి 23-21, 21-13 తేడాతో మిత్సాషి-వాటానాబి ద్వయంపై గెలవగా, పూర్విషా- మేఘన జంట 21-16, 21-6 తేడాతో ఏరియల్ లీ-సిడ్నీ లీ(అమెరికా) జోడిపై గెలిచింది. -
సెమీస్‌లో సాయిప్రణీత్
కాల్గరీ(కెనడా): కెనడా ఓపెన్ గ్రాండ్ ప్రి బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత షట్లర్లు అజయ్ జయరామ్, సాయి ప్రణీత్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో టాప్ సీడ్ జయరామ్ 21-18, 19-21, 21-8తో హ ర్షిల్ డానీ (భారత్)పై గెలుపొందగా... నాలుగో సీడ్ ప్రణీత్ 21-14, 21-16తో రాల్ మస్త్ (ఈస్టోనియా)పై విజయం సాధించాడు. మరోవైపు మహిళల సింగిల్స్ క్వార్టర్స్‌లో భారత అమ్మాయిలు నిరాశ పరిచారు. రుత్విక 16-21, 12-21తో లిండా జెట్చిరి (బల్గేరియా) చేతిలో ఓటమి పాలవగా... తన్వి 16-21, 21-15, 10-21తో వాంగ్ (యూఎస్ఏ) చేతిలో పరాజయం చవిచూసింది. -
సెమీస్‌లో సాయి ప్రణీత్, జయరామ్
కాల్గారి: కెనడా గ్రాండ్ ప్రి బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత షట్లర్లు సాయి ప్రణీత్, అజయ్ జయరామ్‌లు సెమీ ఫైనల్లోకి దూసుకెళ్లారు. శనివారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ జయరామ్ 21-18 19-21-21-8 తేడాతో భారత్ కే చెందిన హర్షిల్ డానిపై గెలిచి సెమీస్ కు చేరాడు. కేవలం 47 నిమిషాలపాటు జరిగిన పోరులో జయరామ్ ఆద్యంతం ఆకట్టుకుని సెమీస్ లో కి ప్రవేశించాడు. మరో క్వార్టర్ పోరులో నాల్గో సీడ్ సాయి ప్రణీత్ 21-14, 21-16 తేడాతో ఎనిమిదో సీడ్ రౌల్ మస్త్(ఎస్టోనియా)పై గెలిచి సెమీస్‌లోకి దూసుకెళ్లాడు. తమ తదుపరి పోరులో లి హున్(కొరియా)తో జయరామ్ తలపడనుండగా, బ్రైస్ లివర్డెజ్(ఫ్రెంచ్)తో సాయి ప్రణీత్ అమీతుమీ తేల్చుకోనున్నాడు. ఇదిలా ఉండగా, భారత ఆటగాడు, రెండో సీడ్ హెచ్ఎస్ ప్రణయ్ క్వార్టర్స్ లో ఓటమి పాలయ్యాడు. ప్రణయ్ 22-20, 21-23, 18-21 తేడాతో లివర్డెజ్పై పరాజయం చెందాడు. -
క్వార్టర్స్‌లో సాయి ప్రణీత్
కాల్గారి: కెనడా ఓపెన్ గ్రాండ్ ప్రి బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్ల జోరు కొనసాగుతోంది. సింగిల్స్‌లో ఆరుగురు ఆటగాళ్లు క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకున్నాడు. గురువారం అర్ధరాత్రి జరిగిన పురుషుల ప్రిక్వార్టర్స్‌లో నాలుగోసీడ్ సాయి ప్రణీత్ 21-19, 21-12తో వెంచో షి (కెనడా)పై; టాప్‌సీడ్ అజయ్ జయరామ్ 21-10, 21-12తో డేవిడ్ ఒబెర్నోస్టెరర్ (ఆస్ట్రియా)పై; రెండోసీడ్ హెచ్.ఎస్.ప్రణయ్ 21-18, 18-21, 21-12తో సంకీర్త్ (కెనడా)పై; హర్షిల్ డాని (భారత్) 21-9, 21-18తో ప్రతుల్ జోషి (భారత్)పై గెలవగా, ఆర్‌ఎంవీ గురుసాయిదత్ 12-21, 21-7, 17-21తో రౌల్ మస్త్ (ఈస్టోనియా) చేతిలో ఓడాడు. మహిళల సింగిల్స్‌లో గద్దె రుత్వికా శివాని 24-22, 21-18తో బ్లాడాఫ్ (ఆస్ట్రియా)పై; తన్వీలాడ్ 21-14, 21-15తో మయా చెన్ (అమెరికా)పై నెగ్గారు. పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్స్‌లో మను అత్రి-సుమీత్ రెడ్డి 21-8, 21-10తో తిమోతి చో-జాసన్ షూ (కెనడా)పై; మిక్స్డ్ డబుల్స్‌లో మను అత్రి-అశ్విని 21-14, 21-12తో లాయ్-టోంగ్ (కెనడా)పై గెలిచారు. -
చైనా ఓపెన్ లో సైనా శుభారంభం
ఫుజౌ (చైనా): చైనా ఓపెన్ ప్రీమియర్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ శుభారంభం చేసింది. మహిళ సింగిల్స్ విభాగంలో మొదటి రౌండ్ లో విజయం సాధించి రెండో రౌండ్ లో అడుగుపెట్టింది. టాప్ సీడ్‌గా బరిలోకి దిగిన తొలి రౌండ్ లో చైనా యువతార, ప్రపంచ 11వ ర్యాంకర్ సున్ యును వరుస సెట్లలో ఓడించింది. 22-20, 21-18తో విజయం సాధించింది. 49 నిమిషాల్లోనే మ్యాచ్ ముగియడం విశేషం. పురుషుల సింగిల్స్ లో భారత షట్లర్ అజయ్ జయరామ్ తొలి రౌండ్ లోనే ఓడిపోయాడు. చైనా టాప్ సీడ్ ప్లేయర్ చెన్ లాంగ్ చేతిలో 12-21, 11-21 తేడాతో పరాజయం పాలయ్యాడు. -
జయరామ్‌దే డచ్ ఓపెన్
అల్మెరి (నెదర్లాండ్స్): ఈ సీజన్లో తన అద్భుత ప్రదర్శన కొనసాగిస్తూ భారత బ్యాడ్మింటన్ అగ్రశ్రేణి క్రీడాకారుడు అజయ్ జయరామ్ డచ్ ఓపెన్ గ్రాండ్‌ప్రి టోర్నమెంట్లో విజేతగా నిలిచాడు. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన జయరామ్... ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో 21-12, 21-18తో రౌల్ మస్త్ (ఎస్తోనియా)పై విజయం సాధించాడు. గతేడాది డచ్ ఓపెన్ టోర్నీలోనే చాంపియన్‌గా నిలిచి తన కెరీర్లో తొలి అంతర్జాతీయ టైటిల్‌ను జమచేసుకున్న జయరామ్ తాజా విజయంతో రెండో టైటిల్‌ను సాధించాడు. ఇటీవల కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీలో రన్నరప్‌తో సరిపెట్టుకున్న జయరామ్ డచ్ ఓపెన్‌లో మాత్రం ట్రోఫీని సొంతం చేసుకున్నాడు. 2010లో ఆస్ట్రియన్ ఇంటర్నేషనల్ చాలెంజ్ టోర్నీలో ఏకైకసారి రౌల్ మస్త్తో ఆడి ఓడిపోయిన జయరామ్ ఈసారి అలవోక విజయాన్ని సాధించాడు. 34 నిమిషాల్లో ముగిసిన ఈ ఫైనల్లో జయరామ్‌కు ఏ దశలోనూ ప్రత్యర్థి నుంచి పోటీ ఎదురుకాలేదు. తొలి గేమ్ ఆరంభంలోనే 4-0తో ఆధిక్యంలోకి వెళ్లిన జయరామ్ ఆ తర్వాత ఇదే జోరును కనబరిచాడు. రెండో గేమ్‌లోనూ జయరామ్ 4-0తో ముందంజ వేశాడు. ఆ తర్వాత రౌల్ మస్త్ తేరుకోవడంతో రెండుసార్లు స్కోర్లు సమమయ్యాయి. అయితే జయరామ్ వరుసగా మూడు పాయింట్లు నెగ్గి 10-7తో ఆధిక్యంలోకి వెళ్లాడు. చివరి వరకు ఈ ఆధిక్యాన్ని కాపాడుకొని గెలిచాడు. పురుషుల డబుల్స్‌లో హైదరాబాద్ ప్లేయర్ సుమీత్ రెడ్డి తన భాగస్వామి మనూ అత్రితో కలిసి రన్నరప్‌గా నిలిచాడు. ఫైనల్లో రెండో సీడ్ సుమీత్ రెడ్డి-మనూ అత్రి (భారత్) ద్వయం 15-21, 10-21తో ఏడో సీడ్ కీన్ కీట్ కూ-బూన్ హెంగ్ తాన్ (మలేసియా) జోడీ చేతిలో ఓడిపోయింది. -
డచ్ ఓపెన్‌లో అజయ్ జయరామ్ సంచలనం
డచ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్ అజయ్ జయరామ్ సంచలనం సృష్టించాడు. మూడో సీడ్‌గా బరిలోకి జయరామ్ ఫైనల్లో ఈస్టోనియా ఆటగాడు రౌల్ మస్ట్ను ఓడించాడు. 21-12, 21-18 వరుస సెట్లలో 12 సీడ్ ఆటగాడిని ఓడించి.. డచ్ ఓపెన్ టోర్నీని సొంతం చేసుకున్నాడు. -
క్వార్టర్స్‌లో గురుసాయి, జయరామ్
అల్మెరె: డచ్ ఓపెన్ గ్రాండ్ ప్రీలో భారత షట్లర్లు గురుసాయి దత్, అజయ్ జయరామ్ ముందంజ వేశారు. వీరిద్దరూ పురుషుల సింగిల్స్‌లో క్వార్టర్ ఫైనల్లో ప్రవేశించారు. ప్రీక్వార్టర్స్‌లో అజయ్ జయరామ్ 21-14, 21-13 స్కోరుతో కాస్పెర్ లెహికోనెన్ (ఫిన్లాండ్) పై విజయం సాధించాడు. జయరామ్ క్వార్టర్స్‌లో మలేసియా ఆటగాడు జుల్కర్నెన్ జైనుద్దీన్‌తో తలపడతాడు. మరో మ్యాచ్‌లో గురుసాయి 21-12, 21-11తో దిమిత్రో జవడ్స్కీ (ఉక్రెయిన్)ను ఓడించాడు. క్వార్టర్స్‌లో రాల్ మస్ట్ (ఈస్తోనియా)తో అమీతుమీ తేల్చుకోనున్నాడు. -
‘టాప్’లోకి జయరామ్?
న్యూఢిల్లీ : గత వారం కొరియా ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచిన షట్లర్ అజయ్ జయరామ్‌ను ‘టాప్’ స్కీంలోకి చేర్చాలని భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) ప్రతిపాదించనుంది. అంచనాలకు మించి రాణించిన తను ప్రపంచ ర్యాంకింగ్స్‌లోనూ మరోసారి టాప్-25కి చేరాడు. ‘జయరామ్ ప్రొఫైల్‌ను సేకరించమని టెక్నికల్ కమిటీకి తెలిపాం. టాప్ స్కీమ్‌లోకి అతడి పేరును చేర్చాలని ప్రతిపాదిస్తాం’ అని బాయ్ అధ్యక్షుడు డాక్టర్ అఖిలేష్ దాస్ గుప్తా తెలిపారు. -
'టాప్'కు జయరామ్ పేరు సిఫారుసు!
న్యూఢిల్లీ:ఇటీవల కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ లో విశేషంగా రాణించిన బ్యాడ్మింటన్ ఆటగాడు అజయ్ జయరామ్ పేరును టార్గెట్ ఒలింపిక్ పోడియం (టాప్) పథకంలో చేర్చడానికి భారత బ్యాడ్మింటన్ సంఘం(బాయ్) కసరత్తులు చేస్తోంది. దీనికి సంబంధించి సాంకేతికపరమైన అంశాలను పరిశీలిస్తున్నారు. రియో ఒలింపిక్స్‌లో పతకాలు సాధించే అవకాశం ఉన్న ఆటగాళ్లకు మరింత అత్యుత్తమ శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాటు చేసేందే టాప్. దీనిలో భాగంగానే బ్యాడ్మింటన్ నుంచి జయరామ్ పేరు తెరపైకి వచ్చింది. గతేడాది గాయం కారణంగా ఆరు నెలలకు పైగా బ్యాడ్మింటన్ కు దూరంగా ఉన్న జయరామ్... ఇటీవల జరిగిన కొరియా ఓపెన్ సిరీస్ లో ఫైనల్ కు చేరి రన్నరప్ గా నిలిచాడు. భారత స్టార్ ఆటగాళ్లు నిష్క్రమించిన చోటే జయరామ్ సత్తా చాటుకుంటూ తుది రౌండ్ వరకూ వెళ్లాడు. దీంతో అతని పేరు ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తోంది. ఈ మేరకు బాయ్ అధ్యక్షుడు డాక్టర్ అఖిలేష్ దాస్ గుప్తా మాట్లాడుతూ.. ఈ మధ్య జరిగిన కొరియా ఓపెన్ లో జయరామ్ అద్భుతంగా రాణించాడని.. ఇందుకు సంబంధించి అతని ప్రొఫైల్ ను టెక్నికల్ కమిటీ పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. అంతకుముందు 2012 లో జరిగిన లండన్ ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ బెర్తును జయరామ్ తృటిలో కోల్పోయిన సంగతిని అఖిలేష్ గుర్తు చేశారు. ప్రస్తుతం పురుషుల సింగిల్స్ విభాగంలో ఒలింపిక్స్ అర్హత రేసుకు సంబంధించి పారుపల్లి కశ్యప్ తో పాటు కిదాంబి శ్రీకాంత్, ప్రణోయ్, అజయ్ జయరామ్ ల పేర్లు టాప్ జాబితాలో ఉన్నాయి. ఇప్పటికే బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ జంట సుమీత్ రెడ్డి, మను అత్రిలకు టాప్ లో చోటు దక్కింది. హైదరాబాద్‌కు చెందిన సుమీత్ రెడ్డి, ఉత్తరప్రదేశ్‌కు చెందిన మనూ అత్రి జతగా ఇటీవల కాలంలో అంతర్జాతీయస్థాయిలో నిలకడగా రాణిస్తుండటంతో వారికి టాప్ లో స్థానం కల్పించారు. వీరితో పాటు ఇన్నాళ్లుగా ‘టాప్’లో చోటు కోసం నిరసన గళం వినిపిస్తున్న మహిళల డబుల్స్ జంట గుత్తా జ్వాల, అశ్వినిలకు కూడా స్థానం కల్పించారు. -
'నా కల నిజమైంది'
న్యూఢిల్లీ: జీవితంలో సూపర్ సిరీస్ ఫైనల్ ఆడాలన్న కల నిజమైనందుకు భారత బ్యాడ్మింటన్ ఆటగాడు అజయ్ జయరామ్ ఆనందం వ్యక్తం చేశాడు. గత కొంతకాలంగా బ్యాడ్మింటన్ లో వెనుకబడ్డ జయరామ్.. ఈమధ్య జరిగిన కొరియో ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ లో ఫైనల్ కు చేరాడు. భారత స్టార్ ఆటగాళ్లు నిష్ర్కమించిన చోటే తన పూర్వవైభవాన్ని చాటుకుంటూ తుది రౌండ్ వరకూ వెళ్లాడు. అయితే టైటిల్ వేటలో భాగంగా ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు, ప్రపంచ చాంపియన్, డిఫెండింగ్ చాంపియన్ చెన్ లాంగ్ (చైనా)చేతిలో ఓటమి పాలయ్యాడు. కాగా, సూపర్ సిరీస్ ఫైనల్ కు చేరడం తన జీవితంలో లక్ష్యంగా నిర్దేశించుకున్నానని.. అది నెరవేరినందుకు చాలా సంతోషంగా ఉందన్నాడు. తాను చిన్నప్పట్నుంచి బ్యాడ్మింటన్ దిగ్గజాలైన పీటర్ గేడ్, లిన్ డాన్ ల ఆటతీరును చూస్తూ పెరిగినట్లు జయరామ్ తెలిపాడు. ఆ చాంపియన్ ఆటగాళ్లే స్ఫూర్తితోనే తన బ్యాడ్మింటన్ ఆటకు పదును పెట్టినట్లు పేర్కొన్నాడు. తాను గెలిచిన డచ్ గ్రాండ్ ప్రి గోల్డ్ టైటిల్ జీవితంలో ఎంతో ముఖ్యమైనదిగా పేర్కొన్నాడు. ఇప్పటివరకూ బ్యాడ్మింటన్ లో ఎన్నో ఎత్తు పల్లాలు చూసిన తనకు.. కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ లో రన్నరప్ గా నిలవడంతో సరికొత్త శక్తి వచ్చినట్లు ఉందన్నాడు. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య ఆధ్వర్యంలో 2007లో సూపర్ సిరీస్ టోర్నమెంట్లు ప్రారంభమైన తర్వాత... భారత్ నుంచి సూపర్ సిరీస్ టోర్నీలో ఫైనల్‌కు చేరుకున్న మూడో ప్లేయర్‌గా జయరామ్ గుర్తింపు పొందాడు. ఇంతకుముందు భారత్ నుంచి సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్ సూపర్ సిరీస్ టోర్నీల్లో ఫైనల్‌కు చేరుకున్న వారిలో ఉన్నారు. -
రజతంతో ముగింపు
కొరియా ఓపెన్ రన్నరప్ అజయ్ జయరామ్ సియోల్ : అద్వితీయ ప్రదర్శనతో తొలిసారి ‘సూపర్ సిరీస్’ టోర్నమెంట్లో ఫైనల్‌కు చేరుకున్న భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ అజయ్ జయరామ్ ఆఖరి అడ్డంకిని అధిగమించలేకపోయాడు. కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీలో రన్నరప్‌గా నిలిచి రజత పతకంతో సంతృప్తి పడ్డాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ 32వ ర్యాంకర్ అజయ్ జయరామ్ 14-21, 13-21తో ప్రపంచ నంబర్‌వన్, ప్రపంచ చాంపియన్, టాప్ సీడ్ చెన్ లాంగ్ (చైనా) చేతిలో పరాజయం పాలయ్యాడు. విజేత చెన్ లాంగ్‌కు 45 వేల డాలర్లు (రూ. 29 లక్షల 64 వేలు), రన్నరప్ అజయ్ జయరామ్‌కు 22 వేల 800 డాలర్లు (రూ. 15 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. కెరీర్లో తొలిసారి ‘సూపర్ సిరీస్’ ఫైనల్ ఆడుతున్న జయరామ్‌పై ఇప్పటికే 18 సూపర్ సిరీస్ టైటిల్స్ నెగ్గిన చెన్ లాంగ్ సంపూర్ణ ఆధిపత్యాన్ని కనబరిచాడు. 39 నిమిషాలపాటు జరిగిన ఈ పోరులో ఈ చైనా స్టార్‌కు ఏ దశలోనూ జయరామ్ ఇబ్బంది పెట్టలేకపోయాడు. రెండు గేముల్లోనూ తొలుత జయరామే ఖాతా తెరిచినప్పటికీ... ఆ తర్వాత అదే జోరును కొనసాగించడంలో విఫలమయ్యాడు. -
ఫైనల్లో జయరామ్ కు నిరాశ
సియోల్:కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ లో భాగాంగా తొలిసారి సూపర్ సిరీస్ ఫైనల్ కు చేరుకున్నభారత బ్యాడ్మింటన్ ఆటగాడు అజయ్ జయరామ్ కు నిరాశే ఎదురైంది. ఆదివారం జరిగిన ఫైనల్లో జయరామ్ 14-21,13-21 తేడాతో ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు, ప్రపంచ చాంపియన్, డిఫెండింగ్ చాంపియన్ చెన్ లాంగ్(చైనా) చేతిలో ఓటమి చెందాడు. భారత స్టార్ ఆటగాళ్లు నిష్ర్కమించిన చోట తన పూర్వవైభవాన్ని చాటుకుంటూ ఫైనల్ కు చేరిన జయరామ్ ఫైనల్లో ఆశించిన స్థాయిలో రాణించలేదు. జయరామ్ వరుస సెట్లను చెన్ లాంగ్ కు అప్పగించి రన్నరప్ గా సరిపెట్టుకున్నాడు. ఈ టోర్నీ ఆద్యంతం అంచనాలు మించి రాణించిన జయరామ్ ఫైనల్లో మాత్రం చెన్ దాటికి తలవంచక తప్పలేదు. అన్ సీడెడ్ క్రీడాకారుడిగా బరిలోకి దిగిన జయరామ్ తొలి గేమ్ లో వరుసగా పాయింట్లు సాధించి ఆధిక్యం దిశగా దూసుకెళ్లినా.. స్కోరు 4-4 వద్ద ఉండగా చెన్ లాంగ్ దూకుడుగా ఆడాడు. ఈ క్రమంలో చెన్ 9-5 తో ముందంజ వేసి అదే ఊపును కడవరకూ కొనసాగించి సెట్ ను చేజిక్కించుకున్నాడు. అయితే రెండో సెట్ లో జయరామ్ చేసిన అనవసర తప్పిదాలను చెన్ ఉపయోగించుకున్నాడు. ఈ మ్యాచ్ లో లాంగ్ అద్భుతమైన ఎఫెన్స్, డిఫెన్స్ తో జయరామ్ కు కళ్లెం వేసి మరోసారి కొరియన్ సూపర్ సిరీస్ విజేతగా అవతరించాడు. దీంతో విజేత చెన్ లాంగ్‌కు 45 వేల డాలర్లు (రూ. 29 లక్షల 64 వేలు), రన్నరప్ అజయ్ జయరామ్‌కు 22 వేల 800 డాలర్లు (రూ. 15 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. ఇదిలా ఉండగా ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య ఆధ్వర్యంలో 2007లో సూపర్ సిరీస్ టోర్నమెంట్లు ప్రారంభమైన తర్వాత... భారత్ నుంచి సూపర్ సిరీస్ టోర్నీలో ఫైనల్‌కు చేరుకున్న మూడో ప్లేయర్‌గా జయరామ్ గుర్తింపు పొంది అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఇంతకుముందు భారత్ నుంచి సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్ సూపర్ సిరీస్ టోర్నీల్లో ఫైనల్‌కు చేరుకున్న వారిలో ఉన్నారు. -
అజయ్హో
ప్రపంచ ఏడో ర్యాంకర్‌పై సంచలన విజయం ♦ కెరీర్లో తొలిసారి ‘సూపర్’ ఫైనల్లోకి ♦ భారత్ నుంచి ఈ ఘనత సాధించిన మూడో ప్లేయర్ ♦ నేడు ప్రపంచ నంబర్‌వన్ చెన్ లాంగ్‌తో అమీతుమీ ♦ కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీ మూడేళ్ల క్రితం చివరి నిమిషంలో లండన్ ఒలింపిక్స్ బెర్త్‌ను పారుపల్లి కశ్యప్‌కు కోల్పోయి తీవ్ర నిరుత్సాహానికి గురైన అజయ్ జయరామ్... ఈ ఏడాది తన పాత చేదు జ్ఞాపకాలన్నింటినీ మర్చిపోయే ప్రదర్శన చేస్తున్నాడు. ఒకప్పుడు భారత నంబర్‌వన్‌గా చెలామణీ అయిన ఈ బెంగళూరు ప్లేయర్ తదనంతరం కశ్యప్, శ్రీకాంత్, గురుసాయిదత్, ప్రణయ్, ఆనంద్ పవార్, సాయిప్రణీత్ తదితర ఆటగాళ్ల దూకుడుకు వెనుకబడిపోయాడు. శ్రీకాంత్, కశ్యప్, ప్రణయ్ లాంటి ఆటగాళ్లపైనే అందరి దృష్టి కేంద్రీకృతమవుతున్న ప్రస్తుత తరుణంలో... జయరామ్ అందరి అంచనాలను తారుమారు చేస్తూ కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నమెంట్లో ఫైనల్‌కు దూసుకెళ్లాడు. తద్వారా మళ్లీ పూర్వ వైభవం దిశగా అడుగులు వేస్తున్నాడు. సియోల్ : భారత అగ్రశ్రేణి క్రీడాకారులు కిడాంబి శ్రీకాంత్, పారుపల్లి కశ్యప్, హెచ్ఎస్ ప్రణయ్ చేతులెత్తేసిన చోట... భారత్‌కే చెందిన మరో ప్లేయర్ అజయ్ జయరామ్ సంచలన ప్రదర్శనతో తన ఉనికిని చాటుకున్నాడు. అందర్నీ ఆశ్చర్యపరుస్తూ కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నమెంట్లో పురుషుల సింగిల్స్ విభాగంలో ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శనివారం జరిగిన సెమీఫైనల్లో ప్రపంచ 32వ ర్యాంకర్ అజయ్ జయరామ్ 21-19, 21-15తో ప్రపంచ ఏడో ర్యాంకర్ చెన్ చౌ తియెన్ (చైనీస్ తైపీ)పై వరుస గేముల్లో నెగ్గి టైటిల్ పోరుకు అర్హత సాధించాడు. ► ఆదివారం జరిగే ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్, ప్రపంచ చాంపియన్, టాప్ సీడ్ చెన్ లాంగ్ (చైనా)తో జయరామ్ అమీతుమీ తేల్చుకుంటాడు. ముఖాముఖి రికార్డులో జయరామ్ 0-1తో వెనుకంజలో ఉన్నాడు. 2014 హాంకాంగ్ ఓపెన్ తొలి రౌండ్లో చెన్ లాంగ్‌తో ఆడిన ఏకైక మ్యాచ్‌లో జయరామ్ వరుస గేముల్లో ఓడిపోయాడు. ► సెమీస్ చేరే క్రమంలో తనకంటే ఎంతో మెరుగైన ర్యాంక్ ఆటగాళ్లను ఓడించి ఆత్మవిశ్వాసంతో ఉన్న జయరామ్ అదే జోరును ఈ మ్యాచ్‌లోనూ ప్రదర్శించాడు. ఈ ఏడాది తన ప్రత్యర్థి చేతిలో రెండుసార్లు ఓడిపోయినప్పటికీ... ఆ మ్యాచ్‌ల్లో చేసిన తప్పిదాలను ఈసారి పునరావృతం చేయకుండా పక్కా ప్రణాళికతో ఆడి అనుకున్న ఫలితాన్ని సాధించాడు. ► జయరామ్ తొలి గేమ్‌లో 11-15తో.. రెండో గేమ్‌లో 12-14తో వెనుకబడ్డాడు. అయితే అతను ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా నిగ్రహంతో ఆడి స్కోరును సమం చేయడంతోపాటు ఆధిక్యంలోకి వెళ్లి విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. ఈ ఏడాది జయరామ్ మలేసియా మాస్టర్స్ గ్రాండ్‌ప్రి గోల్డ్, స్విస్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్, రష్యా ఓపెన్ గ్రాండ్‌ప్రి టోర్నీల్లో సెమీస్‌కు చేరుకున్నాడు. ► ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) ఆధ్వర్యంలో 2007లో సూపర్ సిరీస్ టోర్నమెంట్లు ప్రారంభమైన తర్వాత... భారత్ నుంచి సూపర్ సిరీస్ టోర్నీలో ఫైనల్‌కు చేరుకున్న మూడో ప్లేయర్‌గా జయరామ్ గుర్తింపు పొందాడు. ఇంతకుముందు భారత్ నుంచి సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్ సూపర్ సిరీస్ టోర్నీల్లో ఫైనల్‌కు చేరుకోవడంతోపాటు టైటిల్స్ కూడా నెగ్గిన సంగతి తెలిసిందే. గతంలో ప్రకాశ్ పదుకొనే, పుల్లెల గోపీచంద్ ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ టైటిల్స్ నెగ్గినపుడు ఆ టోర్నీలకు సూపర్ సిరీస్ హోదా లేదు. ► ‘‘నాకిది గొప్ప విజయం. వ్యూహాత్మకంగా, మానసికంగా కూడా సెమీస్‌లో మంచి ఆటతీరును కనబరిచాను. ఈ ఏడాది చెన్ చౌ తియెన్తో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయాను. ఈసారి చాలా ఓపికతో ఆడాను. నెట్ వద్ద, ర్యాలీల్లో పైచేయి సాధించాను. తొలిసారి సూపర్ సిరీస్ టోర్నీలో ఫైనల్ చేరినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ టోర్నీలోని గత మ్యాచ్‌ల ఫలితాలతో సంబంధం లేకుండా ఫైనల్ మ్యాచ్‌పై దృష్టి పెడతాను. చెన్ లాంగ్‌తో టైటిల్ పోరు క్లిష్టంగా ఉంటుందని భావిస్తున్నాను’’ -అజయ్ జయరామ్ -
జయరామ్ సంచలనం
సియోల్:కొరియా ఓపెన్ బ్యాడ్మింటన్ సిరీస్ లోభారత స్టార్ ఆటగాళ్ల నిష్ర్కమించినా.. అజయ్ జయరామ్ అంచనాల మించి రాణిస్తున్నాడు. శనివారం జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ లో జయరామ్ 21-19, 21-15 తేడాతో వరల్డ్ ఏడో ర్యాంక్ ఆటగాడు చౌ తెన్ చెన్(చైనీస్ తైపీ) )పై ఘన విజయం సాధించి ఫైనల్లోకి ప్రవేశించాడు. ఈ టోర్నీలో ఆద్యంతం ఆకట్టుకున్న జయరామ్.. చౌ చెన్ ను వరుస సెట్లలో మట్టికరిపించాడు. కేవలం 43 నిమిషాల వ్యవధిలోనే జయరామ్ సెమీ ఫైనల్ పోరును ముగించాడు. ప్రస్తుత సీజన్ లో ఇదే ప్రత్యర్థిని జర్మన్ ఓపెన్, యూఎస్ ఓపెన్ లలో బోల్తా కొట్టించిన జయరామ్ అదే ఊపును కొరియన్ ఓపెన్ లో కూడా కొనసాగించాడు. తొలి గేమ్‌లో జయరామ్ 11-8తో ముందంజంలో పయనించినా.. ఆ తరువాత కాస్త వెనుకబడ్డాడు. అయితే ఎట్టకేలకు తొలి సెట్ ను గెలుచుకున్న జయరామ్ ఆధిక్యం సంపాదించాడు. ఆ తదుపరి సెట్ లో తొలుత 3-0 తో జయరామ్ ఆధిక్యం సాధించినా.. తరువాత తేరుకున్న చెన్ వరుస పాయింట్లు సాధించాడు. ఓ దశలో రెండో సెట్ కోసం ఇరువురి మధ్య సాగిన పోరు ఉత్కంఠను రేపింది. జయరామ్ -చెన్ ల స్కోరు 12-12 వద్ద ఉండగా వీరిద్దరూ హోరాహోరీగా తలపడ్డారు. కాగా, ఆ తరువాత చెన్ 15-14 తో ముందుకు దూసుకువెళ్లాడు. ఇలా ఇరువురి మధ్య కాసేపు దోబుచులాడిన రెండో సెట్ ను జయరామ్ కైవసం చేసుకుని చెన్ కు చెక్ పెట్టాడు. ఈ తాజా గెలుపుతో జయరామ్ తుదిపోరులో చెన్ లాంగ్ తో తలపడనున్నాడు. శుక్రవారం జరిగిన పురుషుల క్వార్టర్ఫైనల్లో ప్రపంచ 32వ ర్యాంకర్ జయరామ్ 21-19, 16-21, 21-16తో ప్రపంచ 26వ ర్యాంకర్ షో ససాకి (జపాన్)పై అద్భుత విజయం సాధించి సెమీస్‌లోకి అడుగుపెట్టాడు. ఇటీవల డచ్ ఓపెన్ టైటిల్‌ను నెగ్గిన జయరామ్... ఈ సీజన్లో మలేసియా, స్విస్, రష్యా ఓపెన్ టోర్నీల్లో సెమీస్‌కు చేరాడు. -
సెమీస్‌లో జయరామ్
నిరాశపర్చిన సింధు కొరియా ఓపెన్ బ్యాడ్మింటన్ సియోల్ : ఈ సీజన్లో అంచనాలకు మించి రాణిస్తున్న భారత బ్యాడ్మింటన్ ఆటగాడు అజయ్ జయరామ్... కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీలో సంచలనం సృష్టించాడు. శుక్రవారం జరిగిన పురుషుల క్వార్టర్ఫైనల్లో ప్రపంచ 32వ ర్యాంకర్ జయరామ్ 21-19, 16-21, 21-16తో ప్రపంచ 26వ ర్యాంకర్ షో ససాకి (జపాన్)పై అద్భుత విజయం సాధించి సెమీస్‌లోకి అడుగుపెట్టాడు. గంటా ఆరు నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో జయరామ్ కీలక సమయంలో స్ఫూర్తిదాయక పోరాటాన్ని చూపెట్టాడు. తొలి గేమ్‌లో 3-11తో వెనుకబడ్డా.. వరుసగా 8 పాయింట్లు నెగ్గి 11-11తో స్కోరు సమం చేశాడు. తర్వాత ససాకి మరోసారి ఆధిపత్యం చెలాయిస్తూ 19-17 ఆధిక్యంలో నిలిచాడు. ఈ దశలో ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా జయరామ్ నాలుగు వరుస పాయింట్లతో గేమ్‌ను ముగించాడు. రెండో గేమ్ ఆరంభంలో జయరామ్ 6-1 ఆధిక్యంలోకి వెళ్లినా.. ససాకి నేర్పుగా అడ్డుకట్ట వేశాడు. వరుసగా ఐదు పాయింట్లు నెగ్గడంతో పాటు ఓ దశలో 10-10తో స్కోరును సమం చేశాడు. తర్వాత వరుసగా నాలుగు, ఐదు పాయింట్లతో గేమ్‌ను చేజిక్కించుకున్నాడు. ఇక నిర్ణయాత్మక మూడో గేమ్‌లో పాయింట్ల కోసం ఇద్దరు ఆటగాళ్లు హోరాహోరీగా తలపడ్డారు. ఓ దశలో జపాన్ ప్లేయర్ 9-6 ఆధిక్యంలోకి వెళ్లినా.. జయరామ్ నిలకడగా ఆడుతూ 12-12తో సమం చేశాడు. తర్వాత రెండు, మూడు పాయింట్ల ఆధిక్యంతో గేమ్‌తో పాటు చిరస్మరణీయ విజయాన్ని సాధించాడు. ఇటీవల డచ్ ఓపెన్ టైటిల్‌ను నెగ్గిన జయరామ్... ఈ సీజన్లో మలేసియా, స్విస్, రష్యా ఓపెన్ టోర్నీల్లో సెమీస్‌కు చేరాడు. మరోవైపు మహిళల ప్రిక్వార్టర్స్‌లో పి.వి.సింధు 16-21, 13-21తో సయకా తకహషి (జపాన్) చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్ర్కమించింది. -
సెమీస్ కు చేరిన అజయ్ జయరామ్
సియోల్: కొరియా ఓపెన్ బ్యాడ్మింటన్ సిరీస్ లో భారత్ కు మిశ్రమ పలితాలు వస్తున్నాయి. ఇప్పటికే భారత స్టార్ ఆటగాళ్లు కిదాంబి శ్రీకాంత్, పారుపల్లి కశ్యప్ లు టోర్నీ నుంచి నిష్ర్రమించగా.. పెద్దగా అంచనాలు లేకుండా బరిలోకి దిగిన అజయ్ జయరామ్ కు సెమీ ఫైనల్ కు చేరాడు. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ పోరులో జయరామ్ 21-19, 16-21, 21-16 తేడాతో జపాన్ ఆటగాడు షో ససాకీని బోల్తా కొట్టించి సెమీస్ లోక ప్రవేశించాడు. తొలి గేమ్ ను అవలీలగా గెలిచిన జయరామ్.. తదుపరి గేమ్ ను కోల్పోయాడు. రెండో సెట్ తొలి అర్థభాగంలో జయరామ్ 6-1 తేడాతో ముందంజలో పయనించినా.. షో ససాకీ వరుసగా ఐదు పాయింట్లు సాధించి ఆ సెట్ ను చేజిక్కించుకున్నాడు. దీంతో మూడో సెట్ కీలకంగా మారింది. ఆ సెట్ లో తిరిగి పుంజుకున్న జయరామ్ ఆద్యంతం ఎదురుదాడికి దిగి షోససాకీని కోలుకోనీయకుండా చేశాడు.ఈ తాజా గెలుపుతో ఇరువురి ముఖాముఖి రికార్డును జయరామ్ 1-2 కు తగ్గించాడు. -
ముగిసిన భారత్ పోరు
రష్యన్ ఓపెన్ బ్యాడ్మింటన్ వ్లాదివోస్టోక్ (రష్యా): రష్యన్ ఓపెన్ గ్రాండ్‌ప్రి లో భారత బ్యాడ్మింటన్ ఆటగాళ్ల పోరు ముగి సింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో మూడో సీడ్ అజయ్ జయరాం 17-21, 17-21 తేడాతో టాప్ సీడ్ టామీ సుగియార్తో (ఇండోనేసియా) చేతిలో వరుస గేముల్లో ఓడిపోయాడు. ఇక పురుషుల డబుల్స్‌లో మను అత్రి, బి.సుమీత్ రెడ్డి జోడి 21-19, 7-21, 16-21 తేడా తో టాప్ సీడ్ వ్లాదిమిర్ ఇవనోవ్, ఇవాన్ సొజొనోవ్ (రష్యా) చేతిలో.. మిక్స్డ్ డబుల్స్‌లో అక్షయ్ దెవాల్కర్, ప్రజక్తా సావంత్ జంట 10-21, 8-21తో జపాన్‌కు చెందిన యుటా వటనబే, హిగషినో చేతిలో పరాజయం పాలయ్యారు. -
మెయిన్ ‘డ్రా'కు జయరామ్
హాంకాంగ్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీ కౌలూన్ (హాంకాంగ్): హాంకాంగ్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నమెంట్లో భారత యువతార అజయ్ జయరామ్ మెయిన్ ‘డ్రా'కు అర్హత సాధించాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్ పోటీల్లో జయరామ్ ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచాడు. తొలి రౌండ్లో 21-12, 22-20తో లతీఫ్ (మలేసియా)పై, రెండో రౌండ్లో 23-21, 21-7తో చున్ (చైనీస్ తైపీ)పై గెలిచాడు. బుధవారం జరిగే మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్లో ప్రపంచ రెండో ర్యాంకర్ చెన్ లాంగ్ (చైనా)తో అజయ్ జయరామ్; చెన్ చౌ (చైనీస్ తైపీ)తో శ్రీకాంత్; సెన్సోమ్బూన్సుక్ (థాయ్‌లాండ్)తో కశ్యప్; షో ససాకి (జపాన్)తో గురుసాయిదత్ తలపడతారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ఒంగ్‌బుమ్‌రుంగ్‌పన్ (థాయ్‌లాండ్)తో పీవీ సింధు; జామీ సుబంధి (అమెరికా)తో సైనా నెహ్వాల్ ఆడతారు. సైనా, శ్రీకాంత్‌లకు ప్రణబ్ అభినందనలు చైనా ఓపెన్‌లో టైటిల్స్ సాధించిన సైనా నెహ్వాల్, శ్రీకాంత్‌లను భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అభినందించారు. వారిద్దరికీ వ్యక్తిగత సందేశాలు పంపించారు. అలాగే కేంద్ర క్రీడాశాఖ మంత్రి సోనోవాల్ కూడా ఇద్దరినీ ప్రశంసించారు. -
అజయ్ సంచలనం
సింగిల్స్‌లో సంతోషం... డబుల్స్‌లో నిరాశ... క్లుప్తంగా ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో ఇదీ తొలిరోజు భారత ప్రదర్శన. ప్రపంచ 13వ ర్యాంకర్, ఆంధ్రప్రదేశ్ క్రీడాకారుడు పారుపల్లి కశ్యప్ తొలి రౌండ్‌ను దాటేందుకు తీవ్రంగానే శ్రమించాడు. మరోవైపు భారత్‌కే చెందిన ప్రపంచ 24వ ర్యాంకర్ అజయ్ జయరామ్ పట్టుదలగా పోరాడి ప్రపంచ 12వ ర్యాంకర్ వింగ్ కీ వోంగ్ (హాంకాంగ్)ను బోల్తా కొట్టించి రెండో రౌండ్లోకి దూసుకెళ్లాడు. మహిళల డబుల్స్‌లో తెలుగు అమ్మాయి సిక్కి రెడ్డి-అపర్ణ బాలన్; అశ్విని పొన్నప్ప-ప్రద్న్యా గాద్రె .. మిక్స్డ్ డబుల్స్‌లో తెలుగు కుర్రాడు కోనా తరుణ్-అశ్విని పొన్నప్ప; అరుణ్ విష్ణు-అపర్ణ బాలన్ జోడిలు తొలి రౌండ్లోనే ఓడిపోయాయి. మంగళవారం పురుషుల డబుల్స్‌లో తొలి రౌండ్ మ్యాచ్ ఆడాల్సిన తరుణ్-అరుణ్ విష్ణు జంటకు ‘వాకోవర్’ లభించగా... గాయం కారణంగా ప్రణవ్ చోప్రా-అక్షయ్ దివాల్కర్ జోడి వైదొలిగింది. వింగ్ కీ వోంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో అజయ్ 22-20, 17-21, 21-15తో విజయం సాధించాడు. 64 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో తొలి గేమ్‌లో అజయ్ 20-16తో ఆధిక్యంలో ఉన్నా వరుసగా నాలుగు పాయింట్లు కోల్పోయాడు. దాంతో స్కోరు 20-20తో సమమైంది. ఈ దశలో అజయ్ వరుసగా రెండు పాయింట్లు నెగ్గి తొలి గేమ్‌ను దక్కించుకున్నాడు. రెండో గేమ్‌లో అజయ్ 13-8తో ఆధిక్యంలో ఉండి ఆ తర్వాత వెనుకబడిపోయాడు. వరుస పొరపాట్లతో రెండో గేమ్‌ను చేజార్చుకున్నాడు. నిర్ణాయక మూడో గేమ్‌లో అజయ్ తేరుకొని ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా స్థిరమైన ఆటతీరును ప్రదర్శించి ఆరు పాయింట్ల తేడాతో విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. ప్రపంచ 98వ ర్యాంకర్ రౌల్ మస్త్ (ఎస్తోనియా)తో జరిగిన మ్యాచ్‌లో కశ్యప్ 19-21, 21-14, 21-9తో గెలిచాడు. 56 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో కశ్యప్‌కు తొలి రెండు గేముల్లో తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. తొలి గేమ్‌ను కోల్పోయిన ఈ హైదరాబాదీ రెండో గేమ్‌లో తేరుకున్నాడు. మూడో గేమ్‌లో తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. 8-9తో వెనుకబడి ఉన్న దశలో కశ్యప్ చెలరేగిపోయాడు. నమ్మశక్యం కాని రీతిలో వరుసగా 13 పాయింట్లు నెగ్గి 21-9తో గేమ్‌ను కైవసం చేసుకొని విజయాన్ని దక్కించుకున్నాడు. బుధవారం జరిగే రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో పీటర్ కౌకల్ (చెక్ రిపబ్లిక్)తో కశ్యప్; పాబ్లో ఎబియన్ (స్పెయిన్)తో అజయ్ జయరామ్ ఆడతారు. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో తరుణ్-అశ్విని పొన్నప్ప 18-21, 21-12, 19-21తో హషిమోటో-మియూకి మయెదా (జపాన్) చేతిలో; అరుణ్ విష్ణు-అపర్ణ బాలన్ 15-21, 17-21తో మిన్ చున్ లియో-హువాన్ చెన్ (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయారు. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో సిక్కి రెడ్డి-అపర్ణ బాలన్ 15-21, 17-21తో లారెన్ స్మిత్-గాబ్రియెలా వైట్ (ఇంగ్లండ్) చేతిలో; అశ్విని పొన్నప్ప-ప్రద్న్యా గాద్రె 23-21, 18-21, 17-21తో లైన్ క్రుస్-మేరీ రోప్కె (డెన్మార్క్) చేతిలో పరాజయం పాలయ్యారు.