జయరామ్ పోరు ముగిసె...
మలేసియా ఓపెన్ టోర్నీ
కుచింగ్ (మలేసియా): ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ రెండో ర్యాంకర్ విక్టర్ అక్సెల్‌సన్ (డెన్మార్క్)పై సంచలన విజయం సాధించిన భారత నంబర్‌వన్ అజయ్ జయరామ్ అదే జోరును క్వార్టర్ ఫైనల్లో కొనసాగించలేపోయాడు. ఫలితంగా మలేసియా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ బ్యాడ్మింటన్ టోర్నీ నుంచి నిష్క్రమించాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 20వ ర్యాంకర్ జయరామ్ 18–21, 14–21తో ప్రపంచ ఐదో ర్యాంకర్ సన్ వాన్ హో (దక్షిణ కొరియా) చేతిలో ఓడిపోయాడు. సన్ వాన్ హో చేతిలో జయరామ్‌కిది వరుసగా నాలుగో పరాజయం కావడం గమనార్హం.
37 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో జయరామ్ తొలి గేమ్‌లో గట్టిపోటీనిచ్చినా రెండో గేమ్‌లో మాత్రం డీలా పడ్డాడు. జయరామ్ ఓటమితో ఈ టోర్నీలో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. మహిళల సింగిల్స్‌లో సైనా నెహ్వాల్, పీవీ సింధు... పురుషుల సింగిల్స్‌లో సాయిప్రణీత్... పురుషుల డబుల్స్‌లో సుమీత్ రెడ్డి–మనూ అత్రి... మహిళల డబుల్స్‌లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప... మిక్స్‌డ్ డబుల్స్‌లో సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా తొలి రౌండ్‌లోనే వెనుదిరిగారు.