Malaysia Open tournament
-
Malaysia Open 2022: సింధుకు మళ్లీ నిరాశ
కౌలాలంపూర్: మలేసియా ఓపెన్ సూపర్–750 టోర్నీ మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ఏడో ర్యాంకర్ సింధు 21–13, 15–21, 15–21తో రెండో ర్యాంకర్ తై జు యింగ్ (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయింది. తై జు చేతిలో సింధుకిది 16వ ఓటమి. పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రణయ్ 18–21, 16–21తో జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా) చేతిలో ఓటమి చవిచూశాడు. సింధు, ప్రణయ్‌లకు 3,712 డాలర్ల (రూ. 2 లక్షల 93 వేలు) చొప్పున ప్రైజ్‌మనీ లభించింది. -
భారత మహిళల జోరు
కౌలాలంపూర్: మలేసియాతో జరుగుతోన్న ఐదు మ్యాచ్‌ల ద్వైపాక్షిక హాకీ సిరీస్‌లో భారత మహిళల జట్టు జోరు కనబరుస్తోంది. ఈ సిరీస్‌లో వరుసగా రెండో విజయాన్ని సాధించి భారత్ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 5–0తో మలేసియాపై ఘనవిజయం సాధించింది. నవ్‌జ్యోత్ కౌర్ (12వ ని.), వందన కటారియా (20వ ని.), నవ్‌నీత్ కౌర్, లాల్రెమ్సియామి (54వ ని.), నిక్కీ ప్రదాన్ (55వ ని.) తలా ఓ గోల్ చేశారు. మ్యాచ్ ఆరంభం నుంచే అటాకింగ్ ప్రారంభించిన భారత్‌కు మూడో నిమిషంలోనే పెనాల్టీ కార్నర్ లభించింది. అయితే దీన్ని గోల్‌గా మలచలేకపోయింది. తర్వాత మరో రెండు గోల్ అవకాశాలు వచ్చినప్పటికీ భారత్ సద్వినియోగం చేసుకోలేకపోయింది. మరో మూడు నిమిషాల్లో తొలి క్వార్టర్ ముగుస్తుందనగా నవ్‌జ్యోత్ కౌర్ చేసిన గోల్‌తో భారత్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో క్వార్టర్లో స్ట్రయికర్ వందన కటారియా అద్భుత ఫీల్డ్ గోల్‌తో పాటు, నవ్‌నీత్‌కౌర్ మరో గోల్ చేయడంతో భారత్ 3–0తో పటిష్ట స్థితిలో నిలిచింది. ఈ దశలో మలేసియా జట్టు పుంజుకుంది. భారత గోల్ పోస్టుపై దాడులు చేయడంతో పాటు, గోల్ చేయకుండా ప్రత్యర్థిని అడ్డుకుంది. దీంతో మూడో క్వార్టర్లో ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. చివరి క్వార్టర్లో లాల్రెమ్సియామి (54వ ని.), నిక్కీ ప్రదాన్ (55వ ని.) వరుస గోల్స్‌తో చెలరేగడంతో భారత్ ఘన విజయాన్ని అందుకుంది. -
జయరామ్ పోరు ముగిసె...
మలేసియా ఓపెన్ టోర్నీ కుచింగ్ (మలేసియా): ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ రెండో ర్యాంకర్ విక్టర్ అక్సెల్సన్ (డెన్మార్క్)పై సంచలన విజయం సాధించిన భారత నంబర్‌వన్ అజయ్ జయరామ్ అదే జోరును క్వార్టర్ ఫైనల్లో కొనసాగించలేపోయాడు. ఫలితంగా మలేసియా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ బ్యాడ్మింటన్ టోర్నీ నుంచి నిష్క్రమించాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 20వ ర్యాంకర్ జయరామ్ 18–21, 14–21తో ప్రపంచ ఐదో ర్యాంకర్ సన్ వాన్ హో (దక్షిణ కొరియా) చేతిలో ఓడిపోయాడు. సన్ వాన్ హో చేతిలో జయరామ్కిది వరుసగా నాలుగో పరాజయం కావడం గమనార్హం. 37 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో జయరామ్ తొలి గేమ్‌లో గట్టిపోటీనిచ్చినా రెండో గేమ్‌లో మాత్రం డీలా పడ్డాడు. జయరామ్ ఓటమితో ఈ టోర్నీలో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. మహిళల సింగిల్స్‌లో సైనా నెహ్వాల్, పీవీ సింధు... పురుషుల సింగిల్స్‌లో సాయిప్రణీత్... పురుషుల డబుల్స్‌లో సుమీత్ రెడ్డి–మనూ అత్రి... మహిళల డబుల్స్‌లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప... మిక్స్డ్ డబుల్స్‌లో సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా తొలి రౌండ్లోనే వెనుదిరిగారు. -
సైనాకు మళ్లీ నిరాశ
► ఎనిమిదోసారి తై జు యింగ్ చేతిలో పరాజయం ► మలేసియా ఓపెన్ టోర్నీ షా ఆలమ్: ప్రత్యర్థి పటిష్టంగా ఉంటే నిలకడగా రాణించడం తప్పనిసరని... లేకపోతే మంచి ఫలితాలు రావడం కష్టమేనని భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్‌కు మరోసారి అనుభవమైంది. మలేసియా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టోర్నమెంట్లో ఈ హైదరాబాద్ అమ్మాయి పోరాటం సెమీఫైనల్లోనే ముగిసింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో మూడో సీడ్, ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ సైనా నెహ్వాల్ 19-21, 13-21తో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ తై జు యింగ్ (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయింది. ఈ టోర్నీ చరిత్రలో సైనా సెమీఫైనల్లో నిష్ర్కమించడం ఇది నాలుగోసారి కావడం గమనార్హం. తాజా ఫలితంతో సైనా తన చిరకాల ప్రత్యర్థి తై జు యింగ్ చేతిలో వరుసగా ఆరోసారి ఓడిపోయింది. ఓవరాల్‌గా ఈ చైనీస్ తైపీ క్రీడాకారిణి చేతిలో సైనా ఓటమి చెందడం ఇది ఎనిమిదోసారి కావడం విశేషం. గత మూడేళ్లలో తై జు యింగ్‌పై ఒక్కసారి కూడా నెగ్గలేకపోయిన సైనా ఈ మ్యాచ్‌లోనూ నిరాశపరిచింది. తొలి గేమ్‌లో సైనా వరుసగా ఏడు పాయింట్లు కోల్పోవడం ఆమె ఎంత ఒత్తిడిలో ఉందో సూచిస్తోంది. ఆరంభంలోనే 0-7తో వెనుకబడిన సైనా ఆ తర్వాత కోలుకునేందకు ప్రయత్నించింది. అయితే సైనా ఆటతీరుపై మంచి అవగాహన ఉన్న తై జు యింగ్ వైవిధ్యభరితంగా ఆడుతూ భారత స్టార్‌కు తేరుకునే అవకాశం ఇవ్వలేదు. పదునైన స్మాష్‌లు సంధించడంతోపాటు డ్రాప్ షాట్లతో తై జు యింగ్ ఆద్యంతం సైనాపై ఆధిపత్యం చలాయించింది. స్కోరు 14-20 వద్ద సైనా వరుసగా ఐదు పాయింట్లు సాధించి 19-20కు చేరుకుంది. ఈ దశలో తై జు యింగ్ డ్రాప్ షాట్‌తో పాయింట్ సాధించి తొలి గేమ్‌ను సొంతం చేసుకుంది. రెండో గేమ్‌లో ఇద్దరూ నువ్వా నేనా అన్నట్లు పోరాడారు. పలుమార్లు స్కోరు సమం కూడా అయింది. అయితే కీలకదశలో సైనా తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకుంది. విరామానికి తై జు యింగ్ 11-9తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత ఈ చైనీస్ తైపీ క్రీడాకారిణి దూకుడు పెంచగా... సైనా డీలా పడిపోయి ఓటమిని ఖాయం చేసుకుంది. సెమీస్‌లో ఓడిన సైనాకు 7,975 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 5 లక్షల 30 వేలు)తోపాటు 7,700 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
సెమీస్‌లో సైనా
► సింధు పరాజయం ► మలేసియా ఓపెన్ టోర్నీ షా ఆలమ్ (మలేసియా): వరుసగా రెండో సూపర్ సిరీస్ టోర్నమెంట్లో భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. మలేసియా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టోర్నమెంట్లో ఈ హైదరాబాద్ అమ్మాయి క్వార్టర్ ఫైనల్లో చెమటోడ్చి గెలిచింది. ప్రపంచ 22వ ర్యాంకర్ పోర్న్‌టిప్ బురానాప్రాసెర్ట్సుక్ (థాయ్‌లాండ్)తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ సైనా 19-21, 21-14, 21-14తో విజయం సాధించింది. గతవారం ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీలోనూ సైనా సెమీస్‌కు చేరింది. పోర్న్టిప్తో 58 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో తొలి గేమ్‌లో ఓడిన సైనా ఆ తర్వాత తేరుకుంది. ఈ మ్యాచ్‌కు ముందు పోర్న్టిప్పై ఏడుసార్లు గెలిచిన సైనా రెండో గేమ్ నుంచి నిలకడగా ఆడింది. 11-7తో ఆధిక్యంలోకి వెళ్లిన ఆమె అదే జోరులో గేమ్‌ను దక్కించుకుంది. నిర్ణాయక మూడో గేమ్‌లో సైనా ఆరంభం నుంచే దూకుడుగా ఆడుతూ 5-1తో ఆధిక్యాన్ని సంపాదించింది. ఆ తర్వాత కూడా పూర్తి ఆధిపత్యం చెలాయించిన సైనా విజయాన్ని ఖాయం చేసుకుంది. ఈ టోర్నీలో సైనా సెమీఫైనల్‌కు చేరుకోవడం ఇది నాలుగోసారి. అయితే గత మూడు పర్యాయాలు (2012, 2013, 2015) సైనా సెమీస్ దశను దాటి ముందుకెళ్లలేకపోయింది. శనివారం జరిగే సెమీఫైనల్లో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ తై జు యింగ్ (చైనీస్ తైపీ)తో సైనా తలపడుతుంది. ముఖాముఖి రికార్డులో సైనా 5-7తో వెనుకబడి ఉంది. 2013 స్విస్ ఓపెన్‌లో చివరిసారి తై జు యింగ్‌పై గెలిచిన సైనా ఆ తర్వాత ఆమెతో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. మరోవైపు భారత్‌కే చెందిన మరో అగ్రశ్రేణి క్రీడాకారిణి పీవీ సింధు పోరాటం క్వార్టర్ ఫైనల్లో ముగిసింది. ప్రపంచ నాలుగో ర్యాంకర్ ఇంతనోన్ రచనోక్ (థాయ్‌లాండ్)తో జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ 10వ ర్యాంకర్ సింధు 7-21, 8-21తో ఓడిపోయింది. కేవలం 29 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో సింధు ఏదశలోనూ ఆమె ప్రత్యర్థికి పోటీనివ్వలేకపోయింది. సెమీఫైనల్స్ ఉ. గం. 10.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్-2లో ప్రత్యక్ష ప్రసారం -
సైనా, సింధు మిగిలారు!
► తొలి రౌండ్లోనే ఓడిన శ్రీకాంత్ ► ప్రణయ్, జయరామ్ కూడా ► మలేసియా ఓపెన్ టోర్నీ షా ఆలమ్ (మలేసియా): స్వదేశంలో జరిగిన ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీలో మాదిరిగానే... మలేసియా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టోర్నమెంట్లోనూ పురుషుల సింగిల్స్‌లో భారత ఆటగాళ్లందరూ తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టారు. భారత నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్, ప్రణయ్, అజయ్ జయరామ్ తొలి రౌండ్లోనే చేతులెత్తేసి నిరాశపరిచారు. మరోవైపు మహిళల సింగిల్స్ విభాగంలో సైనా నెహ్వాల్, పీవీ సింధు తొలి రౌండ్లో అలవోకగా గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. పురుషుల డబుల్స్‌లో బరిలో ఉన్న భారత జోడీ సుమీత్ రెడ్డి-మనూ అత్రి కూడా తొలి రౌండ్లోనే ఓడిపోయింది. దాంతో ఈ టోర్నీలో భారత్ తరఫున సైనా, సింధు మాత్రమే మిగిలారు.మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో మూడో సీడ్ సైనా 21-16, 21-7తో నిచావోన్ జిందాపోల్ (థాయ్‌లాండ్)పై నెగ్గగా... సింధు 21-16, 21-17తో హీ బింగ్జియావో (చైనా)ను ఓడించింది. గురువారం జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో ఏడో సీడ్ సుంగ్ జీ హున్ (దక్షిణ కొరియా)తో సింధు; యోన్ జూ బే (దక్షిణ కొరియా)తో సైనా తలపడతారు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో శ్రీకాంత్ 21-23, 21-9, 10-21తో బూన్సాక్ పొన్సానా (థాయ్‌లాండ్) చేతిలో... ప్రణయ్ 19-21, 20-22తో కెంటో మొమొటా (జపాన్) చేతిలో... అజయ్ జయరామ్ 17-21, 14-21తో హు యున్ (హాంకాంగ్) చేతిలో పరాజయం పాలయ్యారు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సుమీత్ రెడ్డి-మనూ అత్రి ద్వయం 11-21, 10-21తో ఇవనోవ్-సొజోనోవ్ (రష్యా) జంట చేతిలో ఓడిపోయింది. -
సెమీస్‌లో సింధు, శ్రీకాంత్
* క్వార్టర్స్‌లో ఓడిన జయరామ్ * మలేసియా ఓపెన్ టోర్నీ పెనాంగ్: కొత్త సీజన్లో తమ విజయపరంపరను కొనసాగిస్తూ భారత బ్యాడ్మింటన్ స్టార్స్ పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్... మలేసియా మాస్టర్స్ గ్రాండ్‌ప్రి టోర్నమెంట్లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. అయితే భారత్‌కే చెందిన మరో అగ్రశ్రేణి క్రీడాకారుడు అజయ్ జయరామ్ పోరాటం క్వార్టర్ ఫైనల్లో ముగిసింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో మూడో సీడ్ సింధు 21-10, 21-10తో లిందావెని ఫనెత్రి (ఇండోనేసియా)పై అలవోకగా గెలిచింది. కేవలం 29 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ అమ్మాయి సింధు ఆద్యంతం ఆధిపత్యం చెలాయించింది. తొలి గేమ్‌లో స్కోరు 10-9తో ఉన్నదశలో సింధు ఒక్కసారిగా చెలరేగి వరుసగా 10 పాయింట్లు సాధించింది. ఇక రెండో గేమ్‌లోనూ సింధు నిలకడగా ఆడి ఫనెత్రికి పుంజుకునే అవకాశం ఇవ్వలేదు. శనివారం జరిగే సెమీఫైనల్లో టాప్ సీడ్, ప్రపంచ ఏడో ర్యాంకర్ సుంగ్ జీ హున్ (దక్షిణ కొరియా)తో సింధు తలపడుతుంది. పురుషుల సింగిల్స్ విభాగం క్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ శ్రీకాంత్ 21-15, 21-14తో హువాంగ్ యుజియాంగ్ (చైనా)పై గెలుపొందగా... పదో సీడ్ అజయ్ జయరామ్ 16-21, 16-21తో టాప్ సీడ్ లీ చోంగ్ వీ (మలేసియా) చేతిలో ఓడిపోయాడు. హువాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ ప్లేయర్ శ్రీకాంత్‌కు రెండో గేమ్‌లో కాస్త గట్టిపోటీ ఎదురైంది. ఒకదశలో 4-8తో వెనుకబడిన శ్రీకాంత్ తేరుకొని వరుసగా ఐదు పాయింట్లు నెగ్గి 9-8తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఆ తర్వాత ఇదే జోరును కొనసాగించి 33 నిమిషాల్లో విజయాన్ని దక్కించుకున్నాడు. శనివారం జరిగే సెమీఫైనల్స్‌లో ప్రపంచ 51వ ర్యాంకర్ ఇస్కందర్ జుల్కర్నైన్ (మలేసియా)తో శ్రీకాంత్; మూడో సీడ్ టామీ సుగియార్తో (ఇండోనేసియా)తో లీ చోంగ్ వీ తలపడతారు.