సెమీస్‌లో సింధు, శ్రీకాంత్
* క్వార్టర్స్‌లో ఓడిన జయరామ్
* మలేసియా ఓపెన్ టోర్నీ
పెనాంగ్: కొత్త సీజన్‌లో తమ విజయపరంపరను కొనసాగిస్తూ భారత బ్యాడ్మింటన్ స్టార్స్ పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్... మలేసియా మాస్టర్స్ గ్రాండ్‌ప్రి టోర్నమెంట్‌లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. అయితే భారత్‌కే చెందిన మరో అగ్రశ్రేణి క్రీడాకారుడు అజయ్ జయరామ్ పోరాటం క్వార్టర్ ఫైనల్లో ముగిసింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో మూడో సీడ్ సింధు 21-10, 21-10తో లిందావెని ఫనెత్రి (ఇండోనేసియా)పై అలవోకగా గెలిచింది. కేవలం 29 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ అమ్మాయి సింధు ఆద్యంతం ఆధిపత్యం చెలాయించింది. తొలి గేమ్‌లో స్కోరు 10-9తో ఉన్నదశలో సింధు ఒక్కసారిగా చెలరేగి వరుసగా 10 పాయింట్లు సాధించింది.
ఇక రెండో గేమ్‌లోనూ సింధు నిలకడగా ఆడి ఫనెత్రికి పుంజుకునే అవకాశం ఇవ్వలేదు. శనివారం జరిగే సెమీఫైనల్లో టాప్ సీడ్, ప్రపంచ ఏడో ర్యాంకర్ సుంగ్ జీ హున్ (దక్షిణ కొరియా)తో సింధు తలపడుతుంది.
పురుషుల సింగిల్స్ విభాగం క్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ శ్రీకాంత్ 21-15, 21-14తో హువాంగ్ యుజియాంగ్ (చైనా)పై గెలుపొందగా... పదో సీడ్ అజయ్ జయరామ్ 16-21, 16-21తో టాప్ సీడ్ లీ చోంగ్ వీ (మలేసియా) చేతిలో ఓడిపోయాడు. హువాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ ప్లేయర్ శ్రీకాంత్‌కు రెండో గేమ్‌లో కాస్త గట్టిపోటీ ఎదురైంది. ఒకదశలో 4-8తో వెనుకబడిన శ్రీకాంత్ తేరుకొని వరుసగా ఐదు పాయింట్లు నెగ్గి 9-8తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఆ తర్వాత ఇదే జోరును కొనసాగించి 33 నిమిషాల్లో విజయాన్ని దక్కించుకున్నాడు. శనివారం జరిగే సెమీఫైనల్స్‌లో ప్రపంచ 51వ ర్యాంకర్ ఇస్కందర్ జుల్కర్‌నైన్ (మలేసియా)తో శ్రీకాంత్; మూడో సీడ్ టామీ సుగియార్తో (ఇండోనేసియా)తో లీ చోంగ్ వీ తలపడతారు.