కౌలాలంపూర్: మలేసియాతో జరుగుతోన్న ఐదు మ్యాచ్‌ల ద్వైపాక్షిక హాకీ సిరీస్‌లో భారత మహిళల జట్టు జోరు కనబరుస్తోంది. ఈ సిరీస్‌లో వరుసగా రెండో విజయాన్ని సాధించి భారత్ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 5–0తో మలేసియాపై ఘనవిజయం సాధించింది. నవ్‌జ్యోత్ కౌర్ (12వ ని.), వందన కటారియా (20వ ని.), నవ్‌నీత్ కౌర్, లాల్‌రెమ్‌సియామి (54వ ని.), నిక్కీ ప్రదాన్ (55వ ని.) తలా ఓ గోల్ చేశారు. మ్యాచ్ ఆరంభం నుంచే అటాకింగ్ ప్రారంభించిన భారత్‌కు మూడో నిమిషంలోనే పెనాల్టీ కార్నర్ లభించింది. అయితే దీన్ని గోల్‌గా మలచలేకపోయింది. తర్వాత మరో రెండు గోల్ అవకాశాలు వచ్చినప్పటికీ భారత్ సద్వినియోగం చేసుకోలేకపోయింది.
మరో మూడు నిమిషాల్లో తొలి క్వార్టర్ ముగుస్తుందనగా నవ్‌జ్యోత్ కౌర్ చేసిన గోల్‌తో భారత్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో క్వార్టర్‌లో స్ట్రయికర్ వందన కటారియా అద్భుత ఫీల్డ్ గోల్‌తో పాటు, నవ్‌నీత్‌కౌర్ మరో గోల్ చేయడంతో భారత్ 3–0తో పటిష్ట స్థితిలో నిలిచింది. ఈ దశలో మలేసియా జట్టు పుంజుకుంది. భారత గోల్ పోస్టుపై దాడులు చేయడంతో పాటు, గోల్ చేయకుండా ప్రత్యర్థిని అడ్డుకుంది. దీంతో మూడో క్వార్టర్‌లో ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. చివరి క్వార్టర్‌లో లాల్‌రెమ్‌సియామి (54వ ని.), నిక్కీ ప్రదాన్ (55వ ని.) వరుస గోల్స్‌తో చెలరేగడంతో భారత్ ఘన విజయాన్ని అందుకుంది.
Comments
Please login to add a commentAdd a comment