కౌలాలంపూర్: మలేసియాతో గురువారం ప్రారంభమైన ఐదు మ్యాచ్‌ల హాకీ టోర్నమెంట్‌లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. మ్యాచ్ ఆద్యంతం ఆధిపత్యం ప్రదర్శించిన భారత్ 3–0తో ఘనవిజయం సాధించి సిరీస్‌లో 1–0తో ముందంజ వేసింది. భారత్ తరఫున స్ట్రయికర్ వందన కటారియా (17వ ని., 60వ ని.) రెండు గోల్స్‌తో చెలరేగగా... లాల్‌రెమ్‌సియామి (38వ ని.) మరో గోల్‌తో ఆకట్టుకుంది. హోరాహోరీగా సాగిన తొలి క్వార్టర్‌లో ఇరు జట్లూ గోల్స్ చేయనప్పటికీ ఆధిక్యం సాధించేందుకు విఫలయత్నాలు చేశాయి. మ్యాచ్ మూడో నిమిషంలోనే మలేసియాకు పెనాల్టీ కార్నర్ లభించింది. అయితే అనుభవజ్ఞురాలైన భారత గోల్ కీపర్ సవిత ప్రత్యర్థి గోల్‌ను నిలువరించింది.
తర్వాత భారత్ నుంచి లాల్‌రెమ్‌సియామి, నవ్‌నీత్ కౌర్ గోల్ కోసం ప్రయత్నించినప్పటికీ ఫినిషింగ్ లోపంతో సఫలం కాలేకపోయారు. రెండో క్వార్టర్స్ ఆరంభంలోనే వందన కటారియా ఫీల్డ్ గోల్‌తో అలరించింది. అనంతరం ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. మూడో క్వార్టర్స్‌లో భారత్‌కు మూడు పెనాల్టీ కార్నర్‌లు లభించినప్పటికీ వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయింది. అయితే లాల్‌రెమ్‌సియామి మరో ఫీల్డ్ గోల్ సాధించడంతో భారత్ 2–0తో పటిష్ట స్థితిలో నిలిచింది. కొద్ది సెకన్లలో మ్యాచ్ ముగుస్తుందనగా వందన మరో గోల్‌తో భారత్ విజయాన్ని పరిపూర్ణం చేసింది. ఇరు జట్ల మధ్య రెండో మ్యాచ్ శనివారం జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment