Vandana Kataria
-
మీ పేరు నీరజ్ లేక వందన అయితే మీకు 'ఆ రైడ్' ఫ్రీ
హరిద్వార్: మీ పేరు నీరజ్ లేదా వందన అయితే, ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో ఉచిత రోప్‌వే రైడ్ పొందండంటూ ఉషా బ్రెకో లిమిటెడ్ రోప్‌వే కంపెనీ ప్రకటించింది. ఒలింపిక్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా, భారత మహిళా హాకీ ప్లేయర్ వందన కటారియాలను గౌరవిస్తూ సదరు రోప్‌వే కంపెనీ ఆగస్టు 11 నుంచి 20 వతేదీ వరకు అక్కడికి వచ్చే టూరిస్టులందరికీ ఉచిత రైడ్లను ప్రకటించింది. ఉషా బ్రెకో లిమిటెడ్.. ‘ఉడాన్ ఖటోలా’ బ్రాండ్ పేరుతో రోప్‌వేలను నిర్వహిస్తోంది. చండీదేవి ఆలయ దర్శనం కోసం వచ్చే నీరజ్, వందన అనే పేరుగల పర్యాటకులు రోప్‌వేను ఉచితంగా ఉపయోగించుకోగలరని హరిద్వార్ రోప్ వే కంపెనీ హెడ్ మనోజ్ దోభల్ తెలిపారు. అయితే, ఇందుకోసం వారు తమ ఆధార్ కార్డును చూపించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కాగా, జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఆగస్టు 7 న ఒలింపిక్ ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్లో స్వర్ణం గెలిచిన మొదటి భారతీయ అథ్లెట్గాచరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. మరోవైపు టోక్యో ఒలింపిక్స్‌లో హ్యాట్రిక్ సాధించిన భారత మహిళా హాకీ ఫార్వర్డ్ వందనా కటారియా హరిద్వార్ నివాసి కావడం ఉషా బ్రెకో లిమిటెడ్ రోప్‌వే కంపెనీ ఈ ఆఫర్‌ను ప్రకటించింది. వందనా కటారియాను ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం మహిళా శిశు సంక్షేమ శాఖ బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా నియమించింది. -
హ్యాట్రిక్ ‘వందన కథ చెపుతుందిదే..బేటీ ఖేల్నేదో!
మూడు నెలల క్రితం హాకీ ప్లేయర్ వందనా కటారియా తండ్రి మరణించాడు. చివరి చూపులకు నోచుకోలేని దూరంలో ఒలింపిక్స్ ట్రయినింగ్లో ఉంది వందన. ‘అన్నీ వదిలేసి నాన్న కోసం ఇప్పుడే బయలుదేరి వచ్చేస్తా’ అని ఏడ్చింది వందన. కాని దేశం కోసం ఆగిపోయింది. ఒలింపిక్స్‌లో హ్యాట్రిక్ ప్లేయర్‌గా చరిత్ర సృష్టించింది. అయితే ‘తక్కువ కులం’ అమ్మాయి ఇంత ఎదగడం ఇష్టం లేని ‘అగ్రవర్ణ కుర్రాళ్లు’ ఆమె ఇంటి ముందు హంగామా సృష్టించారు. కాని విజేత ఎప్పుడూ విజేతే. దేశమే ఆమె కులం. అందుకే నేడు ఆమెను ఉత్తరాఖండ్ ప్రభుత్వం ‘బేటీ బచావో’ కాంపెయిన్‌కి అంబాసిడర్‌ని చేసింది. కొందరు పూలదండలు పొందుతారు. మరి కొందరు రాళ్లనూ పూలు చేసుకుంటారు. ఉత్తరాఖండ్ సి.ఎం. పుష్కర్ సింగ్ ధమి ఆదివారం (ఆగస్టు 8) వందనా కటారియాను తమ రాష్ట్ర ‘బేటీ బచావో’ కాంపెయిన్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా నియమిస్తున్నట్టు ప్రకటన చేశారు. వందనా కటారియా హరిద్వార్ జిల్లాలోని రోష్నాబాద్‌లో పుట్టి పెరిగింది. భారతీయ మహిళా హాకీలో కీలకమైన ఫార్వర్డ్ ప్లేయర్. టోక్యో ఒలింపిక్స్‌లో హ్యాట్రిక్ చేసి, అలాంటి రికార్డు సాధించిన తొలి మహిళా ప్లేయర్‌గా ఆమె చేసిన అద్భుత ప్రయాణం ఈ ఊరి నుంచే మొదలైంది. నిజానికి వందనను ‘బేటీ బచావో’ కాంపెయిన్తోపాటు ‘బేటీ ఖేల్నేదో’ (అమ్మాయిలను ఆడనివ్వండి) క్యాంపెయిన్‌కి కూడా అంబాసిడర్ ని చేయాలి. ఎందుకంటే కుటుంబం, ఊరు కూడా ఆమె ఆటకు అభ్యంతరాలు చెప్పాయి. చెట్ల కొమ్మలతో బి.హెచ్.ఇ.ఎల్లో టెక్నిషియన్‌గా పని చేసే నహర్ సింగ్ తొమ్మిది మంది సంతానంలో ఒకమ్మాయి వందన. ఆమె అక్క, చెల్లి.. ముగ్గురూ కలిసి చెట్ల కొమ్మలతో హాకీ ఆడేవారు. అక్క, చెల్లి జిల్లాస్థాయిలోనే ఉండిపోతే వందనా ఒలింపిక్స్ దాకా ఎదిగింది. కాని వీళ్లు ముగ్గురూ క్రీడల్లోకి వెళతామంటే వాళ్ల నానమ్మ ఒప్పుకోలేదు. అన్నయ్యలు కూడా ఒప్పుకోలేదు. మిగిలిన చెల్లెళ్లు ఆటలో ఆగిపోయినా వందనా మీరట్ కు వెళ్లి అక్కడి స్పోర్ట్స్ స్కూల్‌కు జాయిన్ అవుదామని నిశ్చయించుకున్నప్పుడు అన్నయ్యలు ఎక్కడ చదివిస్తాం అని పెదవి విరిచారు. పైగా ఊరి వాళ్లు ఎందుకు ఆడపిల్లలకు ఆటలు అని ఎప్పుడూ వందన తండ్రికి సుద్దులు చెప్పేవారే. కాని తండ్రి ఆమె ప్రతిభను గౌరవించాడు. సపోర్ట్ చేశాడు. నువ్వు ఒకరోజు దేశానికి పేరు తేవాలి... మన ఊరికి పేరు తేవాలి అనేవాడు. దురదృష్టవశాత్తు మూడు నెలల క్రితమే ఆయన చనిపోయాడు. అప్పుడు వందన ట్రయినింగ్ క్యాంప్‌లో ఉంది. రావడం సులువు కాదు. రాకుండా ఉండలేదు. ‘నాన్న కోసం వచ్చేస్తాను అన్నయ్యా... ఆయన్ను చివరి చూపు చూడాలని ఉంది’ అని ఏడ్చింది వందన. ‘వద్దమ్మా... ఇక్కడి పనులు మేము చూసుకుంటాం. నాన్నకు నువ్వు మెడల్ తీసుకురావడమే అసలైన నివాళి’ అని అన్నయ్య చెప్పాడు. ఆమె ఆగిపోయింది. ఒలింపిక్స్‌లో ఆడింది. ఒకే మ్యాచ్‌లో మూడు గోల్స్ కొట్టింది. అది ఆమె ఘనత. ఎదగకూడదా? పాలేరు కొడుకు పాలేరు కావాలి... పని మనిషి కూతురు పని మనిషి కావాలి అనే భావజాలం మన దేశంలో కొందరిలో ఉంది. ఒక కులం వాళ్లు ఇంతలోనే ఉండాలి ఒక కులం వాళ్లు రాజ్యాలు ఏలాలి అనుకునే సంకుచిత మనస్తత్వం ఉందనేది వాస్తవం. వందన సొంత ఊరు రోష్నాబాద్‌లో ఉంది. చిన్న గల్లీలో ఉంటుంది వందన ఇల్లు. వందన ఎదగడం, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఆడటం, పేరు రావడం ఆ ఊరిలోని అగ్రవర్ణాలకు చెందిన కొందరు కుర్రాళ్లకు నచ్చలేదు. వందన సోదరుడు ‘మమ్మల్ని చాలా రోజులుగా ఇబ్బంది పెడుతున్నారు. మా ఇంట్లో దొంగతనాలు చేస్తున్నారు. వాళ్ల బాధ పడలేక సిసి కెమెరాలు బిగించాం’ అన్నాడు. అవమానించాలని చూసిన రోజు భారత మహిళా హాకీ జట్టు ఒలింపిక్స్ సెమి ఫైనల్స్‌కు వెళ్లి దేశమంతా గొప్ప ప్రశంసలు పొందింది. అర్జెంటీనాతో మేచ్ గెలిస్తే ఫైనల్స్‌లోకి వెళ్లేది. నిజానికి వందనా హాకీ స్టార్ అయ్యాక ఊళ్లో ఎంతో మార్పు వచ్చింది. చాలా మంది తల్లిదండ్రులు తమ కుమార్తెలను క్రీడల్లో ప్రోత్సహిస్తున్నారు. అగ్రవర్ణాల వారు కూడా వందనను ఎంతో మెచ్చుకున్నారు. ఊళ్లో వందన కుటుంబానికి ఎంతో గౌరవం కూడా పెరిగింది. కాని అదే సమయంలో కొందరు కుర్రాళ్లు మాత్రం భరించలేకపోయారు. అర్జెంటీనాతో మ్యాచ్ ఓడిన రోజు మ్యాచ్ అయిన వెంటనే వారు వందన ఇంటి ముందుకు వచ్చి టపాకాయలు కాల్చారు. ‘ఇలాంటి వాళ్లు (తక్కువ వర్ణాల వాళ్లు) టీమ్‌లో ఉండటం వల్లే ఇండియా ఓడిపోయింది’ అనే అర్థంలో కామెంట్లు చేశారు. చాలా అవమానించే ప్రయత్నం చేశారు. వందన కుటుంబం ఆ దాడికి దిగ్భ్రాంతి చెందింది. పోలీసులకు ఫిర్యాదు చేశారు. దేశమంతా దీనిపై నిరసనలు జరిగాయి. ముగ్గురిని అరెస్టు చేశారు. ప్రభుత్వమే అడ్డుగా నిలబడి.. దేశం కోసం ఆడిన వందన ఇలాంటి దాడి ఎదుర్కొనడం ఉత్తరాఖండ్ ప్రభుత్వం కూడా సహించలేకపోయింది. వెంటనే ఆ రాష్ట్ర క్రీడల మంత్రి రంగంలో దిగి వందన కుటుంబానికి ధైర్యం చెప్పారు. మరోవైపు ముఖ్యమంత్రి ఆమెను తమ మహిళా, శిశు సంక్షేమ శాఖకు బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటించారు. తమ రాష్ట్రానికి చెందిన గొప్ప క్రీడాకారిణిగా ఆమెను గౌరవిస్తున్నామని తెలిపారు. మన దేశంలో అమ్మాయిలు క్రీడల్లో రాణించాలంటే అదీ మధ్యతరగతి దిగువ మధ్యతరగతి నుంచి రాణించాలనంటే ముందు ‘అమ్మాయి’ అనే అడ్డంకిని దాటాలి, తర్వాత ‘వనరులు’ అనే అడ్డంకిని దాటాలి, తర్వాత వెనుకబడిన వర్గాల నుంచి అయినట్టయితే ‘సామాజిక వివక్ష’నూ దాటాలి. ఇన్ని అడ్డంకులను దాటి, దాటుతూ కూడా వందన సమున్నతంగా నిలబడింది. వందన ఉదంతం ఇలాంటి నేపథ్యం ఉన్నవాళ్లకు క్రీడల్లో ఎన్ని అడ్డంకులు ఉంటాయో తెలియజేస్తోంది. ఇలాంటి నేపథ్యం ఉన్నా ఈ దేశంలో విజయం సాధించేందుకు సకల అవకాశాలు ఉన్నాయని కూడా తెలియచేస్తోంది. మనం చూడాల్సింది ఈ రెండో కోణాన్నే. వందనా కటారియా -
మిస్ సితారమిస్ సితార
రాజీవ్ సిద్ధార్థ్, శోభితా ధూళిపాళ్ల ప్రధాన పాత్రల్లో రూపొందిన హిందీ చిత్రం ‘సితార’. ‘నోబుల్ మ్యాన్’ ఫేమ్ వందనా కటారియా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇంటీరియర్ డిజైనర్ కావాలనుకునే ఒక అమ్మాయి, చెఫ్ కావాలనుకునే ఓ అబ్బాయి చుట్టూ ఈ సినిమా కథనం సాగుతుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. తాజాగా ఈ చిత్రంలోని శోభిత లుక్‌ను విడుదల చేశారు. చేతిలో పువ్వు పట్టుకుని చిరునవ్వులు చిందిస్తున్న శోభిత లుక్ ఆకట్టుకునేలా ఉంది. ఇదిలా ఉంటే తెలుగులో ‘మేజర్’ చిత్రంలో నటించారు శోభిత. మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న ‘పొన్నియిన్ సెల్వన్’లోనూ, అమెరికన్ మిస్టరీ థ్రిల్లర్ ‘మంకీ మ్యాన్’లోనూ నటిస్తున్నారు. మలయాళంలో ఆమె నటించిన ‘కురూప్’ చిత్రం విడుదల కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది. -
భారత మహిళల శుభారంభం
కౌలాలంపూర్: మలేసియాతో గురువారం ప్రారంభమైన ఐదు మ్యాచ్‌ల హాకీ టోర్నమెంట్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. మ్యాచ్ ఆద్యంతం ఆధిపత్యం ప్రదర్శించిన భారత్ 3–0తో ఘనవిజయం సాధించి సిరీస్‌లో 1–0తో ముందంజ వేసింది. భారత్ తరఫున స్ట్రయికర్ వందన కటారియా (17వ ని., 60వ ని.) రెండు గోల్స్‌తో చెలరేగగా... లాల్రెమ్సియామి (38వ ని.) మరో గోల్‌తో ఆకట్టుకుంది. హోరాహోరీగా సాగిన తొలి క్వార్టర్లో ఇరు జట్లూ గోల్స్ చేయనప్పటికీ ఆధిక్యం సాధించేందుకు విఫలయత్నాలు చేశాయి. మ్యాచ్ మూడో నిమిషంలోనే మలేసియాకు పెనాల్టీ కార్నర్ లభించింది. అయితే అనుభవజ్ఞురాలైన భారత గోల్ కీపర్ సవిత ప్రత్యర్థి గోల్‌ను నిలువరించింది. తర్వాత భారత్ నుంచి లాల్రెమ్సియామి, నవ్‌నీత్ కౌర్ గోల్ కోసం ప్రయత్నించినప్పటికీ ఫినిషింగ్ లోపంతో సఫలం కాలేకపోయారు. రెండో క్వార్టర్స్ ఆరంభంలోనే వందన కటారియా ఫీల్డ్ గోల్‌తో అలరించింది. అనంతరం ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. మూడో క్వార్టర్స్‌లో భారత్‌కు మూడు పెనాల్టీ కార్నర్లు లభించినప్పటికీ వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయింది. అయితే లాల్రెమ్సియామి మరో ఫీల్డ్ గోల్ సాధించడంతో భారత్ 2–0తో పటిష్ట స్థితిలో నిలిచింది. కొద్ది సెకన్లలో మ్యాచ్ ముగుస్తుందనగా వందన మరో గోల్‌తో భారత్ విజయాన్ని పరిపూర్ణం చేసింది. ఇరు జట్ల మధ్య రెండో మ్యాచ్ శనివారం జరుగుతుంది. -
కెప్టెన్‌గా వందన
న్యూఢిల్లీ: ఈ నెలాఖర్లో సింగపూర్‌లో జరిగే ఆసియా చాంపియన్స ట్రోఫీ హాకీ టోర్నమెంట్లో పాల్గొనే భారత మహిళల జట్టుకు వందన కటారియా కెప్టెన్‌గా వ్యవహరించనుంది. ఈ టోర్నీలో పాల్గొనే 18 మంది సభ్యుల భారత జట్టును మంగళవారం ప్రకటించారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన 24 ఏళ్ల వందన ఇప్పటివరకు భారత్ తరఫున 120 మ్యాచ్‌లు ఆడి 35 గోల్స్ చేసింది. ఆంధ్రప్రదేశ్ అమ్మాయి యతిమరపు రజని రెండో గోల్‌కీపర్‌గా ఎంపికైంది. మరో గోల్‌కీపర్‌గా సవిత వ్యవహరించనుంది. డిఫెండర్ సునీత లాక్రా వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తుంది. ఈ టోర్నీలో భారత్‌తోపాటు డిఫెండింగ్ చాంపియన్ జపాన్, చైనా, కొరియా, మలేసియా బరిలో ఉన్నాయి. గత మూడు వారాలుగా భోపాల్‌లోని భారత స్పోర్ట్స అథారిటీ (సాయ్) కేంద్రంలో భారత జట్టుకు శిక్షణ శిబిరం కొనసాగుతోంది. భారత మహిళల హాకీ జట్టు సవిత, యతిమరపు రజని (గోల్‌కీపర్లు), వందన కటారియా (కెప్టెన్), సునీత లాక్రా (వైస్ కెప్టెన్), దీప్ గ్రేస్ ఎక్కా, రేణుక యాదవ్, హినియాలుమ్ లాల్ రువాత్ ఫెలి, నమితా టొప్పో, నిక్కీ ప్రధాన్, నవజ్యోత్ కౌర్, మోనిక, రాణి రాంపాల్, దీపిక, నవదీప్ కౌర్, పూనమ్ రాణి, అనురాధ దేవి, ప్రీతి దూబే, పూనమ్ బార్లా.