వందన పునరాగమనం | Vandana Kataria returns to the national team | Sakshi
Sakshi News home page

వందన పునరాగమనం

Jan 30 2025 3:44 AM | Updated on Jan 30 2025 3:44 AM

Vandana Kataria returns to the national team

ఎఫ్‌ఐహెచ్‌ ప్రొ లీగ్‌కు భారత మహిళల హాకీ జట్టు ఎంపిక

ఫిబ్రవరి 15 నుంచి భువనేశ్వర్‌లో మ్యాచ్‌లు  

న్యూఢిల్లీ: వచ్చే నెలలో స్వదేశంలో జరిగే అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్‌) మహిళల ప్రొ లీగ్‌లో పాల్గొనే భారత జట్టును ప్రకటించారు. 24 మంది సభ్యులతో కూడిన ఈ బృందానికి సలీమా టెటె నాయకత్వం వహిస్తుంది. నవ్‌నీత్‌ కౌర్‌ వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తుంది. వెటరన్‌ స్ట్రయికర్‌ వందన కటారియా జాతీయ జట్టులోకి పునరాగమనం చేసింది. 

గత ఏడాది జరిగిన ఆసియా చాంపియన్స్‌ ట్రోఫీకి గాయం కారణంగా దూరమైన వందన ప్రస్తుతం పూర్తి ఫిట్‌నెస్‌ సంతరించుకోవడంతో ఆమెను ఎంపిక చేశారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన 32 ఏళ్ల వందన భారత్‌ తరఫున 317 మ్యాచ్‌లు ఆడి 158 గోల్స్‌ సాధించింది. 2016 రియో ఒలింపిక్స్, 2020 టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించింది. 

2022 బర్మింగ్‌హామ్‌ కామన్వెల్త్‌ గేమ్స్‌లో కాంస్య పతకం నెగ్గిన టీమిండియాలోనూ వందన సభ్యురాలిగా ఉంది. 2014 ఇంచియోన్‌ ఆసియా క్రీడల్లో కాంస్యం... 2018 జకార్తా ఆసియా క్రీడల్లో రజతం... 2022 హాంగ్జౌ ఆసియా క్రీడల్లో కాంస్యం గెలిచిన భారత జట్టులోనూ వందన భాగస్వామిగా ఉంది. 2021లో ‘అర్జున అవార్డు’ సొంతం చేసుకున్న వందనకు 2022లో కేంద్రం నుంచి ‘పద్మశ్రీ’ కూడా వరించింది. 

వందనతోపాటు డిఫెండర్లు నిక్కీ ప్రధాన్, జ్యోతి ఛత్రి, బల్జీత్‌ కౌర్, ముంతాజ్‌ ఖాన్, రుతుజాలకు కూడా జాతీయ జట్టులో స్థానం లభించింది. ఫిబ్రవరి 15 నుంచి 25 వరకు భువనేశ్వర్‌లో జరిగే భారత అంచె ప్రొ లీగ్‌లో భారత్‌తోపాటు జర్మనీ, స్పెయిన్, నెదర్లాండ్స్, ఇంగ్లండ్‌ జట్లు పోటీపడతాయి. 

భారత జట్టు తమ మ్యాచ్‌లను ఫిబ్రవరి 15, 16వ తేదీల్లో ఇంగ్లండ్‌తో... 18, 19వ తేదీల్లో స్పెయిన్‌తో... 21, 22వ తేదీల్లో జర్మనీతో... 24, 25వ తేదీల్లో నెదర్లాండ్స్‌తో తలపడుతుంది.  

భారత మహిళల హాకీ జట్టు 
సవిత పూనియా, బిచ్చూ దేవి ఖరిబం (గోల్‌కీపర్లు), సుశీలా చాను, నిక్కీ ప్రధాన్, ఉదిత, జ్యోతి, ఇషికా చౌధరీ, జ్యోతి ఛత్రి (డిఫెండర్లు). వైష్ణవి విఠల్‌ ఫాల్కే, నేహా, మనీషా చౌహాన్, సలీమా టెటె (కెప్టెన్‌), సునెలితా టొప్పో, లాల్‌రెమ్‌సియామి, బల్జీత్‌ కౌర్, షర్మిలా దేవి (మిడ్‌ ఫీల్డర్లు), నవ్‌నీత్‌ కౌర్‌ (వైస్‌ కెప్టెన్‌), ముంతాజ్‌ ఖాన్, ప్రీతి దూబే, రుతుజా పిసాల్, బ్యూటీ డుంగ్‌డుంగ్, సంగీత కుమారి, దీపిక, వందన కటారియా. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement