హ్యాట్రిక్‌ ‘వందన కథ చెపుతుందిదే..బేటీ ఖేల్నేదో! | Hockey star Vandana Katariya a face of Uttarakhand Beti Bachao campaign now | Sakshi
Sakshi News home page

హ్యాట్రిక్‌ ‘వందన కథ చెపుతుందిదే..బేటీ ఖేల్నేదో!

Published Tue, Aug 10 2021 12:03 AM | Last Updated on Tue, Aug 10 2021 12:03 AM

Hockey star Vandana Katariya a face of Uttarakhand Beti Bachao campaign now - Sakshi

హాకీ ప్లేయర్‌ వందనా కటారియా

మూడు నెలల క్రితం హాకీ ప్లేయర్‌ వందనా కటారియా తండ్రి మరణించాడు. చివరి చూపులకు నోచుకోలేని దూరంలో ఒలింపిక్స్‌ ట్రయినింగ్‌లో ఉంది వందన. ‘అన్నీ వదిలేసి నాన్న కోసం ఇప్పుడే బయలుదేరి వచ్చేస్తా’ అని ఏడ్చింది వందన. కాని దేశం కోసం ఆగిపోయింది. ఒలింపిక్స్‌లో హ్యాట్రిక్‌ ప్లేయర్‌గా చరిత్ర సృష్టించింది. అయితే ‘తక్కువ కులం’ అమ్మాయి ఇంత ఎదగడం ఇష్టం లేని ‘అగ్రవర్ణ కుర్రాళ్లు’ ఆమె ఇంటి ముందు హంగామా సృష్టించారు. కాని విజేత ఎప్పుడూ విజేతే. దేశమే ఆమె కులం. అందుకే నేడు ఆమెను ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం ‘బేటీ బచావో’ కాంపెయిన్‌కి అంబాసిడర్‌ని చేసింది. కొందరు పూలదండలు పొందుతారు. మరి కొందరు రాళ్లనూ పూలు చేసుకుంటారు.

ఉత్తరాఖండ్‌ సి.ఎం. పుష్కర్‌ సింగ్‌ ధమి ఆదివారం (ఆగస్టు 8) వందనా కటారియాను తమ రాష్ట్ర ‘బేటీ బచావో’ కాంపెయిన్‌కి బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమిస్తున్నట్టు ప్రకటన చేశారు. వందనా కటారియా హరిద్వార్‌ జిల్లాలోని రోష్నాబాద్‌లో పుట్టి పెరిగింది. భారతీయ మహిళా హాకీలో కీలకమైన ఫార్వర్డ్‌ ప్లేయర్‌. టోక్యో ఒలింపిక్స్‌లో హ్యాట్రిక్‌ చేసి, అలాంటి రికార్డు సాధించిన తొలి మహిళా ప్లేయర్‌గా ఆమె చేసిన అద్భుత ప్రయాణం ఈ ఊరి నుంచే మొదలైంది. నిజానికి వందనను ‘బేటీ బచావో’ కాంపెయిన్‌తోపాటు ‘బేటీ ఖేల్నేదో’ (అమ్మాయిలను ఆడనివ్వండి) క్యాంపెయిన్‌కి కూడా అంబాసిడర్‌ ని చేయాలి. ఎందుకంటే కుటుంబం, ఊరు కూడా ఆమె ఆటకు అభ్యంతరాలు చెప్పాయి.

చెట్ల కొమ్మలతో
బి.హెచ్‌.ఇ.ఎల్‌లో టెక్నిషియన్‌గా పని చేసే నహర్‌ సింగ్‌ తొమ్మిది మంది సంతానంలో ఒకమ్మాయి వందన. ఆమె అక్క, చెల్లి.. ముగ్గురూ కలిసి చెట్ల కొమ్మలతో హాకీ ఆడేవారు. అక్క, చెల్లి జిల్లాస్థాయిలోనే ఉండిపోతే వందనా ఒలింపిక్స్‌ దాకా ఎదిగింది. కాని వీళ్లు ముగ్గురూ క్రీడల్లోకి వెళతామంటే వాళ్ల నానమ్మ ఒప్పుకోలేదు. అన్నయ్యలు కూడా ఒప్పుకోలేదు. మిగిలిన చెల్లెళ్లు ఆటలో ఆగిపోయినా వందనా మీరట్‌ కు వెళ్లి అక్కడి స్పోర్ట్స్‌ స్కూల్‌కు జాయిన్‌ అవుదామని నిశ్చయించుకున్నప్పుడు అన్నయ్యలు ఎక్కడ చదివిస్తాం అని పెదవి విరిచారు. పైగా ఊరి వాళ్లు ఎందుకు ఆడపిల్లలకు ఆటలు అని ఎప్పుడూ వందన తండ్రికి సుద్దులు చెప్పేవారే. కాని తండ్రి ఆమె ప్రతిభను గౌరవించాడు.  సపోర్ట్‌ చేశాడు. నువ్వు ఒకరోజు దేశానికి పేరు తేవాలి... మన ఊరికి పేరు తేవాలి అనేవాడు. దురదృష్టవశాత్తు మూడు నెలల క్రితమే ఆయన చనిపోయాడు. అప్పుడు వందన ట్రయినింగ్‌ క్యాంప్‌లో ఉంది. రావడం సులువు కాదు. రాకుండా ఉండలేదు. ‘నాన్న కోసం వచ్చేస్తాను అన్నయ్యా... ఆయన్ను చివరి చూపు చూడాలని ఉంది’ అని ఏడ్చింది వందన. ‘వద్దమ్మా... ఇక్కడి పనులు మేము చూసుకుంటాం. నాన్నకు నువ్వు మెడల్‌ తీసుకురావడమే అసలైన నివాళి’ అని అన్నయ్య చెప్పాడు. ఆమె ఆగిపోయింది. ఒలింపిక్స్‌లో ఆడింది. ఒకే మ్యాచ్‌లో మూడు గోల్స్‌ కొట్టింది. అది ఆమె ఘనత.

ఎదగకూడదా?
పాలేరు కొడుకు పాలేరు కావాలి... పని మనిషి కూతురు పని మనిషి కావాలి అనే భావజాలం మన దేశంలో కొందరిలో ఉంది. ఒక కులం వాళ్లు ఇంతలోనే ఉండాలి ఒక కులం వాళ్లు రాజ్యాలు ఏలాలి అనుకునే సంకుచిత మనస్తత్వం ఉందనేది వాస్తవం. వందన సొంత ఊరు రోష్నాబాద్‌లో ఉంది. చిన్న గల్లీలో ఉంటుంది వందన ఇల్లు. వందన ఎదగడం, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఆడటం, పేరు రావడం ఆ ఊరిలోని అగ్రవర్ణాలకు చెందిన కొందరు కుర్రాళ్లకు నచ్చలేదు. వందన సోదరుడు ‘మమ్మల్ని చాలా రోజులుగా ఇబ్బంది పెడుతున్నారు. మా ఇంట్లో దొంగతనాలు చేస్తున్నారు. వాళ్ల బాధ పడలేక సిసి కెమెరాలు బిగించాం’ అన్నాడు.

అవమానించాలని చూసిన రోజు
భారత మహిళా హాకీ జట్టు ఒలింపిక్స్‌ సెమి ఫైనల్స్‌కు వెళ్లి దేశమంతా గొప్ప ప్రశంసలు పొందింది. అర్జెంటీనాతో మేచ్‌ గెలిస్తే ఫైనల్స్‌లోకి వెళ్లేది. నిజానికి వందనా హాకీ స్టార్‌ అయ్యాక ఊళ్లో ఎంతో మార్పు వచ్చింది. చాలా మంది తల్లిదండ్రులు తమ కుమార్తెలను క్రీడల్లో ప్రోత్సహిస్తున్నారు. అగ్రవర్ణాల వారు కూడా వందనను ఎంతో మెచ్చుకున్నారు. ఊళ్లో వందన కుటుంబానికి ఎంతో గౌరవం కూడా పెరిగింది. కాని అదే సమయంలో కొందరు కుర్రాళ్లు మాత్రం భరించలేకపోయారు. అర్జెంటీనాతో మ్యాచ్‌ ఓడిన రోజు మ్యాచ్‌ అయిన వెంటనే వారు వందన ఇంటి ముందుకు వచ్చి టపాకాయలు కాల్చారు. ‘ఇలాంటి వాళ్లు (తక్కువ వర్ణాల వాళ్లు) టీమ్‌లో ఉండటం వల్లే ఇండియా ఓడిపోయింది’ అనే అర్థంలో కామెంట్లు చేశారు. చాలా అవమానించే ప్రయత్నం చేశారు. వందన కుటుంబం ఆ దాడికి దిగ్భ్రాంతి చెందింది. పోలీసులకు ఫిర్యాదు చేశారు. దేశమంతా దీనిపై నిరసనలు జరిగాయి. ముగ్గురిని అరెస్టు చేశారు.

ప్రభుత్వమే అడ్డుగా నిలబడి..
దేశం కోసం ఆడిన వందన ఇలాంటి దాడి ఎదుర్కొనడం ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం కూడా సహించలేకపోయింది. వెంటనే ఆ రాష్ట్ర క్రీడల మంత్రి రంగంలో దిగి వందన కుటుంబానికి ధైర్యం చెప్పారు. మరోవైపు ముఖ్యమంత్రి ఆమెను తమ మహిళా, శిశు సంక్షేమ శాఖకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ప్రకటించారు. తమ రాష్ట్రానికి చెందిన గొప్ప క్రీడాకారిణిగా ఆమెను గౌరవిస్తున్నామని తెలిపారు. మన దేశంలో అమ్మాయిలు క్రీడల్లో రాణించాలంటే అదీ మధ్యతరగతి దిగువ మధ్యతరగతి నుంచి రాణించాలనంటే ముందు ‘అమ్మాయి’ అనే అడ్డంకిని దాటాలి, తర్వాత ‘వనరులు’ అనే అడ్డంకిని దాటాలి, తర్వాత వెనుకబడిన వర్గాల నుంచి అయినట్టయితే ‘సామాజిక వివక్ష’నూ దాటాలి. ఇన్ని అడ్డంకులను దాటి, దాటుతూ కూడా వందన సమున్నతంగా నిలబడింది.

వందన ఉదంతం ఇలాంటి నేపథ్యం ఉన్నవాళ్లకు క్రీడల్లో ఎన్ని అడ్డంకులు ఉంటాయో తెలియజేస్తోంది. ఇలాంటి నేపథ్యం ఉన్నా ఈ దేశంలో విజయం సాధించేందుకు సకల అవకాశాలు ఉన్నాయని కూడా తెలియచేస్తోంది. మనం చూడాల్సింది ఈ రెండో కోణాన్నే.
వందనా కటారియా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement