
టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు(Mahesh Babu) కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED) నోటీసులు జారీ చేసింది. తమ ఎదుట విచారణకు హాజరుకావాలని అందులో పేర్కొంది. గతవారంలో రెండు రోజులపాటు సాయి సూర్య డెవలపర్స్, సురానా గ్రూపులపై ఈడీ దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ సంస్థల ప్రాజెక్టులకు మహేష్ ప్రచార కర్తగా వ్యవహరించారు.
వీటి ప్రచారానికి గానూ ఆయన భారీగా పారితోషకం అందుకున్నట్లు సమాచారం. ఇక సాయి సూర్య డెవలపర్స్‌కు చేసిన ప్రచారానికిగానూ రూ.5.9 కోట్లు మహేష్ అందుకున్నారు. ఈ ప్రమోషన్ కింద రూ.2.5 కోట్ల నగదు, రూ.3.4 కోట్లు చెక్ రూపంలో ఆయన అందుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో.. పెట్టుబడులు పెట్టేందుకు ఆయన ఇన్‌ఫ్లుయెన్స్ చేశారనే అభియోగంపై ఈడీ నోటీసులు జారీ చేసింది.
తొలుత 27వ తేదీన ఆయన్ని విచారణకు ఈడీ నోటీసులు పంపింది. అయితే.. ఆరోజు ఆదివారం ఉన్న నేపథ్యంలో ఆ మరుసటిరోజు (28వ తేదీన) ఉదయం 11గం. విచారణకు రావాలని కోరింది. సంబంధిత గ్రూపులతో జరిగిన లావాదేవీలపై ఈడీ ఆయన్ని ప్రశ్నించే అవకాశం ఉంది.