Real estate companies
-
బడా రియల్ కంపెనీలతో బంధం
సాక్షి, హైదరాబాద్: హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అవినీతి లావాదేవీలు ఏసీబీ అధికారులు తవ్వేకొద్దీ బయటపడుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా పలు రియల్ ఎస్టేట్ కంపెనీలకు అనుమతులిచ్చిన శివబాలకృష్ణ..అందుకు ప్రతిఫలంగా కోట్ల రూపాయలు మూటగట్టుకున్నట్టు ఏసీబీ అధికారుల దర్యాప్తులో వెలుగుచూసినట్టు సమాచారం. ఎన్నికలకోడ్ సమయంలోనూ శివబాలకృష్ణ అనుమతుల జారీ ప్రక్రియ కొనసాగినట్టు ఏసీబీ గుర్తించింది. పుప్పాలగూడ, నార్సింగి పరిధిలో రెండు రియల్ఎస్టేట్ కంపెనీలకు సంబంధించిన వందల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు జారీ చేసినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారంలో శివబాలకృష్ణకు పెద్దమొత్తంలో ‘లబ్ది’చేకూరినట్టు కీలక వివరాలు సేకరించారు. ‘చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూస్’ ప్రక్రియలో పెద్దసంఖ్యలో పెండింగ్ ఫైల్స్ క్లియర్ చేసినట్టు తెలిసింది. ఇందుకు సంబంధించిన అనుమతులపైనా ఆరా తీసేందుకు వరుసగా రెండోరోజూ ఏసీబీ అధికారుల బృందం అమీర్‌పేట్‌లోని హెచ్ఎండీఏ కార్యాలయంలో సోదాలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు ఫైళ్లు పరిశీలించి వివరాలు సేకరించినట్టు సమాచారం. అక్రమార్జన కేసులో ఏసీబీకి పట్టుబడిన శివబాలకృష్ణను కోర్టు ఎనిమిది రోజుల కస్టడీకి అనుమతించిన విషయం తెలిసిందే. ఏసీబీ అధికారులు ఏడో రోజు కస్టడీలో భాగంగా చంచల్‌గూడ జైలు నుంచి బంజారాహిల్స్‌లోని ఏసీబీ కార్యాలయానికి తీసుకొచ్చారు. ప్రధానంగా ఏసీబీ అధికారులు సేకరించిన భూలావాదేవీల వివరాలు, ఇతర పత్రాలు శివబాలకృష్ణ ముందు ఉంచి మంగళవారం ప్రశ్నించినట్టు సమాచారం. లోతుగా పరిశీలన డాక్యుమెంట్లు, బినామీ ఆస్తుల వివరాల ఆధారంగా బాలకృష్ణను ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇతర మార్గాల్లో సేకరించిన వివరాలపై ఏసీబీ అధికారులు లోతుగా ఆరా తీస్తున్నారు. ఇప్పటికే రెరా కార్యాలయంలోనూ సోదాలు చేసి కోట్ల రూపాయల భూములకు సంబంధించిన అనుమతుల విషయంలో వివరాలు సేకరించారు. సోమ, మంగళవారాల్లో అమీర్‌పేట్‌లోని హెచ్ఎండీఏ కార్యాలయంలో జరిపిన సోదాల్లో మరిన్ని వివరాలు లభించాయి. వీటన్నింటినీ విశ్లేషిస్తున్న ఏసీబీ అధికారుల ప్రత్యేక బృందం ఆ విషయాలతో ప్రశ్నావళి రూపొందిస్తూ శివబాలకృష్ణ నుంచి వివరాలు సేకరిస్తోంది. శివబాలకృష్ణకు సహకరించిన సిబ్బందిపైనా ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. శివబాలకృష్ణ నుంచి నిబంధనలకు విరుద్ధంగా అనమతులు పొందిన పలు రియల్ఎస్టేట్ కంపెనీల ప్రతినిధులను ఏసీబీ ప్రశ్నించనున్నట్టు సమాచారం. శివబాలకృష్ణ సోదరుడు శివనవీన్‌కుమార్ అరెస్టు హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ కేసులో కీలక మలుపు చోటు చే సుకుంది. ఆయనకు బి నామీగా వ్యవహరించిన ట్టు ఆధారాలు లభించడంతో ఏసీబీ అధికారులు శివబాలకృష్ణ సో దరుడు శివనవీన్కుమార్ను మంగళవారం అరె స్టు చేశారు. ఇప్పటికే శివ బాలకృష్ణను ఎనిమిది రోజుల కస్టడీలో భాగంగా ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్న విషయం తెలిసిందే. ఏసీబీ సోదాల్లో భాగంగా గుర్తించిన ఆస్తులు, ఆ తర్వాత లాక ర్లు ఓపెన్ చేసి స్వాదీనం చేసుకున్న పలు డాక్యుమెంట్లు, రేరా, హెచ్ఎండీఏ కార్యాలయంలో సోదాల్లో భాగంగా తెలుసుకున్న సమాచారం మేరకు ఏసీబీ అధికారులు శివ నవీన్‌కుమార్‌ను ప్రశ్నించారు. ప్రాథమిక ఆధారాలతోపాటు, శివబాలకృష్ణ విచారణలో తెలుసుకున్న అంశాల మేరకు శివనవీన్‌కుమార్ తన సోదరుడికి బినామీగా వ్యవహరించినట్టు ఏసీబీ అధికారులు ధృవీకరించుకున్నారు. దీంతో ఆయన్ను అరెస్టు చేసినట్టు ఏసీబీ వర్గాలు తెలిపాయి. నేటితో ముగియనున్న ఏసీబీ కస్టడీ హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఏసీబీ కస్టడీ బుధవారంతో ముగియనుంది. గత బుధవారం నుంచి శివబాలకృష్ణను కస్టడీకి తీసుకొని విచారిస్తున్న ఏసీబీ అధికారులు, మరోవైపు ఇతర ఆధారాల కోసం తనిఖీలు కొనసాగిస్తున్నారు. బుధవారం చివరి రోజు కావడంతో మరిన్ని కీలక వివరాలు సేకరించేలా ఏసీబీ అధికారుల బృందం ఏర్పాట్లు చేసుకుంది. ఇప్పటికే సేకరించిన వివరాలతోపాటు తనిఖీల్లో గుర్తించిన ఫైళ్ల ఆధారంగా చివరి రోజు ప్రశ్నించే అవకాశముంది. కాగా, హెచ్ఎండీఏ కార్యాలయాల్లో వరుస సోదాలు, బ్యాంకు లాకర్ల నుంచి సేకరించిన పత్రాలు, ఇతర ఆధారాలపై మరింత లోతుగా ఆరా తీయాలని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరో ఐదు రోజులు శివబాలకృష్ణను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ కోర్టులో పిటిషన్ వేసే యోచనలో ఏసీబీ అధికారులు ఉన్నట్టు తెలిసింది. -
రియల్ ఎస్టేట్ కంపెనీలతో చైనా ఆర్థిక వ్యవస్థకు తంటాలు!
చైనా ఆర్థిక పరిస్థితి సరిగా లేదనే వార్తలు ఈమధ్య ఎక్కువగానే అంతర్జాతీయ మీడియాలో వస్తున్నాయి. కొద్ది సంవత్సరాల క్రితం వరకూ చైనా ‘ప్రపంచానికి ఫ్యాక్టరీ’ అనే ప్రశంసలు అందుకుంది. 2019 చివరిలో వేగంగా ప్రయాణం మొదలెట్టిన మహమ్మారి కొవిడ్–19 దెబ్బతో చైనా ఎదురులేని ఆర్థికాభివృద్ధి తగ్గుముఖం పట్టడం మొదలైంది. 2018లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాను లక్ష్యంగా చేసుకుని విధించిన అదనపు దిగుమతి సుంకాలు చైనాపై వ్యతిరేక ప్రభావం చూపించడం ఆరంభమైంది. ‘ప్రపంచ వర్క్‌షాప్’ అనే పేరు నెమ్మదిగా కోల్పోయే పరిస్థితులు చైనా కళ్ల ముందు కదలాడుతున్నాయి. అప్పటి వరకూ తమ ఉత్పత్తి కార్యకలాపాలను చైనాలో కొనసాగిస్తున్న కొన్ని ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలు ఇతర దేశాల్లో ఆ పనిని చేయించడం ప్రారంభించాయి. ఎలక్ట్రానిక్స్ దిగ్గజాలైన యాపిల్, శామ్సంగ్ తమ కార్యకలాపాల్లో కొంత భాగాన్ని 2022లో మరో ఆసియా దేశం వియత్నాంకు తరలించాయి. పిల్లల బొమ్మల తయారీ కంపెనీ హాస్బరో 2019లోనే తన ఉత్పత్తి పనులను మెక్సికో, అమెరికా, ఇండియా, వియత్నాంకు తరలించింది. తమ ఉత్పత్తి కార్యకలాపాల్లో రిస్కును తగ్గించుకోవడానికే చైనాను ఈ కంపెనీలు వదిలిపోయాయని అంతర్జాతీయ వాణిజ్యంలో పరిణామాలను అధ్యయనం చేసే మూడీస్ అనలిటిక్స్ ఆర్థికవేత్త మార్క్ హాప్కిన్స్ అభిప్రాయపడ్డారు. అంతేగాక, అమెరికా–చైనా వాణిజ్య సంబంధాలు తగ్గుముఖం పట్టిన ఫలితంగా ఇతర ఆసియా దేశాలైన వియత్నాం, దక్షిణ కొరియా, తైవాన్, మలేసియా లబ్ధిపొందుతున్నాయి. ఇప్పుడు ఇతర అనేక సమస్యలు చైనా ఆర్థిక వ్యవస్థను మున్నెన్నడూ లేనంతగా పీడిస్తున్నాయి. జనాభా తగ్గడం, రియల్ ఎస్టేట్ రంగంలో సంక్షోభంతో ఆందోళనకర పరిణామాలు గత మూడు దశాబ్దాల్లో చైనా జనాభా బాగా పెరిగింది. ఉపాధి, ఆర్థిక అవకాశాల కోసం చైనీయులు పెద్ద సంఖ్యలో నగరాల బాట పట్టారు. ఆరంభంలో వారి కోసం రియల్ ఎస్టేట్ డెవలపర్లు వేగంగా ఆధునిక అపార్ట్ మెంట్లు నిర్మించలేకపోయారు. అనేక కంపెనీలు ఈ స్థిరాస్తి రంగంలోకి ప్రవేశించి నిర్మాణ కార్యకలాపాలు ఉధృతంగా కొనసాగించాయి. రియల్ ఎస్టేట్ రంగం చైనా ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపించే ఇంజన్ మాదిరిగా ఉపయోగపడింది. స్థిరాస్తి రంగం లక్షలాది మందికి ఉపాధి కల్పించింది. అనేక కుటుంబాలు పొదుపు చేసుకుని మదుపు చేయడానికి ఈ రంగం గొప్ప అవకాశం కల్పించింది. ఇలా ప్రస్తుతం రియల్ ఎస్టేట్ రంగం సైజు చైనాలోని మొత్తం ఆర్థిక కార్యకలాపాల్లో నాలుగో వంతుకు చేరింది. ఇక ఎప్పటికీ పెరుగుతూనే ఉంటుందనుకున్న స్థిరాస్తి రంగంపై చైనా ఆధారపడడం ఎక్కువైంది. కాని, తర్వాత ప్రజల అవసరాలకు మించిన సంఖ్యలో గృహాల నిర్మాణం, అందుకోసం శక్తికి మించిన మొత్తాల్లో గృహనిర్మాణ కంపెనీలు అప్పులు చేయడంతో ఒక్కసారిగా కథ మారిపోయింది. చైనా ఆర్థిక వ్యవస్థ సజావుగా ముందుకు సాగుతున్నంత వరకూ ఈ కంపెనీలు తేలికగా తమకు లభ్యమైన రుణాలతో చెల్లింపులు జరిపాయి. ఇప్పుడు ఇళ్లకు గిరాకీ తగ్గడంతో కంపెనీలకు అప్పులు పుట్టడం లేదు. పాత అప్పులు తీర్చలేకపోతున్నాయి. అన్ని సమస్యలకూ కొవిడ్–19 వల్ల ఎడాపెడా పెట్టిన లాక్ డౌన్లే కారణమని జనం నిందించే పరిస్థితి వచ్చింది. అలాగే, అన్ని ఇబ్బందులకూ కారణం రియల్ ఎస్టేట్ రంగమేనని ఇప్పుడు మరి కొందరు తప్పుబడుతున్నారు. ఈ ఆగస్టులో కంట్రీ గార్డెన్ వంటి 50కి పైగా బడా రియల్ ఎస్టేట్ కంపెనీలు నిర్ణీత సమయంలో చెల్లింపులు చేయలేక దివాలా స్థితికి చేరుకుంటున్నాయి. గత మూడేళ్లుగా ఈ సంక్షోభం ముదురుతోంది. ఈ ఏడాది జులైలో 100 చైనా అగ్రశ్రేణి రియల్టీ కంపెనీల అమ్మకాలు గత ఏడాదితో పోల్చితే 33% పడిపోయాయి. జూన్ లో 28 శాతం తగ్గిపోయాయని చైనా రియల్ ఎస్టేట్ ఇన్ఫర్మేషన్ అనే సంస్థ గణాంకాలు చెబుతున్నాయి. అయితే, దివాలాకు సిద్ధమౌతున్న స్థిరాస్తి కంపెనీల సంఖ్య పెరుగుతున్నా చైనా ప్రభుత్వం ఈ రంగాన్ని కాపాడడానికి ఎలాంటి ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించడం లేదు. కేవలం, తనఖా నిబంధనలు సరళతరం చేయడం, వడ్డీ రేట్లు తగ్గించడం వంటి చర్యలకే పరిమితమైంది సర్కారు. ఇళ్ల ధరలు పెరుగుతున్నంత సేపూ భారీ అప్పులతో గృహాలు నిర్మించి అమ్ముకునే స్థిరాస్తిరంగం బాగుంటుందని, ఇబ్బందులు ఎదురైతే తట్టుకోలేదని చైనా మోడల్ నిరూపిస్తోంది. - విజయసాయిరెడ్డి, వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు -
ఎవర్ ‘గ్రీన్’ బాటలో..! హైదరాబాద్ వాసుల ఆసక్తి ‘పచ్చటి’ భవనాలే!
సాక్షి, హైదరాబాద్: కరోనా నేర్పిన చక్కని పాఠం ఆరోగ్యంపై శ్రద్ధ. తినే తిండి మాత్రమే కాదు ఉండే ఇల్లు కూడా ఆరోగ్యాన్ని ఇచ్చేలా ఉండాలని జనం కోరుకుంటున్నారు. అందుకే హరిత (గ్రీన్) భవనాలకు డిమాండ్ పెరిగింది. ఇంటి చుట్టూ పచ్చని చెట్లు, ధారాళమైన గాలి, వెలుతురు వచ్చే ఏర్పాట్లు, సౌర విద్యుత్, వర్షపు నీటి వినియోగం, జీవ వైవిధ్య పరిరక్షణ.. ఈ ఏర్పాట్లు, సదుపాయాలు ఉన్నవే హరిత భవనాలు. కొనుగోలుదారుల అభిరుచి మేరకు ఇటీవల రియల్ఎస్టేట్ సంస్థలు ఈ తరహా నిర్మాణాలకే మొగ్గుచూపిస్తుండటంతో..హైదరాబాద్‌లో గ్రీన్ బిల్డింగ్స్ పెరుగుతున్నాయి. ఆనందం, ఆహ్లాదంతోపాటు కాలుష్యానికి దూరంగా, ఆరోగ్యానికి దగ్గరగా ఉండటమే హరిత భవనాల అసలు లక్ష్యం. సాధ్యమైనంత వరకు సహజ సిద్ధమైన ఇంధన వనరులను వినియోగిస్తూ.. జీవ వైవిధ్యాన్ని కాపాడే నిర్మాణాలను హరిత భవనాలుగా పరిగణిస్తారు. నిర్వహణ వ్యయాన్ని తగ్గించడం, జీవన కాల పరిమితిని పెంచడమే హరిత భవనాల ముఖ్య ఉద్దేశం. ప్రస్తుతం దేశంలో 975 కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణం మేర 8,600 హరిత భవనాలు ఉన్నాయి. తెలంగాణలో 178 నివాస, 256 వాణిజ్య భవనాలు ఐజీబీసీ గుర్తింపు పొందాయి. రేటింగ్‌ను బట్టి సర్టిఫికెట్లు ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజీబీసీ) ప్రమాణాల మేరకు ఉన్న నివాస, వాణిజ్య సముదాయాలను గుర్తించి ప్లాటినం, గోల్డ్, సిల్వర్ కేటగిరీలలో సర్టిఫికెట్లను ప్రదానం చేస్తుంటారు. 80కిపైగా పాయింట్లు వస్తే ప్లాటినం, 60–79 మధ్య వస్తే గోల్డ్, 50–59 మధ్యవస్తే సిల్వర్ సర్టిఫికెట్లు ఇస్తారు. ఆయా భవనాల్లో విద్యుత్, నీటి వినియోగం, నిర్మాణ సామగ్రి ఎంపిక, ల్యాండ్ స్కేపింగ్ మీద ఆధారపడి ఈ రేటింగ్స్ ఉంటాయి. ‘గ్రీన్ బిల్డింగ్’ ప్రయోజనాలివే.. ►సాధారణ భవనాలతో పోలిస్తే గ్రీన్ బిల్డింగ్స్‌లో విద్యుత్ 30–50% ఆదా ఆవుతుంది. ►20–30 % నీటి వినియోగం తగ్గుతుంది. ►12–16% మేర కార్బన్ ఉద్గారాలు తగ్గుతాయి. పాత భవనాలూ ‘గ్రీన్’గా.. కొత్త భవనాలను పర్యావరణ ప్రమాణాలకు అనుగుణంగా నిర్మించవచ్చు. మరి పాత భవనాల పరిస్థితేంటి అనే సందేహాలు వస్తుంటాయి. వాటిని కూడా గ్రీన్ బిల్డింగ్ మార్గదర్శకాలకు అనుగుణంగా మార్చుకునే అవకాశం ఉంది. గచ్చిబౌలిలోని హెచ్ఎస్బీసీ బ్యాంకు బిల్డింగ్‌ను హరిత భవన ప్రమాణాలకు అనుగుణంగా మార్చారు. బిల్డింగ్‌లో త్రీస్టార్, ఫైవ్‌స్టార్ రేటింగ్ ఉండే ఎలక్ట్రికల్ వస్తువులను వినియోగించడం, గాలి, వెలుతురు ధారాళంగా వచ్చేలా పైకప్పులో మా ర్పులు, సౌర విద్యుత్ వినియోగం, నీటి వృథాను అరికట్టడం, మొక్కలను పెంచడం వంటివి చేస్తే ‘గ్రీన్’గా మారొచ్చు. హరిత భవనాలు ఎలా ఉండాలంటే? ►భవన నిర్మాణంలో నీరు, విద్యుత్ వినియోగాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించాలి. ►వేడిని విడుదల చేసే ఉత్పత్తుల వాడకాన్ని తగ్గించాలి. ►వాన నీటిని వృథా చేయకుండా ఇంకుడు గుంతలు, నీటి శుద్ధి కేంద్రం ఉండాలి. ►భవనంలో సాధ్యమైనంత వరకు సౌరశక్తిని వినియోగించాలి. ►ఇంటి లోపలికి గాలి, వెలుతురు ధారాళంగా వచ్చేలా ఏర్పాటు చేసుకోవాలి. ►భవనం చుట్టు ప్రక్కల ప్రాంతాల్లో జీవ వైవిధ్యాన్ని పరిరక్షించాలి. ►ఖాళీ స్థలంలో పచ్చదనం ఎక్కువగా ఉండే మొక్కలను పెంచాలి. ‘తొలి’ ఘనత మనదే.. హరిత భవనాల గుర్తింపులో హైదరాబాద్‌ది ప్రత్యేక స్థానం. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ దేశంలోనే తొలి ఐజీబీసీ ప్లాటినం గ్రేడ్ స్టేషన్‌గా గుర్తింపు పొందగా.. ఆసియాలోనే తొలి హరిత భవనంగా గచ్చిబౌలిలోని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) సొహ్రబ్జి గ్రీన్ బిజినెస్ సెంటర్ నిలిచింది. ఇక ప్రపంచంలో మొదటి గ్రీన్ ప్యాసింజర్ టెర్మినల్‌గా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఖ్యాతి గడించింది. తాజాగా తెలంగాణ పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు గ్రీన్ బిల్డింగ్ గుర్తింపు దక్కగా.. కొత్తగా నిర్మించనున్న సచివాలయం, తెలంగాణ అమరవీరుల స్మారకం కూడా ఐజీబీసీ ప్రమాణాల మేరకు నిర్మిస్తున్నారు. అనుమతుల్లో తప్పనిసరి చేయాలి 2070 నాటికి కార్బన్ న్యూట్రల్ ఇండియాగా మారాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. దాన్ని చేరాలంటే భవన నిర్మాణాలు కూడా హరితంగా ఉండాలి. దేశంలో ప్రతి ప్రభుత్వ భవనాన్ని హరిత భవనంగా మార్చాలి. అలాగే నిర్మాణ అనుమతులలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఐజీబీసీ సర్టిఫికెట్ లెవల్‌ను తప్పనిసరి చేయాలి. – సి.శేఖర్‌రెడ్డి, ఐజీబీసీ హైదరాబాద్ చాప్టర్ చైర్మన్ -
రియల్ ఎస్టేట్ సంస్థలపై ఆదాయపన్ను శాఖ సోదాలు
సాక్షి, హైదరాబాద్/మణికొండ: హైదరాబాద్‌లో పేరుమోసిన రియల్ ఎస్టేట్ సంస్థలపై ఆదాయపన్ను శాఖ అధికారులు బుధవారం ఉదయం నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు. వాసవి కన్స్ట్రక్షన్స్, సుమధుర కన్స్ట్రక్షన్స్ సంస్థలపై పెద్దస్థాయిలో సోదాలు జరుగుతున్నాయి. 20 మంది ఐటీ అధికారులు వివిధ నగరాల్లో వాసవి కన్స్ట్రక్షన్‡్షకు సంబంధించిన ప్రధాన కార్యాలయంతో సహా పది ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. సుమధుర కన్స్ట్రక్షన్స్కు సంబంధించి హైదరాబాద్, బెంగళూరుల్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. వాసవి సంస్థ వాసవి రియల్టీ, వాసవి నిర్మాణ్, శ్రీముఖ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్, వాసవి ఫిడిల్ వెంచర్స్ పేరుతో వేల కోట్ల రూపాయల రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని, ఆదాయానికి సంబంధించిన పన్ను చెల్లింపులో అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఈ దాడులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. అలాగే ఈ రెండు సంస్థలు టాలెస్ట్ టవర్స్ నిర్మాణాల పేరుతో కూడా భారీగా వినియోగదారుల నుంచి బుకింగ్స్ పొందినట్లు తెలిసింది. భారీగా నగదు రూపంలో పెట్టుబడులు పెట్టీ ప్రీ లాంచ్ పేరుతో వసూలు చేసిన వ్యవహారంపై ఐటీ ప్రధానంగా దృష్టి సారించినట్లు సమాచారం. వాసవిలో స్లీపింగ్ భాగస్వామిగా పెద్ద మొత్తంలో బయట వ్యక్తులు పెట్టుబడి పెట్టడం గురించి ఆరా తీయడంతోపాటు, మొత్తం ఆరుగురు ప్రముఖుల వాటాలు ఇందులో ఉన్నట్లు ఐటీ అధికారులు గుర్తించారని తెలుస్తోంది. -
మౌలిక రంగం.. ఉజ్వల తరంగం
నగరంలో నిర్మాణ రంగం శరవేగంగా దూసుకుపోతోంది. భాగ్యనగరిని కేంద్రంగా చేసుకుని ఎన్నో రియల్ ఎస్టేట్ కంపెనీలు తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి. రానున్న రోజుల్లో మరెన్నో పరిశ్రమలు, కంపెనీలు ఏర్పాటు కానున్నాయి. మరోవైపు మెట్రో రైలు నిర్మాణం చురుగ్గా జరుగుతోంది. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దడానికి కృతనిశ్చయంతో ఉన్నట్లు ప్రభుత్వం చెబుతోంది. నిర్మాణ రంగంలో లక్షలాది నిపుణుల అవసరం ఏర్పడింది. నిర్మాణ రంగ నిపుణులకు గల్ఫ్ దేశాలు కూడా సాదర స్వాగతం పలుకుతున్నాయి. ఈ నేపథ్యంలో నిర్మాణ రంగంలో అవకాశాలు.. వివిధ సంస్థలు.. అందిస్తున్న కోర్సులు.. వేతనాలపై ఫోకస్.. - ‘హైదరాబాద్‌ను విశ్వనగరంగా రూపొందిస్తాం. భాగ్యనగరిలో మురికివాడలు లేకుండా చేస్తాం. పేదలకు ఇళ్లు నిర్మించి ఇస్తాం’.. ఇది ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటన. - ‘దేశంలో 100 స్మార్ట్ సిటీలను ఏర్పాటు చేస్తాం. దేశంలోని ముఖ్య నగరాలను అనుసంధానిస్తూ స్వర్ణ చతుర్భుజి రహదారులను నిర్మిస్తాం’... ఇది దేశ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్య. - ‘దేశంలో ప్రధాన నగరాల మధ్య బుల్లెట్ రైళ్లు ఏర్పాటు చేస్తాం’.. రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా రైల్వే శాఖ మంత్రి సదానంద గౌడ ప్రకటన. - ‘తక్కువ ఖర్చుతో మధ్యతరగతి వర్గాలకు అందుబాటులో ఉండేలా ఇళ్లు నిర్మిస్తాం’ - వివిధ రియల్ ఎస్టేట్ కంపెనీలు. ఇలా ఎవరు ఏం చెప్పినా తెలుస్తోంది ఏమిటంటే.. రాబోయే రోజుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మౌలిక రంగానికి పెద్దపీట వేయనున్నాయి. ఇందుకోసం భారీ స్థాయిలో నిధులను కేటాయించనున్నాయి. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజనలో భాగంగా గ్రామీణ రహదారులను నిర్మించడం, అభివృద్ధి చేయడం, వాటిని జిల్లా కేంద్రానికి వెళ్లే రహదారులతో అనుసంధానించనున్నారు. ఇవేకాకుండా దేశంలో వంద స్మార్ట్ సిటీలను ఏర్పాటు చేయడానికి, ఇతర పట్టణాల అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలను చేపట్టడానికి రంగం సిద్ధమవుతోంది. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దడానికి, ప్రపంచస్థాయిలో బ్రాండ్ ఇమేజ్ కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. రాష్ట్ర స్థాయిలో అన్ని గ్రామాల్లో సీసీ రోడ్లు, నదులపై నీటిపారుదల ప్రాజెక్టులు నిర్మించాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉంది. ఇవన్నీ సాకారం కావాలంటే నిర్మాణ రంగ నిపుణుల అవసరం ఎంతో ఉంది. కాబట్టి నిర్మాణ రంగ నిపుణులకు మంచి అవకాశాలు రానున్నాయి. అవకాశాలెన్నో నిర్మాణ రంగంలో ఎన్నో ఉద్యోగావకాశాలు అందుబాటులో ఉన్నాయి. ముందు సంబంధిత నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని గుర్తించడం, దాని వాస్తును సరిచూడటం, స్థలాన్ని సర్వే చేయడం, సైట్/ప్రాజెక్టును పర్యవేక్షించడం, నిర్మాణానికి అవసరమైన వనరులు అంటే.. ఆర్కిటెక్టులు, నిర్మాణ కూలీల నుంచి తాపీ మేస్త్రీల వరకు, టిప్పర్-లారీ-క్రేన్ డ్రైవర్లు, ప్లంబింగ్ అండ్ శానిటేషన్, ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్, కార్పెంటరీ, పెయింటింగ్ అండ్ డెకరేషన్, ఫైర్ సేఫ్టీ ఇంజనీరింగ్, బయట గార్డెన్, ఇంటిపైన రూఫ్ గార్డెన్.. ఇలా ఆయా విభాగాల్లో లక్షల మంది నిపుణుల అవసరం ఉంది. కోర్సులు.. సంస్థలు నిర్మాణ రంగంలో అవకాశాలను అందిపుచ్చుకోవడానికి నగరంలో ఎన్నో సంస్థలు కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. సైబరాబాద్‌లో ఉన్న నేషనల్ అకాడెమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (నాక్)కు ఈ కోర్సులను అందించడంలో మంచి గుర్తింపు ఉంది. ఇందులో ఐదో తరగతి ఉత్తీర్ణుల నుంచి గ్రాడ్యుయేషన్ స్థాయి వరకు కోర్సులు అందుబాటులో ఉన్నాయి. స్వల్పకాలిక, లాంగ్‌టర్మ్ కోర్సులను ఆఫర్ చేస్తున్నారు. ఇప్పటికే నిర్మాణ రంగంలో అనుభవం ఉన్నవారికి ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్స్‌ను కూడా నాక్ అందిస్తోంది. లాంగ్‌టర్మ్ కోర్సులు పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లో భాగంగా కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్, ఆపరేషన్స్ మేనేజ్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్సింగ్ ఇన్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ, కాంట్రాక్ట్ మేనేజ్మెంట్ అండ్ లీగల్ ఆస్పెక్ట్స్, కన్స్ట్రక్షన్ టెక్నాలజీ, కన్స్ట్రక్షన్ సేఫ్టీ, క్వాంటిటీ సర్వేయింగ్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్, ఆర్గనైజేషనల్ అండ్ మేనేజీరియల్ స్కిల్స్, సెమినార్/లోకల్ విజిట్స్ వంటి సబ్జెక్టులను అందిస్తోంది. స్వల్పకాలిక శిక్షణ కోర్సులు షార్ట్‌టర్మ్ కోర్సుల్లో భాగంగా ఐదో తరగతి అర్హతతో ప్లంబింగ్ అండ్ శానిటేషన్, ఫామ్‌వర్క్ కార్పెంట్రీ, బిల్డింగ్ కార్పెంట్రీ, బార్ బెండింగ్, పెయింటింగ్ అండ్ డెకరేషన్ వంటి కోర్సులు ఉన్నాయి. ఈ కోర్సుల వ్యవధి 600 గంటలు. ఎనిమిదో తరగతి అర్హతతో వెల్డింగ్, ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్ కోర్సులూ, ఇంటర్మీడియెట్ అర్హతతో జనరల్ వర్క్స్ సూపర్వైజర్, హైవే వర్క్స్ సూపర్వైజర్, ల్యాండ్ సర్వేయర్, ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్‌షిప్ వంటి కోర్సులూ ఉన్నాయి. వీటి వ్యవధి కూడా 600 గంటలు. గ్రాడ్యుయేషన్ అర్హతతో స్టోర్ కీపర్ కోర్సు అందుబాటులో ఉంది. దీని వ్యవధి 600 గంటలు. ఈ కోర్సులన్నింటికి 18 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసున్నవారు అర్హులు. మరిన్ని వివరాలకు www.nac.edu.in నగరంలోనే కొలువుదీరిన మరో సంస్థ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ అండ్ రీసెర్చ్. ఇందులో ఫుల్‌టైం ప్రోగ్రామ్స్‌లో భాగంగా.. రెండేళ్ల వ్యవధి ఉన్న పోస్ట్‌గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఇన్ అడ్వాన్స్డ్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్, ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్, రియల్ ఎస్టేట్ అండ్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్- డెవలప్మెంట్ అండ్ మేనేజ్మెంట్ వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో కొన్ని కోర్సులను మహారాష్ర్టలోని పుణెలో ఆఫర్ చేస్తున్నారు. దూరవిద్య ద్వారా అందిస్తున్న కోర్సులు రెగ్యులర్‌గానే కాకుండా దూరవిద్య ద్వారా కూడా ఎన్‌ఐసీఎంఏఆర్ కోర్సులను అందిస్తోంది. అవి.. పోస్ట్‌గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఇన్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అండ్ మేనేజ్మెంట్, కన్స్ట్రక్షన్ బిజినెస్ మేనేజ్మెంట్, రియల్ ఎస్టేట్ మేనేజ్మెంట్, క్వాంటిటీ సర్వేయింగ్, హెల్త్- సేఫ్టీ అండ్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్. ఈ కోర్సుల వ్యవధి రెండేళ్లు. బీటెక్/బీఈ/బీఆర్క్/బీప్లానింగ్ ఉత్తీర్ణులు, ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తిచేసి రెండేళ్లు పని అనుభవమున్నవారు ఈ కోర్సులకు అర్హులు. వీటితోపాటు వివిధ విభాగాల్లో గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్‌ను అందిస్తోంది. వీటికి ఇంజనీరింగ్/టెక్నాలజీ/ఆర్కిటెక్చర్/ప్లానింగ్ ఉత్తీర్ణులు లేదా ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తిచేసి నిర్మాణ రంగంలో రెండేళ్లు పని అనుభవమున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు www.nicmar.ac.in పై సంస్థలే కాకుండా జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ఆర్ట్స్ యూనివర్సిటీ (జేఎన్ఏఎఫ్ఏయూ) - హైదరాబాద్.. బీటెక్‌లో ప్లానింగ్, బీఆర్క్ కోర్సులను, ఎంటెక్‌లో భాగంగా.. ప్లానింగ్, ప్రాపర్టీ డెవలప్మెంట్, కన్జర్వేషన్ ప్లానింగ్, ఎంఆర్క్‌లో ఇంటీరియర్ డిజైన్, కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ వంటి కోర్సులను అందిస్తోంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ - వరంగల్, జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (జేఎన్టీయూ) - హైదరాబాద్, స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ (ఎస్పీఏ)- విజయవాడ, మరికొన్ని కళాశాలలు.. బీటెక్, ఎంటెక్ స్థాయిలో సివిల్ ఇంజనీరింగ్, కన్స్ట్రక్షన్ సంబంధిత కోర్సులను అందిస్తున్నాయి. సెట్విన్.. కార్పెంట్రీ వంటి వివిధ కోర్సులను ఆఫర్ చేస్తోంది. లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు రాబోయే పదేళ్లలో భారత్‌లో దాదాపు 100 మిలియన్ల ఉద్యోగాలు వస్తాయని అంచనా. దీనిలో సగ భాగం అంటే 50 మిలియన్ల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మౌలిక రంగం నుంచే వస్తాయంటున్నారు ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్(ఐఐఎఫ్‌సీఎల్) మేనేజింగ్ డెరైక్టర్ ఎస్.బి.నాయర్. ‘మౌలిక రంగంలో చోటుచేసుకుంటున్న పెనుమార్పులు దేశీయ, విదేశీ పెట్టుబడులకు మరింత ఊతమిస్తాయి’ అని అంటున్నారు కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ రాష్ట్ర చైర్మన్ అశోక్‌రెడ్డి. దీనివల్ల నిపుణులతోపాటు నైపుణ్యం లేని కార్మికులకూ ఉపాధి అవకాశాలు గ్యారంటీ అంటున్నారాయన. ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత రెండు రాష్ట్రాల్లోనూ ఆయా ప్రాంతాలకు అనువుగా ఉండేలా ప్రాజెక్టులు, రహదారులు, వంతెనలు, కారిడార్లు, నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు, రైలు మార్గాలు, భవన సముదాయాల నిర్మాణం ప్రారంభం కానుంది. హైదరాబాద్‌లో ఐఐటీఆర్, మెట్రోరైలు విస్తరణ, ఇండస్ట్రియల్, ఐటీ కంపెనీలతో ఇన్ఫ్రాస్టక్చర్ రంగం రాబోయే పదేళ్లలో 7 నుంచి 10 శాతం వరకూ వృద్ధి చెందుతుందని అంచనా. -
కన్వర్షన్ లేని స్థలాలకు చెక్ !
సాక్షి ప్రతినిధి, గుంటూరు : అనధికార లే అవుట్లపై వీజీటీఎం ఉడా కొరడా ఝళిపిస్తోంది. అనుమతి లేని లేఅవుట్లను రిజిస్ట్రేషన్ చేయవద్దని సూచిస్తూ రిజిస్ట్రేషన్ శాఖకు ఉడా వీసీ ఉషాకుమారి ఆదేశాలు జారీ చేశారు. అనుమతి లేని వ్యవసాయ భూములను ప్లాట్లుగా విభజించి విక్రయిస్తున్న రియల్ ఎస్టేట్ కంపెనీల వల్ల కొనుగోలుదారులు నష్టపోవడమే కాకుండా ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోంది. రాష్ట్ర రాజధాని విజయవాడ- గుంటూరు నగరాల మధ్య ఏర్పాటు కానున్నదనే ప్రచారం ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో రియల్ ఎస్టేట్ కంపెనీలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. రైతుల నుంచి కొనుగోలు చేసిన వ్యవసాయ భూములను నివేశన స్థలాలు గా కన్వర్షన్ చేయకుండా ఆ భూమిని రెండు, మూడు వందల చదరపు గజాలుగా విభజించి అమ్మకాలు జరుపుతున్నాయి. దీని వల్ల కొనుగోలుదారులు లే అవుట్ లేని స్థలాల్లో నిర్మాణాలు చేపట్టడానికి అవకాశం ఉండదు. ఆ స్థలాలను రియల్ ఎస్టేట్ కంపెనీలు మొదట కొనుగోలు చేసిన వ్యక్తికి తెలియకుండా ఇద్దరు ముగ్గురు వ్యక్తులకు అమ్మడానికి అవకాశం ఉంటుంది. దీంతో కొనుగోలుదారుల మధ్య భూ వివాదాలు ఏర్పడతాయి. వీటిని దృష్టిలో ఉంచుకుని వీజీటీఎం ఉడా వైస్ చైర్మన్ ఉషాకుమారి అనధికార లేఅవుట్ల స్థలాలను రిజిస్ట్రేషన్ చేయరాదని రిజిస్ట్రేషన్ శాఖకు ఆదేశాలు జారీ చేశారు. తెనాలి డివిజన్లోని కొన్ని ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ కంపెనీలు ఉడా అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నాయని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం రహదారులు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించడం లేదని పేర్కొంటూ రిజిస్ట్రారు కార్యాలయాలకు లేఖ రాశారు. ఇటువంటి స్థలాలను రిజిస్ట్రేషన్ చేయవద్దని సూచించారు. జిల్లాలో ముఖ్యంగా గుంటూరు, మంగళగిరి, పెదకాకాని, తెనాలి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో అనధికార లే అవుట్లు అధికంగా ఉన్నట్టు ఉడా గుర్తించింది. గతంలో ఈ అనధికార లేఅవుట్లలోని రహదారులను ఉడా సిబ్బంది పొక్లయిన్లు, బుల్డోజర్లతో ధ్వంసం చేసి, ప్రజలందరికీ తెలిసే విధంగా నోటీసు బోర్డులు ఏర్పాటు చేసేవారు. ఈ సమాచారం తెలియని కొనుగోలుదారులు ఈ అనధికార లే అవుట్లలోని స్థలాలను కొనుగోలు చేసి మోసపోతుండేవారు. ఇలాంటి సంఘటనల దృష్ట్యా వైస్ చైర్మన్ అనధికార లే అవుట్లలోని స్థలాలను రిజిస్టర్ చేయవద్దని గుంటూరు, తెనాలి రిజిస్ట్రార్ కార్యాలయాలకు లేఖలు రాశారు. అనధికార లే అవుట్లలోని స్థలాలను రిజిస్ట్రేషన్ చేస్తే ప్రభుత్వానికి కన్వర్షన్ చార్జీలు వసూలు కావు. వీటిని కొనుగోలు చేసిన వ్యక్తులు గృహాలు నిర్మించుకునే అవకాశం ఉండదు. నిర్మాణాలు జరగాలంటే కన్వర్షన్ చార్జీలు తప్పకుండా చెల్లించాల్సి ఉండటంతో కొనుగోలుదారులకు మరి కొంత ఆర్థిక భారం పడుతుంది. వివరణ : ఈ విషయమై రిజిస్ట్రేషన్ శాఖ అధికారులను ‘సాక్షి’ ప్రతినిధి వివరణ కోరగా, ఉడా వీసీ నుంచి లేఖ వచ్చిన మాట వాస్తమేనని, అయితే సర్వే నంబర్ల సమాచారం పూర్తిగా ఇస్తే రిజిస్ట్రేషన్లు నిలుపుదల చేస్తామని చెప్పారు. -
గృహస్థుకు శుభాలనిచ్చే.. వాస్తుశాస్త్రం
అప్‌కమింగ్ కెరీర్ మానవుడి జీవితంపై పంచ భూతాల, ప్రకృతి శక్తుల ప్రభావం కచ్చితంగా ఉంటుందని భారతీయులు ప్రాచీన కాలం నుంచి నమ్ముతున్నారు. దీనికి శాస్త్రీయమైన ఆధారాలు కూడా ఉన్నాయి. నివాస గృహం అనేది ప్రకృతి శక్తులను స్వేచ్ఛగా ఆహ్వానించేదిగా ఉండాలి. అప్పుడు ఆ ఇంటి యజమాని జీవితం ఒడిదుడుకుల్లేకుండా సాగిపోతుంది. పంచభూతాల గమనం ప్రకారం ఇంటిని నిర్మించుకోవడం అందరికీ తెలియదు. దానికొక శాస్త్రం ఉంది. అదే వాస్తు శాస్త్రం. గృహ నిర్మాణానికి సలహాలు, ఇంటిలో మార్పులు చేర్పులపై సూచనలు ఇచ్చేవారే వాస్తు నిపుణులు. దీనిపై ప్రజల్లో అవగాహన అధికమవుతుండడంతో డిమాండ్ ఉన్న కెరీర్... వాస్తుశాస్త్రం. పెట్టుబడి లేకుండానే కెరీర్ ప్రారంభం వ్యక్తిగత నివాస గృహాలతోపాటు కార్పొరేట్ కార్యాలయాలను కూడా వాస్తుప్రకారం నిర్మిస్తున్నారు. రియల్ ఎస్టేట్ సంస్థలు వాస్తు ప్లానర్లను తప్పనిసరిగా నియమించుకుంటు న్నాయి. ప్రజలు తమ ఇంటిలో వాస్తు దోషాలను సరిచేసుకొనేందుకు నిపుణులను సంప్రదిస్తున్నారు. ఇక పత్రికలు, టీవీ ఛానళ్ల వంటి ప్రసార మాధ్య మాలు వాస్తును విస్తృతంగా ప్రచారం చేస్తుండడం తో ప్రజల్లో దీనిపై అవగాహన పెరుగుతోంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటిని నిర్మించుకోవాలని అందరూ భావిస్తున్నారు. వీటన్నింటి వల్ల వాస్తు ప్లానర్లకు డిమాండ్ అంతకంతకూ పెరుగుతోంది. దీన్ని కెరీర్‌గా ఎంచుకుంటే ఉపాధి అవకాశాలకు కొదవ ఉండదు. కచ్చితమైన పనివేళలు లేకపోవడం దీనిలో ఉన్న వెసులుబాటు. నచ్చిన సమయాల్లోనే పనిచేసుకోవచ్చు. ఎలాంటి పెట్టుబడి లేకుండానే కెరీర్ ప్రారంభించొచ్చు. వాస్తు నిపుణులుగా మంచి పేరు, తద్వారా మరిన్ని అవకాశాలు తెచ్చుకోవాలంటే ఈ శాస్త్రంపై గట్టి పట్టు, తగిన అనుభవం ఉండాలి. మిడిమిడి జ్ఞానంతో ముందుకెళితే కెరీర్లో నష్టపోయే ప్రమాదం ఉంటుంది. రకరకాల మనస్తత్వాలు ఉన్న క్లయింట్లతో వ్యవహరించేందుకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. వృత్తిలో భాగంగా దూర ప్రాంతాలకు కూడా ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. కాబట్టి అందుకు సంసిద్ధంగా ఉండాలి. వాస్తు శాస్త్రంలో పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు పెంచుకోవాలి. అర్హతలు: వాస్తు శాస్త్రాన్ని నేర్చుకోవడానికి ప్రత్యేకంగా విద్యార్హతలు అవసరం లేదు. దీనిపై నమ్మకం, ఆసక్తి, అభిరుచి ఉన్నవారెవరైనా ఇందులోకి ప్రవేశించొచ్చు. ఈ శాస్త్రంపై ప్రొఫెషనల్ కోర్సు పూర్తిచేస్తే మంచి అవకాశాలుంటాయి. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పలు కోర్సులు ఉన్నాయి. కోర్సు చదివిన తర్వాత పేరు ప్రఖ్యాతలున్న వాస్తు గురువు వద్ద కొన్నాళ్లు శిష్యరికం చేసి, అనుభవం సంపాదించాలి. తర్వాత సొంతంగా పనిచేసుకోవచ్చు. వేతనాలు: వాస్తు నిపుణులు ప్రారంభంలో నెలకు రూ.20 వేలు సంపాదించుకోవచ్చు. తర్వాత అనుభవం, నైపుణ్యాలను పెంచుకుంటే నెలకు దాదాపు రూ.60 వేల ఆదాయం లభిస్తుంది. డిమాండ్‌ను బట్టి ఎంతైనా సంపాదించుకోవచ్చు. లక్షల్లో ఆర్జించే సీనియర్ వాస్తు నిపుణులు ఎందరో ఉన్నారు. వాస్తుశాస్త్రాన్ని ఆఫర్ చేస్తున్న సంస్థలు: ఉస్మానియా విశ్వవిద్యాలయం వెబ్సైట్: www.osmania.ac.in పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వెబ్సైట్: http://teluguuniversity.ac.in ఆర్జన, విజ్ఞాన సముపార్జన ‘‘భారతదేశంలో ఆచరించే ప్రతి అంశంలో మానవాళి శ్రేయస్సు దాగుంది. వాస్తుశాస్త్రం కూడా దానిలో భాగమే. నివాస యోగ్యమైన గృహం, వ్యాపార, పరిశ్రమలకు అనువైన వాతావరణం ఎలా ఉండాలనే నిర్దిష్టమైన అంశాలే ఇందులో ఉంటాయి. జ్యోతిష్యం, వాస్తు రెండూ ఒకదానికొకటి విడదీయలేనివి. అందుకే ఆ రెండింటికీ కలిపి కోర్సులు నిర్వహిస్తున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వాస్తు, ఇంటీరియర్ కోర్సు ఏర్పాటు చేయాలనే యోచనలో ఉన్నాం. వాస్తుపై అపోహలను పోగొట్టి, విజ్ఙానం పెంపొందించేందుకు వాస్తు విజ్ఙాన సంస్థ ఏడాదికి రెండుసార్లు కార్యక్రమాలు నిర్వహిస్తోంది. వాస్తు శాస్త్రం అనేది ఎప్పటికీ వన్నెతగ్గని కెరీర్ అనే చెప్పొచ్చు.ఈ కోర్సులను పూర్తిచేసిన వారు కన్సల్టెన్సీలు, మీడియా, ఆన్లైన్ మార్గాల ద్వారా అవకాశాలను పొందొచ్చు. వాస్తు ప్లానర్లకు సంఘంలో గౌరవం, హోదా పెరిగాయి. ప్రస్తుతం వాస్తు నిపుణుడి స్థాయిని బట్టి నెలకు రూ.5 వేల నుంచి రూ.లక్ష వరకు సంపాదన గ్యారంటీ’’ -ప్రొఫెసర్ సాగి కమలాకరశర్మ, వైదిక్ ఆస్ట్రో విభాగం, ఓయూ -
‘విలువ’ తగ్గదు
ముంబై: మాస్టర్ బ్లాస్టర్ ఆట నుంచి తప్పుకున్నా కార్పొరేట్ ప్రపంచంలో తన విలువ ఏ మాత్రం తగ్గదు. ప్రస్తుతం తనతో ప్రచారం చేయించుకుంటున్న సంస్థలన్నీ సచిన్‌ను కొనసాగిస్తామనే చెబుతున్నాయి. ధోని, కోహ్లి, రోహిత్‌లాంటి యువ క్రికెటర్ల ముందు సచిన్ బ్రాండ్ విలువ తగ్గుతుందా? అనే చర్చ మొదలైన నేపథ్యంలో కార్పొరేట్ ప్రపంచం మాత్రం... ‘సచిన్‌కు మరెవరూ సాటిరారు’ అనే చెబుతోంది. ‘సచిన్ క్రికెట్ ఆడినా, ఆడకపోయినా మా సంబంధం తెగిపోదు. మా బ్రాండ్‌కు సచిన్ జీవితకాలం అంబాసిడర్. తనతో మాకు ప్రత్యేకమైన బంధం ఉంది’ అని అడిడాస్ ఇండియా డెరైక్టర్ తుషార్ చెప్పారు. కోకాకోలా, ఫ్యూచర్ గ్రూప్, తోషిబా, స్టార్ ఇండియా సంస్థలు కూడా ఇదే మాట చెబుతున్నాయి. సచిన్‌కు ప్రస్తుతం ఉన్నంత డిమాండ్ భవిష్యత్‌లో ఉండకపోవచ్చు. క్రమంగా తన ఎండార్స్మెంట్స్ తగ్గిపోతాయి. కానీ చాలామంది మాజీ క్రికెటర్ల మాదిరిగా కనుమరుగు అయ్యే అవకాశం మాత్రం లేదు. సచిన్ రిటైరైతే తన ఎండార్స్మెంట్ల రేటు తగ్గుతుందని, అప్పుడు తాము మాస్టర్‌ను సంప్రదించాలని మరికొన్ని కంపెనీలు భావిస్తున్నాయి. పలు బ్యాంకులు, రియల్ ఎస్టేట్ కంపెనీలు ఈ రకమైన ఆలోచనతో ఉన్నట్లు మార్కెట్ వర్గాల సమాచారం.