చైనా ఆర్థిక పరిస్థితి సరిగా లేదనే వార్తలు ఈమధ్య ఎక్కువగానే అంతర్జాతీయ మీడియాలో వస్తున్నాయి. కొద్ది సంవత్సరాల క్రితం వరకూ చైనా ‘ప్రపంచానికి ఫ్యాక్టరీ’ అనే ప్రశంసలు అందుకుంది. 2019 చివరిలో వేగంగా ప్రయాణం మొదలెట్టిన మహమ్మారి కొవిడ్–19 దెబ్బతో చైనా ఎదురులేని ఆర్థికాభివృద్ధి తగ్గుముఖం పట్టడం మొదలైంది.
2018లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాను లక్ష్యంగా చేసుకుని విధించిన అదనపు దిగుమతి సుంకాలు చైనాపై వ్యతిరేక ప్రభావం చూపించడం ఆరంభమైంది. ‘ప్రపంచ వర్క్‌షాప్’ అనే పేరు నెమ్మదిగా కోల్పోయే పరిస్థితులు చైనా కళ్ల ముందు కదలాడుతున్నాయి. అప్పటి వరకూ తమ ఉత్పత్తి కార్యకలాపాలను చైనాలో కొనసాగిస్తున్న కొన్ని ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలు ఇతర దేశాల్లో ఆ పనిని చేయించడం ప్రారంభించాయి. ఎలక్ట్రానిక్స్ దిగ్గజాలైన యాపిల్, శామ్సంగ్ తమ కార్యకలాపాల్లో కొంత భాగాన్ని 2022లో మరో ఆసియా దేశం వియత్నాంకు తరలించాయి.
పిల్లల బొమ్మల తయారీ కంపెనీ హాస్బరో 2019లోనే తన ఉత్పత్తి పనులను మెక్సికో, అమెరికా, ఇండియా, వియత్నాంకు తరలించింది. తమ ఉత్పత్తి కార్యకలాపాల్లో రిస్కును తగ్గించుకోవడానికే చైనాను ఈ కంపెనీలు వదిలిపోయాయని అంతర్జాతీయ వాణిజ్యంలో పరిణామాలను అధ్యయనం చేసే మూడీస్ అనలిటిక్స్ ఆర్థికవేత్త మార్క్ హాప్కిన్స్ అభిప్రాయపడ్డారు. అంతేగాక, అమెరికా–చైనా వాణిజ్య సంబంధాలు తగ్గుముఖం పట్టిన ఫలితంగా ఇతర ఆసియా దేశాలైన వియత్నాం, దక్షిణ కొరియా, తైవాన్, మలేసియా లబ్ధిపొందుతున్నాయి. ఇప్పుడు ఇతర అనేక సమస్యలు చైనా ఆర్థిక వ్యవస్థను మున్నెన్నడూ లేనంతగా పీడిస్తున్నాయి.
జనాభా తగ్గడం, రియల్ ఎస్టేట్ రంగంలో సంక్షోభంతో ఆందోళనకర పరిణామాలు
గత మూడు దశాబ్దాల్లో చైనా జనాభా బాగా పెరిగింది. ఉపాధి, ఆర్థిక అవకాశాల కోసం చైనీయులు పెద్ద సంఖ్యలో నగరాల బాట పట్టారు. ఆరంభంలో వారి కోసం రియల్ ఎస్టేట్ డెవలపర్లు వేగంగా ఆధునిక అపార్ట్ మెంట్లు నిర్మించలేకపోయారు. అనేక కంపెనీలు ఈ స్థిరాస్తి రంగంలోకి ప్రవేశించి నిర్మాణ కార్యకలాపాలు ఉధృతంగా కొనసాగించాయి. రియల్ ఎస్టేట్ రంగం చైనా ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపించే ఇంజన్ మాదిరిగా ఉపయోగపడింది.
స్థిరాస్తి రంగం లక్షలాది మందికి ఉపాధి కల్పించింది. అనేక కుటుంబాలు పొదుపు చేసుకుని మదుపు చేయడానికి ఈ రంగం గొప్ప అవకాశం కల్పించింది. ఇలా ప్రస్తుతం రియల్ ఎస్టేట్ రంగం సైజు చైనాలోని మొత్తం ఆర్థిక కార్యకలాపాల్లో నాలుగో వంతుకు చేరింది. ఇక ఎప్పటికీ పెరుగుతూనే ఉంటుందనుకున్న స్థిరాస్తి రంగంపై చైనా ఆధారపడడం ఎక్కువైంది. కాని, తర్వాత ప్రజల అవసరాలకు మించిన సంఖ్యలో గృహాల నిర్మాణం, అందుకోసం శక్తికి మించిన మొత్తాల్లో గృహనిర్మాణ కంపెనీలు అప్పులు చేయడంతో ఒక్కసారిగా కథ మారిపోయింది. చైనా ఆర్థిక వ్యవస్థ సజావుగా ముందుకు సాగుతున్నంత వరకూ ఈ కంపెనీలు తేలికగా తమకు లభ్యమైన రుణాలతో చెల్లింపులు జరిపాయి.
ఇప్పుడు ఇళ్లకు గిరాకీ తగ్గడంతో కంపెనీలకు అప్పులు పుట్టడం లేదు. పాత అప్పులు తీర్చలేకపోతున్నాయి. అన్ని సమస్యలకూ కొవిడ్–19 వల్ల ఎడాపెడా పెట్టిన లాక్ డౌన్లే కారణమని జనం నిందించే పరిస్థితి వచ్చింది. అలాగే, అన్ని ఇబ్బందులకూ కారణం రియల్ ఎస్టేట్ రంగమేనని ఇప్పుడు మరి కొందరు తప్పుబడుతున్నారు. ఈ ఆగస్టులో కంట్రీ గార్డెన్ వంటి 50కి పైగా బడా రియల్ ఎస్టేట్ కంపెనీలు నిర్ణీత సమయంలో చెల్లింపులు చేయలేక దివాలా స్థితికి చేరుకుంటున్నాయి. గత మూడేళ్లుగా ఈ సంక్షోభం ముదురుతోంది.
ఈ ఏడాది జులైలో 100 చైనా అగ్రశ్రేణి రియల్టీ కంపెనీల అమ్మకాలు గత ఏడాదితో పోల్చితే 33% పడిపోయాయి. జూన్ లో 28 శాతం తగ్గిపోయాయని చైనా రియల్ ఎస్టేట్ ఇన్ఫర్మేషన్ అనే సంస్థ గణాంకాలు చెబుతున్నాయి. అయితే, దివాలాకు సిద్ధమౌతున్న స్థిరాస్తి కంపెనీల సంఖ్య పెరుగుతున్నా చైనా ప్రభుత్వం ఈ రంగాన్ని కాపాడడానికి ఎలాంటి ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించడం లేదు. కేవలం, తనఖా నిబంధనలు సరళతరం చేయడం, వడ్డీ రేట్లు తగ్గించడం వంటి చర్యలకే పరిమితమైంది సర్కారు. ఇళ్ల ధరలు పెరుగుతున్నంత సేపూ భారీ అప్పులతో గృహాలు నిర్మించి అమ్ముకునే స్థిరాస్తిరంగం బాగుంటుందని, ఇబ్బందులు ఎదురైతే తట్టుకోలేదని చైనా మోడల్ నిరూపిస్తోంది.
- విజయసాయిరెడ్డి, వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు
Comments
Please login to add a commentAdd a comment