V.VijaySaiReddy
-
రియల్ ఎస్టేట్ కంపెనీలతో చైనా ఆర్థిక వ్యవస్థకు తంటాలు!
చైనా ఆర్థిక పరిస్థితి సరిగా లేదనే వార్తలు ఈమధ్య ఎక్కువగానే అంతర్జాతీయ మీడియాలో వస్తున్నాయి. కొద్ది సంవత్సరాల క్రితం వరకూ చైనా ‘ప్రపంచానికి ఫ్యాక్టరీ’ అనే ప్రశంసలు అందుకుంది. 2019 చివరిలో వేగంగా ప్రయాణం మొదలెట్టిన మహమ్మారి కొవిడ్–19 దెబ్బతో చైనా ఎదురులేని ఆర్థికాభివృద్ధి తగ్గుముఖం పట్టడం మొదలైంది. 2018లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాను లక్ష్యంగా చేసుకుని విధించిన అదనపు దిగుమతి సుంకాలు చైనాపై వ్యతిరేక ప్రభావం చూపించడం ఆరంభమైంది. ‘ప్రపంచ వర్క్‌షాప్’ అనే పేరు నెమ్మదిగా కోల్పోయే పరిస్థితులు చైనా కళ్ల ముందు కదలాడుతున్నాయి. అప్పటి వరకూ తమ ఉత్పత్తి కార్యకలాపాలను చైనాలో కొనసాగిస్తున్న కొన్ని ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలు ఇతర దేశాల్లో ఆ పనిని చేయించడం ప్రారంభించాయి. ఎలక్ట్రానిక్స్ దిగ్గజాలైన యాపిల్, శామ్సంగ్ తమ కార్యకలాపాల్లో కొంత భాగాన్ని 2022లో మరో ఆసియా దేశం వియత్నాంకు తరలించాయి. పిల్లల బొమ్మల తయారీ కంపెనీ హాస్బరో 2019లోనే తన ఉత్పత్తి పనులను మెక్సికో, అమెరికా, ఇండియా, వియత్నాంకు తరలించింది. తమ ఉత్పత్తి కార్యకలాపాల్లో రిస్కును తగ్గించుకోవడానికే చైనాను ఈ కంపెనీలు వదిలిపోయాయని అంతర్జాతీయ వాణిజ్యంలో పరిణామాలను అధ్యయనం చేసే మూడీస్ అనలిటిక్స్ ఆర్థికవేత్త మార్క్ హాప్కిన్స్ అభిప్రాయపడ్డారు. అంతేగాక, అమెరికా–చైనా వాణిజ్య సంబంధాలు తగ్గుముఖం పట్టిన ఫలితంగా ఇతర ఆసియా దేశాలైన వియత్నాం, దక్షిణ కొరియా, తైవాన్, మలేసియా లబ్ధిపొందుతున్నాయి. ఇప్పుడు ఇతర అనేక సమస్యలు చైనా ఆర్థిక వ్యవస్థను మున్నెన్నడూ లేనంతగా పీడిస్తున్నాయి. జనాభా తగ్గడం, రియల్ ఎస్టేట్ రంగంలో సంక్షోభంతో ఆందోళనకర పరిణామాలు గత మూడు దశాబ్దాల్లో చైనా జనాభా బాగా పెరిగింది. ఉపాధి, ఆర్థిక అవకాశాల కోసం చైనీయులు పెద్ద సంఖ్యలో నగరాల బాట పట్టారు. ఆరంభంలో వారి కోసం రియల్ ఎస్టేట్ డెవలపర్లు వేగంగా ఆధునిక అపార్ట్ మెంట్లు నిర్మించలేకపోయారు. అనేక కంపెనీలు ఈ స్థిరాస్తి రంగంలోకి ప్రవేశించి నిర్మాణ కార్యకలాపాలు ఉధృతంగా కొనసాగించాయి. రియల్ ఎస్టేట్ రంగం చైనా ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపించే ఇంజన్ మాదిరిగా ఉపయోగపడింది. స్థిరాస్తి రంగం లక్షలాది మందికి ఉపాధి కల్పించింది. అనేక కుటుంబాలు పొదుపు చేసుకుని మదుపు చేయడానికి ఈ రంగం గొప్ప అవకాశం కల్పించింది. ఇలా ప్రస్తుతం రియల్ ఎస్టేట్ రంగం సైజు చైనాలోని మొత్తం ఆర్థిక కార్యకలాపాల్లో నాలుగో వంతుకు చేరింది. ఇక ఎప్పటికీ పెరుగుతూనే ఉంటుందనుకున్న స్థిరాస్తి రంగంపై చైనా ఆధారపడడం ఎక్కువైంది. కాని, తర్వాత ప్రజల అవసరాలకు మించిన సంఖ్యలో గృహాల నిర్మాణం, అందుకోసం శక్తికి మించిన మొత్తాల్లో గృహనిర్మాణ కంపెనీలు అప్పులు చేయడంతో ఒక్కసారిగా కథ మారిపోయింది. చైనా ఆర్థిక వ్యవస్థ సజావుగా ముందుకు సాగుతున్నంత వరకూ ఈ కంపెనీలు తేలికగా తమకు లభ్యమైన రుణాలతో చెల్లింపులు జరిపాయి. ఇప్పుడు ఇళ్లకు గిరాకీ తగ్గడంతో కంపెనీలకు అప్పులు పుట్టడం లేదు. పాత అప్పులు తీర్చలేకపోతున్నాయి. అన్ని సమస్యలకూ కొవిడ్–19 వల్ల ఎడాపెడా పెట్టిన లాక్ డౌన్లే కారణమని జనం నిందించే పరిస్థితి వచ్చింది. అలాగే, అన్ని ఇబ్బందులకూ కారణం రియల్ ఎస్టేట్ రంగమేనని ఇప్పుడు మరి కొందరు తప్పుబడుతున్నారు. ఈ ఆగస్టులో కంట్రీ గార్డెన్ వంటి 50కి పైగా బడా రియల్ ఎస్టేట్ కంపెనీలు నిర్ణీత సమయంలో చెల్లింపులు చేయలేక దివాలా స్థితికి చేరుకుంటున్నాయి. గత మూడేళ్లుగా ఈ సంక్షోభం ముదురుతోంది. ఈ ఏడాది జులైలో 100 చైనా అగ్రశ్రేణి రియల్టీ కంపెనీల అమ్మకాలు గత ఏడాదితో పోల్చితే 33% పడిపోయాయి. జూన్ లో 28 శాతం తగ్గిపోయాయని చైనా రియల్ ఎస్టేట్ ఇన్ఫర్మేషన్ అనే సంస్థ గణాంకాలు చెబుతున్నాయి. అయితే, దివాలాకు సిద్ధమౌతున్న స్థిరాస్తి కంపెనీల సంఖ్య పెరుగుతున్నా చైనా ప్రభుత్వం ఈ రంగాన్ని కాపాడడానికి ఎలాంటి ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించడం లేదు. కేవలం, తనఖా నిబంధనలు సరళతరం చేయడం, వడ్డీ రేట్లు తగ్గించడం వంటి చర్యలకే పరిమితమైంది సర్కారు. ఇళ్ల ధరలు పెరుగుతున్నంత సేపూ భారీ అప్పులతో గృహాలు నిర్మించి అమ్ముకునే స్థిరాస్తిరంగం బాగుంటుందని, ఇబ్బందులు ఎదురైతే తట్టుకోలేదని చైనా మోడల్ నిరూపిస్తోంది. - విజయసాయిరెడ్డి, వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు -
‘డాలర్ మిలియనీర్ల విదేశీ వలసలు తగ్గుతున్నాయి’
ఇండియా నుంచి పది లక్షల డాలర్ల (మిలియన్) మించిన సంపద ఉన్న ధనికులు పెట్టుబడులతో విదేశాలకు తరలిపోవడం క్రమంగా పెరుగుతోందని కిందటేడాది ఆందోళన వ్యక్తమైంది. నిజమే, కొత్తగా కోట్లాది రూపాయలు సంపాదించిన తెలివైన భారతీయులు స్వదేశం విడిచి ఆస్ట్రేలియా, సింగపూర్, దుబాయ్, పోర్చుగల్, స్పెయిన్ వంటి దేశాలకు తరలిపోవడం ఎవరికైనా మొదట దిగులు పుట్టిస్తుంది. కష్టపడి వ్యాపారాల ద్వారా సంపాదించిన వ్యక్తులు మిలియన్ డాలర్ల విలువైన ఆస్తులు పోగేసుకున్న తర్వాత కూడా తమకు అనుకూలంగా కనిపించే దేశాలకు పెట్టుబడుల ద్వారా వలసపోవడానికి అనేక కారణాలుంటాయి. తమ ఆర్జనపైన, విదేశాల్లో పెట్టే పెట్టుబడుల నుంచి వచ్చే ఆదాయాలపైన భారత ప్రభుత్వం విధించే పన్నులు సబబుగా, హేతుబద్ధంగా లేవనే కారణంతో కొందరు పైన చెప్పిన డాలర్ మిలియనీర్లు విదేశాలకు వలసపోతుంటారు. మరి కొందరు మిలియనీర్లు ఇక్కడ కన్నా మెరుగైన సామాజిక జీవనశైలి సాధ్యమని భావించిన దేశాలకు పోయి స్థిరపడుతుంటారు. ఇలా రకరకాల కారణాలతో కొద్ది మంది కొత్త కోటీశ్వరులు ఇండియా నుంచి బయటకు పోతున్నారు. వలసపోయే మిలియనీర్ల సంఖ్య తగ్గడం శుభవార్తే! 2022లో దేశం నుంచి మిలియన్ డాలర్ల సంపన్నులు 7,500 మంది విదేశాలకు తరలిపోయారు. కాని, ఇలా విదేశాల్లో పెట్టుబడులు పెట్టడానికి బయటకు పోతున్న సంపన్నులను ఆకట్టుకోవడానికి భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల ఫలితంగా 2023లో ఇలాంటి ధనికుల సంఖ్య 6,500కు తగ్గుతుందని అంచనా. ఇలాంటి పెట్టుబడి వలసలపై ప్రపంచవ్యాప్తంగా అధ్యయనం చేసే లండన్ కు చెందిన హెన్లీ అండ్ పార్టనర్స్ సంస్థ విడుదల చేసిన వివరాలు పై విషయాలను వెల్లడిస్తున్నాయి. ఇండియా వదిలిపోవాలనుకునే భారత సంపన్నుల్లో ఎక్కువ మంది ఇష్టపడే దేశం ఆస్ట్రేలియా. తర్వాత స్థానం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో ఒకటైన దుబాయి. ఇప్పటికే దుబాయి మాదిరిగానే భారత సంతతి ప్రజలున్న సింగపూర్ పోయి స్థిరపడానికి కూడా కొందరు భారతీయులు ఉత్సాహపడుతున్నారని హెన్లీ అండ్ పార్టనర్స్ సర్వే చెబుతోంది. ఆస్ట్రేలియాలో 2023లో పెట్టుబడులతో వచ్చి స్థిరపడే విదేశీయులు గరిష్ఠంగా 5,200 వరకూ ఉండొచ్చని అంచనా వేశారు. డాలర్ మిలియనీర్ల వలసల్లో చైనాదే ప్రథమ స్థానం! 20వ శతాబ్దంలో 1978 నుంచీ ఆర్థిక సంస్కరణలు అమలు చేసిన చైనా, 1991 నుంచీ పేదరికం నిర్మూలించి, సంపద సృష్టించడానికి కొత్త మార్గంలో ప్రయాణం మొదలెట్టిన ఇండియాలో కొత్త ఐడియాలతో, వినూత్న పరిశ్రమతో కొత్త డాలర్ మిలియనీర్లు ఏటా గణనీయ సంఖ్యలో పుట్టుకొస్తున్నారు. ఆర్థిక వ్యవస్థ సైజులో పెద్దదైన చైనా ఇలాంటి వలసల విషయంలో కూడా ప్రపంచంలో మొదటిస్థానంలో ఉంది. 2023లో చైనా నుంచి 13,500 మంది కోటీశ్వరులు ఇతర దేశాలకు వలసపోతారని భావిస్తున్నారు. 2022లో ఈ సంపన్నుల సంఖ్య 10,800 మాత్రమే. అంటే ఏటా చైనా నుంచి బయటకు పోయే కొత్త ధనికుల (పది లక్షల అమెరికన్ డాలర్లకు మించిన సంపద ఉన్న హైనెట్ వర్త్ ఇండివిడ్యువల్స్) సంఖ్య పెరుగుతుండగా ఇండియాలో వారి సంఖ్య తగ్గుముఖం పట్టడం విశేషం. ఆరో అతిపెద్ద ఆర్థిక శక్తి ఇంగ్లండ్ నుంచి కూడా డాలర్ మిలియనీర్లు చెప్పుకోదగ్గ సంఖ్యలో విదేశాలకు తరలిపోతున్నారట. ఇంకా ఈ తరహా దేశాల్లో రష్యా, బ్రెజిల్ కూడా ఉన్నాయి. భారతదేశానికి సంబంధించి సంపన్నుల విదేశీ వలసల విషయంలో శుభపరిణామం ఏమంటే–ఇండియాలో మెరుగవుతున్న ఆర్థిక,సామాజిక పరిస్థితులను, అవకాశాలను దృష్టిలో పెట్టుకుని అనేక మంది భారతీయులు విదేశాల నుంచి వెనక్కి వచ్చి స్వదేశంలో స్థిరపడుతున్నారు. వారి సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. ప్రపంచంలో ఏకైక అగ్రరాజ్యం, అవకాశాల స్వర్గంగా భావించే అమెరికా నుంచి కూడా మిలియనీర్లు ఇతర దేశాలకు వలసపోవడం సాధారణ విషయంగా నేడు మారిపోయింది. - విజయసాయిరెడ్డి, వైఎస్సార్సీపీ, రాజ్యసభ ఎంపీ. -
‘ఆంధ్రజ్యోతి కిట్టు మారడు’
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు, అచ్చెన్నాయుడు, ఎల్లో మీడియాపై వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరోసారి ట్విటర్ వేదికగా ధ్వజమెత్తారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈఎస్ఐ హాస్సిటల్స్‌లో చికిత్స పొందుతూ మరణించిన కార్మికుల వివరాలను ఆ సంస్థ బయటపెట్టాలని డిమాండ్ చేశారు. నాసిరకం మందులు, నకిలీ డయాగ్నిస్టిక్ కిట్ల వల్ల వ్యాధి ముదిరి కార్మికులు చనిపోయారని ఆరోపించారు. కార్మికుల అకాల మరణాలకు అచ్చెన్న, పెదబాబు, చినబాబు బాధ్యత వహించాలంటూ ఆదివారం వరుస ట్వీట్లు చేశారు. (చదవండి : 'మీ అలీబాబా 40 దొంగల స్టోరీ అంతా వారికి తెలుసు') ఎల్లో కుల మీడియా బుద్ధి మరోసారి బయట పడింది. పోలీసులు అచ్చెన్న ఇంటి గోడ దూకి అరెస్ట్ చేశారట. గేటు తెరవకుండా కార్యకర్తలకు ఫోన్ చేసి రప్పించే యత్నం చేయడంతో అలా చేయాల్సి వచ్చిందని ఏసీబీ జేడీ మీడియాకు చెప్పారు. అయినా ‘మాకు వినపడలేదు’ అంటూ యజమాని చెప్పినట్టు రాశారు అని విజయసాయిరెడ్డి విమర్శించారు. (చదవండి : అచ్చెన్నకు మా ఉసురే తగిలింది) ‘ఆంధ్రజ్యోతి కిట్టు మారడు - చెత్తపలుకు ఆపడు- వ్యాపార ప్రయోజనాలకోసమే వైసీపీలో టీడీపీ నేతలు చేరుతున్నారు అంటున్నాడు. గతంలో 23 మంది మా ఎమ్మెల్యేలను కొనుక్కుని టీడీపీలోకి చట్ట వ్యతిరేకంగా చేర్చుకుని అభివృద్ధికోసమేనంటూ అప్పట్లో ఊగిపోయాడు. ఈ ద్వంద ప్రమాణాలేంటి కిట్టప్ప!’ అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. ‘కరోనాపై జగన్ గారు మొహం చాటేస్తున్నారంటూ చెత్తరాతలేంటి కిట్టు. దేశంలోనే అత్యధిక టెస్టులు చేస్తూ కంట్రోల్ చేస్తున్నారు! తమిళనాడులో దుస్థితి చూడు. టీడీపీ హయాంలో ఫైల్స్ చూసి ఎక్కడ సంతకాలు పెట్టాలో చంద్రబాబుకు చెప్పి కమీషన్లు కొట్టేసేవాడివి.ఇప్పుడు ఆ అవకాశం లేదనేనా నీ బాధంతా కిట్టన్న! ’అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. -
‘రామాయపట్నం పోర్టు నిర్మాణాన్ని చేపట్టండి’
సాక్షి, న్యూఢిల్లీ : రామాయపట్నంలో భారీ పోర్టు నిర్మాణం పనులను సత్వరమే ప్రారంభించాలని వైఎస్సార్సీపీ సభ్యులు వి. విజయసాయి రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సోమవారం రాజ్యసభ జీరో అవర్‌లో ఆయన ఈ అంశాన్ని లేవనెత్తారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం దుగరాజపట్నంలో మేజర్ పోర్టు నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఆర్థిక సహాయం అందించాలి. అయితే దుగరాజపట్నంలో పోర్టు నిర్మాణం లాభదాయకం కాదని తేలిన తర్వాత ప్రత్యామ్నాయంగా ప్రకాశం జిల్లా రామాయపట్నంలో నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినట్లు విజయసాయి రెడ్డి చెప్పారు. రామాయపట్నం పోర్టు అంతర్జాతీయ నౌకా రవాణాకు అనువైనదిగా గుర్తింపు పొందినట్లు ఆయన తెలిపారు. బంగాళాఖాతం తీరం హద్దుగా ఉన్న దేశాలలో నౌకాశ్రాయల నిర్మాణంపై ఇటీవల జరిగిన బిమ్స్టెక్ అంతర్జాతీయ సదస్సు సైతం రామాయపట్నం పోర్టు ఆవశ్యకతను ప్రసావించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. బిమ్స్టెక్ దేశాల మధ్య జరిగే వాణిజ్య లావాదేవీలపై రామాయపట్నం పోర్టు ప్రభావం గురించి ఈ సదస్సులో చర్చ జరిగినట్లు చెప్పారు. ఈ పోర్టును కేంద్ర ప్రభుత్వ నిధులతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం నుంచి మేజర్ పోర్టు నిర్మాణానికి అనుమతులు సాధించడానికి బదులుగా గత ప్రభుత్వం రామాయపట్నంలో సొంతంగానే నాన్-మేజర్ పోర్టు నిర్మించాలని నిర్ణయించిందని ఆయన చెప్పారు. కానీ నేటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విషయంలో చాలా స్పష్టంగా ఉంది. రామాయపట్నంలో నాన్-మేజర్ పోర్టు స్థానంలో కేంద్ర ప్రభుత్వం హామీ మేరకు మేజర్ పోర్టు నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేస్తే రాష్ట్ర ప్రభుత్వమే పోర్టు నిర్మాణ బాధ్యతలను చేపట్టి త్వరితిగతిన పూర్తి చేస్తుందని అన్నారు. తద్వారా రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయాలన్నది తమ ప్రభుత్వ ఆకాంక్ష అని ఆయన అన్నారు. మేజర్ పోర్టు నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రామాయపట్నంలో 3 వేల ఎకరాల భూమిని గుర్తించింది. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం అమలులోకి వచ్చి ఇప్పటికే అయిదేళ్ళు పూర్తయినా రామాయపట్నం పోర్టు నిర్మాణం హామీని నెరవేర్చమంటూ ఇప్పటికీ మేము పార్లమెంటులో గొంతెత్తి అరవవలసి రావడం దురదృష్టకరమని అన్నారు. పోర్టు ప్రాజెక్ట్ ప్రక్రియను చేపట్టి రాష్ట్ర ప్రభుత్వం త్వరితగతిన దాని నిర్మాణం పూర్తి చేసేందుకు వీలుగా నిధులు మంజూరు చేయవలసిందిగా ఆయన కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
తెలుగుజాతి రుణం తీర్చుకుంటా
హైదరాబాద్: సమాజానికి చార్టెర్డ్ అకౌంటెంట్లు(సీఏలు) ప్రశంసనీయమైన సేవలు అందజేస్తున్నారని రాజ్యసభ సభ్యుడు, వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి అన్నారు. సీఏల సమస్యలను చట్టసభలో ప్రస్తావించి పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌తో మాట్లాడి హైదారాబాద్‌లో సీఏ సంఘం భవనానికి భూమి కేటాయించేలా కృషి చేస్తామని పేర్కొన్నారు. శుక్రవారం అంతర్జాతీయ చార్టెర్డ్ అకౌంటెంట్స్‌డే సందర్భంగా హైదరాబాద్‌లోని ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 67 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సంఘానికి అభినందనలు తెలిపారు. తాను గతంలో వ్యక్తిగతంగా, కార్పొరేట్ స్థాయిలో వివిధ హోదా ల్లో పనిచేశానని, ఇప్పుడు రాజ్యసభ సభ్యుడి హోదాలో రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, కన్నతల్లి, తెలుగుజాతి రుణం తీర్చుకుంటానన్నారు. తెలుగు జాతి ప్రయోజనాలు కాపాడుతామన్నారు. రైల్వే మంత్రి సురేష్‌ప్రభు, తాను ఇద్దరం సీఏలమేనని, ఏపీ నుంచి ఇద్దరం ఒకేసారి రాజ్యసభ సభ్యులుగా ప్రమాణం చేశామని చెప్పారు. సీఏ వృత్తి అంటే కేవలం లాభనష్టాల లెక్కలు మాత్రమే కాదని దేశ ప్రగతి, సమాజ అభ్యున్నతిలో వారి పాత్ర అత్యంత కీలకమన్నారు. అనంతరం ఆయన్ను సంఘం సభ్యులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సీఏగా పనిచేస్తూ ఇటీవలే సివిల్స్‌కు ఎంపికైన స్నేహజతో పాటు పలువురు సీఏలు, సంఘం పూర్వ సభ్యులను సత్కరించారు. సంఘం హైదరాబాద్ బ్రాంచ్ చైర్మన్ రామచంద్రారెడ్డి, వైస్ చైర్మన్ చెంగల్‌రెడ్డి, కార్యదర్శి మండవ సునీల్‌కుమార్, ట్రెజరర్ భానునారాయణరావు తదితరులు పాల్గొన్నారు.