MP Vijayasai Reddy Dollar Millionaires Migrations Declining - Sakshi
Sakshi News home page

‘డాలర్‌ మిలియనీర్ల విదేశీ వలసలు తగ్గుతున్నాయి’

Published Thu, Jun 15 2023 8:00 PM | Last Updated on Mon, Jul 3 2023 12:02 PM

mp vijayasai reddy dollar millionaires migrations declining - Sakshi

ఇండియా నుంచి పది లక్షల డాలర్ల (మిలియన్‌) మించిన సంపద ఉన్న ధనికులు పెట్టుబడులతో విదేశాలకు తరలిపోవడం క్రమంగా పెరుగుతోందని కిందటేడాది ఆందోళన వ్యక్తమైంది. నిజమే, కొత్తగా కోట్లాది రూపాయలు సంపాదించిన తెలివైన భారతీయులు స్వదేశం విడిచి ఆస్ట్రేలియా, సింగపూర్, దుబాయ్, పోర్చుగల్, స్పెయిన్‌ వంటి దేశాలకు తరలిపోవడం ఎవరికైనా మొదట దిగులు పుట్టిస్తుంది.

కష్టపడి వ్యాపారాల ద్వారా సంపాదించిన వ్యక్తులు మిలియన్‌ డాలర్ల విలువైన ఆస్తులు పోగేసుకున్న తర్వాత కూడా తమకు అనుకూలంగా కనిపించే దేశాలకు పెట్టుబడుల ద్వారా వలసపోవడానికి అనేక కారణాలుంటాయి. తమ ఆర్జనపైన, విదేశాల్లో పెట్టే పెట్టుబడుల నుంచి వచ్చే ఆదాయాలపైన భారత ప్రభుత్వం విధించే పన్నులు సబబుగా, హేతుబద్ధంగా లేవనే కారణంతో కొందరు పైన చెప్పిన డాలర్‌ మిలియనీర్లు విదేశాలకు వలసపోతుంటారు. మరి కొందరు మిలియనీర్లు ఇక్కడ కన్నా మెరుగైన సామాజిక జీవనశైలి సాధ్యమని భావించిన దేశాలకు పోయి స్థిరపడుతుంటారు. ఇలా రకరకాల కారణాలతో కొద్ది మంది కొత్త కోటీశ్వరులు ఇండియా నుంచి బయటకు పోతున్నారు. 

వలసపోయే మిలియనీర్ల సంఖ్య తగ్గడం శుభవార్తే!
2022లో దేశం నుంచి మిలియన్‌ డాలర్ల సంపన్నులు 7,500 మంది విదేశాలకు తరలిపోయారు. కాని, ఇలా విదేశాల్లో పెట్టుబడులు పెట్టడానికి బయటకు పోతున్న సంపన్నులను ఆకట్టుకోవడానికి భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల ఫలితంగా 2023లో ఇలాంటి ధనికుల సంఖ్య 6,500కు తగ్గుతుందని అంచనా. ఇలాంటి పెట్టుబడి వలసలపై ప్రపంచవ్యాప్తంగా అధ్యయనం చేసే లండన్‌ కు చెందిన హెన్లీ అండ్‌ పార్టనర్స్‌ సంస్థ విడుదల చేసిన వివరాలు పై విషయాలను వెల్లడిస్తున్నాయి.

ఇండియా వదిలిపోవాలనుకునే భారత సంపన్నుల్లో ఎక్కువ మంది ఇష్టపడే దేశం ఆస్ట్రేలియా. తర్వాత స్థానం యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ లో ఒకటైన దుబాయి. ఇప్పటికే దుబాయి మాదిరిగానే భారత సంతతి ప్రజలున్న సింగపూర్‌ పోయి స్థిరపడానికి కూడా కొందరు భారతీయులు ఉత్సాహపడుతున్నారని హెన్లీ అండ్‌ పార్టనర్స్‌ సర్వే చెబుతోంది. ఆస్ట్రేలియాలో 2023లో పెట్టుబడులతో వచ్చి స్థిరపడే విదేశీయులు గరిష్ఠంగా 5,200 వరకూ ఉండొచ్చని అంచనా వేశారు.

డాలర్‌ మిలియనీర్ల వలసల్లో చైనాదే ప్రథమ స్థానం!
20వ శతాబ్దంలో 1978 నుంచీ ఆర్థిక సంస్కరణలు అమలు చేసిన చైనా, 1991 నుంచీ పేదరికం నిర్మూలించి, సంపద సృష్టించడానికి కొత్త మార్గంలో ప్రయాణం మొదలెట్టిన ఇండియాలో కొత్త ఐడియాలతో, వినూత్న పరిశ్రమతో కొత్త డాలర్‌ మిలియనీర్లు ఏటా గణనీయ సంఖ్యలో పుట్టుకొస్తున్నారు. ఆర్థిక వ్యవస్థ సైజులో పెద్దదైన చైనా ఇలాంటి వలసల విషయంలో కూడా ప్రపంచంలో మొదటిస్థానంలో ఉంది.

2023లో చైనా నుంచి 13,500 మంది కోటీశ్వరులు ఇతర దేశాలకు వలసపోతారని భావిస్తున్నారు. 2022లో ఈ సంపన్నుల సంఖ్య 10,800 మాత్రమే. అంటే ఏటా చైనా నుంచి బయటకు పోయే కొత్త ధనికుల (పది లక్షల అమెరికన్‌ డాలర్లకు మించిన సంపద ఉన్న హైనెట్‌ వర్త్‌ ఇండివిడ్యువల్స్‌) సంఖ్య పెరుగుతుండగా ఇండియాలో వారి సంఖ్య తగ్గుముఖం పట్టడం విశేషం. ఆరో అతిపెద్ద ఆర్థిక శక్తి ఇంగ్లండ్‌ నుంచి కూడా డాలర్‌ మిలియనీర్లు చెప్పుకోదగ్గ సంఖ్యలో విదేశాలకు తరలిపోతున్నారట. ఇంకా ఈ తరహా దేశాల్లో రష్యా, బ్రెజిల్‌ కూడా ఉన్నాయి. 

భారతదేశానికి సంబంధించి సంపన్నుల విదేశీ వలసల విషయంలో శుభపరిణామం ఏమంటే–ఇండియాలో మెరుగవుతున్న ఆర్థిక,సామాజిక పరిస్థితులను, అవకాశాలను దృష్టిలో పెట్టుకుని అనేక మంది భారతీయులు విదేశాల నుంచి వెనక్కి వచ్చి స్వదేశంలో స్థిరపడుతున్నారు. వారి సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. ప్రపంచంలో ఏకైక అగ్రరాజ్యం, అవకాశాల స్వర్గంగా భావించే అమెరికా నుంచి కూడా మిలియనీర్లు ఇతర దేశాలకు వలసపోవడం సాధారణ విషయంగా నేడు మారిపోయింది.

- విజయసాయిరెడ్డి, వైఎస్సార్‌సీపీ, రాజ్యసభ ఎంపీ. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement