అధిక వెయిటేజీ షేర్ల పతనం
సెన్సెక్స్ 1235 పాయింట్లు క్రాష్
23,050 దిగువకు నిఫ్టీ
7 నెలల కనిష్టానికి సూచీలు
ముంబై: అమెరికా కొత్త అధ్యక్షుడు ట్రంప్ వాణిజ్య టారిఫ్ పెంపు భయాలకు తోడు అధిక వెయిటేజీ షేర్ల పతనంతో స్టాక్ సూచీలు మంగళవారం ఒకటిన్నరశాతానికి పైగా కుప్పకూలాయి. విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు, ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు మరింత ఒత్తిడి పెంచాయి. సెన్సెక్స్ 1,235 పాయింట్లు పతనమై 75,838 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 320 పాయింట్లు నష్టపోయి 23,025 వద్ద నిలిచింది. ఇరు సూచీలకిది ఏడు నెలల కనిష్టం. ఉదయం స్వల్ప నష్టాలతో మొదలైన సూచీలు రోజంతా అదే బాటలో నడిచాయి. ఒక దశలో సెన్సెక్స్ 1,432 పాయింట్లు క్షీణించి 75,642 వద్ద, నిఫ్టీ 369 పాయింట్లు పతనమై 22,976 వద్ద ఇంట్రాడే కనిష్టాలను తాకాయి. ప్రపంచ మార్కెట్లు బలహీనంగా ట్రేడవుతున్నాయి. డాలర్‌తో రూపాయి విలువ 13 పైసలు బలహీనపడి 86.58 వద్ద స్థిరపడింది.
⇒ అన్ని రంగాల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. రియల్టీ ఇండెక్స్ 4.2% క్షీణించింది. కన్జూమర్ డ్యూరబుల్స్ 4%, సర్విసెస్, విద్యుత్, టెలికం, యుటిలిటీ ఇండెక్సులు 2.5% పడ్డాయి.
నష్టాలకు 4 కారణాలు
⇒ ‘అమెరికా ఫస్ట్’ నినాదంతోట్రంప్ మెక్సికో, కెనడాలపై ఫిబ్రవరి 1 నుండి 25% వాణిజ్య సుంకాల విధింపునకు సిద్ధమయ్యారు. భారత్‌తో సహా ఇతర దేశాలపై సుంకాల విధింపు తప్పదని గతంలో వ్యాఖ్యానించారు. ట్రంప్ టారిఫ్ ఆందోళనలతో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహిస్తూ అమ్మకాలకు పాల్పడ్డారు.
⇒ దేశీయ కార్పొరేట్ క్యూ3 ఆర్థిక ఫలితాలు నిరాశపరుస్తున్నాయి. ఇప్పటి వరకు ఫలితాలు వెల్లడించిన లిస్టెడ్ కంపెనీల సగటు నికరలాభ వృద్ధి కేవలం 4%గా మాత్రమే నమోదైంది. వార్షిక ప్రాతిపదిక డిసెంబర్ త్రైమాసికంలో నిఫ్టీ50 కంపెనీల ఈపీఎస్ (ఎర్కింగ్స్ పర్ షేర్) 3% మాత్రమే ఉంటుందని బ్లూమ్‌బర్గ్ అంచనా వేసింది.
⇒ జొమాటో (–11%)తో సహా అధిక వెయిటేజీ షేర్లు ఐసీఐసీఐ బ్యాంకు (–3%), ఎస్‌బీఐ (–2.57%), రిలయన్స్ (–2.50%), ఎంఅండ్‌ఎం (–2.25%) షేర్లు భారీగా క్షీణించి సూచీల పతనానికి ప్రధాన కారణమయ్యాయి. సెన్సెక్స్ మొత్తం పతనంలో ఈ షేర్ల వాటాయే 640 పాయింట్లు. కాగా ఒక్క జొమాటో షేరు వాటా 150 పాయింట్లు కావడం గమనార్హం.
⇒ విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు దలాల్ స్ట్రీట్‌పై మరింత ఒత్తిడి పెంచాయి. ఈ కొత్త ఏడాది జనవరి 20 నాటికి ఎఫ్‌ఐఐలు మొత్తం రూ.48,023 కోట్ల విలువైన భారత ఈక్విటీలు అమ్మేశారు.
7.5 లక్షల కోట్లు ఆవిరి
మార్కెట్ భారీ పతనంతో సోమవారం ఒక్కరోజే రూ.7.52 లక్షల కోట్లు హరించుకుపోయాయి. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్‌ఈలోని కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.424 లక్షల కోట్లకు దిగివచ్చింది. సెన్సెక్స్‌లోని మొత్తం 30 షేర్లలో అల్ట్రాటెక్(0.39%), హెచ్‌సీఎల్ టెక్(0.33%) మాత్రమే స్వల్ప లాభాలతో గట్టెక్కాయి.
Comments
Please login to add a commentAdd a comment